31 సామాన్య ఆదివారము, Year B

31 సామాన్య ఆదివారము, Year B
ద్వితీయ 6:2-6; హెబ్రీ 7:23-28; మార్కు 12:28-34

ప్రేమే దైవరాజ్యం (ఉపోద్ఘాతము)

దేవునికి మానవునికి మధ్యనున్న బంధం ప్రేమానుబంధం. దేవుడు ప్రేమ. ఆయన ప్రేమామయుడు. దేవుడు ఈ లోకమును సృష్టించి మానవుని ఈ లోకానికి అధిపతిగా చేసియున్నాడు. దేవుడు తన సృష్టిలో అణువు అణువున తన ఉనికిని కలిగి యున్నాడు. దేవుడు ప్రతిఒక్కరిని వ్యక్తిగతంగా ప్రేమిస్తూ ఉంటాడు. అలాగే మనము ప్రేమించాలని ఆహ్వానిస్తూ ఉంటాడు. పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ మనల్నిమనం దేవునికి అర్పించుకుంటూ దేవుని ఆహ్వానానికి సమాధానం ఇవ్వాలి, అనగా ప్రేమగా జీవిస్తూ ఉండాలి. దేవుని ప్రేమను మనం క్రీస్తు సాన్నిధ్యముద్వారా అనుభవించు చున్నాము. క్రైస్తవప్రేమ దేవుని ప్రేమతో ముడిపడి యున్నది. మొదటి పఠనములో దేవుని ప్రేమ పది ఆజ్ఞలద్వారా వ్యక్తపరచబడి యున్నది. “మీ ప్రభువైన దేవుని పూర్ణహృదయంతో, పూర్ణమనసుతో, పూర్ణశక్తితో ప్రేమింపుడు” (ద్వితీ 6:5) అని ప్రభువు తన ప్రజలను ఆహ్వానిస్తున్నాడు. తద్వారా వారు ఆశీస్సులను పొందుతున్నారు. రెండవ పఠనములో, క్రీస్తు ప్రధాన యాజకునిగా తననుతాను ఏ విధముగా అర్పించుకుని మనలను రక్షించియున్నాడో ధ్యానించు చున్నాము. ప్రధాన యాజకునిగా తన్నుతాను అర్పించుకున్నప్పుడు ఒకే ఒక బలిగ, శాశ్వతంగా అర్పించుకొనెను (7:27). సువిశేష పఠనములో ప్రభువు ప్రముఖ ఆజ్ఞను ఇచ్చుచున్నాడు. “నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతోను, పూర్ణఆత్మతోను, పూర్ణమనసుతోను, పూర్ణశక్తితోను ప్రేమింపవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్నునీవు ప్రేమించుకొనునట్లు నీ పొరుగువానిని ప్రేమింపుము. ఇది రెండవ ఆజ్ఞ. దీనిని మించిన ఆజ్ఞ మరియొకటి లేదు” అని ప్రభువు చెప్పియున్నాడు (12:30-31).

పది ఆజ్ఞలు దైవ ప్రేమ (మొదటి పఠనము)

మొదటి పఠనము, యూదమతములోని అత్యంత ముఖ్యమైన ప్రార్ధన, విశ్వాస ప్రకటనలోని భాగము (‘షేమా’). దేవుడు ఒక్కడే, ఆయనను సంపూర్ణముగా ప్రేమించాలి అని ప్రకటిస్తున్నది (6:4). యూదుల విశ్వాసానికి ఇది మూలం.

మోషే సినాయి కొండపై యావేదేవుని పది ఆజ్ఞలను స్వీకరించి యున్నాడు. వానిని దైవప్రజలైన-ఇశ్రాయేలు ప్రజలకు, వారి వారసులకు కూడా బోధించ వలసియున్నది. వారు ఆజ్ఞలను పాటిస్తే ఆశీస్సులు పొందుతారు అని తెలియజేయడం జరిగింది. దైవాను బంధమును కలిగియుండాలంటే ఈ పది ఆజ్ఞలు పాటించటం ఎంతో ముఖ్యము.

దేవుని సహవాస బంధములో యుండాలంటే దేవునిపట్ల “భయభక్తులు” కలిగియుండాలని మోషే బోధించియున్నాడు (6:2-3). “భయభక్తులు కలిగియుండటం” అనగా దేవుని ఆజ్ఞలను/ చట్టాన్ని/ చిత్తాన్ని పాటించటం. ‘భయము’ అనేది క్రమశిక్షణలోనికి నడిపిస్తుంది. క్రమశిక్షణ ఆత్మను పవిత్రముగావించుటకు ఒక ప్రక్రియ, క్రమము లేదా పద్ధతి. “దేవునిపట్ల భయభక్తులు” కలిగియుండటం దేవునితో సంబంధములో వినయము, నమ్మకము, విధేయతను పెంపొందించే పవిత్రాత్మ వరము. ఎప్పుడైతే, ఒక విశ్వాసి పవిత్రతలో ఎత్తునకు ఎదుగుతారో, అప్పుడు భయము క్షీణిస్తుంది. భయము దేవుని ప్రేమతో లేదా నిజమైన ప్రేమతో భర్తీ చేస్తుంది. ఇది శిక్ష గురించి భయపడుటకు కాదు. దేవునిపట్ల గౌరవము కలిగి యుండుట.

తరువాత మోషే “దేవుడు ఏకైక ప్రభువు” (6:4) అని ఆ ప్రభువును “పూర్ణహృదయముతో, పూర్ణమనస్సుతో, పూర్ణశక్తితో ప్రేమింపుడు” (6:5) అని దైవప్రజలకు ఉపదేశించాడు. ఇదే వారు తమనుతాము దేవునికి ప్రతిష్టించుకోవటం, అర్పించుకోవడం, అంకితం చేసుకోవటం, దేవునికొరకు జీవించటం, దేవునితో జీవించడం, దేవునిద్వారా జీవించటం. దేవుని గౌరవించాలి, ఆయనపట్ల భక్తిని కలిగి యుండాలని మోషే బోధించాడు. ‘భక్తి’ అనగా అన్ని వేళలా, అన్ని పరిస్థితులలో దేవుని ఆజ్ఞలను పాటించడం. దీనిద్వారా వారు పొందే ఆశీర్వాదాలు – “కలకాలం బ్రతికిపోవటం” (6:2), “పెద్ద కుటుంబమును కలిగి యుండటం, వాగ్ధత్తభూమిని పొందటం (6:3).

క్రీస్తు ప్రధానయాజకుడు (రెండవ పఠనము)

క్రీస్తు “ఇతర ప్రధాన యాజకుల వంటివాడు కాదు” (7:27). పాత ఒప్పందములో ఎంతోమంది ప్రధాన యాజకులు ఉన్నారు. నూతన ఒప్పందంలో ప్రధానయాజకుడు క్రీస్తు ఒక్కడే. పాత నిబంధనలో ప్రధాన యాజకులు, వారి పాపముల కొరకు, ప్రజల పాపముల కొరకు ప్రతిరోజు బలులను అర్పిస్తూ వేడుకొనెడివారు. క్రీస్తు ప్రధానయాజకుడు “ప్రతి దినము మొదట తన పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకు బలులను అర్పింపవలసిన అవసరము ఆయనకు లేదు. ఒకే బలిగ, శాశ్వతముగా అర్పించుకొనెను (7:27).  ఎందుకన, ఆయనలో ఏపాపము లేకుండెను. మోషే చట్టము బలహీనులగు వ్యక్తులను ప్రధాన యాజకులుగా నియమించెను. కాని దేవుని ప్రమాణ వాక్కు సర్వదా సంపూర్ణుడుగ చేయబడిన దైవపుత్రుని ప్రధానయాజకునిగా నియమించెను (7:28). పాత ఒప్పంద ప్రధాన యాజకులు బలహీనులు, పాపాత్ములు, మృతమానవులు కాని క్రీస్తు ప్రధానయాజకుడు పాపరహితుడు, పవిత్రుడు, దైవకుమారుడు. వారు పాపాత్ములు, బలహీనులు, మృతమానవులు కనుకనే అనేక ప్రధాన యాజకులు ఉండెడివారు. కాని క్రీస్తు ప్రధాన యాజకత్వం మరణముతో ముగియలేదు. అందుకే క్రీస్తు ప్రధానయాజకుడు ఒక్కడే. వాస్తవానికి క్రీస్తు ప్రధాన యాజకత్వం సమర్థత ఆయన ఉత్థానంతో ప్రారంభమైనది. ఇప్పుడు ఆయన అంతర్గత మహాపవిత్రస్థానమున యుండి మన అందరి కొరకు వేడుకొనుచున్నాడు. ఆయన శాశ్వతముగా తండ్రి దేవుని సింహాసనమున యున్నాడు. దేవుని చెంతకు చేరుకోవాలని కోరుకునే వారందరి కొరకు ఆయన తండ్రి చెంత ప్రాధేయపడుతున్నారు. క్రీస్తుద్వారా తప్ప వేరే మార్గం లేదు. మానవ స్వభావంలో ఆయన సంపూర్ణ మానవుడు. దేవుని ఆజ్ఞలను తు.చ. తప్పకుండా పాటించి వాటికి విధేయుడై జీవించాడు. అనంతమైన విలువ కలిగిన ఏకైక బలిని అర్పించి యున్నాడు. తద్వారా ఒకే ఒక బలిగ, శాశ్వతముగా అందరి కొరకు, అన్ని కాలాలకు అర్పించుకోవడం తగినది.

దైవప్రేమ సోదరప్రేమ (సువిశేషపఠనము)

నేటి సువిశేషం, క్రైస్తవ జీవితం, నైతికత సారాంశం. తరుచుగా దీనిని “ప్రేమ చట్టం” అని పిలుస్తూ ఉంటాము. ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు “ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది” అని యేసుని ప్రశ్నించాడు. ఆ కాలములో శిష్యులు బోధకుడుని లేదా గురువుని ప్రశ్నలు అడగటం సాధారణం. ప్రాముఖ్యమైనది ఏదో తెలుసుకొని శాశ్వత జీవమును, దేవుని రాజ్యమును, దేవుని రక్షణను పొందుటకు, వేడుకొనుటకు, నిజాయితీతో కూడిన ప్రశ్నగా మనకి కనిపిస్తుంది. ఎందుకనగా, ఇక్కడ ప్రభువును ఇబ్బంది పెట్టుటకు అడగటం లేదు. “పది ఆజ్ఞలలో ఏది ప్రధానమైన ఆజ్ఞ” అని వారు ఒకరినొకరు తర్కించుకొంటున్నారు. నిజాయితీగా వాస్తవాన్ని తెలుసుకొనుటకు ప్రశ్నించడం జరిగింది. సాధారణంగా ధర్మశాస్త్ర బోధకులు చట్టాన్ని వివరించడంలో నిపుణులు, సమర్ధులు. కనుక ప్రభువు ఉద్దేశము తెలుసుకొనుటకు వారు ప్రశ్నించారు. ప్రశ్న నిజాయితీతో కూడినదని తెలుసుకొని, ప్రభువుకూడా చక్కగా సమాధానమిచ్చియున్నాడు.

దేవున్ని ప్రేమించడం పొరుగువానిని ప్రేమించడం ప్రముఖ శాసనమని ప్రభువు చెప్పియున్నాడు. ఇచ్చట ప్రభువు మొదటి ఆజ్ఞ కొరకు ద్వితీయోపదేశకాండము నుండి ప్రస్తావించాడు (ద్వితీ 6:4-5). “ప్రభువైన దేవుడు ఏకైక ప్రభువు” అని మోషే యూదులకు ఆదేశించాడు. ఒక వ్యక్తి పరిపూర్ణముగా దేవుడిని ప్రేమించాలి దీనికి ప్రభువు రెండవ ఆజ్ఞనుకూడా చేర్చియున్నాడు, “నిన్ను నీవు ప్రేమించుకొనునట్లు, నీ పొరుగు వానిని ప్రేమించుము” (12:31). ఈ రెండవ ఆజ్ఞకూడా కొత్తది యేమీ కాదు. లేవీయకాండములో చెప్పబడినది, “పొరుగువానిమీద పగతీర్చుకొనకుడు. వైరము పెట్టుకొనకుడు. నిన్నువలె నీ పొరుగు వారిని కూడా ప్రేమింపుము” (లేవీ 19:18). అయితే క్రీస్తు బోధించిన కొత్త విషయం ఏమిటంటే, ఈ రెండు ప్రధాన ఆజ్ఞల మధ్యనున్న బంధము. దైవప్రేమ, సోదరప్రేమల మధ్యన సన్నిహిత సంబంధము యున్నది. క్రైస్తవ ప్రేమలో – దేవుడు మరియు పొరుగువారు వేరువేరు కాదు. ఈ రెండు విడదీయలేనటువంటివి (చూడుము మత్త 25:40). ఇది ప్రభువు చెప్పిన కొత్త విషయం. మరొక కొత్త విషయం ప్రభువు నేర్పునది ఏమిటంటే, పొరుగువారు ఎవరు? పొరుగువాడు అనగా ప్రభువు ఒక నూతన అర్ధాన్ని బోధిస్తున్నాడు. లేవీయకాండము సమయములో పొరుగువాడు అనగా కేవలం తోటియూదుడు మాత్రమే కాని ప్రభువు బోధనల ప్రకారం ప్రతి మనిషి కూడా పొరుగువాడే.

ప్రభువు ఇచ్చిన సమాధానమునకు బదులుగా, ఆ ధర్మశాస్త్ర బోధకుడు ప్రభువు బోధనను అంగీకరించాడు. “బోధకుడా నీవు యదార్థము చెప్పితివి” (12:32) అని అన్నాడు, “దేవుడు ఒక్కడేనని, దేవుని, పొరుగువారిని ప్రేమించుట సమస్త హోమముల కంటే, సమస్త బలుల కంటే ఘనమైనది” (12:33) అని ఉద్ఘాటించాడు. బలులకన్న, బాహ్యమైన కార్యములకన్న ప్రేమ గొప్పది. అంతర్గతముగా నిజమైన ప్రేమ యున్నప్పుడే బాహ్యముగా మనము చేయు ప్రార్థనలు, పనులకు నిజమైన విలువ, అర్థం చేకూరుతుంది.

అందుకే ప్రభువు ఆ ధర్మశాస్త్ర బోధకునితో, “దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు” (12:34) అని అన్నాడు. దేవుని రాజ్యమునకు దగ్గరగా ఉండటం వేరు. దేవుని రాజ్యములో ఉండటం వేరు. దేవుని రాజ్యంలో ఉండటానికే, కలువరి సిలువపై తననుతాను ఒక బలిగ, శాశ్వతముగా అర్పించి యున్నాడు (హెబ్రీ 7:27). చట్టమును గూర్చిన జ్ఞానము ఉంటె సరిపోదు, ప్రేమను అర్ధంచేసుకోవడం, ప్రేమగా జీవించడం నిజమైన శిష్యరికం అని యేసు తెలియజేయు చున్నాడు.

నిజమైన ప్రేమ తన్నుతాను బహుమానముగా ఇతరులకు అర్పించడం. ఆ ఇతరులే దేవుడు మరియు పొరుగువారు. ఈవిధముగా, సమస్త దేవుని ఆజ్ఞలకు ప్రేమ పునాదియని అర్ధమగుచున్నది. నిజమైన విశ్వాసాన్ని ప్రేమద్వారా వ్యక్తపరచాలి. మన అత:ర్గత భక్తిని బాహ్య క్రియలతో వ్యక్తపరచాలి.

“దైవరాజ్యము”ను రెండు విధాలుగా అర్ధంచేసుకోవచ్చు, ఒకటి వర్తమానములో దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించడం, రెండు భవిష్యత్తులో దేవునితో సహవాస బంధము కొరకు నిరీక్షణ కలిగి యుండటము.

మనం నేర్చుకోవలసిన పాఠాలు (ముగింపు)

1. క్రైస్తవ జీవన విధానానికి పునాది దైవప్రేమ, సోదర ప్రేమ. “దీనిని మించిన ఆజ్ఞ మరియొకటి లేదు” అని ప్రభువే స్వయముగా చెప్పియున్నాడు. ఇతర ఆజ్ఞలు అన్నికూడా ఈ రెండు ఆజ్ఞలలో ఇమిడియున్నవి. పొరుగువారికి ఎలాంటి హాని, కీడు చేయకూడదు. ఎందుకన ప్రతిఒక్కరు దేవునికి సంబంధించినవారే. ప్రతిఒక్కరికి జీవమునిచ్చిన దేవుడు ఒక్కడే. అదే దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించాలని గౌరవించాలని ఆజ్ఞాపించాడు. ఇతరులకు హానిచేయడం దేవుని హక్కులను జోక్యం చేసుకోవడమే, ఆయన ఆజ్ఞను అవిధేయించడమే! శాశ్వతమైన పరిపూర్ణమైన దేవున్ని మనం ప్రేమించాలి. వాస్తవానికి మనం మన పొరుగు వారిని ప్రేమించినప్పుడు దేవుడిని కూడా ప్రేమిస్తున్నాము. ఎందుకన దేవుని స్వరూపం ఇతరులలో నున్నది. దేవుడు అందరినీ తన పోలికలో, తన రూపములో సృజించి యున్నాడు (ఆది 1:27). దేవుడు మనకు జీవమును, జీవితమును, సమస్తమును ఇచ్చియున్నాడు. ఆయన మనలను మిక్కిలిగా ప్రేమిస్తున్నాడు. మనము ఆయనకు ఎంతగానో ఋణపడి యున్నాము. కనుక మనం ఆయనను ప్రేమించాలి, ఆయన నామమును గౌరవించాలి, ఆయన సాన్నిధ్యమును గౌరవించాలి.

ప్రేమించడం అనగా ఒక భావోద్వేగంమో, ఒక మొక్కుబడి ఆచారమో కాదు, మన జీవితములో ప్రతీ విషయములో మార్గనిర్దేశకం చేసే ఒక నిబద్ధత. నిజమైన పవిత్రత కేవలం ఆరాధనలలోనే కాదు, దేవునిపట్ల, పొరుగువారిపట్ల ప్రేమతో జీవించడం, తద్వారా దేవుని రాజ్యాన్ని ఆదరికీ చేరువ చేయడం!

2. దేవునితో మన ఆధ్యాత్మిక అనుబంధం ఈ రెండు ఆజ్ఞలద్వారా సాధ్యమవుతుంది. ఎవరైతే ప్రేమించరో, వారు శూన్యం, ఏమీ లేనివారు. ప్రార్థన చేయుచు పొరుగు వారిని ప్రేమించనిచో నిజమైన ప్రేమ వారిలో లేనట్లే! దేవుడు వారిలో వాసం చేయలేడు. దేవుడు ప్రేమస్వరూపుడు. కనుక ప్రేమించువాడు దేవునిలో వాసము చేయును. అట్టివారు పొరుగువారిపట్ల శ్రద్ద వహించగలరు, ప్రేమించగలరు. ఈ రెండు ఆజ్ఞలను పాటించడంద్వారా మనం దైవరాజ్యంలో చేరగలం.

3. క్రీస్తు ప్రేమ మనకు ఆదర్శం. ఆయన ప్రేమ దైవీకమైనది, శాశ్వతమైనది. పొరుగువారి ప్రేమను మనకు నేర్పించి యున్నాడు. ఆయన శత్రువులను సైతం ప్రేమించి యున్నాడు. సిలువ నుండి తన శత్రువుల కొరకు క్షమాప్రార్థన చేసి యున్నాడు.

4. ఈరోజు ప్రేమ అనే పదం తప్పుగా అర్థం చేసుకోబడుచున్నది. తప్పుగా ఉపయోగించబడుతున్నది. నిజమైన ప్రేమ సంపూర్ణ అర్పణం, త్యాగం. ఇతరులకు మన సమయాన్ని ఇవ్వటం. సహాయం చేయటం. తోడుగా యుండటం. ప్రేమ అనగా సంపూర్ణముగా ఇవ్వటం. ఇతరులచే మనం ప్రేమింపబడాలి. ప్రేమించబడినప్పుడే మనం ఇతరులను ప్రేమించగలము.

5. కుటుంబ సభ్యులను ప్రేమించుదాం. వారికి మన సమయాన్ని కేటాయించుదాం. పనిచేయు స్థలములలో ఇతరులతో ప్రేమగా యుందాం. అందరిని సమానంగా చూద్దాం.

No comments:

Post a Comment