ఏడవ సామాన్య ఆదివారము, YEAR C


7వ సామాన్య ఆదివారము, YEAR C
1 సమూ 26: 2, 7-9, 12-13, 22-23; 1 కొరి 15:45-58; లూకా 6:27-38


అష్టభాగ్యాలను అనుదిన జీవితములో పాటించడం ఎలా? యేసు బోధించే జీవిత పాఠాలు

శత్రువుల యెడ ప్రేమ: నా శత్రువులను నేను ప్రేమించుట వలన, వారిని నా స్నేహితులుగా చేసుకొనుచున్నాను, తద్వారా, నా శత్రువులను శాశ్వతముగా నిర్మూలించుచున్నాను అని అబ్రహాం లింకన్ అన్నారు. నిజముగా ఇది ఎంతో వాస్తవము! మన శత్రువులను జయించాలంటే, మనకున్న ఒకే ఒక మార్గం వారిని ప్రేమించడం, క్షమించడం, అర్ధంచేసుకోవడం.

నేటి సువార్త పఠనము, లూకా సువార్తలోని ‘అష్టభాగ్యాల’ బోధనను వాస్తవ్యములో, మన అనుదిన జీవితములో ఎలా జీవించాలో బోధిస్తున్నది. అష్టభాగ్యాల బోధన ప్రేమతో కూడిన జీవితముగా మారాలి. అయితే, ఈ ప్రేమ కేవలము మన కుటుంబ సభ్యులపట్ల, స్నేహితులపట్ల మాత్రమేగాక, మన శత్రువులపట్ల, మనలను ద్వేషించువారిపట్ల, మనలను బాధించువారిపట్ల కూడా ఉండాలి.

లూకా సువార్తీకుడు తనదిన శైలిలో దేవుని గురించి ఆయన ప్రేమ గురించి తన సువార్తలో తెలియజేయుచున్నాడు. దేవుడు దయగలవారు, ప్రేమగలవారు. ఆ ప్రేమ వలనననే, ఆయన మన మధ్యలోనికి వచ్చియున్నారు. ఆయన సమాజములో దిగువ శ్రేణి ప్రజల పక్షమున ఉన్నారు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే తనను ద్వేషించువారిని, చంపినవారిని సైతము ప్రేమించారు. సిలువనుండి కూడా వారిని క్షమించారు: “తండ్రీ! వీరు చేయునదేమో వీరు ఎరుగరు. వీరిని క్షమింపుము” (లూకా 23:34).

ఈవిధముగా, క్రీస్తు ప్రేమ అనంతమైనది, షరతులు లేనిది. ఆయన తప్పిపోయిన కుమారుని కొరకు ఆశగా ఎదురుచూసే తండ్రి. తప్పిపోయిన వారిని వెదకి రక్షించుటకు వచ్చిన గొప్ప ప్రేమమూర్తి, “మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చియున్నాడు” (లూకా 19:10). క్రీస్తు సర్వమానవాళికి దయగల రక్షకుడు. క్రీస్తు ధర్మశాస్త్రముపైగాక, ప్రేమ, సోదరభావముపై ఎక్కువ ఆసక్తిని చూపియున్నారు. ఆయన ధర్మశాస్త్రబోధకులకు, పండితులకుగాక, సంఘమునుండి వెలివేయబడిన వారికి, పాపాత్ములకు, పేదవారికి సువార్తను ప్రకటించారు. ప్రజలతో ఉండి, వారితో కలిసి తిరుగుతూ, వారిని తండ్రి ప్రేమలోనికి నడిపించారు.

యేసు క్రీస్తు మన సోదరుడు. మనమందరము ఆయన సోదరీ సోదరులము. మన ఏకైక తండ్రి పరలోక దేవుడు. ప్రజల జీవితానికి చాల దగ్గరగా ప్రభువును లూకా చూపిస్తున్నాడు. లూకా సువార్తలో క్రీస్తుబోధ కొండపైనుండిగాక, నేలపైనుండి ఉంటుంది, “యేసు కొండ దిగివచ్చి, అనుచరులతో మైదానమున నిలుచుండెను...” (6:17-19) అని చదువుచున్నాము. ప్రజలతో సమానముగా ప్రభువు ఉన్నారని దీని తాత్పర్యం. ఆయన ఒక బోధకునిగాకాక, ఒక సోదరునిగా లూకా చిత్రీకరిస్తున్నాడు. ఆయన గ్రామ గ్రామాలకు వెళ్లి సువార్తను బోధించారు. ప్రజలతో మమేకమై జీవించారు. ఆయన ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉన్నారు. మానవాళి సాధారణ జీవితాన్ని ఆయన కూడా జీవించారు.

బంగారు నియమము: నేడు ప్రభువు ఒక ముఖ్యమైన బోధనను 6:31వ వచనములో తెలియజేస్తున్నాడు, “ఇతరులు మీకు ఎట్లు చేయవలెనని మీరు కోరుదురో అట్లే మీరును ఇతరులకు చేయుడు.” ఇది యేసు ప్రభువు చెప్పిన ‘బంగారు నియమము’. ఇది మానవ సంబంధాలకు పునాది. అందరుకూడా ఇతరులచేత గుర్తింపబడాలని, గౌరవింపబడాలని ఆశిస్తాము. అయితే, ఇతరులుకూడా, మనలనుండి గుర్తింపును, గౌరవాన్ని ఆశిస్తున్నారని మనము గుర్తించాలి, తెలుసుకోవాలి. మనం ఆశిస్తూ ఇతరులకు ఇవ్వనప్పుడు, మనము స్వార్ధపరులము. ఇతరులు మనపట్ల ఎలా ప్రవర్తించాలని ఆశిస్తామో, అలాగే మనం ఇతరులపట్ల ప్రవర్తించాలి. కనుక, ప్రేమ, దయ, కనికరముతో ఇతరులపట్ల వ్యవహరించాలి. మన స్వార్ధాన్ని విడచి పెట్టి ఇతరుల అవసరాలను పట్టించు కోవాలి. ఇతరులను గౌరవించాలి. ఈ బంగారు నియమాన్ని పాటించడం ద్వారా, మంచి సంబంధాలను ఏర్పరచుకోవచ్చు. ఇది సమాజములో శాంతి, సామరస్యాన్ని పెంపొందించడానికి దోహదపడుతుంది. దేవుని ప్రేమను ఇతరులకు చాటడానికి గొప్ప మార్గం.

నూతన బోధన: “శత్రువులను ప్రేమింపుడు”: ప్రభువు ఓ నూతన బోధనను చేయుచున్నారు, “మీ శత్రువులను ప్రేమింపుడు. మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు. మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు. మిమ్ము భాదించువారికై ప్రార్ధింపుడు” (లూకా 6:27, 35). ఒక నూతన జీవితాన్ని జీవింపమని ప్రభువు మనలను కోరుచున్నారు. యూదప్రపంచం పాత నిబంధనకు లోనై జీవించుచున్నది – “పొరుగు వారిని ప్రేమింపుడు. శత్రువులను ద్వేషింపుడు” అని చెబుతుంది. కాని, ప్రభువు ప్రేమతో కూడిన ఒక కొత్త నిబంధనను ఇచ్చుచున్నారు, “శత్రువులను ప్రేమింపుడు.” ప్రభువు కేవలము బోధించడము మాత్రమేగాక, దానిని ఆయన జీవించి మనకు ఆదర్శముగా నిలచారు. తన శత్రువులను ఆయన ప్రేమించారు, వారిని క్షమించారు (లూకా 23:34). శత్రువులను ప్రేమించడం చాలా కష్టం, కాని యేసు శిష్యరికములో ప్రాముఖ్యమైన అంశం.

“ప్రేమించడం” అనగా ‘మేలు చేయుట’, ‘ఆశీర్వదించుట’, ‘ప్రార్ధించుట’ (లూకా 6:27-28). ఇతరులపట్ల దయ, కనికరము కలిగి జీవించుటయే (agape, ఆగాపే) అత్యున్నతమైన ప్రేమ. అందుకే ప్రభువు అన్నారు: “మీ తండ్రివలె మీరును కనికరము గలవారై యుండుడు” (లూకా 6:36). దేవుని ప్రేమ, కనికరము - అనంతమైనది, షరతులు లేనిది, త్యాగపూరితమైనది. కనుక, క్రీస్తు శిష్యులు ఎవరిని ద్వేషించ కూడదు.

ఇంకా, ఈ నూతన నియమమును మన అనుదిన జీవితములో ఎలా జీవించాలో ప్రభువు వివరముగా తెలియజేయుచున్నారు, “మీ శత్రువులను ప్రేమింపుడు. వారికి మేలు చేయుడు. అపకారులకు ప్రత్యుపకారము చేయుడు. ఆశపడకుడు. మీ తండ్రివలె మీరును కనికరము గలవారై యుండుడు. పరుల గూర్చి తీర్పు చేయకుడు. పరులను ఖండింపకుడు. పరులను క్షమింపుడు. పరులకు మీరు ఒసగుడు” (లూకా 6:32-38). ఇదియే క్రైస్తవ వైఖరి! మనము జీవించాల్సిన క్రైస్తవ విధానము! హింసను శాంతితో జయించాలి! ద్వేషాన్ని ప్రేమతో ఓడించాలి! గాయాన్ని క్షమతో నయంచేయాలి! చెడును మంచితో నియంత్రించాలి! “మీరు ఏ కొలతతో కొలుతురో, ఆ కొలతతోనే మీకును కొలువ బడును” అని లూకా 6:38లో చదువుచున్నాము.

మనం జీవించే ప్రస్తుత సమాజములో, ఇలా జీవించడం కష్టమే! కాని, మనకు సాధ్యమే! ఎందుకన, “మనం సర్వోన్నతుడగు దేవుని బిడ్డలము. ఏలయన, ఆయన కృతజ్ఞత లేనివారికి, దుష్టులకును మేలు చేయును” (లూకా 6:35). అలాగే, మనం దేవుని పోలికలో, ప్రతిరూపములో సృష్టింప బడినాము. కనుక, ఆయనవలె, మనం కూడా శత్రువులను ప్రేమించాలి.

నేటి సువిశేష పఠనం ద్వారా, యేసు ముఖ్యమైన మూడు విషయాలను బోధిస్తున్నాడు: ఒకటి, శత్రువులను ప్రేమించండి: మనల్ని ద్వేషించే వారిని, మనకు హాని కలిగించే వారిని కూడా ప్రేమించాలని యేసు చెబుతున్నాడు. ఇది చాలా కష్టమైన విషయం, కానీ దేవుని ప్రేమను ప్రతిబింబించడానికి ఇది చాలా ముఖ్యం. రెండు, ఇతరులకు మేలు చేయండి: మనకు సహాయం చేసిన వారికి మాత్రమే కాకుండా, మనకు హాని కలిగించిన వారికి కూడా మేలు చేయాలని యేసు చెబుతున్నాడు. ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు సహాయం చేయడం నిజమైన ప్రేమకు గుర్తు. మూడు, క్షమించండి: ఇతరులు మనకు చేసిన తప్పులను క్షమించాలని యేసు చెబుతున్నాడు. క్షమాపణ అనేది మన హృదయాలను స్వస్థపరుస్తుంది మరియు ఇతరులతో మన సంబంధాలను మెరుగుపరుస్తుంది.

నేటి రెండవ పఠనములో, పౌలు అంటున్నారు: “రక్తమాంసములతో చేయబడినది దేవుని రాజ్యమున పాలు పంచుకొనలేదు. భౌతికమైనది అమరత్వమును పొందలేదు” (1 కొరి 15:50). మొదటి ఆదాము భౌతికం; రెండవ ఆదాము (క్రీస్తు) ఆధ్యాత్మికం. మనం ఎవరికి చెందిన వారము? మొదటి ఆదాముకు చెందిన వారమైతే, ఈ భూలోక మట్టిలోనే ఉంటాము. పరలోకము నుండి దిగివచ్చిన ఆదాము అయిన క్రీస్తుకు చెందిన వారమైతే, నూతన జీవితమునకు ఎత్తబడుతాము. “భువికి సంబంధించిన వారు భువినుండి చేయబడిన వానిని పోలి యుందురు. దివికి సంబంధించిన వారు దివినుండి వచ్చిన వానిని పోలి యుందురు. భువి నుండి పుట్టిన వానిని పోలి యుండిన మనము దివి నుండి వచ్చిన వాని పోలికను పొందగలము” (1 కొరి 15:48-49). మానవులముగా, మనమందరం, భూలోక ఆదాము శిబిరానికి చెందిన వారమే. అయితే, మనకున్న సవాలు ఏమనగా, ఆదాము శిబిరము నుండి, క్రీస్తు శిబిరము వైపునకు మరలాలి. ఇది సాధ్యం కావాలంటే, క్రీస్తు బోధనలను జీవించి, మంచి వారిగా మారాలి! కేవలం మంచి వ్యక్తిగా కాక, క్రీస్తులో నూతన వ్యక్తిగా మారాలి (1 కొరి 15:52).

మొదటి పఠనములో (1 సమూ 26:2, 7-9, 12-13, 22-23), సౌలు దావీదును చంపుటకు అనేకసార్లు ప్రయత్నాలు చేసాడు. దేవుడు దావీదును రక్షిస్తాడు. అయితే, సౌలును చంపుటకు దావీదుకు అవకాశం రాగా, చంపకుండా వదిలివేసాడు. దావీదు సౌలును అభిషిక్తునిగా భావించి అతనికి హాని చేయకూడదని నిర్ణయించుకుంటాడు. దావీదు క్షమాగుణాన్ని చూసి, సౌలు మనసు మార్చుకున్నాడు.

మనము సువార్తను ఆలకించి ప్రేమలో జీవించుటకు పిలువబడి యున్నాము. ప్రేమ అనేది ఒక పదము కాదు, అది ఒక ఆచరణ. విశ్వాసము వలన మనము దేవుని ప్రేమలో జీవిస్తున్నాము. దేవుడు మనలను ప్రేమిస్తున్నారు. కనుక ఆయన దయను మనము పొందుచున్నాము. దీని మూలముగనే, మనము జీవించుచున్నాము. కనుక మనము ఇతరుల పట్ల ప్రేమగా జీవించాలి.

No comments:

Post a Comment