సర్వేశ్వరుడు రాజ సింహాసనమందు ఆసీనుడై యుండును. ఆయన తన ప్రజలకు శాంతి వరమును ప్రసాదించును (కీర్తన 29:10-11).
ఈ రోజు దైవార్చన సం,,లో చివరి ఆదివారము మరియు ఈ రోజు సర్వాధికారియగు క్రీస్తు రాజు మహోత్సవమును కొనియాడుచున్నాము. ప్రపంచ దేశాలెన్నో గతములో రాజులచేత పరిపాలించబడ్డాయి. రాజుల పాలనను మనం చూడక పోయిన, ఎంతగానో వినియున్నాము కాబట్టి, ఎంతో కొంత అవగాహన మనందరికీ ఉన్నది. ఎంతోమంది గొప్ప గొప్ప రాజుల చరిత్రలు మనకు తెలుసు. అలాగే పాలితులను, రాజ్యాలను కొల్లగొట్టి వినాశనము చేసిన రాజుల చరిత్రలూ మనకు తెలుసు. రాజు అనగానే, మన మదిలో మెదిలేది భయం, క్రూరత్వం, సైన్యం, యుద్ధం మొ,,వి. రాజు అనేవాడు తన ప్రజలకు ఓ గొర్రెల కాపరివలె, ప్రేమించే హృదయాన్ని కలిగి యుండాలి. సంఘాన్ని న్యాయముతో, శాంతి పధములో నడిపించగలగాలి. ప్రజల అవసరాలను గుర్తెరిగి వాటిని నెరవేర్చే వాడై ఉండాలి. అలాంటి పరిపాలనను మనం స్వర్ణయుగముతో పోల్చుతూ ఉంటాము.
ఈనాడు మనం కొనియాడే ఈ పండుగ, క్రీస్తుని సర్వాధికారము మరియు సర్వాధిపతియని తెలియజేస్తుంది. ఈ పండుగ మన భవిష్యత్తును ధ్యానించేలా చేస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన రోజులు. ఐహికత్వం పెరుగుతున్న కాలం. యూరోపు మరియు ఇతర దేశాలలో భయానకర నియంతలు వెలుగులోనికి వస్తున్న కాలం. ఇలాంటి సమయములో, క్రీస్తు ఒక రాజుగా గౌరవించబడాలని, చర్చికి కూడా స్వతంత్ర౦ కలదనే విషయం లోకం తెలుసుకోవాలని, విశ్వాసులు బలాన్ని, ధైర్యాన్ని పుంజుకొంటారని తలంచి, ఈ పండుగను 1925 వ సం,,లో 11 వ భక్తినాధ పాపుగారు స్థాపించారు. ప్రతీ దైవార్చన సం,,ర చివరి ఆదివారమున ఈ ఉత్సవం కొనియాడటం జరుగుతూ ఉంది. ఈ పండుగ ద్వారా, మనం గుర్తుకు చేసుకోవాల్సింది, క్రీస్తు మన హృదయాలను, మనసులను పరిపాలించాలి.
ప్రజాస్వామ్యం కలిగిన దేశాలలో 'రాజు', 'ప్రభువు' అన్న పదాలను సంభోదించడం సమంజసం కాదేమో! ఎందుకన, ఇవి నిరంకుశ ప్రభుత్వ పాలనలోంచి పుట్టుకొచ్చాయి కనుక. అనేక సందర్భాలలో, రాజు గర్వానికి, అధికార దుర్వినియోగానికి, యుద్ధాలకు, అవినీతికరమైన జీవితాలకు ప్రతీక. అయితే, క్రీస్తు ప్రభుని రాజరికం, అణకువ మరియు సేవకు ప్రతీక.
క్రీస్తు తన శిష్యులతో ఇలా అన్నారు: "అన్య జాతి ప్రజలలో పాలకులు పాలితులను నిరంకుశముగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై పెత్తనం చెలాయించుచున్నారు. మీకు ఇది తగదు. మీలో ఎవడైన గొప్పవాడు కాదలచిన అతడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడైన ప్రముఖుడై ఉండదలచిన అతడు మీకు బానిసయై ఉండవలెను. ఏలయన, మనుష్య కుమారుడు సేవించుటకేగాని, సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను (మార్కు 10:42-45). యేసు పిలాతుతో ఇలా అన్నారు: "నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని. ఇందు కొరకే ఈ లోకమునకు వచ్చితిని" (యోహాను 18:37).
ఈనాటి మహోత్సవం క్రీస్తు రాజరికపు బిరుదులను స్థిరపరుస్తుంది. మొట్టమొదటిగా, క్రీస్తు దేవుడు, సృష్టికర్త. కనుక తన సర్వాధికారాన్ని సమస్తముపై చాపుచున్నాడు. "దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా, ఆయన కొరకు సృష్టించెను" (కొలస్సీ 1:16). రెండవదిగా, క్రీస్తు మన రక్షకుడు; తన పవిత్ర రక్తాన్ని వెలగా పెట్టి మనలను తన స్వంతం చేసుకొన్నాడు. మూడవదిగా, క్రీస్తు శ్రీసభకు అధిపతి. చివరిగా, క్రీస్తు రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు.
క్రీస్తు ఈ లోకమున జీవించినప్పుడు, దైవ రాజ్యము గూర్చి భోదించాడు మరియు తన శిష్యులతో, "మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదకుడు" (మ 6:33) అని చెప్పాడు. దేవునికి ప్రధమ స్థానాన్ని ఇవ్వాలని సూచించాడు. తన శిష్యులను సేవకులని గాక స్నేహితులని పిలిచాడు. తన గురుత్వమును, రాజరికాన్ని వారితో పంచుకొన్నాడు. ఆయన మరణించినప్పటికిని, ఈ లోక రాజులవలె గాక, ఆయన ఇష్టపూర్తిగా, తన ప్రజల రక్షణార్ధమై మరణించాడు. ఆయన మరణం యుద్ధము వలన వచ్చినది కాదు. రక్షణ ప్రణాళికలో సృష్టి పూర్వమే ఏర్పాటు చేయబడినది.
ఆయన మహిమతో పుణరుత్తానుడై మోక్షారోహనుడైనాడు. రాజుగా ఈ లోకములో ఒక సేవకునిగా ప్రజల దరికి చేరాడు. తన శిష్యులను సైతం సేవకులుగా ఉండాలని ఆజ్ఞాపించాడు. ఆయన నిజమైన స్వాతంత్రాన్ని ఒసగువాడు. ఈ విధముగా, 'రాజు'కు ఓ నూతన అర్ధాన్ని ఇచ్చాడు.
మొదటి పఠనములో (దానియేలు 7:13-14), దానియేలు ప్రవక్త, శాశ్వత జీవి, నరపుత్రుని రాకను గూర్చిన దర్శనము గూర్చి తెలియజేయుచున్నాడు. "ఆ నరపుత్రుడు పరిపాలనమును, రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలతనికి దాసులైరి. అతని పరిపాలనము శాశ్వతమైనది. అతని రాజ్యమునకు అంతము లేదు. ఈ పఠన౦, దేవుడు రాజుగా కలకాలం ప్రజల చెంత ఉన్నాడని, దేవుని రాజ్యం భూలోకమునకు ఏతెంచినదని నిరూపిస్తున్నది.
రెండవ పఠన౦ (దర్శన గ్రంధము 1:5-8), క్రీస్తును ప్రేమించే రాజుగా వర్ణిస్తుంది. "ఆయన మనలను ప్రేమించుచున్నాడు" (1:5). మనకోసం ఒక రాజ్యాన్ని స్థాపించిన సర్వాధికారియైన క్రీస్తు రాజసత్వమును గూర్చి భోదిస్తుంది. ఈ రాజ్యములో క్రీస్తు మనలను దైవసేవకు అంకితము చేసియున్నాడు. "ఆయన రక్తము ద్వారా, మనలను పాప విముక్తులను చేసి (1:5), తన ప్రేమను నిరూపించుకొన్నాడు. అందుకే, ఆయన సర్వాధికారమునకు పాత్రుడైనాడు. ఆయన మరల మహిమతో తిరిగి వచ్చును. ఆయన "ఆల్ఫా, ఒమేగ" (1:8).
సువిశేష పఠన౦లో (యో 18:33-37) పిలాతు ఎదుట ప్రభువు తన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదని, తన రాజ్యము ఆధ్యాత్మికమైనదని, తన రాజ్యము సత్యము, న్యాయములపై ఆధారపడి ఉన్నదని చెప్పాడు, కాని, పిలాతు అర్ధము చేసుకోలేకపోయాడు. సిలువ క్రీస్తు రాజ్య విజయానికి చిహ్నము. ఈ విజయం జీవితం, సత్యం, ప్రేమ కొరకు.
క్రీస్తు మన రాజు, అందరి రాజు మరియు సర్వాధికారము కలిగిన వాడు. ఆయన మన జీవితాలకు, హృదయాలకు రాజు. ఆయన చూపిన ప్రేమ-సేవ మార్గములో పయనిద్దాం. ఇతరులకు సేవకులమై దేవుని రాజ్యాన్ని ఈ లోకములో బలపరచుదాం.
సర్వ శక్తిగల ఓ సర్వేశ్వరా! సమస్తము మీద రాజ్యాధికారముగల మీ ప్రియతమ పుత్రుని ద్వారా సృష్టినంతటిని పునరిద్దరించ చిత్తగించితిరి. సృష్టి అంతయు పాప దాస్యమునుండి విముక్తి చెంది మీ వైభవ సేవకు అంకితమగునట్లును, నిత్యము మీ స్తుతిగానమందు నిమగ్నమై యుండునట్లును చేయుమని మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాము. ఆమెన్.
Fr exelexcel...mess Mes...
ReplyDeleteKeep it up💐💐💐
Excellent father
ReplyDelete