తపస్కాల రెండవ ఆదివారము, Year C
ఆది. 15:5-12, 17-18; ఫిలిప్పీ. 3:17-4:1; లూకా 9:28-36
ఉపోద్ఘాతము: మనము రెండవ తపస్కాల ఆదివారములోనికి ప్రవేశించియున్నాము. ఉత్థాన మహోత్సవమునకు సిద్ధపడుచున్నాము. గతవారము యేసు ప్రభువుయొక్క "ఎడారి అనుభవము" లేదా సాతాను శోధనలను జయించిన విషయం గురించి ధ్యానించాము. తన ప్రేషిత కార్యము ఆరంభించుటకు ఎడారిలో నలుబది దినములు ప్రార్ధనలో, ఉపవాసములో తన తండ్రితో గడిపియున్నారు. ఆరంభములోనే, ఆకలి, అధికారము, విజయము అను శోధనలను ఎదుర్కొన్నారు. తండ్రి దేవుని సాన్నిధ్యముతో, పవిత్రాత్మ శక్తితో, సాతాను శోధనలను జయించారు. ప్రార్ధన, ఉపవాసముతో మనముకూడా శోధనలను జయించవచ్చని ధ్యానించాము. ఈ వారం "పర్వతానుభవం" / "యేసు "దివ్యరూప ధారణ" గురించి ధ్యానిస్తున్నాం. 'నేను దేవునిచేత ఎన్నుకొనబడిన బిడ్డను' అనేదే ఈ పర్వతానుభవము! "మనం అబ్రహాము సంతతి" (ఆ.కాం. 15:5). "మనం పరలోక పౌరులము" (ఫిలిప్పీ 3:20).
సందర్భము: శిష్యులు యేసును "దేవుని క్రీస్తుగా" ప్రకటించుట (లూకా 9:18-20) - క్రీస్తు తన పాటుల గురించి ప్రస్తావించుట (లూకా 9:21-22) - యేసు గలిలీయనుండి యెరూషలేమునకు పయణం (లూకా 9 నుండి). యేసు యెరూషలేములో మరణించ వలసియున్నది; ఉత్థానం చెందవలసి యున్నది; పరలోకమునకు కొనిపోబడవలసి యున్నది. తన "దివ్యరూప ధారణ" ద్వారా, ఈ మూడింటిని ముందుగానే యేసు తన ముగ్గురు శిష్యులకు తెలియజేయుచున్నారు.
దివ్యరూపధారణ, యేసు జీవితములో జరిగిన మహత్కర సంఘటన. యేసు శ్రమలానంతరం పొందబోవు మహిమకు, ఉత్థానమునకు తార్కాణం. ఇదొక గొప్ప దివ్యదర్శనము. యేసు మెస్సయ్య అని, సజీవ దేవుని కుమారుడని ధృవీకరించబడిన సంఘటన. రాబోవు దైవరాజ్యమునకు సూచన!
ముఖ్య ధ్యానాంశం ఏమనగా: యేసు ప్రభువు మహిమతో దివ్యరూప ధారణమును పొందియున్నారు. ఆయనను అనుసరించు వారందరుకూడా ఆయనతోపాటు ఆ దివ్యరూప ధారణ మహిమలో పాలుపంచుకొనెదరు. దీనిద్వారా, ప్రభువువలె మనముకూడా మారవలెనను ఒక ఆశ మనలో కలుగుతుంది. ఈ మహిమలో పాలుగొనడానికి, మన అనుదిన శ్రమలను ఎదుర్కొనడానికి ధైర్యాన్ని పొందుతున్నాము. అలాగే, ప్రభువులో మన విశ్వాసం, నమ్మకం, ప్రేమ బలపడుతున్నది.
దివ్యరూప ధారణ: పర్వతం-ప్రార్ధన ఫలితం: "పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని ప్రార్ధన చేసికొనుటకై యేసు ప్రభువు [తాబోరు] పర్వతముపైకి ఎక్కి వెళ్ళెను" (లూకా 9:28). పర్వతం ప్రార్ధన స్థలముగా, దేవుని కలుసుకొను స్థలముగా ప్రసిద్ధి. పేతురు దివ్యరూప ధారణ గురించి చెబుతూ, "పవిత్రమగు పర్వతమున" అని చెప్పాడు (2 పేతు 1:18). కేవలం పర్వతంపైకి వెళితే సరిపోదు; పర్వతముపైకి ప్రార్ధనకై వెళ్ళాలి; ప్రార్ధన చేయాలి. కష్టాలలో, బాధలలో, నిరాశలో, నిరాకరణలో, హింసలలో 'కొండపైకి' అనగా 'ప్రార్ధనకు' వెళ్ళాలి.
మోషేకూడా దేవున్ని సినాయి కొండపై దర్శించుకున్నాడు. యావే తేజస్సు కొండ కొమ్మున ప్రజ్వరిల్లుచున్న అగ్నివలె కనబడెను (నిర్గ 24:17). యావేతో మాటలాడి వచ్చుటవలన మోషే ముఖము ప్రకాశించుచుండెను (నిర్గ 34:29). ప్రార్ధనలో తన తండ్రి దేవుని సాన్నిధ్యములో ఉండాలని యేసు ఆశించారు. ప్రార్ధన అనగా తండ్రి సాన్నిధ్యములో ఉండటం, దేవుని చిత్తమును ఆలకించి పాటించడం.
"ఆయన ప్రార్ధన చేసికొనుచుండగా, యేసు ముఖరూపము మార్పు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను" (9:29). దివ్యరూప ధారణ ప్రార్ధన ఫలితమైయున్నది. ప్రార్ధనలో, దేవుడు యేసు 'గుర్తింపు'ను (నా కుమారుడు) బయలు పరచారు. దేవునిలో ఐఖ్యమైయున్నప్పుడు, ఆయన ఆత్మలో నిమగ్నమైయున్నప్పుడు, ఒక వ్యక్తి దివ్యరూప ధారణ పొందును. మహిమ, వైభవమును పొందును. ముఖము సూర్యునివలె ప్రకాశించును. పరలోక మహిమతో వెలిగిపోవును. తెలుపు పవిత్రతకు సూచన! ఇదే మారుమనస్సు, హృదయపరివర్తన, శుద్ధీకరణ! త్రిత్వైక దేవునితో సహవాసము! ఇదే దైవరాజ్యము, పరలోకము! పర్వతముపై ప్రభువు పొందిన దివ్యరూప ధారణము, తన ఉత్థానములో పొందబోయే మహిమను ముందుగానే సూచిస్తున్నది. "మహిమ" అనగా దేవుని మహిమ, వైభవం, తేజస్సు! తాను మరల "శక్తితోను, మహా మహిమతోను ఆకాశమున మేఘారూడుడై వచ్చునని" యేసు చెప్పియున్నారు (లూకా 21:27).
మోషే, ఏలీయా - ధర్మశాస్త్రము, ప్రవక్తలు: మోషే, ఏలీయా మహిమతో కనిపించిరి (9:30). మెస్సయ్య కాలమున, మోషే, ఏలీయాలు తిరిగి వత్తురని ఎదురుచూసేవారు. ఎందుకన, మోషే ధర్మశాస్త్రమును, ఏలీయా ప్రవక్తలను ప్రాతినిధ్యం వహించారు. వారి సాన్నిధ్యముతో, ప్రభువుతో సంభాషణతో రెండు విషయాలను సూచిస్తున్నారు: మొదటగా, పాతనిబంధనలో వాగ్ధానము చేయబడిన రక్షకుడు, మెస్సయ్య, క్రీస్తుప్రభువే అని ధ్రువీకరించుచున్నారు. రెండవదిగా, యెరూషలేములో మరణింపవలసిన విషయమును మాట్లాడుచూ, ప్రభువు తననుతాను సిలువపై అర్పించుకొంటూ లోకరక్షణను పరిపూర్తిగావిస్తాడని సూచిస్తున్నారు. ఈవిధముగా, దివ్యరూప ధారణయొక్క ప్రాముఖ్యతను వెల్లడించారు. యేసు మరణం మరో నిర్గమనం (exodus). మోషే ప్రజలను ఐగుప్తు బానిసత్వమునుండి విడిపించి, వాగ్ధత్త భూపికి నడిపించగా, యేసు పాపము, మరణమునుండి విడిపించి, దైవరాజ్యమునకు నడిపిస్తారు.
శిష్యుల స్పందన: "వారు నిద్రమత్తులో ఉండినను, మేలుకొనినపుడు, యేసు మహిమను, ఆయన చెంతనున్న ఆ పురుషులిద్దరిని చూచిరి" (9:32). శిష్యులు ఎప్పటికి అచ్చటనే ఉండాలని ఆశించారు (9:33). కాని ఈ దివ్యరూప ధారణ శాశ్వతం కాదని, రాబోవు గొప్ప మహిమను సూచిస్తున్నదని తెలుసుకోలేక పోయారు. కొండదిగి వాస్తవ జీవితమును (శ్రమలు, నిరాకరణ, మరణం) జీవించుటకు వారు ఇష్టపడలేదు. ప్రభువును ఎప్పుడు మహిమలోనే చూడాలని ఆశించారు. శ్రమలను పొందేవారిగా (బాధామయ సేవకుడు) ప్రభువును ఊహించుకోలేక పోయారు.
మేఘము - దేవుని స్వరము - ఈయనను ఆలకింపుడు: మోషే, ఏలీయాలు కనుమరుగైపోగానే, మేఘమునుండి ఒక వాణి, "ఈయన నా కుమారుడు. నేను ఎన్నిక చేసికొనిన వాడు. ఈయనను ఆలకింపుడు" (9:35; ద్వితీయ 18:15-19) అని తండ్రి దేవుడు సాక్ష్యమిచ్చియున్నారు. యేసు దైవకుమారుడు. యోర్దాను నదిలో యేసు బప్తిస్మము పొందిన సమయములోకూడా తండ్రి దేవుని స్వరము వినిపించెను (మార్కు 1:11; లూకా 3:22). తండ్రి దేవుడు, తన కుమారుని 'గుర్తింపు'ను లోకానికి బయలు పరచుచున్నారు. కుమారునితో తనకున్న అతి సన్నిహిత సంబంధమును, బాంధవ్యమును, సహవాసమును వెల్లడిచేయుచున్నారు. మేఘమునుండి తండ్రి వాణి వినిపించెను. ఇశ్రాయేలీయుల జీవితములో 'మేఘము' దేవుని సాన్నిధ్యాన్ని సూచిస్తున్నది (నిర్గమ 16:10; 19:9, 16; 24:15-18; 33:9). యేసు పరలోకమునకు కొనిపోబడినప్పుడుకూడా, "ఒక మేఘము ఆయనను కమ్మివేసెను" (అ.కా. 1:9). తన స్వరముతో, కుమారుని ప్రేషిత కార్యమును తండ్రి తెలియజేయుచున్నారు. శిష్యుడు/విశ్వాసి రూపాంతరం (పునరుద్ధరణ, పరిపూర్ణమార్పు) చెందాలంటే, తండ్రి దేవుడు చెప్పిన విధముగా యేసును ఆలకించాలి. పాపజీవితాన్ని విడనాడాలి. విశ్వాసం కలిగి జీవించాలి. శ్రమల పరమార్ధాన్ని గ్రహించాలి. ప్రేమగా జీవించాలి.
అన్నింటికన్న ముఖ్యముగా, యేసును ఆలకించాలి: నేడు ఎన్నో స్వరాలను వింటున్నాము, కాని దేవుని (క్రీస్తు) స్వరమును వినలేక పోతున్నాము. ఆధ్యాత్మిక చెవిటివారిగా ఉంటున్నాం!
***తండ్రి దేవుని మాట - ఈయనను ఆలకింపుడు (లూకా 9:35); తల్లి మరియ మాట - "ఆయన చెప్పినట్లు చేయుడు" (యోహాను 2:5) - యేసును ఆలకించాలి; ఆలకించిన దానిని చేయాలి.*** నిజమేకదా?
దివ్యరూపధారణలో దాగియున్న పరమార్ధము: ఇప్పటి వరకు శిష్యులచేత ఒక బోధకునిగా, నాయకునిగా, రక్షకునిగా, మెస్సయాగా, పరిగణింపబడిన యేసు, తన నిజస్వరూపమును (దైవత్వం) తెలియపరచడం ఎంతోముఖ్యం. ఫలితముగా, శిష్యుల విశ్వాసము దృఢపరచబడినది. ప్రభువులోనున్న దైవత్వమును చూపించి, ఫలితముగా, శిష్యులను బలపరచియున్నారు. తండ్రి తనకు అప్పగించిన పనిని నెరవేర్చుచున్నారు (యెషయ 42:1-4, లూకా. 9:35. యోహాను. 4:34). తాను మోషేతోను (ధర్మశాస్త్రము), ఏలియాతోను (ప్రవక్తలు) మాట్లాడుటద్వారా తాను ప్రవక్తల ప్రబోధములను, ధర్మశాస్త్రమును రద్దుచేయక, సంపూర్ణ మొనర్చుటకు వచ్చితినని (మత్త 5:17) తెలియ జేయుచున్నారు.
అలాగే, యేసు దివ్యరూపధారణ, పరలోక పరమరహస్య అనుభూతిని తెలియజేయుచున్నది. పరలోకం అంటే ఒక స్థలము కాదని, అది ఒక వ్యక్తి అని, ఆ వ్యక్తి యేసు క్రీస్తు అని తెలియజేయుచున్నది. యేసు ప్రభువే ఆ దైవరాజ్యము. త్రిత్వైక దేవుడే ఆ పరలోక రాజ్యము (నిత్యజీవము).
యేసు ప్రార్ధనా జీవితానికి తార్కాణం ఆయన దివ్యరూప ధారణ. ప్రార్ధన, తండ్రి-కుమారుల మధ్యననున్న బాంధవ్యము. ప్రభువు ప్రేషిత పరిచర్య అంతయు కూడా అతని ప్రార్ధన ఫలమే!
ముగింపు: మనముకూడా క్రీస్తుమహిమను జ్ఞానస్నానములో పొందియున్నాము. వాక్యములో, దివ్యసంస్కారాలలో క్రీస్తుమహిమలో పాలుపంచుకొనుచున్నాము. అయితే, ఇది మనము శాశ్వతముగా పొందబోవు మహిమను సూచిస్తున్నది. మనము ఆ మహిమవైపునకు ప్రయాణం చేస్తున్నాము. మన గమ్యాన్ని మనం చేరుకోవలసియున్నది. దానిని పొందవలెనంటే, ఈ లోక ప్రవాసమును ముగించాలి. కనుక, శాశ్వత మహిమ కొరకు మనము ఒక గొప్ప నమ్మకముతో ముందుకు సాగాలి! ముఖ్యముగా, మన అనుదిన ప్రార్ధనలో, మనం "ఎన్నుకొనబడిన దేవుని బిడ్డలము" అని గ్రహించాలి. ఇది మనలను రూపాంతరం పొందునట్లు చేస్తుంది. మన శ్రమల పరమార్ధాన్ని గ్రహించేలా చేస్తుంది.
మొదటి పఠనం: "దేవుడు అబ్రహామును ఎన్నుకొని, పిలచుకొని, ఒడంబడిక చేసుకున్నారు. అబ్రహాము దేవుని నమ్మాడు. ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రహామును నీతిమంతునిగా ఎంచెను" (అ.కాం. 15:5-6). నేను దేవుని, ఆయన వాగ్దానాలను నమ్ముచున్నానా?
రెండవ పఠనం: క్రీస్తు సిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారికి తుదకు మిగులునది వినాశమే. వారికి దేహ వాంఛలే దైవము. లౌకిక విషయములను గూర్చియే ఆలోచింతురు (ఫిలిప్పీ 3:18-19). కాని మనము పరలోక పౌరులము (3:20). నేను లౌకిక విషయాలతో జీవిస్తున్నానా లేక దైవీక విషయాలతో జీవిస్తున్నానా?
Very deep and simplified homily Father
ReplyDeleteThank you very much Father 🙏