ఆగమనకాల మొదటి ఆదివారం, Year C


ఆగమనకాల మొదటి ఆదివారం, YEAR C
యిర్మియా 33:14-16; 1 తెస్స 3:12-4:2; లూకా 21:25-28, 34-36
ప్రభువు వచ్చుచున్నాడు – సిద్ధపడుదాo

    ఈరోజు మనము, ఆగమన కాలాన్ని ప్రారంభిస్తున్నాము. దీనితో నూతన దైవార్చన సంవత్సరాన్ని ఆరంభిస్తున్నాము. ప్రభువురాక కొరకు మనం సిద్ధపడాలని తల్లి తిరుసభ మనలను కోరుచున్నది. యేసు రాకను ధ్యానించి, సిద్ధపడే కాలము. మన జీవితములో దేవుని వాగ్దానాలు పరిపూర్ణమయ్యే కాలము. దేవుని వాగ్దానాలు యేసు ప్రభువు ద్వారా నెరవేరబడతాయి. 

    ‘ఆగమనము’ అనగా ‘ఎదురు చూడటం’. మనం ప్రేమించే వారి కొరకు, ఇష్టపడే వారికొరకు, ఎంతో ఆతురతతో ఎదురు చూస్తూ ఉంటాము; వారి కొరకు మన సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాము. ఆగమనం సంతోషముతో కూడుకొన్న కాలము; ప్రేమతో చూసే ఎదురు చూపు. ఇచ్చట మనం యేసు కొరకు ఆతురతతో ఎదురు చూస్తూ ఉన్నాము. ఈవిధముగా, దేవుడు మానవుడయ్యే గొప్ప సంఘటన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము.

    ప్రభువు ఆగమనం మూడు అంశాలతో ఉన్నది: మొదటగా, గతములోనికి చూస్తూ 2000 సం.ల క్రితం చరిత్రలో జరిగిన యేసు జన్మమును కొనియాడుట. రెండవదిగా, ప్రస్తుత కాలములో, మన అనుదిన జీవితములో ప్రభువును స్వీకరించుటకు సిద్ధపడుట. ప్రభువును మనం వాక్యము ద్వారా, దివ్యబలి పూజలో స్వీకరిస్తూ ఉన్నాము. మూడవదిగా, భవిష్యత్తులోనికి చూస్తూ ప్రభువు తన మహిమలో అంత్యకాలములో వచ్చుట కొరకు ఎదురు చూచుట. ప్రభువు రాకడలో వాగ్దానం, ప్రేమ, సంసిద్దత, జాగరూకత, ఆత్మ పరిశీలన, ప్రార్ధన, కొత్త ఆరంభం, పరిపూర్ణత ఉన్నాయి.

ఈనాటి పఠనాలు, ఆధ్యాత్మికముగా, పైన చెప్పిన మూడు అంశాలపై ధ్యానించమని ఆహ్వానిస్తూ  ఉన్నాయి. మొదటి పనములో యిర్మియా ప్రవక్త శిధిలమైన, అభద్రతలోనున్న యేరూషలేమునకు భోధిస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం, ‘హృదయ పరివర్తన చెందుడు’ అన్న పిలుపును వారు పెడచెవిన పెట్టియున్నారు. దేవుని వారు నిర్లక్ష్యం చేసి, వారికున్న వనరుల మీద, ఇతర దేశాలతో కూటమి ఏర్పాటు చేసుకోవడములో వారి భద్రతను చూసుకొన్నారు. యిర్మియా ప్రవక్త, వారి వినాశనాన్ని వారిస్తూనే, వారి ఉజ్వల భవిష్యత్తును చూస్తూ ఉన్నాడు. దీనికి ముఖ్య కారణం, దేవుడు తాను చేసిన వాగ్దానాలకు విశ్వసనీయముగా ఉన్నాడు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసాడు, “నిన్నెక్కువ దీవింతును. ఆకాశము నందలి నక్షత్రములవలె, సముద్ర తీరమునందలి ఇసుకరేణువులవలె, లెక్కకందనంతగా నీ సంతతిని విస్తరిల్ల జేయుదును” (ఆ.కాం. 22:17; 26:4). వారి శత్రువులను జయించి, వారి ద్వారా సకల జాతి జనులు  దేవుని ఆశీర్వాదాలు పొందుదురు. ఆ తర్వాత, దేవుడు దావీదుతో వాగ్దానం చేసాడు (యిర్మి. 23:5; 33:15). వారికి ఒక నీతిగల రాజు వస్తాడని, ఆయన ద్వారా దేశమంతట నీతిన్యాయములు, భద్రత నెలకొనునని ప్రవక్త తెలియ జేయుచున్నాడు. దేవుని వాగ్దానం యేసు రాకతో నెరవేరింది. యేసు ప్రభువు, దేవుని వాగ్ధాన పరిపూర్ణం.

రెండవ పనములో పౌలు ప్రభువు చివరి రాకడ గురించి తెలియజేస్తూ, ప్రభువు రాక కొరకు ఎలా సిద్ధపడాలో చక్కని సలహా ఇస్తున్నాడు. ప్రభువు రాకడ ఎంతో వైభవముగా, మహా మహిమతో ఉంటుంది. ప్రభువును మన అనుదిన జీవితములో ‘ఇప్పుడు, ఇక్కడే’ స్వీకరించాలని పౌలుగారు ఆహ్వానిస్తూ ఉన్నారు.

ఈవిధముగా, ప్రభువు అనుచరులమైన మనము బెత్లేహేములో జరిగిన ప్రభువు రాకడను, జన్మను గుర్తించి, మనకు తెలియని భవిష్యత్తులో రాబోయే ప్రభువు రాకకొరకు సిద్ధపడాలి. దీనినిమిత్తమై, మనము పవిత్రమైన జీవితాలను జీవించాలి. ప్రభువు వచ్చునప్పుడు మనం ఒకరినొకరు ప్రేమిస్తూ జీవించాలి, ప్రేమలో, ప్రేమగా జీవించాలి. మన ప్రేమ మన వారిపై మాత్రమేగాక, మన ప్రేమ మన విరోధులపై, శత్రువులపై కూడా ఉండాలి. ఎందుకన, వారు కూడా దేవుని బిడ్డలే, దేవుని పోలికలో సృష్టింపబడ్డారు. మన హృదయాలు, దేవుని సన్నిధిలో పవిత్రముగా ఉండాలి, నిష్కళంకముగా ఉండాలి. దీనిని మనం సాధించాలంటే, మనం పరిశుద్దాత్మలో నడవాలి. మనం పవిత్రతలో నడచుటకు మనకు క్రమశిక్షణను నేర్పుతుంది. దేవుని సహవాసములో ఉంటూ, క్రీస్తువలె మనము మారవలెను. మనం నిండిన విశ్వాసములో జీవించినప్పుడే ఇది సాధ్యమవుతుంది.

సువిశేష పనము లోకాంత్యము గురించి, ప్రభువు రాకడ గురించి బోధిస్తూ ఉన్నది. ప్రభువును కలవడానికి మనం ఎలా సిద్ధపడాలో తెలియజేస్తూ ఉన్నది. ప్రభువు పునరాగమనమునకు ముందు జరగబోయే సంఘటనల తర్వాత (లూకా 21:25-26), “మనుష్య కుమారుడు శక్తితోను, మహా మహిమతోను ఆకాశమున మేఘారూరుడై వచ్చుటను వారు చూచెదరు” (21:27). ఈ లోకములో మన జీవితం ఒక ప్రయాణమని, యాత్ర అని, ఈ భూలోకం మన చివరి గమ్యం కాదని గుర్తుకు చేస్తుంది. యేసు క్రీస్తు ప్రభువు మన చివరి గమ్యం, నిరీక్షణ. ఈ సందర్భముననే, ప్రభువు రెండవ రాకడ గురించి సువిశేషం బోధిస్తున్నది. జరగబోయే సంఘటనలు (21:25-26) ప్రభువు రాకడ దగ్గర ఉన్నదని సూచిస్తూ ఉన్నాయి, “ఇవన్ని సంభవించినప్పుడు, మీ రక్షణ కాలము ఆసన్నమైనది” (21:28). ప్రభువు రాకడ, ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలె వచ్చి పడును (21:34). కావున, మనం అప్రమత్తులై ఉండవలయును, ఎల్లప్పుడును జాగరూకులై ప్రార్ధన చేయాలి (21:34-36).

ప్రభువు రాకడ ఆయన తీర్పు కొరకు. ఇది తీర్పు దినము కనుక మనం మారుమనస్సు పొందాలని, సేవా జీవితాన్ని గడపాలని సువిశేషం ఆహ్వానిస్తూ ఉన్నది. లూకా సువార్తలో 'అంత్యదినము' అనగా దేవుని చిత్తము పరిపూర్తియగుట. అందుకే ఆ దినమును “ప్రభువు దినము”గా పిలువబడుచున్నది. లోకాశాలకు గురికాకూడదని ప్రభువు కోరుచున్నారు (21:34). ఆయన రాకకై ఎదురు చూడాలి. ఇలా నిత్యజీవితం కొరకు సిద్ధపడాలి.

ఆగమన కాలము (ఆగమన కాలము గురించి క్లిక్ చేయండి)

No comments:

Post a Comment