మూడవ పాస్కా ఆదివారము, Year C

మూడవ పాస్కా ఆదివారము, Year C
అ.కా. 5:27-32, 40-41, దర్శన. 5:11-14, యోహాను 21:1-19

మూడవ పాస్కా ఆదివారము, Year C
అ.కా. 5:27-32, 40-41, దర్శన. 5:11-14, యోహాను 21:1-19

యేసును గూర్చి అపోస్తలుల సాక్ష్యం
విశ్వాసం దేవుని వరం. మన విశ్వాసానికి సాక్షమివ్వడానికి కూడా మనకు దైవసహాయం అవసరం. పెంతకోస్తు పండుగకు ముందు పేతురుకి, పెంతకోస్తు పండుగ తరువాత పేతురుకి మధ్య ఉన్న తేడా మనకు సుపరిచితమే! పెంతకోస్తు ముందు అనగా ప్రభువు మరణానికి ముందు యేసు తనకు తెలియదని పేతురు మూడుసార్లు బొంకాడు. పెంతకోస్తు తరువాత, పవిత్రాత్మతో నింపబడిన పేతురు, ఇతర అపోస్తలులు బాహాటముగా, నిర్భయముగా తమ విశ్వాసాన్ని ప్రకటించారు. భయమును వీడి ధైర్యముతో నింపబడ్డారు. పిరికితనం వీడి దృఢత్వం వారిలో చోటు చేసుకున్నది. బ్రతుకు జీవుడా! అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పారిపోయినవారు, 'మేము నమ్మిన ప్రభువు కొరకు మా ప్రాణాలను సహితం ఇవ్వడానికి సిద్ధం' అని బాహాటముగా ప్రకటిస్తున్నారు. తమ విశ్వాసానికి సాక్ష్యం ఇస్తున్న సంఘటనను మనం ఈ రోజు మొదటి పఠనములో చదువుతున్నాం. వారి ధైర్యానికి కారణం, ప్రభువు ఉత్తానం మరియు పవిత్రాత్మ వారు నింపబడటం.

యేసును గూర్చి బోధిస్తున్నందులకు శిష్యులను బంధించి విచారణ సభ ఎదుట నిలువ బెట్టారు. కాని పేతురు, ఇతర అపోస్తలులు, "మేము మనుష్యులకు కాక దేవునికి విధేయులము కావలెను... దేవుడు తనపట్ల విధేయత చూపువారికి అనుగ్రహించిన పవిత్రాత్మయును, మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము" అని ధైర్యముగా పలికారు. అదివిని, సభలోని సభ్యులు మండిపడి అపోస్తలులను చంపదలచిరి. కాని, గమలీయేలు అను పరిసయ్యుని సలహామేరకు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. పిమ్మట, వారు అపోస్తలులను లోనికి పిలిపించి కొరడాలతో కొట్టించి [సాధారణముగా 40 కొరడా దెబ్బలు], మరల యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి. ''యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభనుండి వెడలి పోయిరి. ప్రతిరోజు వారు దేవాలయములోను, ప్రజల యిండ్లలోను ప్రబోధించుచు మెస్సయాయైన యేసును ప్రకటించుట మానలేదు" (అ.కా. 5:41). 
 
మన అనుదిన జీవితములో కూడా యేసుకు సాక్ష్యం ఇచ్చుటకు అనేక అవకాశములు ఉన్నాయి. వాటిని సద్వినియోగ పరచుకొని యేసుకు ధైర్యముతో సాక్ష్యం ఇవ్వగలగాలి. మన విశ్వాస అనుభవాలను ఇతరులతో పంచుకొనడం ద్వారా, ఇతరుల విశ్వాసాన్ని వికసింప జేసినవారము అవుతాము. వారి కష్ట సమయాలలో, మన నోటిమాట ఒక మంత్రములా పనిజేసి, పరిష్కార మార్గాన్ని చూపవచ్చు. చిన్న చేతిస్పర్శ, ఒక చిరునవ్వు ఇతరులకు ఊరటను ఇవ్వవచ్చు. కాబట్టి, దైవప్రేమను పంచుటకు, పెంచుటకు ఉదార స్వభావముతో మనం ముందుకు వెళదాం! 

ఈనాడు రెండవ పఠనములో పునీత యోహానుగారు ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నారు. సకల జీవకోటి ప్రభువును స్తుతించునట్లుగా అతను ఒక దివ్య అనుభూతిని పొందాడు. ప్రభువునకు స్తుతి, ఆరాధనలు, ఘనత, మహిమలు అర్పించడం ఇక్కడే మొదలు పెట్టాలి. అది ఒక అలవాటుగా మారాలి. మన స్వభావములో భాగమై పోవాలి. అపుడు, మనము, మన సంఘము, పునీతులతో, దేవదూతలతో ఏకమై ప్రభువును నిరంతరం స్తుతించగలుగుతాము. 

సువిశేష పఠనములో రెండు ముఖ్య భాగాలను చూస్తున్నాము: ఒకటి యేసు తన శిష్యులకు దర్శనమిచ్చి వారితో కలిసి భుజించడం; రెండు సంఘము గురించి పేతురును ప్రభువు ఆదేశించడం; పేతురును నాయకునిగా నియమించడం. 

యేసు దర్శనము - కలిసి భుజించడం
ఉత్తాన ప్రభువు తిబెరియా సరస్సు తీరమున శిష్యులకు మరల [మూడవ పర్యాయము] దర్శనము ఇచ్చారు. మొత్తం ఏడుగురు శిష్యులు, యెరూషలేమును వీడి వారి స్వస్థలమైన గలిలీయాకు తిరిగివచ్చి, సరస్సున చేపలు పెట్టుటకు వెళ్లిరి. రాత్రియంతయు శ్రమించినను వారికి ఏమియు దొరకలేదు. ఎందుకంటే, ప్రభవును అనుసరించకముందు అది వారి వృత్తి అయినప్పటికిని (మత్త 4:18), ఇప్పుడు కాదు. ఇప్పుడు వారు చేయవలసినది ప్రభువు ప్రేషిత కార్యం. దానిని వారు విడచి మరల పాత జీవితాలకు వెళ్లిపోయారు. "మిమ్ము మనుష్యులను పట్టువారినిగా చేసెదను" అన్న ప్రభువు మాటలు మరచిపోయారు. అందుకే, పేతురు "నేను చేపలు పట్టబోవుచున్నాను" అని పేతురు అనగా, "మేమును నీ వెంట వచ్చెదము" అని మిగతా శిష్యులు అన్నారు (యోహాను 21:3). ఇది వారి నిస్సహాయతకు, నిరాశకు నిదర్శనం! రాత్రియంతయు శ్రమించినను వారికి ఏమియు దొరకలేదు. ఎందుకన, వారు సరైన స్థలములో, మార్గములో లేరు. ప్రభువు మార్గమును వీడి, మన మార్గములో, ప్రణాళికలో వెళితే మనం గమ్యాన్ని కోల్పోతాము. ప్రభువు శక్తిపైగాక, మన శక్తిపై ఆధారపడితే అంతా వ్యర్ధమే (కీర్తన 127:1-2). 

ప్రాతఃకాలమున యేసు సరస్సు తీరమున నిలుచుండి ఉండెను. వారు ఆయనను గుర్తించలేక పోయిరి. కాని, యేసు వారి శ్రమను, కష్టాన్ని, అలసటను, నిరాశను గుర్తించారు. ప్రభువుకు మన జీవితమంతా క్షుణ్ణముగా తెలుసు. మన ప్రతీ సమస్య, కష్టం ఆయనకు తెలుసు. మన పోరాటంలో దైవీక సహాయాన్ని అందించడానికి ప్రభువు ఎప్పుడు సిద్ధమే! యేసు వారిని "బిడ్డలారా" (యోహాను 21:5) అని సంబోధించారు.

యేసు చెప్పినట్లుగా పడవకు కుడివైపున వలవేయగా ఎక్కువ చేపలు పడ్డాయి. అప్పుడు యోహాను "ఆయన ప్రభువే" అని గుర్తించాడు. ఆ క్షణములో వారు తప్పుడు స్థలములో ఉన్నామని గ్రహించారు. తప్పుడు మార్గములో ఉన్నామని గ్రహించారు.

వారు తీరమునకు రాగా, యేసు వారికోసం అచట 'బొగ్గుల మంటను' దానిపై ఉన్న చేపను, రొట్టెను చూచిరి. "వచ్చి భుజింపుడు" అని యేసు వారిని పిలిచెను. ప్రభువు లేనప్పుడు, వారికి తినుటకు ఏమియు లేకుండెను. కాని, ఇప్పుడు తినడానికి భోజనం సిద్ధముగా ఉన్నది. అదికూడా ప్రభువు ఏర్పాటు చేసిన భోజనము! ఎడారిలో ప్రజలకు తినడానికి ఏమియు లేనప్పుడు, ప్రభువు ఐదు రొట్టెలు, రెండు చేపలతో అందరికి సంతృప్తిగా భోజనం వడ్డించారు (యోహాను 6:1-14). "క్రీస్తు యేసు నందలి తన మహిమైశ్వర్యముల కనుగుణముగా నా దేవుడు మీ అవసరము లనన్నిటిని తీర్చును" (ఫిలిప్పీ 4:19) అని పౌలు సరిగానే చెప్పాడు.

ఇది చాలా సాధారణమైన సంఘటన అయినను, ప్రభువు భోజనము, దివ్యసత్ర్పసాదము, సంఘ కూడిక, ప్రభువు వాక్యం, బోధన...మొదలగు ఎన్నో గొప్ప విషయాలు ఈ సంఘటనలో దాగున్నాయి. అలాగే, పేతురు ఆ బొగ్గుల మంటను చూడగానే, తాను ప్రభువు ఎవరో తెలియదు అని మూడుసార్లు బొంకిన విషయం జ్ఞప్తికి వచ్చి యుండవచ్చు! ఈ సంఘటన వారికి ఎంతో ఊరటను ఇచ్చింది. వారి హృదయములో తుఫాను, అలజడులు ప్రభువు శాంతపరచారు.

శిష్యులు ప్రభువును విడిచి వెళ్లినను, ప్రభువు వారికోసం వెదకుచున్నారని, వారివెంట ఉన్నారని స్పష్టమగుచున్నది. యేసు వారిని ఎన్నడూ కోపగించుకొనలేదు. ఇది ఆయన ప్రేమకు, దయకు తార్కాణం. వారికి ఎక్కువ చేపలు పడటం, శిష్యుల ప్రేషిత కార్యాన్ని సూచిస్తుంది. క్రైస్తవ హింసల కాలములో, క్రైస్తవులు చేప గుర్తుతో సూచింపబడేవారు.

నేడు దివ్యసత్ప్రసాదాన్ని శ్వీకరించుచున్న మనం, యేసు పట్ల విధేయతను చాటుదాం. ప్రతీ దివ్యబలి పూజలో, ప్రభువును కలుసుకోవాలి. దివ్యసత్ప్రసాదములోనున్న ప్రభువు సాన్నిధ్యాన్ని మనం గుర్తించాలి. మన నిరాశలో, ఆయన మనతో ఉంటాడని విశ్వసించుదాం. ప్రభువు ఉన్నారని ధైర్యముగా, నమ్మకముగా ఉందాం.

యేసు-పేతురు సంభాషణ
వారు భుజించిన పిమ్మట, యేసు, సీమోను పేతురుతో, “యోహాను పుత్రుడవైన సీమోను! నీవు నన్ను వీరందరి కంటె ఎక్కువగ ప్రేమించుచున్నావా?” అని అడిగెను (యోహాను 21:15). పేతురు అవును ప్రభూ అని సమాధానం ఇచ్చాడు. ఇది అతని మారుమనస్సుకు సూచన (లూకా 22:62). అందుకే, తన సంఘానికి పేతురును కాపరిగా ప్రభువు నియమించారు. 'చేపలు పట్టడం' అనగా 'మనుష్యులను పట్టడం మరియు వారిని 'కాయడం', అనగా వారిని ప్రభువు మార్గములో నడిపించడం శ్రీసభ బాధ్యత. "మిమ్ము మనుష్యులను పట్టువారినిగా చేసెదను" అని ప్రభువు శిష్యులతో చెప్పారు (మత్త 4:19; మార్కు 1:17; లూకా 5:10).

'ప్రేమ' నోటితో మాత్రమే చెప్పే విషయం కాదు. అది చేతలలో చూపెడిది. మనం ఆచరించేది. 'నేను ప్రభువును ప్రేమిస్తున్నాను' అని అనగా దానిని మన కార్యాలలో జీవించాలి. యేసు మంచి కాపరి. మంచి కాపరి అయిన యేసును ఆదర్శముగా తీసుకొని, ప్రేమ, సంరక్షణను, తన ప్రజల కాపరులుకూడా చూపాలని దేవుడు కోరుకుంటున్నారు. శ్రీసభ నాయకత్వము గురించి, పేతురుకు కూడా ఉత్థాన క్రీస్తు సవాలు విసిరాడు: “నీవు నన్ను ప్రేమించుచున్నావా?” అని మూడుసార్లు అడిగాడు. “అవును ప్రభూ! నేను నిన్ను ప్రేమించుచున్నాను” అని పేతురు చెప్పినప్పుడు, “నీవు నా గొర్రెపిల్లలను మేపుము” (యోహాను. 21:15), “నా గొర్రెలను కాయుము” (21:16), “నా గొర్రెలను మేపుము” అని ప్రభువు కాపరి బాధ్యతలను అపోస్తలులకు అప్పగించారు. దీని నిమిత్తమై, పేతురు వేదసాక్షి మరణాన్ని పొందుతాడని కూడా ప్రభువు ప్రవచించారు (21:18-19). పేతురు ఇతర శిష్యులు అలాగే ప్రభువు కొరకు జీవించారు. వారి ప్రాణాలను కూడా అర్పించారు. వారి జీవితాలు నేడు మనకు ఆదర్శం!

ప్రేమ యనగా హృదయములో దేవునితో సహవాసాన్ని కలిగి యుండటం. “దేవుడు ప్రేమస్వరూపుడు” (1 యోహాను 4:8,16). ఆయన ప్రేమ అనంతమైనది, శాశ్వతమైనది. క్రైస్తవ ప్రేమ ఇట్టిదే! నేడు, జగద్గురువులు, మేత్రాణులు, విచారణ గురువులు, ప్రభుత్వాధికారులు, తల్లిదండ్రులు... కాపరులుగా సఫలమవ్వాలంటే, మొదటిగా ప్రేమ, అంకితభావం ఉండాలి. నిజమైన నాయకుడు, తన వారికొరకు తన సర్వాన్ని అర్పిస్తాడు. అంకితభావము కలిగిన నాయకులు, సమర్ధత, నిబద్ధత, పవిత్రత, మారుమనస్సు అను లక్షణాలను కలిగి ఉంటారు. రెండవదిగా, జ్ఞానం కలిగి యుండాలి. నిజమైన నాయకుడు తన ప్రజలను ఎరిగియుంటాడు (యోహాను. 10:3). మూడవదిగా, ఆదర్శముగా ఉండాలి. నాయకులు సంఘములో వారి మాటలద్వారా, చేతలద్వారా ఇతరులకు ఆదర్శముగా ఉండాలి. గురువులు ప్రజలకు, తల్లిదండ్రులు పిల్లలకు, బోధకులు విద్యార్ధులకు... ఆదర్శముగా ఉండాలి.

"నీవు నన్ను మిక్కిలిగా ప్రేమిస్తున్నావా?" అని ప్రభువు అడిగితే, నీ సమాధానం ఏమిటి?
నిన్ను విడిచిన వారిని ప్రేమతో కలుసుకొనుటకు నీవు సిద్ధముగా ఉన్నావా?
ప్రేమ, ప్రభువు ఆజ్ఞ అని ఎల్లప్పుడూ గుర్తుచేసుకొనుచున్నావా?

No comments:

Post a Comment