ఐదవ సామాన్య ఆదివారము (YEAR C)

ఐదవ సామాన్య ఆదివారము (YEAR C)
యెషయ 6:1-2, 3-8; 1 కొరి 15:1-11; లూకా 5:1-11

గడచిన రెండు ఆదివారాలలో యేసు తన సొంత గ్రామమైన నజరేతులో గడపటం మనం చదువుకొని, ధ్యానం చేసియున్నాము. తన స్వగ్రామమైన నజరేతులో వారు యేసును తృణీకరించారు. వారందరికీ తెలిసిన వ్యక్తిగానే వారు యేసును భావించారు. ఆయన మాటలు పెడచెవిన పెట్టారు. తననుతాను నిరూపించుకోవటానికి అద్భుతం చేయమన్నారు. కాని, యేసు వారి తిరస్కారాన్ని గ్రహించి, ప్రక్క గ్రామమైన కఫర్నామునకు తిరిగి వచ్చారు. అక్కడ ఆయన అనేక మహిమలను, అద్భుతాలను చేసారు. ఆయన పేరు ఆ ప్రాంతమంతా కూడా వ్యాప్తి చెందినది. ప్రజలు ఆయనను గుర్తించారు. ఆయన మాటలను ఆలకించారు. అందుకే యేసు ఎక్కడికి వెళ్ళినను ప్రజలు అనేకులు ఆయన చెంతకు వచ్చారు.

కఫర్నాములో ప్రజలు యేసు చెంతకు వచ్చింది కేవలం ఆయనను చూడటానికి మాత్రమే కాదు. ఆయన చెప్పే మాటలను వినడానికి వారందరు అక్కడకు వచ్చారు. దేవుని వాక్యం ఎంత గొప్పదో, ప్రధానమైనదో మనం చూస్తూ ఉన్నాము. మనం, మన అనుదిన జీవితాలలో, మన ఆరాధన సమయములో, పూజాబలి అర్పణలో దేవునివాక్యాన్ని విని, ధ్యానించి, జీవితములో ఆచరించడానికి ఎంత ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నాం? దేవుని వాక్యాన్ని వినడానికి శ్రద్ధను కనబరుస్తూ ఉన్నామా? మనం చెప్పే మాటలు, చేసే క్రియలు దేవుని వాక్యానుసారముగా ఉంటున్నాయా?

శిష్యులకు ఆహ్వానము
ఈనాటి సువిషేశములో, యేసు తన రక్షణ కార్యాన్ని ఈ లోకములో కొనసాగించటాన్ని మనం చూస్తూ ఉన్నాము. అయితే, ఈ రక్షణ ప్రణాళికలో యేసుకు మానవ తోడ్పాటు కూడా ఎంతో అవసరం. మనకున్న సంపద, సకల విద్యలు, తెలివితేటలు, నైపుణ్యమంతా కూడా దేవుని రాజ్యవ్యాప్తికి ఉపయోగపడాలి. దేవుడు మనకు ఒసగే సకల వరాలు, ఆశీర్వాదాలు, ఆయన మహిమ కొరకు వినియోగించాలి. 

యేసు గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఉండగా, జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన యొద్దకు నెట్టుకొనుచు వచ్చిరి. అందులకు అక్కడ ఉన్న సీమోను పడవనెక్కి, దానిని ఒడ్డుననుండి లోనికి కొద్దిగా త్రోయుమని అందు కూర్చుండి ప్రజలకు బోధించెను (5:1-3). బోధన ముగిసిన తరువాత, యేసు సీమోనుతో, "మీరు పడవను ఇంకను లోతునకు తీసుకొని వెళ్లి చేపలకి మీ వలలను వేయుడు" అని చెప్పెను. వల వేయగనే, వల చినుగునన్ని చేపలు పడెను. సీమోను, యాకోబు, యోహానులు ఆశ్చర్య పడిరి. అపుడు యేసు సీమోనుతో, "భయపడవలదు. ఇకనుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువు" అనెను (5:4-10). ఈవిధముగా, యేసు తన ప్రధమ శిష్యులను పిలుచుకున్నాడు. "ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి" (5:11). లూకా తన సువార్తను వ్రాసే సమయానికి 'పడవ' శ్రీసభకు సూచనగా మారింది. క్రీస్తు సువార్త "భూదిగంతముల వరకు" (అ.కా. 1:8) ప్రకటింప బడవలెను. వల చినుగునన్ని చేపలు ఈ దైవరాజ్య వ్యాప్తిని సూచిస్తుంది. దానిలో మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. కాని ఉత్థానం తరువాత, యేసు ఆజన ప్రకారం, వలవేయగా నూట ఏబది మూడు పెద్ద చేపలు పడెను (యోహాను 21:1-14). అవి మంచి చేపలు మాత్రమే!

యేసు తన అధికారాన్ని, శక్తిని ప్రదర్శించారు. యేసు పేతురుతో, "మీరు పడవను ఇంకను లోతునకు తీసుకొని వెళ్లి మీ వలను వేయుడు" (5:4) అని చెప్పి యున్నాడు. యేసు మాటలు పేతురులో ఆశను, విశ్వాసాన్ని నింపాయి, ధైర్యాన్ని ఇచ్చాయి. వారు రాత్రంతా శ్రమించినను, యేసు మాటలు వారిలో కొత్త ఆశను నింపాయి. ఆదే ఆశతో వలను వేసినప్పుడు, వారికి వల చినుగునన్ని చేపలు పడ్డాయి. అద్భుతం, ఆశ్చర్యం! యేసుపై ఉన్న నమ్మకం, విశ్వాసం ఈ అద్భుతానికి తోడ్పడ్డాయి. దేవుని [యేసు] వాక్యం రెండంచుల ఖడ్గముకన్న పదునైనది. గొప్పది. అద్భుత శక్తి కలది. మనలో కూడా దృఢవిశ్వాసం ఉండాలి. ప్రభువు వాక్యం మనలో జీవించినప్పుడు, మనలను ముందుకు నడిపించినప్పుడు, మన విశ్వాస ఎదుగుదలకు తోడ్పడినప్పుడు, దాని శక్తిని చూస్తాము. అప్పుడు మనము కూడా ఆయన మహిమను చూస్తాము. మొదటగా దేవునిపై విశ్వాసం ఉండాలి.

ఈనాటి పఠనాలలో, యెషయా ప్రవక్త మరియు పేతురు, వారి అపవిత్రతను దేవుని ఎదుట ప్రకటిస్తున్నారు. వారు, దేవుని మహిమను, పవిత్రతను, గొప్పతనాన్ని చూచినప్పుడు వాళ్ళ చిన్నతనాన్ని గుర్తించారు. దేవుని పవిత్రతలో నిలబడలేక పోయారు. యెషయా ప్రవక్త ఇలా అన్నాడు, "నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించు వాడను, నేను నశించితిని" (యెషయ 6:5). అలాగే పేతురు యేసు పాదములపై పడి, "ప్రభూ! నేను పాపాత్ముడను, నన్ను విడచి పొండు" (5:8) అని పలికాడు. అయినను, ప్రభువు వారిని తన సేవకు పిలుచుకున్నారు. "ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి" (5:11). ప్రతీ పాపాత్ముడు, ప్రతీ రోగి యేసు వైపునకు మరలాలి. పేతురు, ఇతర శిష్యులవలె దృఢవిశ్వాసముతో ప్రభువును అనుసరించాలి.

గమనించాల్సిన విషయం: యేసు పేతురు పడవనుండే, ప్రజలకు దేవుని వాక్కును బోధించారు. అదే పడవనుండి, వల చినుగునన్ని చేపలు పడేలా చేసారు. పాపాత్ముడను అని పశ్చాత్తాప పడిన పేతురును, మనుష్యులు పట్టువానిగా, పునీతునిగా మలచాడు.

పాపాత్ములమైన మనలను దేవుడు తన ప్రేమ వలన, పవిత్రత వలన తన వారినిగా చేసికొని, తననుతాను మనకు అనుదిన సంఘటనలద్వారా, తెలియజేస్తూ ఉన్నాడు. మనం పాపాత్ములమైనప్పటికిని, యేసు మనలను పిలచుచున్నారు. మనలను బలపరచు చున్నారు. ప్రతీ పాపాన్ని అధిగమించేలా చేయువారు ఆయనయే! ఈ అద్భుతాన్ని ప్రతీ ఒక్కరు గుర్తించాలి! ఆయన ప్రేమను గుర్తెరిగి, ఆయన సేవలో జీవించుదాం! ఆయనకు సాక్షులుగా జీవించుదాం! 

No comments:

Post a Comment