తపస్కాల మొదటి ఆదివారము, Year C

తపస్కాల మొదటి ఆదివారము, Year C
ద్వితీయ 26:4-10; రోమీ 10:8-13; లూకా 4:1-13

మనము తపస్కాలములో ఉన్నాము. విభూతి బుధవారముతో, తపస్కాల ప్రయాణాన్ని ప్రారంభించాము. ఈ 40 దినాలు మనము ఈస్టర్‌ పండుగ వైపునకు ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఈ ప్రయాణములో ఎన్నో సంతోషాలు ఉంటాయి, అలాగే మన ప్రయాణాన్ని భంగపరచడానికి ఎన్నో శోధనలు, అడ్డంకులు కూడా ఉంటాయి. అయినప్పటికిని మన ప్రయాణాన్ని కొనసాగించాలి. మన గమ్యాన్ని చేరుకొనుటకు ఒక గొప్ప ఆశతో ముందుకు సాగాలి. ధైర్యము, అంకింతభావము ఉంటే ఇది సాధ్యమే!

తపస్కాలము ఆధ్యాత్మిక పునరుద్ధరణ కాలము. ఈ కాలములో మనము పాత జీవితానికి - ఈ లోకాశాలకు బై బై చెప్పి క్రీస్తుని ఆత్మను మనము ధరించవలయును. ఈ కాలములో మన ఆధ్యాత్మిక పునరుద్ధరణ ఏవిధముగా ఉండాలో ప్రభువు మనకు వాక్యము - ప్రార్ధన, ఉపవాసము, దానధర్మాలు - ద్వారా తెలియజేస్తూ ఉంటారు. పొప్‌ బెనెడిక్ట్‌ జగద్గురువులు అన్నట్లుగా, తపస్కాలము మన అంత:రంగిక జీవితములోనికి పయణించడం. ఆత్మ పరిశీలన చేసుకొనే సమయం.

మన ఆధ్యాత్మిక పునరుద్ధరణకు 'ఎడారి అనుభవము' (desert experience) ఎంతో అవసరము. 'ఎడారి' అనగానే మనకు గుర్తుకు వచ్చేది నిర్జీవము, ఆకలిదప్పులు, భయము... మొదలగునవి. కాని, ఆధ్యాత్మికముగా, 'ఎడారి' అనునది దేవునిని కలుసుకొను స్థలము. ఎడారిలో నిశబ్దత, ఏకాంతము ముఖ్యాంశాలు. హృదయ నిశబ్ధతలో మనలోని దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించి, ఆయన స్వరమును వినగలము. మన జీవితములోని ఏకాంతములో ప్రభువు సాన్నిధ్యాన్ని అనుభవించగలము. ఎడారిలో బాహ్యమైన ఆటంకాలు ఉండవు. శోధనలోపడవేసేవి ఏమి అక్కడ ఉండవు. అచ్చట మనతో మనం మరియు దేవునితో ఏకాంతముగా ఉండగలము. కనుక ఎడారి అనుభవము మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకొనుటకు మరియు పరలోకము వైపునకు నడచుటకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ ఎడారి అనుభవమునకు తపస్కాలము సరియైన కాలము.

యేసు ప్రభువు కూడా ఈ ఎడారి అనుభవమును పొందారు. తండ్రి దేవుని సాన్నిధ్యాన్ని చవిచూసాడు. తననుతాను దైవరాజ్య బోధనకు సంసిద్ధుడయ్యాడు. పవిత్రాత్మతో నింపబడి ఆయన ఎడారికి వెళ్ళారు (లూకా 4:1). నిశబ్ధములో, ఏకాంతములో, ప్రార్ధనలో, ఉపవాసములో తండ్రి దేవుని చిత్తాన్ని తెలుసుకున్నారు. తండ్రి దేవునితో ఉండటానికి, ఆయన చిత్తమును తెలుసుకోవడానికి 40 దినములు ఎడారిలో గడిపారు. ఎడారి అనుభవమునుండి శక్తిని పొందియున్నారు. దీనినుండి మనము నేర్చుకోవలసినది, మన జీవితములో ప్రతీ ఒక్కరికి ఈ ఎడారి అనుభవము ఎంతో అవసరము. అప్పుడే ఈ లోకాశాలను త్యజించగలము. తద్వారా మన ఆధ్యాత్మిక గమ్యమును చేరుకోగలము.

ఎడారిలో ప్రభువు శోధనలను ఎదుర్కొన్నారు, కాని వాటినన్నింటిని జయించారు. ఎందుకన, ఆయన అంత:రంగిక జీవితం తండ్రి దేవుని సాన్నిధ్యముతో, సన్నిహితత్వముతో నిండియున్నది. అందుకే సాతాను ఆయన అంత:రంగమును శోధించలేక పోయింది. మన బలహీనతలో సాతాను ప్రవేశిస్తాడు. కాని మనము ఆత్మతో, దేవుని సాన్నిధ్యముతో, సన్నిహితత్వముతో నింపబడి యున్నప్పుడు, సాతాను మన అంత:రంగమును శోధించలేదు.

సాతాను కేవలము మన బాహ్య బలహీనతలను మాత్రమే శోధించగలదు. ప్రభువును మూడు విధాలుగా శోధించింది: ఆకలి, అధికారము, విజయము. ఈ మూడు విషయాలలో  మనము కూడా శోధనలలో పడిపోతూ ఉంటాడు. మన కోరికలన్నీ కూడా వీటికి సంబంధించినవై ఉంటాయి. వీటిని మన అంత:రంగిక శక్తితో జయించ వలయును. ప్రభువు శోధనలను దేవుని వాక్యముతో, ప్రార్ధనతో జయించారు. తండ్రి దేవున్ని నమ్మియున్నారు. ప్రతీ శోధనకు దేవుని వాక్యాన్ని పలికి యున్నారు. కనుక మనము కూడా దేవుని వాక్యశక్తితో మన శోధనలను జయించగలము. యేసు నామమున మన శోధనలను జయించవచ్చు. మన శోధనలో మనము దేవునిపై నమ్మకాన్ని ఉంచాలి.

మొదటి శోధన: సైతాను యేసు వద్దకు వచ్చి, "నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్ళను రొట్టెలుగా మారునట్లు ఆజ్ఞాపింపుము" (లూకా 4:3). స్వప్రయోజనం కొరకు తన శక్తిని ఉపయోగించమని శోధన. అధికారమునకు శోధన. కాని, ప్రభువు సైతానుతో, "మనుష్యుడు కేవలం రొట్టె వలననే జీవింపడు. కాని దేవుని నోటినుండి వచ్చు ప్రతిమాట వలన జీవించును" (4:4, ద్వితీయ. 8:3, నిర్గమ. 16) అని సమాధానమిచ్చాడు. ఆత్మ వరాలను, స్వలాభం కొరకుగాక, సంఘము కొరకు, "అందరి మేలు కొరకై" ఉపయోగించాలి (1 కొరి. 12:7). యేసు ప్రేషిత సేవలో, అయిదు రొట్టెలను, రెండు చేపలను ఐదువేలమందికి పంచిపెట్టాడు. యేసు తన ఆకలి తీర్చుకోవడానికికాక, ఇతరుల ఆకలి తీర్చడానికి ఆ గొప్ప అద్భుతాన్ని చేసాడు (మత్త. 14:13-21).
ఆనాడు ఎడారిలో ఉన్న యిశ్రాయేలు ప్రజలకు ఇలాంటి పరీక్ష ఎదురయింది. వారు ఆకలిగొనినపుడు, వారిని ప్రభువు ఆశ్చర్యకరంగా ఎర్రసముద్రాన్ని రెండుపాయలుగా చీల్చి వారిని దాటేటట్లు చేశాడన్న విషయంకూడా మరచిపోయి, ఈజిప్టులో మాంసం భుజించుచూ ఎంతో సంతోషముగా ఉండేవారమని సణుగుకున్నారు. అప్పుడు యావే, అద్భుత రీతిలో ఆకాశమునుండి మన్నా (ఆహారము) కురిపించి, తనకు అసాధ్యమైనది ఏమీలేదని నిరూపించాడు. యిశ్రాయేలు ప్రజలవలెకాక, యేసు 40 రోజులు ఉపవాసముండి ఆకలిగొనినపుడు సణుగుకొనక, దేవుని వాక్కును ఉపయోగించి, శోధనను ఎదుర్కొన్నారు. మనంకూడా మన దేహాన్ని కాపాడుకొనుటకు, ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కాని ఈ కృపాకాలం మనకు గుర్తుచేసే విషయమేమిటంటే, దేహాన్ని మించినది ఆత్మ. ఆత్మనికూడా మనం పోషించాలి. Our hearts are restless, till they rest in you. పాఠం: మనం కోరుకొనే ఈ భూసంబంధమైన వస్తువులకన్న దేవుడు మనకు ముఖ్యమని, దీనినే ఉపవాసం (దగ్గరవ్వటం) చూపిస్తుందని యేసు మనకు నేర్పిస్తున్నాడు.

రెండవ శోధన: "సైతాను యేసును పైకి తీసుకొని పోయి, రెప్పపాటు కాలములో ప్రపంచములోని రాజ్యములను అన్నింటిని చూపి, ఈ రాజ్యముల సర్వాధికారమును, వాని వైభవముల నెల్ల నీకు ఇచ్చెదను. అట్టి అధికారము నాకు కలదు. నేను కోరిన వానికి వాటిని ఈయగలను. కనుక,  నీవు నన్ను ఆరాధించినచో ఇది అంతయు నీ సొత్తు అగును" అని అనెను" (4:5-7). సంపద, ఐశ్వర్యం కొరకు శోధన. మనం (గురువులు, నాయకులు, అధికారులు) ఇతరులకు సేవ చేసే బదులుగా, ఇతరులు మనకు సేవచేయాలి అనే శోధన! అందుకు యేసు, "నీ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలయును" (4:10, ద్వితీయ. 6:13, నిర్గమ. 32) అని పలికెను. యేసు తండ్రి దేవునికే నమ్మకపాతృనిగా ఉన్నాడు.
యిశ్రాయేలు ప్రజలతో చేసుకున్న ఒడంబడిక ప్రకారం యావే వారిని వాగ్ధాన భూమివైపు మోషేను నాయకునిగా ఉంచి నడిపిస్తున్నపుడు, వారు ఆ వాగ్ధాన భూమిని త్వరగా చేరుకోలేకపోతున్నారనే ఆలోచన వారికొచ్చి, యావేపై విశ్వాసముంచక, మోషే సినాయి పర్వతంపై ఉన్నపుడు వారంతా బంగారు దూడను ఆరాధించారు (నిర్గమ. 32: 8). ఇలా, యావే కోపానికి పాతృలయ్యారు. యేసునకు ఇలాంటి సందర్భం ఎదురైనపుడు తను ఏమియూ ఆలోచింపక, ఈలోక రాజ్యానికి ఆశపడక, సాతానును ఆరాధించకుండా, కేవలం ప్రభువైన దేవునినే పూర్ణమనస్సుతో ఆరాధించాలని తెలియజేస్తున్నారు. పాఠం: ప్రార్ధన, ఆరాధనలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలని యేసు మనకు భోదిస్తున్నాడు.

మూడవ శోధన: పిమ్మట సైతాను యేసును నగరములోని దేవాలయ శిఖరమున నిలిపి, "నీవు దేవుని కుమారుడవైనచో, క్రిందికి దూకుము. నిన్ను రక్షింప దేవుడు తన దూతల ఆజ్ఞ యిచ్చి యున్నాడు. మరియు నిన్ను రాళ్ళపై పడి గాయపడ కుండునట్లు, నిన్ను వారు చేతులతో ఎత్తి పట్టుకొందురు" (లూకా 4:9-11; కీర్తన. 91:11). ప్రతిష్ట కొరకు శోధన. నేడు జనాదరణ కోసం, సంపాదనకోసం శోధన. కాని, యేసు, "ప్రభువైన నీ దేవుని నీవు శోధింప రాదు" (4:7, ద్వితీయ. 6:16, నిర్గమ. 17) అని అనెను. "ఇట్లు ఆ సైతాను అనేక విధముల శోధించిన పిదప, సముచితమైన సమయమునకై ఆయనను విడిచి వెళ్ళెను" (4:13). అనగా, సాతాను యేసును శోదించలేక పోయింది.
యిశ్రాయేలు ప్రజలు, స్వర్గంనుంచి మన్నా పొందిన తర్వాత, యావే వారికి కావలసిన కోరికలన్నింటిని తీర్చాలని వారు భావించారు. మన్నా దొరికిన తర్వాత నీటికోసం సణుగుకున్నారు. తరువాత అసలు యావే వారి మధ్య ఉన్నాడా? లేదా? అని సందేహించారు (నిర్గమ. 17:7). అద్భుతం జరగనంత మాత్రాన విశ్వాసం లేదని అర్ధం కాదు’’. పాఠం: అవసరమున్న వాటిని చూసుకొనుటకు, దేవుడు జోక్యం చేసుకుంటాడని, మనకు ఆపదలేని సమయంలోకూడ, ఆపద కల్పించుకొని, మనకు సహాయం చేయమని దేవుని పరీక్షింప రాదని యేసు మనకు గుర్తుచేస్తున్నారు.

సాతాను శోధనను ఎదుర్కొనటంద్వారా క్రీస్తు, తన తండ్రిపట్ల తనకున్న ప్రేమ అన్నిటికంటే బలమని నిరూపించారు. శ్రీసభ మనలనుండి ఈనాటి దివ్య పఠనాలద్వారా కోరేది ఇదే. మనం, క్రీస్తును ఆదర్శంగా తీసుకొని, శోధనను అధిగమించి, ప్రభు ప్రేమను గుర్తించి, అతని ప్రేమబాటలో, అతని చిత్తప్రకారం జీవించి, అతని ప్రణాళికను నెరవేర్చాలి. మనం అనారోగ్యంతో బాధపడినప్పుడు, వైద్యుని దగ్గరకు వెళితే ఒక చీటిలో మందు రాసి వాటిని వాడమంటాడు. అలాగే మన ఆత్మకు ఎదుగుదల కావాలని, శోధనలను ఎదుర్కొనే శక్తి కావాలని శ్రీసభ, కృపాకాలంలో ఒక మందు చీటిని మనందరికీ ఇస్తుంది. ఆ చీటిలో ఉన్న మందులే: ప్రార్ధన, ఉపవాసం, దానధర్మాలు. వీటిని సాధనాలుగా మలచుకొని ప్రభు చిత్తప్రకారం నడుచుటకు ప్రయత్నిద్దాం.

యేసు శోధనలను ఎలా జయించాడు? ఆయన సైతానుతో వాదించలేదు, తర్కించలేదు. కేవలం దేవుని వాక్కును మాత్రమే సైతానుకు తెలియజేసాడు. మన శోధనలను ఎలా జయించాలి? మన శోధనలను జయించడానికి దేవుని వాక్కు, ప్రార్ధన ఆయుధాలుగా కావాలి. శోధనల సమయములో ప్రార్ధన చేయాలి. పాపములో పడిపోయే పరిస్థితులకు (వ్యక్తులు, స్థలాలు, వస్తువులు) మనము దూరముగా ఉండాలి. ప్రభువు ఇలా అన్నారు, “నీ కుడి కన్ను నీకు పాపకారణ మైనచో దానిని పెరికి పారవేయుము. నీ దేహమంతయు నరకమున త్రోయబడుట కంటె నీ అవయవములలో ఒక దానిని కోల్పోవుట మేలు” (మత్త. 5:29). అలాగే, “నీ కుడి చేయి నీకు పాపకారణ మైనచో, దానిని నరికి పారవేయుము. నీ దేహమంతయు నరకము పాలగుట కంటె నీ అవయవములలో ఒక దానిని కోల్పోవుట మేలు” (మత్త. 5:30).
శోధనలు జయించాలంటే, యేసులో మనం సంగమమై జీవించాలి. దానికి మనం చేయవలసిన మూడు పుణ్య క్రియలు: ఉపవాసము, దానధర్మాలు, ప్రార్ధన.

ఆత్మపరిశీలన చేసుకుందాం: నేను నిజముగా దేవుని ఆరాధిస్తున్నానా? లేదా నా హృదయం లోకసంపదలపై దృష్టి సారించినదా? నేను దేవునిపై ఆధారపడుచున్నానా? లేదా నాకున్న సంపదలపై ఆధారపడుచున్నానా? నేను దేవునిపై సంపూర్ణ నమ్మకాన్ని కలిగియున్నానా? నా జీవితములో ప్రధానముగా నేను మార్చుకోవలసిన ఆ ఒక్క విషయం ఏమిటి? ఈ తపస్సు కాలములో నెమ్మదించి, దేవుని వాగ్దానాలను ఆలకించి, పాప మరణములనుండి క్రీస్తు మనకొసగిన స్వతంత్రమును కొనియాడుదాం.
 
మొదటి పఠనము ఇశ్రాయేలు ప్రజలు ఏవిధముగా ఐగుప్తునుండి రక్షింపబడిరో గుర్తుచేస్తుంది. ఇది మన రక్షణనుకూడా గుర్తుచేస్తుంది. ఆత్మతో కూడిన జీవితమును జీవించాలని రెండవ పఠనము బోధిస్తుంది. "సైతాను మాయాపూరిత జిత్తులను ఎదుర్కొన గలుగుటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును ధరింపుడు" అని పౌలు ఎఫేసి 6:11లో చెప్పి యున్నారు.

1 comment: