దివ్యకారుణ్య మహోత్సవం - 28 ఏప్రిల్‌ 2019, 28ఏప్రిల్‌ 2019

దివ్యకారుణ్య మహోత్సవం - 28 ఏప్రిల్‌ 2019, 28ఏప్రిల్‌ 2019


శ్రీసభలో ''దివ్యకారుణ్య మహోత్సవం'' స్థాపించబడాలని ప్రభువే స్వయముగా కోరినట్లు పునీత ఫౌస్తీనమ్మగారు (దివ్య కరుణ అపోస్తురాలు) తన దినచర్య పుస్తకములో తెలిపియున్నారు (699). ప్రభువు ఆమెకి ఈ మహోత్సవమునుగూర్చి ఫిబ్రవరి 22, 1931వ సంవత్సరములో తెలిపియున్నారు, ''పునరుత్థాన పండుగ తరువాత వచ్చు ఆదివారమున (పాస్కా రెండవ ఆదివారము) దివ్యకారుణ్య మహోత్సవం కొనియాడబడాలనేదే నా కోరిక. ఆ దినమున, దివ్యకరుణ సకల జనులకు ఒసగబడును. ఆ దినమున, పాపసంకీర్తనం చేసి, దివ్యసత్ప్రసాదమును స్వీకరించు వారికి సంపూర్ణ పాపవిమోచనము, శిక్షనుండి విముక్తియును లభించును. మానవ లోకము నా దరికి చేరిననే తప్ప అది శాంతమును పొందలేదు. ఆనాడు, అనంత దివ్య వరానుగ్రహాలూ ప్రవహించే దివ్య ద్వారాలన్నీ తెరచే ఉంటాయి. వారి పాపాలు ఎంతటివైనను, నన్ను చేరడానికి ఏ ఆత్మగాని భయపడక ఉండునుగాక! నా దరి చేరు ఆత్మలకు నా కరుణా సముద్ర వరాలను క్రుమ్మరించెదను. దివ్యకారుణ్య మహోత్సవం సకల ఆత్మలకు, ముఖ్యముగా పాపాత్ములకు శరణముగాను, ఆదరణముగాను ఉండునుగాక!''

పునరుత్థాన మహోత్సవము తర్వాత వచ్చు ఆదివారమున కరుణ మహోత్సవమును కొనియాడుట ద్వారా, మన రక్షణ పాస్కాపరమ రహస్యమునకు, దివ్యకారుణ్యమునకు ఎంతో సంబంధము కలిగియున్నదని విదితమగుచున్నది. ఆ దినమున, ప్రత్యేకముగా రక్షణ పరమ రహస్యము దివ్యకారుణ్యము యొక్క అతి గొప్ప వర ప్రసాదము అని ధ్యానించాలి.

దివ్యకరుణ మహోత్సవానికి ముందుగా దివ్యకరుణ నవదిన ప్రార్ధనలను, దివ్యకరుణ జపమాలను జపించి ధ్యానించి ఉత్సవానికి సంసిద్దులము కావలయునని ప్రభువు కోరుచున్నారు. నవదిన ప్రార్ధనలను చెప్పువారికి సాధ్యమైనన్ని వరాలు ఒసగబడును.

దివ్యకరుణ మహోత్సవాన్ని ఘనముగా, వైభవముగా కొనియాడాలనేదే ప్రభువు ఆకాంక్ష. ఈ మహోత్సవాన్ని జరుపుకొనే విధానాన్ని ప్రభువు రెండు విధాలుగా సూచించారు. మొదటగా, దివ్యకరుణ చిత్ర పటాన్ని ఆశీర్వదించి, సమూహముగా గౌరవించి, ఆరాధించాలి (49, 341, 414, 742). రెండవదిగా, ఆ దినమున గురువులు దివ్యకరుణ గూర్చి దైవప్రజలకు బోధించాలి (570, 1521).

మే 5, 2000 సంవత్సరమున 2 వ జాన్‌పాల్‌ పొప్‌గారు రెండవ పాస్కా ఆదివారాన్ని ''దివ్య కరుణ ఆదివారము''గా ప్రకటించారు.

దివ్యకారుణ్య సందేశము

దేవుడు దయామయుడు. ప్రేమ స్వరూపి. మన కొరకు తన ప్రేమను, కరుణను ధారపోసియున్నాడు. దేవుని కరుణను విశ్వసించుదాం. పరులపట్ల కరుణను చూపుదాం. ఎవరును దేవుని కరుణకు దూరము కాకూడదని ఆయన కోరిక. ఇదియే దివ్యకారుణ్య సందేశము. రాబోవు జీవితమున దేవుని కరుణను మనం పొందాలంటే, ఈ జీవితమున ఇతరులపట్ల కరుణతో జీవించాలి.

దేవుడు మనందరిని మిక్కిలిగా ప్రేమిస్తున్నాడు. మన పాపములకన్న ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది, అనంతమైనది. హద్దులులేనిది, షరతులు లేనిది. తద్వారా, నమ్మకముతో ఆ అనంత ప్రేమను కోరి, ఆయన కరుణను పొంది, మన ద్వారా, ఇతరులకు కూడా ఆ కరుణ ప్రవాహించాలనేదే దేవుని కోరిక. ఆవిధముగా, ప్రతి ఒక్కరు దైవ సంతోషములో పాలుపంచు కొనగలరు.

దివ్యకారుణ్య సందేశాన్ని మనం పుణికిపుచ్చుకోవాలంటే, మూడు కార్యాలు చేయాలి:

1. దివ్య కరుణను వేడుకోవాలి: ప్రార్ధనలో మనం దేవున్ని తరచూ కలుసుకోవాలన్నదే ఆయన కోరిక. మన పాపాలకి పశ్చత్తాపపడి, ఆయన కరుణను మనపై, సమస్త లోకముపై క్రుమ్మరించబడాలని దివ్య కరుణామూర్తిని వేడుకోవాలి.

2. కరుణ కలిగి జీవించాలి: మనం కరుణను పొంది, మన ద్వారా ఆ కరుణ ఇతరులకు కూడా లభించాలన్నదే దేవుని కోరిక. ఆయన మనపై ఏవిధముగా తన అనంత ప్రేమను, మన్నింపును చూపిస్తున్నారో, ఆ విధముగానే మనము కూడా ఇతరుల పట్ల ప్రేమను, మన్నింపును చూపాలని ప్రభువు ఆశిస్తున్నాడు.

3. యేసును సంపూర్ణముగా విశ్వసించాలి: తన దివ్యకరుణ వరప్రసాదాలు మన నమ్మకముపై ఆధారపడియున్నవని మనం తెలుసుకోవాలనేదే ప్రభువు కోరిక. మన ఎంత ఎక్కువగా ఆయనను నమ్మితే, విశ్వసిస్తే, అంతగా ఆయన కరుణా                కపావరాలను పొందుతాము.

''దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు'' (మత్త. 5:7). ''నాకు ఒసగబడిన ఈ దైవకార్యము నా మరణముతో అంతము కాదని, ఇది ఆరంభమేనని, నాకు ఖచ్చితముగా తెలుసు. అనుమానించు ఆత్మలారా! దేవుని యొక్క మంచితనము గూర్చి మీకు ఎరుకపరచుటకు, నమ్మించుటకు పరలోకపు తెరలను తీసి మీ చెంతకు తీసుకొని వత్తును'' (పునీత ఫౌస్తీనమ్మ డైరీ, 281).

యేసుక్రీస్తునందు ప్రధమముగా బహిరంగ పరచబడిన దేవుని దివ్యకరుణా రహస్యం, ఈ యుగానికొక గొప్ప సందేశము. మానవ చరిత్ర ప్రతి దిశలోనూ, ముఖ్యముగా, ఈ యుగములోను, దివ్య కరుణా రహస్యాన్ని లోకానికి చాటిచెప్పాల్సిన గురుతర భాద్యత శ్రీసభకు ఉన్నది (పునీత రెండవ జాన్‌ పాల్‌ పోప్‌).

''యేసుక్రీస్తు వ్యక్తిగా కారుణ్యమూర్తి. క్రీస్తును దర్శిస్తే దైవ కారుణ్యమును దర్శించడమే'' (16వ బెనెడిక్ట్‌ పోప్‌).

No comments:

Post a Comment