నాలుగవ సామాన్య ఆదివారము YEAR C

నాలుగవ సామాన్య ఆదివారముYEAR C
యిర్మియా 1:4-5, 17-19;  1 కొరిం 12:31-13:13; లూకా 4:21-30

ఈనాటి దైవార్చన ముఖ్యాంశం: దేవుడు మనలనందరిని వ్యక్తిగతముగా పిలుస్తున్నాడు. ఈ పిలుపు ద్వారా, తన ప్రేమ సందేశాన్ని అందజేస్తున్నాడు. యోహాను సువార్తీకుడు ఇలా అంటున్నాడు, "దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించిన ప్రతివాడు నాశనము చెందక నిత్యజీవము పొందుటకై అట్లు చేసెను" (3:16). ఈ ప్రేమ త్యాగపూరితమైనది, సంరక్షణతో కూడినది. ఈ ప్రేమ ఇతరులను అంగీకరించుటకు, క్షమించుటకు, అర్ధం చేసికొనుటకు, ఓర్పు, ఓదార్పును కలిగి యుండుటకు మనలను బలవంతులను చేయును. మన జీవితములో ఎదురయ్యే ప్రతీ సవాలును ఎదుర్కొనుటకు శక్తిని, ధైర్యమును ఒసగును. దేవుడు ప్రతీ ఒక్కరిని కాపాడును. అందుకే, తననుతాను మనకు అర్పించుకుంటున్నాడు. ఇదే దేవుని ప్రేమతో ఈ లోకాన్నికూడా మనం బలపరచాలి, ప్రేమతో నింపాలి. అందకే దేవుడు మనలను పిలుస్తున్నాడు.

ఈనాటి మొదటి పఠనములో చూస్తునట్లుగా, దేవుడు తన వాక్యముద్వారా, యిర్మియాను ప్రవక్తగా తన సేవకు పిలుచుకొంటున్నాడు. ఈ దైవకార్యములో ఎన్నో కష్టాలను ఎదుర్కొనవలసి ఉంటుందని, వాటిని ధైర్యముగా ఎదుర్కొన సిద్ధము కావలయునని యిర్మియాకు తెలియజేయడం జరిగింది. మాతృగర్భమున రూపొందింపక మునుపే యిర్మియాను దేవుడు ఎన్నుకున్నారు, పవిత్రపరచారు (ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు), జాతులకు (యూదులకు, అన్యులకు) ప్రవక్తగా నియమించారు. దేవుని పిలుపులో ఎంతో ప్రేమ కనిపిస్తున్నది. దేవుడే మొదటి యత్నాన్ని చేస్తూ, యిర్మియాను ప్రవక్తగా ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రవక్త దేవుని స్వరం. దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు, దేవుడు ఆజ్ఞాపించిన దానిని ప్రజలకు తెలియ చేయాలి. 

పిలుపును విన్న యిర్మియా భయముతో, "యావే ప్రభూ! నాకెట్లు మాటలాడవలయునో తెలియదు. నేను బాలుడను" అని చెప్పినప్పుడు, "నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుచుందును" అని తండ్రి దేవుడు చెప్పియున్నారు. ప్రభువు చేయి చాచి, యిర్మియా నోటిని తాకి ఆయన పలుకులను యిర్మియా నోట పెట్టి యున్నారు.

రెండవ పఠనములో పునీత పౌలుగారు ఆత్మవరములు, వాని ప్రాముఖ్యతను గూర్చి తెలియచేయు చున్నాడు. ఆత్మ వరములలో కెల్ల, ప్రేమ అన్నింటికన్న ముఖ్యమైనదని చెప్పుచున్నాడు. ప్రేమ ఓ వరం. దేవుని ప్రేమ గొప్పది. అనంతమైనది. దేవుని ప్రేమ ప్రతీ ఒక్కరిపై అమితముగా ఉంటుంది. ప్రేమ లేనిచో మిగతా వరాలకు విలువ లేదని పౌలుగారు చెప్పుచున్నారు. ప్రేమ లేనిచోట అంతా శూన్యముగా ఉంటుంది. జ్ఞానము, విశ్వాసము ఉన్నను ప్రేమ లేనిచో వ్యర్ధమే! ప్రేమ సహనము కలది, దయ కలది, అసూయ కాని, డంభము కాని, గర్వము కాని ప్రేమకు లేవు. అమర్యాద కాని, స్వార్ధపరత్వము కాని, కోప స్వభావము కాని, ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు. ప్రేమ కీడునందు ఆనందింపదు. సత్యమునందే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును. సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రేమ శాశ్వతమైనది.

సువిశేష పఠనములో నజరేతూరిలో యేసును (దైవ ప్రేమను) నిరాకరించిన సంఘటన గురించి వింటున్నాం. యేసు ఓ మెస్సయ్యగా, ప్రవక్తగా, దేవుని కుమారునిగా ఈ లోకమునకు వచ్చారు. దేవుని స్వరమును, వాక్యమును ప్రజలకు అందించారు. తండ్రి ప్రేమను చాటారు. ఆయన మాటలను విన్న ప్రజలు మొదటగా ఆశ్చర్యచకితులైనారు. కొందరు విశ్వసించారు. కొందరు ద్వేషించారు, ఆయనను నాశనము చేయబూనారు.
"నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది" (4:21) - "నేడు" - యేసు వాగ్దానాలు 'నేడు' నేరవేరుచున్నవి. ఎదురుచూపు ముగిసినది. దైవరాజ్యము సమీపమునకు వచ్చియున్నదని యేసు తెలియజేయు చున్నారు (11:20; 17:20-21). యూదులు ఎన్నో సం.లుగా మెస్సయ్య కొరకు ఎదురు చూసారు, కాని "నేడు" ఆయన వారి మధ్యలో ఉన్నారని గుర్తించలేక పోయారు. ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. నేడు రక్షకుడు నాలోనే ఉన్నారని నేను విశ్వసించు చున్నానా? యేసు మరల వస్తానని వాగ్దానం చేసారు. ఆ రోజు "నేడే" ఎందుకు కాకూడదు? నేను సిద్ధముగా ఉన్నానా?
ప్రభువు అప్పటికే కఫర్నాములో (అన్యులు ఎక్కువగా ఉండు ప్రదేశము) ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు చేసారు. ఇప్పుడు నజరేతులో (యూదులు) అంతకంటే ఎక్కువ అద్భుతాలు, స్వస్థతలు చేస్తారని ప్రజలు ఆశించారు. "ఓ వైద్యుడా! నీకు నీవే చికిత్స చేసికొనుము" (4:23) - కఫర్నాములో అన్యులను, అర్హత లేని వారిని స్వస్థత పరచావు కనుక నజరేతులో స్వంత ప్రజలకు ఇంకా ఎక్కువ చేయగలగాలి అన్న అర్ధం స్పురిస్తున్నది. సిలువచెంత అధికారులు, "ఇతడు ఇతరులను రక్షించెను. కాని, ఇతడు దేవుడు ఎన్నుకొనిన క్రీస్తు అయినచో తననుతాను రక్షించుకొననిమ్ము" (లూకా 23:35) అని హేళన చేసిరి.
"ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడడు" (4:24) - నజరేతు ప్రజల విముఖతను ప్రభువు ముందుగానే స్పష్టం చేయుచున్నారు: "యేసు మాటలను విని వారు మండిపడ్డారు...పర్వతాగ్రమునకు తీసుకొని వెళ్లి, అచట నుండి తలక్రిందులుగా పడత్రోయ తలచిరి" (4:28-29). దేవుని ప్రవక్తలను నిరాకరించిన చరిత్ర ఇశ్రాయేలు ప్రజలది (2 రా.ది.చ. 36:16; యిర్మీ 2:30; ఆమో 2:12; మత్త 23:37; లూకా 13:34; 1 తెస్స 2:15; హెబ్రీ 11:32).
"యిస్రాయేలీయులలో పెక్కుమంది విధవరాండ్రు ఉండినను, సీదోనులోని సరెఫాతు గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలీయా పంపబడెను" (4:25-26) - 1 రాజు 17:8-24లో ఈ సంఘటనను చదవవచ్చు. ఆమె అన్యురాలు; అయినను విశ్వాసముతో స్పందించినది. "యిస్రాయేలీయులలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నను, సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవ్వరును స్వస్థత పొందలేదు" (4:27) - ఈ సంఘటనను 2 రాజు 5:1-14లో చదవవచ్చు. ఇక్కడ కూడా నామాను అన్యుడు. యూదులు అయితే సరిపోదు, పరివర్తన, మారుమనస్సు కలిగిన జీవితం, విశ్వాసం అవసరమని స్పష్టమగుచున్నది. కాని, అచ్చటి ప్రజలు ప్రతీకారాన్ని ఆశించారు. మెస్సయ్య ఇశ్రాయేలు ప్రజలను విడిపించి, వారి శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటారని భావించారు. యేసు సందేశం వారు ఆశించిన దానికి విరుద్ధముగా నున్నది. అందుకే, "యేసు మాటలను విని వారు మండిపడ్డారు" (4:28). యేసును దైవదూషకునిగా, తప్పుడు ప్రవక్తగా భావించారు. అందుకే, చట్టం ప్రకారం (లేవీ 24:14; ద్వితీ 13:1-11), ఆయనను నాశనం చేయ ప్రయత్నించారు. "కాని యేసు వారి మధ్యనుండి వెళ్ళిపోయెను" (4:30).

మన పిలుపుకు యేసే ఆదర్శం. దైవపిలుపునకు నమ్మకముగా ప్రతిస్పందించినపుడు, ఆ పిలుపును ఎవరు అడ్డుకోలేరు, జోక్యంచేసుకొనలేరు. దైవసేవకులు, పునీతులు ఎన్ని కష్టాలు, ఆటంకాలు, ఇబ్బందులు వచ్చినను, తండ్రి చిత్తాన్ని ఈ లోకములో పరిపూర్ణముగా పూర్తిచేసారు. ప్రేమలోకానికి నాంది పలికారు. తండ్రి దేవుడు మనకు ఇచ్చిన పిలుపును మనం ఈ లోకమున పరిపూర్ణము చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎవరి బాధ్యతలను వారు గుర్తెరిగి నిర్వహించినప్పుడు, మన కుటుంబములోగాని, సమాజములోగాని, రాష్ట్రములోగాని, ఇన్ని అసమానతలు, నిరాశలు, చావులు, అక్రమాలు, హింసలు, హత్యాచారాలు ఉండవు. ప్రతీ పిలుపులో ప్రాముఖ్యమైనది ప్రేమ. ప్రేమ లేనప్పుడు, ఎన్ని అధికారాలు ఉన్న, ఎన్ని ప్రణాళికలు ఉన్న, ఎంత డబ్బు ఉన్న, అంతా శూన్యమే, అంతా వ్యర్ధమే! ప్రేమతో జీవించుదాం, ఆ ప్రేమను లోకానికి పంచుదాం! మన సమాజములో ఉన్న చెడును నిర్మూలించాలంటే అది కేవలం ప్రేమతో మాత్రమే సాధ్యమవుతుంది.

1 comment: