32 వ సామాన్య ఆదివారము, Year B
రాజులు మొదటి గ్రంథము 17:10-16; హెబ్రీ. 9:24-28; మార్కు. 12:38-44
ఉదారత్వం దేవుని ఆశీర్వాదం
క్రీస్తు ప్రభువు నందు ప్రియమైన సహోదరీ సహోదరులారా! మనమందరము కూడా ప్రభువు నుండి ఎన్నో దీవెనలను, ఆశీర్వాదములను, కృపావరములను పొందియున్నాము. వీటన్నిటిని కూడా ప్రభువు మనకు ఉచితంగా ఇచ్చి ఉన్నాడు. ఒక్కొక్కరము వ్యక్తిగతంగా ప్రత్యేకమైనటువంటి వరములను పొందియున్నాము. అయితే ఇవన్నీ కూడా దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన దానములు. ఏవిధంగానైతే మనము ఉచితంగా పొంది ఉన్నామో వాటిని ఇతరులకు ఉచితంగా ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇతరులకు దానము చేయాలి అంటే మనలో ఇతరుల పట్ల కనికరము, శ్రద్ధ తప్పనిసరిగా ఉండాలి.
ఈనాటి పఠనాల ద్వారా, ఉదారత్వం కలవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అనే గొప్ప విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాయి. ఉదారత్వం లేని సంపద విలువ లేనిది. మన సంపద ఇతరులతో పంచుకున్నప్పుడు, అది దేవుని వరంగా మారుతుంది. ఈనాటి పరిశుద్ధగ్రంధ పఠనాలలో సారెఫతు లోని అన్యురాలు, నిరుపేద అయిన విధవరాలు యావే ప్రభువు నందు విశ్వాసంతో తనకు ఉన్నదంతా దేవుని మనిషి ఏలియాకు దానము చేయ సిద్ధపడగా ఆమె ఘోరమైన క్షామము నుండి కాపాడబడిన ఉదంతాన్ని నేటి మొదటి పఠనం వర్ణిస్తుంది. మరో పేద విధవరాలు దేవునియందు ప్రేమ విశ్వాసంతో తనకున్న మొత్తాన్ని సమర్పించి యేసుక్రీస్తు మెప్పుకు అర్హురాలు అయింది అని నేటి సువార్త పఠనం వర్ణిస్తుంది.
ఈనాటి మొదటి పఠనంలోనికి చవిచూస్తే, క్రీస్తుపూర్వం 9వ శతాబ్దంలో అహబు ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా పరిపాలన చేసేవాడు. అతని భార్య జేజెబెలు ఎంతో క్రూరురాలు. యావే ప్రభువును కాక బాలు దేవుళ్ళను, దేవతలను కొలిచేది. అతని భార్య ప్రభావం బాలు దేవుని ఆరాధన ఇజ్రాయేలు దేశంలో ప్రబలిపోయింది. అప్పుడు యావే ప్రభువు ప్రజలను చిల్లర దేవుళ్ల నుండి తన వైపుకు మరల్చడానికి ఏలియా ప్రవక్తను పంపియున్నాడు. ఏలియా ప్రవక్త దేశంలో రాబోయే మూడు సంవత్సరములు వర్షాలు, పంటలు ఉండవని దైవ శిక్షను ప్రకటించాడు. ప్రవక్త ప్రవచనం అక్షరాలా నెరవేరింది. దేవుని యొక్క వాగ్దానం ప్రకారం ఏలియా ప్రవక్త కటిక పేదరాలు అయిన సారెఫతులోని విధవరాలు వద్దకు వెళ్లి ఉన్నాడు. ఆమె తాను తన కుమారునికి జీవితంలో చివరి భోజనం వండుకొని తిని ఆ తర్వాత చనిపోవడానికి సిద్ధపడి దానికి కావలసిన వస్తువులను సమకూర్చుకుంటున్న సమయంలో ఏలియా ప్రవక్త ఆమెతో సంభాషించి ఆమెను కొంచెం నీరు ఆహారం తీసుకురా అని అడిగి ఉన్నాడు. కరువులో అధికమాసం అన్నట్లు ఆమెకు లేక చస్తుంటే ఇక ఏలియాను పోషించుట ఎలా? ఎంత కష్ట స్థితిలో ఉన్నప్పటికిని దేవునిపై పూర్తి నమ్మకం, భారం ఉంచిన ఆమె ఏలియాకు ఆతిథ్యమిచ్చి తనకున్న సర్వస్వాన్ని అనగా ఉన్న కొద్ది పిండినీ, రొట్టెను త్యాగం చేయడానికి, ఇవ్వడానికి సిద్ధపడింది. ఆమె త్యాగశీలతకు భగవంతుడు మెచ్చుకొని ఆమెను ఆశీర్వదించాడు. ఆమెను ఆమె కుమారున్ని మరణము నుండి కాపాడి ఉన్నాడు. ఇతరుల అవసరాలకు తక్షణం స్పందించడమే అసలైన సిసలైన ఉదారత్వం.
ఈనాటి సువిషేశములో కానుకల, అర్పణల విషయంలో ఒక విధవరాలు కూడా అట్లే సంపూర్ణ త్యాగం చేసి ఉన్నది. యేరుషలేము దేవాలయంలో స్త్రీలకు ప్రత్యేక స్థలము ఉండేది. ఆ సమీపంలోనే ప్రజల కానుకలకై 13 పెట్టెలు ఉండెడివి. దేవాలయంలో జరిగే ఆరాధన, బలుల ఖర్చులకు ఆ కానుకలను వాడెడివారు. ప్రజలు తమ యొక్క ఉద్దేశాలను, అవసరాలను, విన్నపాలను, ప్రార్థన రూపంలోనే కాక, కానుకల రూపంలోను అర్ధించేవారు.ఇదంతా బహిరంగంగా దేవాలయంలో జరుగుతుంది. ఎవరు ఎక్కువగా కానుకలు సమర్పిస్తే వారు గొప్పవారు అనే ఆలోచన ప్రజలలో ఉండేది. నాణెములను పెట్టెలో వేసినప్పుడు శబ్దం వినిపించేది. దీనిని బట్టి ఎవరు ఎక్కువగా కానుకలు సమర్పిస్తున్నారో ప్రజలకు తెలిసిపోయేది. ఈ కానుకల విషయంలో ఎంతో మంది ధనికులు తమకున్న సంపదలో నుండి దేవునికి సమర్పించటం దేవునికి సహజంగా కనిపిస్తుంది. కాని ఒక పేద విధవరాలు రెండు నాణెములు మాత్రమే అనగా తనకున్న దంతయు దానం చేయడం ప్రభువు గమనించి ఆమెను ఎంతగానో అభినందించాడు.
సందేశం
1. మన విచారణలోనున్న విధవరాలులను గౌరవించుదాము. వారు అనుభవించే ఆర్థిక ఇబ్బందులలో తోడుగా ఉందాము. వారి కుటుంబాలను ఒంటరిగా నడిపించే వారి ధైర్యాన్ని మెచ్చుకొందాము. విచారణకు వారు చేసే సేవలను గుర్తించి, అభినందించి, ప్రోత్సహించుదాము.
2. ఇతరులను క్రీస్తు వలె అర్థం చేసుకుందాం. ఇతరులను వారికున్న ఆస్తి పాస్తులను, అధికారమును, మాటను చూసి గౌరవిస్తాం. మిగతా వారిని తక్కువ చేసి చూస్తూ ఉంటాం. కాని క్రీస్తు హృదయంతరాన్ని చూస్తాడు. ఇతరుల మెప్పు కోసం చేసే దాన ధర్మాలు దేవుని దృష్టిలో అంగీకార యోగ్యం కావు. ఏమీ చేసిన మనస్ఫూర్తిగా చేస్తేనే దేవునికి అంగీకార యోగ్య మగును.
3. మన జీవిత సర్వాన్ని ఇవ్వగలగాలి. మనం ఏమి చేసినా హృదయ పూర్వకంగా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. ఈనాటి పఠనాలలోని విధవరాలులవలె, మన సర్వాన్ని దేవునికి, ఇతరులకు ఇవ్వగలగాలి. అప్పుడు మనం కూడా వారివలె దేవుని ఆశీర్వాదములు, దీవెనలు పొందుతాము. మనకున్న సమయాన్ని, టాలెంట్స్ ను ఇతరులతో పంచుకోగలగాలి. ఆకలితో అలమటిస్తున్న ఏలీయాకు విధవరాలు భోజనం పెట్టిన విధముగా, మన చుట్టూ ఆకలి దప్పులతో ఉన్నవారిని ఆదరించుదాం.
4. పొందడంలో కన్న ఇవ్వడంలో చాలా ఆనందం ఉంటుంది. సంతోషముతో దానమొనర్చు వానిని దేవుడు ప్రేమిస్తాడు (2 కొరి. 9:7). యేసు మనకు మార్గదర్శి. ఆయన తనను తాను సర్వాన్ని మనకు ఇచ్చాడు. దేవుడై యుండి మానవుడై తన జీవితాన్ని త్యాగం చేశాడు. “మనకు జీవమును ఇచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు తన జీవితమును మనకు ఇచ్చి యున్నాడు (యోహాను. 10:10). ఇతరులకు ఇచ్చినప్పుడు మన సంపదలను పరలోకములో కూడ బెట్టుకొంటున్న వారము అవుతాము (మత్త. 6:20). ఇతరులకు ఇవ్వాలంటే మనలో గర్వం, అసూయ ఉండ కూడదు.
5. మన సంపదలపై గాక దేవునిపై ఆధారపడి జీవించుదాము. క్రీస్తు ప్రభువును నమ్ముకుందాము. పఠనాలలోని విధవరాలులవలే దేవుని విశ్వసిస్తూ మనకున్న దానిని ఇతరులతో పంచుకుందాము.
No comments:
Post a Comment