ఐదవ పాస్కా ఆదివారము, Year C

ఐదవ పాస్కా ఆదివారము, Year C
అ.కా. 14:21-27; దర్శన. 21:1-5; యోహాను 13:31-35
నూతన ఆజ్ఞ

నేడు పాస్కా ఐదవ ఆదివారము. క్రీస్తు ఉత్థాన వెలుగులో మనం ప్రయాణం చేస్తున్నాము. ఆధ్యాత్మికముగా బలపడుచూ ముందుకు సాగిపోవుచున్నాము. ఈస్టర్ రోజున, క్రీస్తు నిజముగా ఉత్థాన మయ్యారు అని ప్రకటించాము. రెండవ వారమున, అనాధి క్రైస్తవ సంఘ ఆరంభ చరిత్రను ధ్యానించాము. మూడవ వారమున, ప్రభువుపట్ల విధేయత కలిగి జీవించాలని జ్ఞాపకం చేసుకున్నాము. గతవారం, ప్రభువు మన మంచి కాపరి. ఆయన స్వరమును ఆలకించి, ఆయనను అనుసరించాలి అని ధ్యానించాము. ఈరోజు, మన ఆధ్యాత్మిక ప్రయాణములో, ఎదుగుదలలో ప్రభువైన యేసు ప్రేమాజ్ఞను ఇస్తున్నారు. ప్రేమే మన గుర్తింపు, మూలం అని జ్ఞాపకం చేసుకుంటున్నాము.

ఈనాటి సువిశేష పఠనములో, కడరాత్రి భోజన సమయములో, తన శిష్యులకు ప్రభువు ఇచ్చిన చివరి సందేశములోని భాగాన్ని వింటున్నాము. ఒకరినొకరు ప్రేమించుకొనుడు అని ప్రభువు శిష్యులను ఆహ్వానించారు: నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో, దానిని బట్టి మీరు నా శిష్యులని అందరు తెలిసికొందురు (యోహాను 13:34-35).

ఎందులకు శిష్యులకు ప్రేమ అంత అవసరం? దేవుడు ప్రేమ. ఆయన ప్రేమకు మూలం. త్రిత్వైక సర్వేశ్వరుడు ప్రేమతో నిండియున్న ఒక సమూహము. కనుక ప్రేమ ఉన్నచోట దేవుడు ఉన్నారు. ఒకరు ఎప్పుడైతే పరిపూర్ణ ప్రేమను హృదయమున కలిగి ఉంటారో, వారు సరియైన మార్గమున ఉన్నట్లే! ప్రేమతో నిండిన హృదయం సంతోషానికి మూలము. హృదయములో ప్రేమ కలిగిన వారు సంతోషముగా ఉంటారు. 

మనిషి హృదయం ప్రేమకోసం తపిస్తూ ఉంటుంది. మన నైజం ఏమంటే, ప్రేమ లేనిచో మనం కుదుటగా ఉండలేము. అసంతృప్తిగా ఉంటాము. చాలామంది ప్రేమించడానికి ఇష్టపడరు. ప్రేమ హృదయాన్ని బాధిస్తుందేమోనని భయపడతారు. బాధాకరమైన సంఘటనలు ఇతరులకు దూరముగా ఉండుటకు ప్రలోభ పెడుతూ ఉంటాయి. 

ప్రభువు తన శిష్యుల పాదాలను కడిగే సందర్భమున ఈ నూతన ఆజ్ఞను ఇచ్చియున్నారు. ప్రేమయనగా, సేవయని ప్రభువు తెలియజేయుచున్నారు. ఆకాలములో కేవలం బానిసలు మాత్రమే ఇతరుల పాదాలను కడిగేవారు. కనుక ప్రభువు శిష్యులను సేవాపూరితమైన జీవితానికి ఆహ్వానించుచున్నారు. వినయవిధేయతలతో ఇతరుల శ్రేయస్సు కొరకు పాటుబడాలి. ప్రభువు ప్రేమ అనంతమైనది. హద్దులు, షరతులు లేనిది. లోకరక్షణ కొరకు తననుతాను ఒక బలిగా అర్పించుకున్నారు. అంత గొప్ప ప్రేమను ఈ లోకం అర్ధంచేసుకొనక, ఆయనపై ద్వేషాన్ని పెంచుకుంది. శత్రువుగా భావించింది. ఈ ద్వేషము, శత్రుత్వము వలన ఆయన సిలువ మరణము పొందినను, వీరు చేయుచున్నది వీరు ఎరుగరు, వీరిని క్షమించు తండ్రీ (లూకా 23:34) అని ప్రార్ధించారు. ఎంత గొప్ప ప్రేమ!

నూతన ఆజ్ఞలో మూడు విషయాలు గమనింపవచ్చు: (1)ఒకరినొకరు ప్రేమింపుడు (13:34) అని ప్రభువు ఆజ్ఞాపించారు. అది ఒక ఆజ్ఞ. కనుక, మనకు వేరే ఆప్షన్ లేదు. ప్రభువు ఆజ్ఞకు మనం విధేయులమై యుండాలి. ఇతరులను ప్రేమించడం మన బాధ్యత! (2). "ఒకరినొకరు ప్రేమింపుడు" అని చెప్పారు. అనగా, ఎలాంటి షరతులు, పరిమితులు లేకుండా ప్రేమించాలి. ప్రభువు కేవలం ప్రేమించండి అని మాత్రమే చెప్పారు. ప్రేమ అనంతమైనది, కనుక మనం ఒకరినొకరము అనంతముగా ప్రేమించుకొనాలి. (3). నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించు కొనుడు (13:34) అని ప్రభువు చెప్పారు. దేవుడు మనలను మిక్కిలిగా, అనంతముగా ప్రేమించుచున్నారు. పాపాత్ములమైనను, మనలను ప్రేమించుచున్నారు. మనం క్రైస్తవ జీవితములో 'ప్రేమ' అన్నింటికన్న ప్రధానం అని అర్ధమగుచున్నది.

ప్రేమ - క్రైస్తవ జీవితానికి గుర్తింపు: మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో, దానిని బట్టి మీరు నా శిష్యుల్ని అందరు తెలిసికొందురు (13:35). క్రైస్తవులముగా, మనం ఎవరము అని లేదా క్రీస్తు శిష్యులమని ఈ లోకానికి తెలియ జేయడానికి మనకున్న మార్గం - ప్రేమ. మనం వేసుకొనే వేషధారణ కన్న, మనం జీవించే జీవిత విధానం ప్రాధాన్యం! ప్రేమే మన క్రైస్తవ గుర్తింపు. మన యూనిఫాం ప్రేమే. మనం ప్రేమను ధరించి జీవించాలి. మన జీవితముద్వారా, మనం ఇతరులకు సాక్ష్యులుగా ఉండాలి. "అన్ని వేళల, సువార్తను బోధించు; అవసరమైతేనే మాటలను ఉపయోగించు" అని పునీత అస్సీసిపుర ఫ్రాన్సిసు ఒక సందర్భములో చెప్పారు. "నాకు క్రైస్తవ మతముతో ఎలాంటి సమస్యలేదు; కాని క్రైస్తవులు వారి సత్య బోధనల ప్రకారం జీవించరు" అని మహాత్మ గాంధి అన్నారు. మనం ఒకరినొకరము ప్రేమించినప్పుడే, మనం క్రీస్తు శిష్యులమని ఇతరులు తెలుసుకుంటారు. 1 యోహాను 4;7-8 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం: ప్రేమ దేవుని నుండి పుట్టినది. కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలముగ జన్మించినవాడు. అతడు దేవుని ఎరిగిన వాడగును. దేవుడు ప్రేమ స్వరూపుడు. కనుక ప్రేమింపనివాడు దేవుని ఎరుగని వాడే. అలాగే, 1 యోహాను 4:16: దేవుడు ప్రేమ స్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమమయుడై జీవించునోఅతడు దేవుని యందును, దేవుడు అతనియందును ఉందురు. 1 యోహాను 4;20-21: కాని, ఎవరైనను తాను దేవుని ప్రేమింతునని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. తన కనులారా తాను చూచిన సోదరుని ప్రేమింపనిచో తాను చూడని దేవుని అతడు ప్రేమింపలేడు. కనుక దేవుని ప్రేమించువాడు, తన సోదరుని కూడ ప్రేమింపవలెను అనునదియే క్రీస్తు మనకు ఒసగిన ఆజ్ఞ.

సోదరప్రేమ, దైవప్రేమను ప్రతిబింబిస్తుంది. ఈ ప్రేమాజ్ఞను విధేయించుటద్వారా, ప్రభునిలో మన ప్రేమ పరిపూర్ణమగును. తద్వారా, పరలోక తండ్రి, తన కుమారుని ప్రేమించునటుల, మనలను ప్రేమించును. ప్రేమించక, ఈ లోకములో దుష్టత్వముతో జీవిస్తే, మనలను మనం మోసము చేసుకున్నవారమవుతాము! పౌలు, బర్నబాలు సంఘాలను విశ్వాసములో, ప్రేమలో నడిపించడం నేడు మనకు ఆదర్శముగా మొదటి పఠనములో చూడవచ్చు. రెండవ పఠనములో యోహాను "ఒక క్రొత్త దివిని, క్రొత్త భువిని" దర్శనము గాంచాడు. అది మన ప్రేమ కలిగిన జీవితానికి ఫలితముగా చూడవచ్చు.

ప్రభువు ఇచ్చిన నూతన ఆజ్ఞను మనం జీవించాలంటే అంత గొప్ప ప్రేమను ప్రభువే మన హృదయాలలో ఉంచాలి. ప్రతీ ఒక్కరిని ప్రేమించడం అంత సులువు కాదు. అయితే, దేవుని సహాయముతో అసాధ్యమైనదీ ఏదీ ఉండదు. ప్రేమలో ఎదగాలంటే, దేవుని శక్తిపై ఆధారపడాలి. దేవుడు మాత్రమే ప్రేమించడం మనకు నేర్పగలరు. మనవైపునుండి మనం ప్రేమించుటకు కృషి చేయాలి. మన కృషిని బట్టే, దేవుడు మనకు సహాయం చేయును.

No comments:

Post a Comment