సత్యోపదేశము - ప్రాముఖ్యత
“ఏకైక సత్యదేవుడవగు నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును వారు తెలుసుకొనుటయే నిత్యజీవము” (యోహాను. 17:3). “మానవులు అందరు రక్షింపబడవలయునని, సత్యమును తెలిసికొనవలయునని దేవుని అభిలాష” (1 తిమో. 2:4). “ఆయనయందుతప్ప వేరొకనియందు రక్షణ లభింపదు. ఏలయన, ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు” (అ.కా. 4:12).
సత్యోపదేశము అనగా సువిషేశ ఆనందమును, శ్రీసభ బోధనలను ఉపదేశించడము. మనిషి జీవితం దేవున్ని తెలుసుకొని ప్రేమించడం. పరిపూర్ణుడు పవిత్రుడైన దేవుడు తన ప్రణాళిక ప్రకారం తన దివ్యజీవితంలో పాలుపంచుకోవడానికి మానవుని స్వేచ్ఛతో సృష్టించాడు. తనను తెలిసికొని సంపూర్ణశక్తితో తనను ప్రేమించేందుకు దేవుడు మానవుని ఆహ్వానిస్తున్నాడు. తన కుటుంబమైన శ్రీసభలో చేరి ఒకటి కావాలని పిలుస్తున్నాడు. ఈ కార్యమును పరిపూర్తిచేయటానికి తన కుమారుని రక్షకునిగా పంపాడు. తన కుమారునిద్వారా తన దివ్యజీవితానికి వారసులు కావాలని ఆహ్వానిస్తున్నాడు. సువార్తను బోధించాలని ఆదేశించి క్రీస్తు తన అపోస్తలులను పంపియున్నాడు. అపోస్తలులనుంచి వారసులుగా విశ్వాసులు ఈ సువార్త బోధనను చేసియున్నారు.
తండ్రి దేవుని చిత్తప్రకారం మనం ఆ నిత్యజీవితంలో భాగస్తులమవ్వాలి. దీనికోసమే సువార్త బోధింపబడాలి. అందుకే సువార్తను బోధించే అధికారం యేసు తన శిష్యులకు ఇచ్చియున్నాడు (మత్త. 28:19-20). “పిదప శిష్యులు వెళ్లి అంతట సువార్తను ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు, అద్భుతములద్వారా, వారి బోధ యదార్ధం అని నిరూపించుచుండెను (మార్కు. 16:20). శిష్యులతోపాటు, క్రీస్తు పిలుపును ఆహ్వానించి, స్వేచ్ఛగా ఆ పిలుపుకు బదులు ఇచ్చినవారు, సువార్త బోధనలో పాలుపంచుకున్నారు. శిష్యులనుంచి అందుకున్న సువార్త సంపదను వారి విశ్వాసముద్వారా పరిరక్షిస్తూ వచ్చారు. సువార్త జీవితముద్వారా, ప్రార్థనద్వారా, సువార్త బోధనను తరతరాలవారికి అందించియున్నారు (అ.కా. 2:42).
సత్యోపదేశం అనగా విశ్వాసాన్ని అందివ్వడం; మనుషులను క్రీస్తు శిష్యులుగా మలచటం; యేసు దేవుని కుమారుడని మనుషులు నమ్మడానికి వాళ్లకు తోడ్పడటం; ఆయనపేర జీవముపొందేలా చూడటం; ఈ జీవములో వాళ్లకు విద్యగరిపి శిక్షణ ఇవ్వడం. ఆ విధముగా క్రీస్తు దేహాన్ని (శ్రీసభ) నిర్మించటం. శ్రీసభచేసే ఈ కార్యమునంతా “సత్యోపదేశం” అని పిలువబడుచున్నది.
క్రైస్తవ జీవిత సంపూర్ణతలోనికి ఇతరులను ప్రవేశపెట్టడం; ఒక క్రమపద్ధతిలో క్రైస్తవ సిద్ధాంతాలను, సువార్త విలువలను, పిల్లలకు యువతకు, వయోజనులకు వివరించి అందించే విశ్వాస విద్యయే సత్యోపదేశం. అయితే, కేవలం క్రైస్తవవిద్యను అందించడం ఒక్కటే సత్యోపదేశము కాదు. దీనిలో ప్రధానంగా ఉండవలసిన అంశాలు ఏమనగా: ప్రారంభదశలో సువార్తను ప్రకటించటం లేదా సువార్త ప్రచారంద్వారా విశ్వాసాన్ని రేకెత్తించడం; నమ్మడానికిగల కారణాలను పరిశీలించడం; క్రైస్తవ జీవన అనుభవం; దివ్యసంస్కారాల ఆచరణ; శ్రీసభలో ఇమిడిపోవడం; అపోస్తలులే సాక్షులుగా నిలచి సువార్త ప్రచారం చేయటం.
సత్యోపదేశం ఉద్దేశం ఏమనగా: విశ్వాసాన్ని, నైతిక జీవన విలువలను, కతోలిక సిద్ధాంతాన్ని సమగ్రంగా, క్రమబద్ధంగా అందించడం.
సత్యోపదేశంలో ఉండవలసిన నాలుగు ముఖ్యాంశాలు:
1. విశ్వాస ప్రమాణం: జ్ఞానస్నానములో పొందిన విశ్వాసాన్ని బాహాటంగా ఒప్పుకోవాలి. “కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతివానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేను అంగీకరింతును” (మత్త. 10:32). “నీ నోటితో యేసు ‘ప్రభువు’ అని ఒప్పుకొని, మృతులలోనుండి దేవుడు ఆయనను లేవనెత్తినని నీ హృదయమున నీవు విశ్వసించినచొ నీవు రక్షింపబడుదువు” (రోమీ. 10:9). ఈ విశ్వాసాన్ని ప్రకటించాలంటే సత్యోపదేశం ఎంతో అవసరం. విశ్వాస ప్రమాణం దేవుడు మనకి ఇచ్చే మూడు వరాల గురించి వివరిస్తుంది. అవేమనగా: దేవుడే మన మూలదాత; దేవుడే మన ముక్తిదాత; మనలను పవిత్రం చేసేవాడు.
2. విశ్వాస సంస్కారాలు: యేసుక్రీస్తుద్వారా పవిత్రాత్మద్వారా ఒకేసారి సిద్ధించిన దేవుని రక్షణ శ్రీసభ జరిపే పవిత్ర కర్మలైన అర్చనలు దేవుడు మనకు ఒసగిన ఏడు దివ్యసంస్కారాలు.
3. విశ్వాసమయ జీవనం: దేవునిరూపంలో చేయబడిన మానవుని చరమాశయము గురించి వివరించడం; మోక్షానందం దాన్ని అందుకునే మార్గాలు, దేవుని చట్టం ఆయన కృపావర సహాయముతో స్వేచ్ఛగా ఎంపిక చేసుకున్న సత్ప్రవర్తన, దేవుని పది ఆజ్ఞలలో నిర్దిష్టమవుతున్న ద్విముఖ ప్రేమను ఈ సత్ప్రవర్తన నెరవేర్చడం అను విషయములను గురించి వివరించడం.
4. విశ్వాసమయ జీవనంలో ప్రార్ధనం: విశ్వాసుల జీవితంలో ప్రార్థనకున్న అర్థాన్ని, దాని ప్రాముఖ్యాన్ని వివరించడం; ప్రభువు నేర్పిన ప్రార్థనలోని ఏడు విన్నపాలను వివరించడం.
సత్యోపదేశమును ప్రథమంగా బోధించేవారు: తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉపదేశకులు. అలాగే, జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. ప్రతీ క్రైస్తవుడు కూడా ఒక ఉపదేశియే!
వారి ముఖ్య బాధ్యత: వారి విశ్వాసాన్ని పంచుకోవడం. వారి దైవానుభవాన్ని పంచుకోవడం. ఇతరులకు ముఖ్యముగా పిల్లలకు యేసు ప్రభువును పరిచయం చేయడం. అనగా వారు ప్రభువును తెలుసుకోవాలి, ఆయన అనంతప్రేమను, కరుణను తెలుసుకోవాలి. ఇలా చేసినప్పుడే ప్రభువు గురించి తెలుసుకోవాలనే ఆశ, తపన వారిలో కలుగుతుంది.
మనం జీవించే జీవితం ఆదర్శం కావాలి.
తల్లిదండ్రులు వారి బాధ్యత:
కుటుంబం ఓ చిన్న శ్రీసభ. గృహస్థ దేవాలయం. కుటుంబం ఐక్యతకు పవిత్రతకు నిలయం. కుటుంబం సమాజానికి పునాది. కుటుంబమే సమస్తము. కుటుంబము ప్రార్థనకు నిలయం (1 కొరి. 16:19; రోమీ. 16:5; కొలస్సీ. 4:15; ఫిలే. 2). కుటుంబం దేవుని సన్నిధికి నిలయం (దర్శన. 3:20). కుటుంబంలో ఐక్యతను, పవిత్రతను భద్రపరచుకోవాలి అంటే విశ్వాసం, ప్రార్థన, సువార్త జీవితం ఎంతో అవసరం. అప్పుడే మీరు మీ పిల్లలకు సత్యోపదేశాన్ని చెప్పగలరు. ప్రభువు గురించి తెలియజేయడానికి, తల్లిదండ్రులు పిల్లలతో తగిన సమయాన్ని వెచ్చించాలి, విశ్వాస సత్యాలను బోధించాలి.
కనుక తల్లిదండ్రులు పిల్లలపట్ల విశ్వాస విషయంలో, గుడివిషయంలో, సువార్త విలువల విషయంలో, నైతిక విలువల విషయంలో, చాలా శ్రద్ధవహించండి. పిల్లలను మనం ఎటువంటి వాతావరణంలో పెంచుతున్నాము? వారి ఎదుగుదలకు (మానసిక, శారీరక, ఆధ్యాత్మిక) ఎంతవరకు మనం న్యాయంచేస్తున్నాము? పిల్లలు, యువత ఎన్నోదురలవాట్లకు బానిసలవుతున్నారు. ఈనాటి ప్రసార మాధ్యమాలకు బానిసలవుతున్నారు. తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏమిటి?
పిల్లల ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు:
చివరిగా ఒక మాట:
ఒక్కోసారి మనం అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. ఇప్పటికే పిల్లలు అదుపుతప్పి ఉండవచ్చు. అయినను అధైర్యపడవద్దు. ఓపికగా ఉండాలి. ప్రార్థన చేయాలి, దేవునిపై భారం వేయాలి. మన కష్టాన్ని దేవుడు ఎప్పుడు కూడా హృదా కానివ్వడు.
No comments:
Post a Comment