దళిత విమోచన ఆదివారం ఆరాధన
11 నవంబరు 2018
2017 నుండి నవంబరు రెండవ ఆదివారం దళిత విమోచన ఆదివారంగా కొనియాడాలని నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భముగా రేపటి ఆదివారమునకు ప్రత్యేకమైన ధ్యానాంశమును మోస్ట్. రెవ. శరత్ చంద్ర నాయక్ పీఠాధిపతులు అందించిన ధ్యానాంశమును మీతో పంచుకొనుటకు సంతోషిస్తున్నాను. ఎంతోకొంత మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
దళిత విమోచన ఆదివారం ఆరాధన
11 నవంబరు 2018
ఒడిషా రాష్ట్రంలోని కందమాల్ లో జరిగిన విశ్వాస పరీక్ష సాక్ష్యము - 10 వ వార్షికోత్సవం
అతి పూజ్య అగ్ర పీఠాధిపతులు, పీఠాధిపతులు, గురువులు, కన్యాస్త్రీలు, దైవ ప్రజలారా!
ప్రభువు పేర మీ అందరికీ శాంతి, సంతోషముల శుభ వందనములు
భారతదేశ కతోలిక పీఠముల సమాఖ్య, మన నుండి విడిపోయిన సోదర క్రైస్తవ శాఖల జాతీయ సమాఖ్యతో కలసి దళిత విమోచన ఆదివారమును కొనియాడుచున్నాము. భారత జాతీయ కతోలిక పీఠాధిపతుల సమాఖ్య వారి నిర్ణయం ప్రకారం 2017 నుండి నవంబరు రెండవ ఆదివారం దళిత విమోచన ఆదివారంగా కొనియాడాలని నిర్ణయించాము. ఈ సంవత్సరము ఒరిస్సా రాష్ట్రంలోని కంధమాల్ క్రైస్తవులకు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక సంఘటన దశమ వార్షికోత్సవమును పురస్కరించుకొని ఈ సంవత్సరం దళిత విమోచన ఆదివారమునకు “నేను నా కుటుంబం మాత్రము యావేను ఆరాధింతుము” అనెడి ప్రత్యేక ఉద్దేశ్యమును ఎన్నిక చేశాము.
దళిత విమోచన ఆదివారపు ఆరాధన క్రైస్తవ సమాజమునకు ఇవ్వబడుచున్న గొప్ప పిలుపు. మన విశ్వాసమును నూతన పరచుకొనుటకు మన మనస్సులను మేల్కొల్పుటకును, సమాజంలో పీడింపబడుచున్నప్పటికిని నోరెత్తి వారికి జరిగే అన్యాయాలు సమాజానికి తెలియచేయలేని దళితుల పక్షాన నిలబడుటకు ఇవ్వబడుచున్న పిలుపు దళిత విమోచన ఆదివారం. సోదర భావంతో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సమైక్యతతో దైవ ప్రేమను పంచెడి సమయం. మన రాజ్యాంగము మనకిష్టమైన మతమును విశ్వసించుటకు, పాటించుటకు, ప్రచారం చేయుటకు, ప్రతి ఒక్కరికి హక్కును కల్పించినది. కాని వాస్తవముగా దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరించినచొ రాజ్యాంగము కల్పించిన దళిత హక్కులను వారికి ప్రభుత్వము నిరాకరించుచున్నది. ఈ విధముగా దళితులకు మత స్వేచ్ఛ లభించకుండా ప్రభుత్వాలు అడ్డుపడుచున్నవి.
10 సంవత్సరాల క్రితం ఒరిస్సాలోని కందమాల్ లో క్రైస్తవుల యెడల జరిగిన మారణకాండలో క్రైస్తవులు ప్రదర్శించిన విశ్వాసము అత్యంత ఆదర్శమైనది. వారు విశ్వాసము కొరకు తమ ప్రాణాలర్పించారు. ఆస్తులను, ఇండ్లను, జీవనాధారములను, సమస్తమును కోల్పోయారు. విశ్వాసమును నిలుపుకొనుటకు రక్తార్పణ గావించారు. ఇదే సమయంలో 7 గురు అమాయకులు గత 10 సం,,ల నుండి జైల్లోనే గడుపుచు న్యాయం కొరకు ఎదురుచూస్తున్నారు. వారి కొరకు మనందరము ప్రార్ధించుదము.
మన దళిత సోదరులు ఆర్థికంగా పేదవారే కాకుండా రాజకీయ అధికారాలు లేకుండా సామాజికంగా అంటరాని వారుగా జీవిస్తున్నారు. మానవమాత్రులు కల్పించిన కుల వ్యవస్థ సామాజిక రుగ్మతగా మన అందరిని విడదీస్తూ తరతరాల నుండి ప్రజలను వేరు చేస్తూ మన మధ్య నెలకొని ఉన్న దేవుని గుర్తించలేని, ఆయన ప్రేమను అనుభవించలేని స్థితిని కల్పించుచున్నది. దేవుని బిడ్డలుగా జీవించుటకు క్రీస్తు వలే మనము కొనసాగుటకు దేవుడు మనలను సృజించాడు కాని దేవుని దివ్య దేహంలో భాగస్తులమైన మనము కుల వ్యవస్థ వలన పరస్పరము ఒకరికొకరు తెలియని వారముగా వేరుచేయబడి జీవించుచున్నాము. దళిత క్రైస్తవులు ఇటు క్రైస్తవ సంఘములోను, బయట సమాజంలోను, ప్రభుత్వ పరంగాను తీవ్రమైన వివక్షకు గురియగుచున్నారు.
భారత జాతీయ పీఠాధిపతుల సమాఖ్య శ్రీ సభలో కొనసాగుతున్న కులవివక్షను తొలగించుటకు తమ ప్రయత్నాలను కొనసాగించుచున్నారు. ఈ సందర్భమున దళిత క్రైస్తవుల సాధికారత కొరకు భారత జాతీయ కతోలిక పీఠాధిపతుల సమాఖ్య వారు అధికారపూర్వక విధానం పత్రమును 2016 డిసెంబరులో విడుదల చేశారు. “కులపరమైన వివక్ష తీవ్రమైన సామాజిక పాపమని” ప్రకటించారు.
దళిత విమోచన ఆదివారము దళిత సోదరులలో ఆశను సాధికారతను ఉన్నతమైన ఆలోచనలను ప్రేరేపించుటకు సదవకాశము ఏలియా ప్రవక్త ఆకలితో అలమటించు విధవరాలి వద్దకు పంపబడినట్లు తన లేమిలో నుండి ఉదారముగా దానము చేసిన విధవరాలిని ప్రభువు ప్రశంసించినట్లు, దేవుడు పేదల అణగారిన ప్రజల పక్షాన ఉంటాడన్న నిరీక్షణ మనకు కలుగుచున్నది. శాంతియుతమైన, సమైక్యత కలిగిన సమాజమును నిర్మించుటలో ప్రేమతో పరస్పర సహకారంతో జీవించుటలో మనందరము ముందడుగు వేద్దాం.
దళిత క్రైస్తవులకు దళిత హోదా కల్పించాలన్న న్యాయమైన హక్కుల కొరకు భారత జాతీయ పీఠాధిపతుల సమాఖ్య వారు సుప్రీంకోర్టులో వేసిన కేసు విషయంలో ఇప్పటికీ ఏవిధమైన పురోగతి లేదు. రాజ్యాంగంలోని 1950, 3 వ పేరాలోని అధికరణను సవరించి దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు దళిత హోదా కల్పించాలన్న న్యాయమైన పోరాటం సంవత్సరముల తరబడి కొనసాగుచున్నా పరిష్కారం కొరకు ఇంకను మనం ఎదురు చూస్తున్నాం. దళిత క్రైస్తవుల మతస్వేచ్ఛకు ప్రభుత్వము ఆటంకములను తొలగించుటలేదు.
మన న్యాయసమ్మతమైన డిమాండును సాధించుటలో మనము విజయం సాధిస్తామనే ఆశతో ఎదురు చూస్తున్నాము. 2019 లో జరుగనున్న లోకసభ ఎన్నికల ప్రణాళికలలో మన న్యాయమైన కోరికను తీర్చెదమని దళిత క్రైస్తవులకు దళిత హోదా కల్పిస్తామన్న వాగ్దానమును తమ పార్టీల ప్రణాళికలలో చేర్చాలని వివిధ రాజకీయ పార్టీలకు మన తరఫున ప్రతిపాదనలు అందచేయుచున్నాము.
దళిత విమోచన ఆదివారమును అర్థవంతముగా నిర్వహించుటకు కొన్ని కార్యాచరణ ప్రణాళికలను పంపుతున్నాము. మన దళిత క్రైస్తవ సహోదరీ సహోదరులకు సంఘీభావమును తెలియజేయుటకు ఈ సందర్భంలో మనమందరము ముందుండాలని కోరుచున్నాము.
మీ అందరి ప్రార్థన పూర్వక సహకార మునకు తోడ్పాటు నకు వందనములు.
ప్రభు క్రీస్తు సేవలో
మోస్ట్. రె వ. శరత్ చంద్ర నాయక్
అఖిలభారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య
యస్.సి.బి.సి. విభాగపు అధ్యక్షులు.
No comments:
Post a Comment