33 వ సామాన్య ఆదివారము, Year B

33 వ సామాన్య ఆదివారము, Year B
దాని. 12:1-3; హెబ్రీ. 20:11-14, 18; మార్కు. 13:24-32

ఉపోద్ఘాతము

దైవార్చన సంవత్సరము చివరి రెండవ వారము లోనికి ప్రవేశించి ఉన్నాము. మరికొన్ని రోజులలో నూతన దైవార్చన సంవత్సరాన్ని ఆరంభిస్తాము. ప్రతి  దైవార్చన సంవత్సరము క్రీస్తు రాజు మహోత్సవముతో ముగుస్తుంది. ఈ మహోత్సవాన్ని వచ్చే ఆదివారం అనగా దైవార్చన సంవత్సర చివరి ఆదివారంనాడు కొనియాడ బోవుచున్నాము. ఈ సమయంలో శ్రీసభ అంతిమ దినాల (తుది తీర్పు, లోకాంత్యము) గురించి ధ్యానించమని మనలను కోరుతున్నది. అందుకే ఈనాటి పఠనములు, అంతిమ దినము గురించి బోధిస్తున్నాయి. యేసుక్రీస్తు ఆల్ఫా-ఒమేగా, ఆదియు-అంతము ఆయనేనని, సమస్తము ఆయన ద్వారానే ఉండునని, సర్వానికి మూలం ఆయనయేనని సందేశాన్ని ఇస్తున్నాయి.

అంతిమ దినము అనగా ఏమి?

బైబిలు ప్రకారము, క్రైస్తవ వేదాంతం ప్రకారం, అంతిమ దినాలు అనగా లోకము అంతం కావడం కాదు... అంతిమ దినము అనగా ‘క్రీస్తు నాయకత్వమున దివి యందలి, భువి యందలి సర్వ సృష్టిని ఒకటిగా చేయుట’. దానిని ఆయన పరిపూర్ణమైన సమయమున నెరవేర్చును (ఎఫెసీ. 1:10). అంతిమ దినము అనగా ‘క్రీస్తు రెండవ రాకడ’ లేక ‘ప్రభువు పునరాగమనము’ అని కూడా అర్థం. దీని సంపూర్ణ అర్థము “సర్వము విరాజిల్లుట” (1 కొరి. 15:28). సమస్తమును క్రీస్తు పాలనలో, రాజ్యంలో పాలుపంచుకొనును. ఇదే విషయాన్ని మనం పరలోక ప్రార్థనలో జపిస్తున్నాము: “నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము నెరవేరునుగాక” (మత్త. 6:10).

అంతిమ దినము అనగా ‘దైవ దర్శనము’. దేవుడు తన మహిమలో ప్రదర్శింపబడును. ఆయనను మనము ముఖాముఖిగా గాంచెదము. మన క్రైస్తవ ప్రయాణము ప్రభువును కలుసుకోవడమే!

మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసినట్లయితే, ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు. అంతట అవినీతి, టెర్రరిజం, పేదరికం. ఇలాంటి స్థితిలోనున్న మనకు ప్రభువు మాటలు నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. దేవుని రాజ్యము, ప్రేమను కరుణను దయను మన ఆశకు నమ్మకానికి గుర్తుగా ఇస్తుంది. అనగా శ్రమలు, కష్టాలు, బాధల మధ్య కూడా దేవుని వాక్యం సజీవముగా, చురుకుగా ఉన్నది. మనము క్రీస్తులో దైవరాజ్య స్థాపన పరిపూర్ణ మగుట కొరకు అనగా నీతి, న్యాయం, ప్రేమ, శాంతి గల రాజ్యము / సమాజము కొరకు ఎదురుచూస్తున్నాము.

మొదటి పఠనములో దానియేలు దర్శనాన్ని గాంచు తున్నాము. దేవుని విశ్వాసులు “సజీవులగుదురని” “నిత్యజీవము బడయుదురని” (12:2) చూస్తున్నాము. రెండవ పఠనములో క్రీస్తు అర్పించిన ఒకే ఒక బలి సర్వ పాపములను పరిహారార్థం చేసిందని, మనలను తన తండ్రికి అంకితం చేసి శాశ్వతంగా పరిపూర్ణులుగా చేసి ఉన్నాడని గుర్తు చేస్తుంది (10:12-14). సువిశేష పఠనము, అంతిమ దినములలో జరగబోవు మహోపద్రవములను గూర్చి తెలియజేస్తుంది. అయితే వీటిని గురించి మనం భయపడకుండా జాగరూకులై ఉండాలని ప్రభువు బోధిస్తున్నారు.

నిరీక్షణ - నిత్య జీవితం

దేవుడు వాగ్దానం చేసిన నిత్యజీవములో పాలుపంచుకోవడం మన నిరీక్షణ. దివ్య సంస్కారముల ద్వారా మనము ఇప్పటికే నిత్య జీవితపు ఆనందంలో భాగస్తులమై ఉన్నాము. అయితే ఇంకా దీనిని పరిపూర్ణముగా సాధించవలసి ఉన్నది. నిత్య జీవము యొక్క రుచిని పొందియున్నాము, కాని ఇంకా దానిని పరిపూర్ణముగా పొందవలసి ఉన్నది. ఈ లోకమున విశ్వాసములో ప్రభుని కలుసుకోవడం, ఈ లోక జీవితం ముగిసిన తర్వాత దేవునిలో ఐక్యం అవ్వడం మన నిరీక్షణ.  ఇప్పటికే (already) ఇంకా కాదు (not yet) అనే రెండింటి మధ్య జీవిస్తున్నాము. అనగా, మనం ప్రభునిలో ఇప్పటికే ఉన్నాము కాని ఇంకా అంతిమ మహిమను చూడలేదు. ఈ సందర్భములో మనకున్న ఒకే ఒక రక్షణమూలం, పరిష్కారం: నిరీక్షణ. నిరీక్షణ లేనిచో మనం ఇప్పటికే మరణించిన వారము. నిరీక్షణ జీవితాన్ని నిలబెడుతుంది (ఎఫీ 2:12). మన నిరీక్షణ దేవుని యందు ఉండవలయును. దేవుడు మనలను ప్రేమించాడు; “చివరి వరకు” (యో 13:1), అంతయు “సమాప్తమగు” (యో 19:30) వరకు మనలను ప్రేమిస్తూనే ఉంటాడు.

జ్ఞానస్నాన సాంగ్యములో కూడా “తిరుసభ నుండి ఏమి కోరుచున్నారు” అని ప్రశ్నించినప్పుడు విశ్వాసము, యేసుక్రీస్తు వరము, తిరు సభలో ప్రవేశము, నిత్య జీవము అని సమాధానం ఇస్తాము. “నేను జీవము నిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చియున్నాను (యోహాను. 10:10) అని ప్రభువు చెప్పియున్నాడు. నిత్యజీవము అనగా “ఏకైక సత్య దేవుడవు నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలుసుకొనుటయే నిత్య జీవము” (యోహాను. 17:3). జీవితం అనగా సంబంధం. జీవమునిచ్చు దేవునితో సంబంధము కలిగి ఉండటం; ఆయనతో సంబంధం కలిగి ఉంటే మనము జీవములో ఉన్నట్లె! మనం జీవిస్తున్నట్లే!

నిరీక్షణ అనగా మన బాధ్యతలను పక్కనపెట్టి దేవుని జోక్యం కొరకు ఎదురు చూడటం కాదు. నిరీక్షణ అనగా జాగరూకతతో, నిరంతర ఆత్మ పరిశీలనతో దుష్ట శక్తుల నుండి మన జీవితాన్ని రక్షించుకుంటూ, అర్థవంతమైన జీవితాన్ని జీవించడం.

మొదటి పఠనములో ఓ గొప్ప నిరీక్షణను చూస్తున్నాము. “అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలామంది సజీవులగుదురు” (12:2). మట్టిలో నిద్రించు వారు అనగా జీవము లేని వారు. ఈ వాక్యమును మనము రెండు రకాలుగా వర్ణించవచ్చు:

మొదటిగా, ఈనాడు మనిషి అనేక సందర్భాలలో నిరాశకులోనై జీవిస్తున్నాడు; జీవిత ఘర్షణలలో దిక్కుతోచక గందరగోళానికి గురియై జీవిస్తున్నాడు; స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా జీవించలేక పోతున్నాడు; బలవంతంగా, భారంగా జీవిస్తున్నాడు; కుటుంబ భారం, సామాజిక - ఆర్థిక - రాజకీయ ఒత్తిడులు, ఆధ్యాత్మిక అస్థిరతల మధ్య నలిగి పోవుచున్నాడు. ఏది సరైన మార్గమో తెలుసుకోలేకపోతున్నాడు. క్రైస్తవ జీవితంలో కూడా ఇదే పరిస్థితి! క్రీస్తు సత్యము, జీవము, మార్గము అని ఎరిగి ఉన్నాము, కాని మన రోజువారీ అవసరతలకు ప్రాధాన్యం ఇస్తూ విశ్వాస జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. అనవసరమైన వాటికై ఆరాటపడుతున్నాము. ఇదే మట్టిలో నిద్రించడం అంటే! ఇదే జీవము లేనివారిగా ఉండడం అంటే! ఇదే నిజమైన జీవితాన్ని కోల్పోవడమంటే! అయినప్పటికిని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు: “చాలామంది సజీవులగుదురు”. అనగా నిత్య జీవితాన్ని కలిగి ఉండటం; అయితే, ఇది ఎప్పుడు సాధ్యం? మారుమనస్సు పొంది, దేవునివైపుకు మరలినప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఈ నిత్య జీవితం ఇప్పుడు ఇక్కడే (here and now) ఇవ్వబడును.

రెండవదిగా, ఈ నిత్య జీవితం లోకాంతమున ఇవ్వబడును. దేవుని వాగ్దానం కలకాలం ఉండును. ఆయన వాక్యము కలకాలము ఉండును. మట్టిలో నిద్రించుచున్న వారు సజీవులగుదురు; అనగా రాబోవు కాలంలో (eschatological) జరుగునది. అనగా చనిపోయిన వారందరూ లోకాంత్యమున, తుది తీర్పున సజీవులగుదురు. దేవుని యొక్క మహిమను అందరూ గాంచెదరు. విశ్వాసముగా, ప్రేమగా ప్రభువు కొరకు జీవించిన వారందరు, ఆయన మహిమను గాంచెదరు. ఆయనను, ఆయన వాక్కును నిరాకరించి జీవించువారు శాశ్వతమైన అంధకారము లోనికి త్రోసివేయబడుదురు.

లోకాంత్యము తప్పక వచ్చును

ఆరోజు, ఆ గడియ ఎప్పుడు వచ్చునో ఎవరికీ తెలియదు, కాని ప్రభువు పునరాగమనము తప్పక సంభవించును. ఈనాటి సువిశేషములో ప్రభువే స్వయంగా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేయుచున్నారు. ప్రభువు పునరాగమనము వలన మనము భయపడనవసరం లేదు. మొదటి పఠనములో గాని, సువిశేష పఠనములో గాని వాడబడిన “అప్పుడు విపత్తు కాలము ప్రాప్తించును”, “మహా విపత్తు”, “తుదితీర్పు”, మొదలగునవి అలౌకిక భాషలో  (apocalyptic language) వాడబడినవి. కొంతమంది వీటిని గూర్చి ప్రజలను భయపెడుతూ ఉంటారు. అవి మన మనస్సాక్షిని వైఖరిని మేల్కొలుపుతూ ఉంటాయి. దేవుని దయ పట్ల ఆశ్రయము కలిగి ఉండునట్లు అవి తోడ్పడును. కనుక మనము భయపడనవసరం లేదు. ప్రభువు చెప్పినట్లుగా మనం “జాగరూకులై” ఉండవలయును.

జాగరూకత, ఆత్మ పరిశీలన

దేవునిని మన జీవిత ఆధారంగా, మన జీవిత గమ్యంగా చూడాలి. ఆత్మ పరిశీలన, దేవుని ఇష్ట ప్రకారము జీవించునట్లుగా చేయును. గతించిపోవు నది - కలకాలము ఉండునది ఏదో, తాత్కాలికమైనది - శాశ్వతమైనది ఏదో, ప్రమాద వశాత్తు జరుగునది - నిర్ణయాత్మకంగా జరుగునది ఏదో తెలియునట్లు చేయును. ఈనాటి విశేషములో విన్నట్లుగా ‘సమస్తమును గతించిపోవును, కాని దేవుని వాక్యము శాశ్వతముగా ఉండును’.

మనం వేసే ప్రతి అడుగులో జాగ్రత్తగా, శ్రద్ధగా ఉండాలి. జాగరూకత, మన గమ్యాన్ని జాగ్రత్తగా చేర్చునట్లు చేయును. మన మార్గాన్ని ప్రకాశవంతముచేసి దేవుని భాంధవ్యంలోనికి మనలను నడిపించును. జాగరూకత అనగా ‘మేలుకొని ఉండుట’. మనం మాట్లాడే ప్రతి మాటకి, చేసే ప్రతి పనికి మనం బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తు చేస్తుంది. ఈ విధముగా నిరీక్షణ, వాగ్ధానము చేయబడిన నిత్యజీవము కొరకు జీవించునట్లు చేయను.

ఆత్మ పరిశీలన చేసుకుందాం! మన ప్రయాణం దేవుని వైపు ఎంతవరకు వెళ్ళుచున్నది? మన ఆధ్యాత్మిక జీవితంలో ఎంతవరకు మనము ఎదుగుతూ ఉన్నాము? మన జీవితాలను సరిచేసుకొందాం. పునరాగమనం అయ్యే ప్రభువును ఆలింగనము చేసుకొనుటకు సిద్ధపడుదాం.

1 comment:

  1. Thank You Very Much Father for Meaningful Homily 🙏🙏🙏

    ReplyDelete