ఆరవ సామాన్య ఆదివారము, YEAR C

ఆరవ సామాన్య ఆదివారము, YEAR C
యిర్మియా 17:5-8; 1 కొరింతు 15:12, 16-20; లూకా 6:17, 20-26

యేసు తన శిష్యులకు అష్టభాగ్యములను బోధిస్తున్నారు. పేదలకు ఆశీర్వాదములు, ధనికులకు అనర్ధములను తెలియజేస్తున్నారు. దేవుని కొరకు ఎదురుచూచువారు, దేవుని కొరకు పనిచేయువారు, దేవుని ఆశీర్వాదములను, అనుగ్రహములను, కరుణను పొందుదురు. దేవుని మంచితనమును చూడలేనివారు అనర్ధమును, శిక్షను పొందుదురు. ఇవి మనముందున్న రెండు మార్గములు: ఆశీర్వాదములు, అనర్ధములు. 

మనము జీవించే జీవితముపై మనది ఏ మార్గమో ఆధారపడి ఉంటుంది. పాత నిబంధనలోకూడా ఇదే విషయాన్ని చూస్తున్నాము. ప్రజలు ఏది కావాలో నిర్ణయించుకొనే అవకాశము, స్వతంత్రము వారికే ఇవ్వబడినది. వారికి వేరే అవకాశము లేకుండెను: కేవలము ఆశీర్వాదకర జీవితమా! లేక అనర్ధ జీవితమా! ద్వితీయోపదేశకాండము 30:19 వ వచనములో యావే దేవుడు ఇలా చెబుతున్నాడు, "నేను జీవమును, మరణమును, ఆశీస్సును, శాపమును మీ యెదటనుంచితిని. కనుక జీవమునెన్నుకొని మీరు, మీ సంతానము బ్రతికి పొండు." మనలను ఖండించునది దేవుడు కాదు. మన కష్టాలకు, ఇబ్బందులకు  కారణం దేవుడు కాదు. ఎలాంటి జీవితము కావలెనో ఎన్నుకొను, నిర్ణయించుకొను స్వతంత్రమును దేవుడు మనకు ఇచ్చియున్నారు. దేవుడు పలుమార్గాలను మనకు తెలియపరుస్తున్నారు. అలాగే, జీవమును, ఆశీస్సును ఎంచుకొనమని సూచిస్తున్నారు. కనుక, మరణమునుగాక, జీవమును ఎంచుకొనుటకు మన స్వతంత్రమును ఉపయోగించు కొనవలయును. 

అనేక సందర్భాలలో మన స్థితిగతులను బట్టి, దేవుని పట్ల సణుగుతూ ఉంటాము. ఇది మనము తీసుకున్న నిర్ణయమేనని మరచిపోతూ ఉంటాము.  మనము ఉన్న స్థితిని తెలుసుకోవాలని, దానినుండి మనలను లేవనెత్తవలెనను ఉద్దేశముతోనే, దేవుడు ఈ లోకమున జన్మించియున్నాడు. మనము రక్షింపడాలనే ప్రభువు మనలను పిలచియున్నాడు. మరి నిర్ణయము మనదే! ఆశీర్వాదమా, అనర్ధమా! జీవమా, మరణమా! ఆయనను విశ్వసించి ఆయన వాక్కును ఆలకించి పాటించువారికి ఆశీర్వాదము, జీవము! లేని వారికి శాపము, మరణమే!

దేవుడు సూచించు ఆశీస్సు, దీవెన, జీవము సకల మానవాళికి! అందరూ రక్షింపబడాలని, ఆశీర్వదింపబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు ఈ లోకమును ప్రేమించాడు, అనగా సర్వ మానవాళిని ప్రేమించాడు. అందుకే తన కుమారున్ని ఈలోకమును రక్షించుటకు పంపియున్నాడు. దైవ రాజ్యమును ప్రకటించుట ద్వారా, నీతి న్యాయము గురించి బోధించుట ద్వారా తండ్రి దేవుడు ఒసగు ఆశీస్సును, జీవమును యేసు ప్రభువు ఈ లోకమున ప్రకటించి యున్నాడు.  పూర్వము మోషేధర్మశాస్త్రము, ప్రవక్తల ఉపదేశముల ద్వారా, ఇప్పుడు తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా నిత్య జీవితమును గురించి అందరికి తెలియజేయడమైనది.

జీవముగల సువార్తను బోధించుటకు యేసు ప్రభువు సర్వమానవాళి దరికి చేరియున్నాడు. తన సందేశము అందరికి అందజేయుచున్నాడు. తమతో తాము సంతృప్తి పడువారు, స్వశక్తిపై ఆధారపడువారు, వారి ధనముపై నమ్మకముంచెడివారు, ఆయన మాటలను పెడచెవిన పెట్టెదరు. వారు దేవుని ఆశీస్సును నిరాకరించెదరు. ఇలాంటి వారు ఈనాటి సువిషేశములో ప్రభువు చెప్పిన ధనికులవంటి వారు. వారు సుఖములను అనుభవిస్తూ, దైవ సందేశమును ఆలకించలేకున్నారు. కాని, దేవునిపై ఆధారపడువారు ఆయన సందేశమును ఆలకింతురు. వారే సువార్తలో చెప్పబడిన ''పేదవారు'', వారు ''ధన్యులు'' అని ప్రభువు అంటున్నారు. వారు దేవుని ఆశీస్సులు పొంది వారి జీవితాన్ని నిర్మించుకొనెదరు.

అయితే, యేసు బోధన మన జీవితము నుండి మార్పును, మారుమనస్సును కోరుకుంటున్నది. అందుకే అష్టభాగ్యముల బోధన వెమ్మటే, ప్రభువు అంటున్నారు, ''మీ శత్రువును ప్రేమింపుడు'' (లూకా. 6:27), ''శపించు వారిని ఆశీర్వదింపుడు'' (6:28), ''ఒక చెంపపై కొట్టిన వానికి రెండవ చెంపను కూడా చూపుము'' (6:29). అష్టభాగ్యాలు పరిపూర్ణ మార్పును కోరుతున్నాయి. ధనికులు పేదవారిని ఆదరించాలిబీ సహాయము చేయాలి. అప్పుడే వారు కూడా దేవుని మహిమలో పాలుపంచుకుంటారు. ఇదే ప్రభువు నేడు మనకు ఇచ్చు సువార్తా సందేశము.

కనుక, దేవుని దృష్టిలో ధనికులము కాదలచినచో పేదవారిగా మారాలి. ఆధ్యాత్మికముగా పేదవారు ఆశీర్వదింపబడిన వారు, ఎందుకన వారు దేవునిపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. వారు దేవుని సహాయమునకై ఎదురు చూస్తూ ఉంటారు. పేదవారికి పోగొట్టుకొనుటకు ఏమీ ఉండదు కనుక దేనికీ భయపడనవసరము లేదు. పేదరికములో వారు దేవునికి చేరువవుతారు. యేసు ప్రభువు కూడా అట్టి జీవితమును జీవించి యున్నారు. పునీత పౌలుగారు అంటున్నారు, ''క్రీస్తు ప్రభువు, తాను భాగ్యవంతుడై ఉంది కూడ, తన పేదరికము వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యెను'' (2 కొరి. 8:9). పేదరికములో దేవుని ఆశీర్వాదము, భాగ్యము ఉంటుందని తెలుసు కొందాము!

No comments:

Post a Comment