ఎనిమిదవ సామాన్య ఆదివారము, YEAR C
సీరా 27:5-8; 1 కొరిం 15:54-58; లూకా 6:39-45
ఈనాటి సువిశేషములో యేసుప్రభువు మూడు చిన్న ఉపమానముల ద్వారా, అష్టభాగ్యాల సందేశమును (లూకా 6:20-26) మనం ఎలా జీవించాలో యేసు మనకు స్పష్టముగా బోధిస్తున్నారు. దీనిలో భాగముగా, గతవారం "శత్రువులను ప్రేమింపుడు" (లూకా 6:27-36) గురించి, "పరులను తీర్పు చేయకుడు" (లూకా 6:37-38) గురించి ధ్యానించాము. నేటి ఉపమానములన్నీ కూడా, మనం యేసుకు మంచి శిష్యులుగా ఎలా జీవించాలనే విషయాలను బోధిస్తున్నాయి.
మొదటి ఉపమానం (6:39-40) - మార్గచూపరి
ఒక మంచి 'గురువు'గా కావలయునంటే, సంపూర్తిగా శిక్షణపొంది యుండవలయును (6:39-40): ఒక గ్రుడ్డివాడు మరో గ్రుడ్డివానికి మార్గమును చూపలేడు. అట్లు చేసినచో ఇరువురును గోతిలో పడుదురు! ఎన్నుకొనబడి, ప్రజలకు మార్గదర్శకులుగా ఉండవలసిన వారిగురించి ఈ వాక్యము బోధిసున్నది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను నడిపింపవలసిన పరిసయ్యుల గురించి చెప్పబడుతుంది. యేసు ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను "అయ్యో! అంధులైన మార్గ దర్శకులారా!" అని గద్దిస్తున్నారు (మత్త 15:12-14; 23:16,17,19,24,26). సత్యమును ఎరిగియున్నామని తలంచి ప్రజలను తప్పుత్రోవ పట్టించే నాయకులకు, గురువులకు ఇది ఒక హెచ్చరికగా ఉన్నది. వారు ఇతరులు ఎలా జీవించాలో చెబుతారు కాని వారి జీవితములో వారు బోధించేది ఏదీకూడా పాటించరు. ఇటువంటి మార్గదర్శకులు సత్యమును ఎరుగని ప్రజలను నడిపించినచో ఇరువురి ఆధ్యాత్మిక జీవితాలకు ముప్పు ఉంటుంది. అందులకే, ఇలాంటి మార్గదర్శకులకు "సంపూర్ణ శిక్షణ" అవసరమని ప్రభువు తెలియజేయుచున్నారు. "సంపూర్ణ శిక్షణ పొందిన శిష్యుడు తన గురువువలె ఉండును'' (6:40).
గొప్ప గురువు అయిన ప్రభువు మనకు ఆదర్శం. ఆయన బోధించిన వాక్కును ఆయన జీవితములో పాటించారు: "మీరు నన్ను బోధకుడనియు, ప్రభువుననియు పిలుచుచున్నారు. మీరు అట్లు పిలుచుట సముచితమే. ఏలయన, నేను మీ బోధకుడను, ప్రభువునై యున్నాను. ప్రభువును, బోధకుడను అయిన నేను మీ పాదములను కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరియొకరు కడుగవలయును. నేను చేసినట్లు మీరును చేయవలయునని మీకు ఒక ఆదర్శమును ఇచ్చితిని" (యోహాను 13:13-15). గురువు ఏమిటో శిష్యులు అలాగే ఉండవలయును. శిష్యుడు గురువుతో పోల్చుకొనవలయును, "ఇక జీవించునది నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నారు" అని పౌలుగారు చెప్పియున్నారు (గలతీ 2:20). కనుక ప్రజలను నడిపించాలనేవారు 'సంపూర్ణ శిక్షణ' పొందవలయునని ప్రభువు తెలియజేయుచున్నారు.
అలాగే, మన ఆధ్యాత్మిక జీవితములో మనం ఎవరిని ఆదర్శముగా తీసుకుంటున్నామో, ఎవరిని మాటలు ఆలకించు చున్నమో కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి! తప్పు ద్రోవలో నడిపే వారినుండి జాగ్రత్త వహించాలి! యేసు మన 'నిత్యగురువు' అని గ్రహించాలి.
రెండవ ఉపమానం (6:41-42) - మారుమనస్సు
చూపు స్పష్టముగా నుండవలయునంటే, కంటిలోని దూలమును, నలుసును తీసివేయవలయును (6:41-42; మత్తయి 7:3-5): "ఊపిన జల్లెడలో మట్టి పెళ్లలు మిగులునట్లే నరుని సంభాషణమున దోషములు కన్పించును" (సీరా 7:4). ఈ ఉపమానము ద్వారా, ప్రతీ ఒక్కరు అంత:రంగికముగా శుద్ధిపొందాలని, మారుమనస్సు పొందాలని ప్రభువు బోధిస్తున్నారు. మన కంటిలోని దూలమును గమనింపనిచో, మన సోదరుల కంటిలోని నలుసును వ్రేలేత్తి చూపలేము (6:41). సోదరులను సరిచేయడం మంచిదే, కాని సరి చేయాలంటే, ముందు మనము సరిగా ఉండవలయును. తననుతాను సరిచేసుకోలేనివాడు, ఇతరులను సరిచేయలేడు. అలా చేయువారిని ప్రభువు, వంచకులని, కపట భక్తులని, అంధులని, అవివేకులని చెప్పుచున్నారు. ఏది ఏమైనప్పటికిని, ఇతరులను పక్షపాతముతో తీర్పుచేయరాదు. సహోదరభావముతో ఇతరులను వారిని వారిగా అంగీకరించి, సహోదర సమూహమును ఏర్పాటు చేయవలయును. అంత:రంగిక శుద్ధి ఇతరులను మన్నించి, ప్రేమించేలాగున చేయును.
ఈ విషయం గురించి, అనగా ఇతరులకు అపకారము, కీడు చేయకూడదని, పౌలు రోమీ 12:17-21లో తెలియజేయుచున్నాడు.
మూడవ ఉపమానం (6:43-45) - సజ్జనుడు
ఒక చెట్టు మంచి పండ్లను ఈయవలయునంటే, దానికి తగిన పోషణ ఇవ్వబడవలయును (6:43-45; మత్తయి 7:16-20): "చెట్టు కాపును బట్టి దానికెంత పరామరిక జరిగినదో ఊహించ వచ్చును. అట్లే నరుని మాటల తీరును బట్టి అతడి శీలమును గుర్తింప వచ్చును" (సీరా 7:6). ఈ మూడవ ఉపమానములో ప్రభువు ఒక మంచి చెట్టుయొక్క స్వభావమును గుర్తుచేయుచున్నారు. ప్రతీ చెట్టుకూడా మంచి పండ్లను ఇవ్వాలనే నాటబడుతుంది. ప్రతీచెట్టులో సహజముగానే వృద్ధిచెంది ఫలించే గుణము ఉంటుంది.
చెట్టువలె మనిషికూడా సహజముగానే మంచివాడు. తనలో మంచితనము సృజనాత్మకత మెండుగా ఉంటాయి. మంచి ఫలాలను ఫలించి ఇతరుల పోషణకుకూడా ఉపయోగపడగలడు. ఈ అంత:రంగిక శక్తికి గ్రుడ్డివాడైనప్పుడు, అహంకారము, స్వార్ధము అనే దూలాలు తనలో ఉండినప్పుడు, తన సహజసిద్ద శక్తిని, స్వభావమును నాశనము చేయుచున్నాడు. కనుక ఈ ఉపమానము ద్వారా ప్రభువు, మానవునిలోనున్న శక్తినిగూర్చి గుర్తుచేయుచున్నారు. తన చుట్టూ ఉన్న వనరులను ఉపయోగించుకొని, తననుతాను వృద్ధిచెందుతూ, ఫలిస్తూ, ఇతరుల అభివృద్ధికి, సమాజాభివృద్ధికి తోడ్పడాలి. తద్వారా, సంపూర్ణ శిక్షణ ద్వారా, మంచి గురువుగా కాగలడు. అంత:రంగిక శుద్ధి, సంసిద్ధతో ఇతరులకు మంచి సహోదరుడు కాగలడు. మంచి ఫలాలను ఫలించే వానిగ కాగలడు.
సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును. దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును. ఏలయన, హృదయ పరిపూర్ణత నుండి నోటిమాట వెలువడును (లూకా 6:45). "నరుని సంభాషణమే అతనికి పరీక్ష. కనుక ఏ నరుని గాని అతడు మాటలాడక ముందు స్తుతింప వలదు" (సీరా. 7:7)
రెండవ పఠనములో, పౌలు, "మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు విజయమును ప్రసాదించెను" (1 కొరి 15:57) అని తెలుపుచున్నారు. కనుక, మనం ఎల్లప్పుడు మంచిని చేయాలి. క్రీస్తు విజయము హృదా కాకూడదు. ప్రభువు సేవలో మనం జీవించాలి.
No comments:
Post a Comment