ఆరవ పాస్కా ఆదివారము, Year C

పాస్క ఆరవ ఆదివారము, Year C
అ.కా. 15:1-2, 22-29, దర్శన. 21:10-14, 22-23, యోహాను 14:23-29
పవిత్రాత్మ వాగ్దానము - శాంతి దానము



నేడు పాస్క 6వ ఆదివారము. ఇది క్రీస్తు మొక్షారోహణ మహోత్సవమునకు ముందు వచ్చే ఆదివారము. ఈరోజు ప్రభువు తన శిష్యులకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నారు మరియు వారికి శాంతిని ప్రసాదిస్తున్నారు. “భయపడకండి” అంటూ వారికి ధైర్యాన్నిస్తున్నారు. మొదటి పఠనంలో, పరిశుద్ధాత్మ యొక్క శక్తితో సంఘంలోని సమస్యలను శిష్యులు, పెద్దలు మరియు విశ్వాసులు ఏ విధంగా పరిష్కరించుకున్నారో తెలియజేయబడింది.

మొదటి పఠనము

ఈనాటి మొదటి పఠనములో, ఆదిమ క్రైస్తవ సంఘములో యూదక్రైస్తవులు, అన్యక్రైస్తవుల మధ్య రక్షణకు సంబంధించిన విభేదాలు ఎలా తలెత్తాయో వివరించబడింది. ఆ సమస్యను వారు దేవుని సహాయముతో, చర్చలు, సంప్రదింపులు, ప్రార్థన మరియు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఎంత సామరస్యంగా పరిష్కరించు కున్నారో తెలియజేయ బడింది. అంతేకాదు, ఆనాటి సమస్య యొక్క మూలాలు ఏమిటి, తొలినాళ్లలో ఇవ్వబడిన నియమాల ఉద్దేశం ఏమిటి, ఈ సంఘటనను పరిశీలించడము ద్వారా నేటి విశ్వాసుల మధ్య వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించు కోవచ్చు మరియు మన జీవితాలను దేవునికి ప్రీతికర మైనవిగా ఎలా మలచు కోవచ్చో కూడా మనం అర్థం చేసుకుందాం!

సమస్య: యూదయ నుండి కొందరు వ్యక్తులు అంతియోకియాకు చేరుకున్నారు. వీరు యూదా మతము నుండి క్రైస్తవ విశ్వాసంలోకి మారినవారు. అక్కడ, అప్పటికే అన్యమతాల నుండి క్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించి, ‘నూతన మార్గములో’ నడుస్తున్న క్రైస్తవ సోదరులకు వారు ఒక కొత్త బోధనను ప్రారంభించారు. వారి బోధన యొక్క సారాంశం ఏమిటంటే, యూదులైనా లేదా అన్యులైనా సరే, మోషే ధర్మశాస్త్రములోని నియమాలను, ముఖ్యముగా సున్నతి ఆచారాన్ని తప్పనిసరిగా పాటించాలి. సున్నతి లేకుండా వారికి రక్షణ లేదు అని వారు ఖరాఖండిగా చెప్పసాగారు.

ఈ కొత్త బోధన అప్పుడే క్రీస్తును విశ్వసించిన వారిలో తీవ్రమైన కలకలం రేపింది, వారిని అయోమయానికి గురిచేసింది. ఈ పరిస్థితిలో, అంతియోకియా సంఘాన్ని నడిపిస్తున్న పౌలు మరియు బర్నబాలకు, యూదయ నుండి వచ్చిన ఈ కొత్త బోధకులకు మధ్య తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. ఈ ఘర్షణ కారణముగా సంఘములో శాంతి కరువైంది. ఈ సంక్షోభము నుండి సంఘాన్ని కాపాడటానికి, పౌలు మరియు బర్నబా యెరూషలేమునకు వెళ్లారు. అక్కడ నున్న అపోస్తలులు మరియు సంఘ పెద్దలతో ఈ విషయముపై క్షుణ్ణంగా చర్చించి, వారి సలహాలు మరియు మార్గదర్శకత్వమును కోరారు.

అన్యమతములనుండి క్రైస్తవ విశ్వాసములోనికి మారుతున్న వారికి స్పష్టమైన సూచనలు, మార్గదర్శకములు అవసరం అయ్యాయి. ఈ చర్చలలో అన్నింటికంటే ముఖ్యముగా ‘సున్నతి’ గురించి ప్రముఖముగా ప్రస్తావించారు. అసలు సున్నతి అంటే ఏమిటి? దానిని ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఆచరించారు? యూదులు ఇప్పటికికూడా ఆచరిస్తూనే ఉన్నారు. ఇశ్రాయేలీయుల జీవితములో దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఈ సున్నతి యొక్క పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోకుండా, దాని యొక్క ఆవశ్యకతనుగాని, అనావశ్యకతనుగాని మనం ప్రతిపాదించలేము.

ఆదికాండము 17వ అధ్యాయము సున్నతి ఆచారం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. దేవుడు అబ్రాహాముతో చేసుకున్న ఒడంబడికకు సూచనగా (గుర్తుగా) అబ్రాహాము సంతతిలోని పురుషులందరు, అలాగే అబ్రాహాము సంతతితో కలసి పనిచేయువారు, కలిసి జీవించు పురుషులందరు కూడా సున్నతి పొందవలెనని దేవుడు ఆదేశించాడు. వారి జీవితములో, కుటుంబములో పాలుపంచు కొనువారు, బానిసలు కూడా సున్నతి చేయబడ వలెనని అజ్ఞాపించడము జరిగింది. ఈ సున్నతి కేవలము ఒక శారీరక గుర్తు మాత్రమే కాదు. ఇది దేవునితో చేసిన ఒడంబడికలో పాలుపంచు కోవడానికి సూచన. దేవునికి అబ్రాహామునకు మధ్య జరిగిన ఒప్పందమునకు నిదర్శనము. ఈ ఒడంబడిక యొక్క సారాంశము ఏమిటంటే, “నేను మీ దేవుడను, మీరు నా ప్రజలు.” ఈవిధముగా, ‘సున్నతి’ ద్వారా ఇశ్రాయేలు ప్రజలు తాము దేవునికి చెందిన వారని, ఆయన మార్గములో నడుస్తామని, ఆయనతో సహవాసము చేస్తామని మరియు ఆయన ప్రత్యేక ప్రజలుగా జీవిస్తామని ప్రపంచానికి చాటిచెప్పేవారు. అదేవిధంగా, దేవుడు తన ప్రజలను నడిపించే నాయకుడిగా, కాపాడే రక్షకుడిగా, ప్రేమగల కాపరిగా, పోషించే తండ్రిగా మరియు సంరక్షించే శక్తిగా ఉంటాడని ఈ సున్నతి ఆచారం తెలియ జేస్తుంది. ఈ పవిత్రమైన ఒడంబడికకు సాక్ష్యముగా మరియు సంకేతముగానే అబ్రాహాము సంతానములోని పురుషులందరూ తరతరాలుగా సున్నతి చేయించు కున్నారు.

ఈ సాంప్రదాయము వంశపారపర్యముగా కొనసాగుతూ వచ్చింది. యేసుక్రీస్తు కూడా ఈ సాంప్రదాయములో భాగస్వామి అయ్యారు. ఆయన జన్మించిన ఎనిమిదవ రోజున సున్నతి చేయబడ్డారు. క్రీస్తు శిష్యులందరూ ఇశ్రాయేలీయులే కావడం వలన, వారికి సున్నతి గురించి ఎలాంటి సందేహాలు కలగలేదు. అయితే, దేవుని వాక్యము యెరూషలేమును దాటి దాని పరిసర ప్రాంతాలకు, చివరకు భూదిగంతాల వరకు వ్యాపించడం మొదలైనప్పుడు (అపొస్తలుల కార్యములు 1:8), అన్యులు క్రీస్తును అంగీకరించడం ప్రారంభించి నప్పుడు, సున్నతి గురించి, దానితో ముడిపడి యున్న ఒడంబడిక గురించి, దేవుని వాగ్దానాల గురించి చర్చలు మొదలయ్యాయి.

సున్నతి యొక్క అంతర్గత అర్థాన్ని, బాహ్య సంకేతాన్ని వేరుగా చూడటం ప్రారంభించారు. అప్పుడే విశ్వాసుల మధ్య సమస్యలు స్పష్టంగా కనిపించాయి. అందుకే మోషే ఇశ్రాయేలీయులను హృదయపూర్వకముగా శుద్ధి చేసుకోమని చెప్పాడు (ద్వితీ 10:12, 16). వారి హృదయం దేవునికి అంకితం కావాలి. ఆ హృదయం దేవుని మాట వినాలి, దేవుని మాటకు స్పందించాలి, దేవునికి సింహాసనముగా ఉండాలి. ఇశ్రాయేలీయుల చరిత్రను పరిశీలిస్తే, వారు ఈ విషయంలో శ్రద్ధ చూపలేదు. బాహ్య ఆచారాలలో మునిగిపోయి, అంతరంగికమైన విషయాలను విస్మరించారు (యెషయా 1:10-15). కానీ, బాహ్య సంప్రదాయమైన సున్నతిని మాత్రం పాటిస్తూ వచ్చారు. అంతరంగికముగా దేవునికి దూరముగా ఉంటూనే, దేవునితో ఉన్నట్లు నటించారు. అందుకే, వారు హృదయశుద్ధికి కాకుండా శారీరకమైన, బాహ్య సంకేతానికి ప్రాధాన్యత ఇచ్చారు. అంతరంగిక శుద్ధిని, ఆత్మశుద్ధిని విడిచిపెట్టారు, మరచిపోయారు. మరీ అనాది క్రైస్తవ సంఘములో తలెత్తిన ఈ సమస్యకు పరిష్కారము ఏమిటి?

పరిష్కారం: నూతన సంఘములో వచ్చిన ‘సున్నతి’ సమస్యను అందరూ కలసి కూర్చొని, ఒకరితో ఒకరు మాట్లాడుకొని, ఒకరి వాదనను ఒకరు విని, సావధానముగా, సామరస్యముగా సమస్యను పరిష్కరించు కున్నారు. ఈవిధమైన సమస్యల పరిష్కారం మనకు మాతృక కావాలి. ఈ సమావేశం చివరిలో పేతురు, యాకోబులు మాట్లాడుతున్నారు, వారిద్దరి మాటలలో, క్రీస్తు సంఘములో నున్న నూతన దృక్పథము స్పురిస్తుంది. పేతురు చెప్పినట్లు, యూదులు ఎన్నిక మరియు సున్నతి ద్వారా దేవునితో సహవాసమును పొందితే, అన్యులు సువార్తను విని, విశ్వసించుట ద్వారా అదే భాగ్యమును పొందుతున్నారు (అ.కా.15:7). వారి విశ్వాసమును బట్టి దేవుడు వారి హృదయాలను శుద్ధి చేశాడు (అ.కా.15:9). అదేవిధముగా, యాకోబుకూడా పేతురు చెప్పిన దానిని వక్కాణిస్తూ, వారు ఏమి చేయకూడదో వివరిస్తున్నాడు (అ.కా.15:29). దేవుని దగ్గరికి రావాలంటే, కొన్ని త్యజించు కోవాలి. కొన్ని తగ్గించు కోవాలి. మలిన పరచు వాటిని మార్చు కోవాలి. వినుట ద్వారా వచ్చిన విశ్వాసమును హృదయములో పదిలముగా బద్రపరచు కోవాలి. అది క్రియలలో, జీవితములో వ్యక్తపరచ బడాలి. అమూల్యమైన ఆ విశ్వాసం మాటలద్వారా, అలవాట్లద్వారా, ఆలోచనలద్వారా, మలినం కాకుండా చూసుకోవాలి. ఇలా జరగాలంటే, హృదయమంతా ఆయనకు అంకిత మవ్వాలి. హృదయంనిండా ఆయనను నింపుకోవాలి. ఆయనకే ప్రధమ ప్రాధాన్యతను యివ్వాలి. ఆయన స్థానమును ఏవ్యక్తిగాని, శక్తిగాని, వస్తువుగాని, యితర వ్యాపకంగాని ఆక్రమించ కూడదు. ఆయనను పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ మనస్సుతోను ప్రేమించి, సేవించాలి (ద్వితీ 10:12). నీ హృదయం దేవునితో నిండాలి, దేవునికి మాత్రమే చెందాలి. మనం క్రీస్తుద్వారా సున్నతి పొందాము. కొలోస్సీ 2:11లో ఇలా చదువుచున్నాము: “క్రీస్తునందు మీరు సున్నతి పొందితిరి. ఆ సున్నతి మానవులచేగాక క్రీస్తుచే ఏర్పరుప బడినది. అది శరీరేచ్చలతో కూడిన శక్తినుండి మిమ్ము విముక్తి చేయును”. అలాగే రోమీ 2:28-29 వచనాలలో ఇలా చదువుచున్నాము: “నిజమైన సున్నతి బాహ్యశారీరక సున్నతి కాదు... అసలైన సున్నతి హృదయమునకు సంబంధించినది”. ఇంకా గలతీ 5:6లో పౌలుగారు ఇలా అంటున్నారు, “క్రీస్తుతో ఏకమై ఉన్నప్పుడు, సున్నతి ఉన్నను లేకున్నను ఎట్టి బేధము లేదు. కాని ప్రేమ ద్వారా పని చేయు విశ్వాసమే ముఖ్యము”.

కనుక, ఆయన ప్రసాదించు శక్తిద్వారా శరీరేచ్చలకు వ్యతిరేకముగా పోరాడాలి. క్రీస్తును మన హృదయములో ప్రతిష్టింప చేయకుండా ఈ పని చేయలేము. అందుకే హృదయము నిండా, క్రీస్తును నింపుకుందాం! ప్రేమను పంచుకుందాం! (కొలోస్సీ 3:15,16). సమస్యలు మన వ్యక్తిత్వాన్ని, సంఘాన్ని భయపెట్ట కూడదు. అవి మనలను దృఢపరచాలి. బలపరచాలి. ఒకరికొకరిని దగ్గర చేయాలి. దేవుని సన్నిధికి మనలను నడిపించాలి.

నేడు తెలుగు రాష్ట్రాలలోని కతోలిక శ్రీసభ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటుంది. కులవ్యవస్థ ప్రభావము, లతీను, సిరో-మలబారు మరియు సిరో-మలంకర అను మూడు సంప్రదాయాల మధ్యన కొన్నిసార్లు పోటీ, సంఘర్షణలు, ఆర్ధిక నిర్వహణలో పారదర్శకత లేకపోవడం, యువతను శ్రీసభలో నిలుపుకోలేక పోవడం, విచారణలలో ప్రభావవంతమైన పారిష్ కౌన్సిల్ లేకపోవడం మొదలగు అంతర్గత సమస్యలు ఉన్నాయి. అలాగే, మతమార్పిడి ఆరోపణలు, ప్రభుత్వ జోక్యం, ఆస్తులపై నియంత్రణ, ఆర్ధిక సవాళ్ళ వంటి బాహ్యపరమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను అధికమించడానికి ప్రయత్నం చేయాలి. తెలుగు కతోలిక పీఠాధిపతుల సమాఖ్య (TCBC) వంటి సంస్థలు, విచారనలోని సంస్థలు, ఈ సవాళ్లను చర్చించి, పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నాయని ఆశిద్దాం!

మన కుటుంబాలలోని, విచారణలోని, సంఘములోని సమస్యలను దేవుని సహాయముతో, పవిత్రాత్మ శక్తి ప్రభావముతో, పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిష్కరించు కోవడానికి ప్రయత్నం చేద్దాం. నాయకుల పట్ల, అధికారులపట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని ఉంచుదాం. నాయకులు, అధికారులు కూడా విశ్వాసుల సలహాలను, అభిప్రాయాలను తెలుసుకోవడం ఎంతో అవసరం! అందరు కలిసి చర్చించు కోవాలి. ఏకపక్ష నిర్ణయాలు మంచివి కావు. దేవునిపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటే, పరిష్కారాలు అందరికీ ఉపయుక్తముగా ఉంటాయి. విశ్వశ్రీసభతో కలిసి నడుద్దాం!

సువిశేష పఠనము

ప్రభువు తన శిష్యులతో వీడ్కోలు మాటలను పలుకుచున్నారు. “నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును” (యో 14:23) అన్న వాక్యముతో ప్రారంభమగు చున్నది. దేవున్ని ప్రేమించడం ఏమిటో స్పష్టం చేయుచున్నది. ప్రభువు వారి మధ్యనుండి త్వరలో వెళ్ళిపోతారు, కాని, ప్రభువు దైవరాజ్య ప్రేషిత కార్యము మాత్రము ఆగిపోదు. కొనసాగుతూనే ఉంటుంది. తన మరణ ఉత్థానముల ద్వారా మహిమో పేతుడైన ప్రభువు, ఇక ప్రత్యక్షముగా గాక, పరిశుద్ధాత్మ రూపమున తన సాన్నిధ్యాన్ని కొనసాగిస్తారు. ఆయన శిష్యులను ఎన్నటికి అనాధలుగా విడచి పెట్టడు. ఎందుకన, ఆయన వారిని ప్రేమించారు. స్నేహితులని పిలిచారు (15:15). ప్రభువును గూర్చి సమస్తమును ఎరుకపరచు ఒదార్చువాడగు పరిశుద్ధాత్మను వారిపైకి పంపిస్తారు (15:16). పవిత్రాత్మశక్తి సహాయముతో వారు ప్రభువు కార్యమును కొనసాగిస్తారు. రక్షణ ఒసగు సువార్తను ప్రపంచ మంతటా ప్రకటిస్తారు.

“నన్ను ప్రేమించువారు” అనగా ప్రభువు నందు విశ్వాసులు, అయన ‘అనుచరులు’ లేదా ఆయన ‘శిష్యులు’ లేదా ‘క్రైస్తవులు’. క్రీస్తుకు-క్రైస్తవులకు మధ్యన నున్న బంధం ప్రేమ బంధం. ప్రభువును ప్రేమిస్తే (క్రైస్తవులు), ఆయన మాటను పాటించాలి. ఆయన బోధనలను ఆలకించాలి. అపుడు పరలోక తండ్రి వారిని ప్రేమించును. అపుడు, తండ్రియును, యేసు ప్రభువును వారితో నివసించును (15:23).

“నా మాటను పాటించును”. మన జీవితములో మాటలు ఎంతో ముఖ్యమైనవి. మాట మీదనే ఎన్నో విషయాలు ముందుకు వెళుతూ ఉంటాయి. మన ప్రేమనుగాని, సత్యాన్నిగాని మాటతోనే వ్యక్తపరుస్తూ ఉంటాము. మాటలు ఎంతో శక్తిగలవి. అవి ఇతరులను బాధించ గలవు మరియు ఒదార్చ గలవు. అవమానపరచ గలవు మరియు పొగడ గలవు. కాని, యేసు మాటలు నిత్యజీవము గలవి, కనుక ఆయన మాటలను మనం తప్పక పాటించాలి.

“శాంతిని మీకు అనుగ్రహించు చున్నాను. నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను” (యో 14:27) అని ప్రభువు వారితో పలికారు. ‘శాంతి’ అనగా ఏమిటి? పునీత అగుస్తీను గారు చెప్పినట్లుగా, శాంతి యనగా, “మనస్సు యొక్క ప్రశాంతత, హృదయ సరళత, ఆత్మ నిశ్చలత.” అందుకే ప్రభువు, “మీ హృదయములను కలవరపడ నీయకుడు. భయపడ నీయకుడు” (యోహాను 14:27) అని చెప్పారు. కలవరపాటు, భయము వలన నిద్రలేని రాత్రులను గడుపుతూ ఉంటాము. ప్రభువు ఒసగు శాంతి మనకు ప్రశాంతతను, నిశ్చలతను ఒసగుతుంది. శాంతి యనగా, క్షమాపణ, సఖ్యత, ఐఖ్యత ఫలమైన దేవునితో సంబంధమును కలిగి యుండటం.

ముగింపు: ఈ పాస్క ఆరవ ఆదివారము, మనం పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని మరియు ప్రభువు మనకు ప్రసాదించే శాంతిని లోతుగా ధ్యానించాము. “భయపడకండి” అనే క్రీస్తు మాటలు మన హృదయాలకు ఎంతగానో ఊరటనిస్తాయి. ఆదిమ క్రైస్తవ సంఘములో తలెత్తిన సున్నతి వివాదాన్ని పరిశుద్ధాత్మ శక్తితో శిష్యులు, పెద్దలు, విశ్వాసులు ఎలా పరిష్కరించు కున్నారో మనం మొదటి పఠనంలో చూసాము. ఇది మన నేటి సంఘములో ఎదురయ్యే సమస్యలను కూడా దైవ సహాయంతో, ఐక్యతతో పరిష్కరించు కోవడానికి ఒక మార్గదర్శకం.

సమస్యల పరిష్కారంలో ఐక్యత యుండాలి: నూతన సంఘములో తలెత్తిన సున్నతి సమస్యను అందరూ కలిసి కూర్చుని, ఒకరి వాదనను ఒకరు విని, సావధానంగా, సామరస్యంగా పరిష్కరించు కున్నారు. ఇది మనకు మాతృక కావాలి. పేతురు, యాకోబుల మాటలలో క్రీస్తు సంఘంలోని నూతన దృక్పథం స్పష్టంగా కనిపిస్తుంది. విశ్వాసం ద్వారా దేవుడు మన హృదయాలను శుద్ధి చేస్తాడు. దేవుని దగ్గరికి రావాలంటే, కొన్ని త్యజించుకోవాలి, కొన్ని తగ్గించుకోవాలి. మన హృదయం దేవునికి పూర్తిగా అంకితం కావాలి. ఆయనకు మాత్రమే ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వాలి. ఆయనను పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ మనస్సుతోను ప్రేమించి, సేవించాలి. క్రీస్తు ద్వారా మనం పొందిన సున్నతి (కొలొస్సీ 2:11) ద్వారా శరీరేచ్ఛలకు వ్యతిరేకంగా పోరాడాలి. క్రీస్తును మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటేనే ఇది సాధ్యం అవుతుంది.

No comments:

Post a Comment