30 వ సామాన్య ఆదివారము, Year B

30 వ సామాన్య ఆదివారము, Year B
యిర్మీ. 31:7-9; కీర్తన. 125; హెబ్రీ. 5:1-6; మార్కు. 10: 46-52.

సరిచేయువాడను... సమకూర్చువాడను... నేనే!

ఈనాటి మొదటి పటనములో, బాబిలోనియా బానిసత్వంలో మగ్గుతున్న ఇజ్రాయిలు ప్రజలకు దేవుడు ఊరటను, ఓదార్పును ఇర్మియా ప్రవక్త యొక్క సందేశముద్వారా తెలియజేస్తున్నాడు. ఈనాటి మొదటి పటనము, ఇర్మియా గ్రంథములోని ఓదార్పు ప్రవచనములకు చెందినవి (యిర్మీ. 30:1-33:26). ఈ ప్రవచనముల యొక్క సందర్భమును, సందేశమును తెలిసికొని, ఈనాడు ప్రభువు, ఈ వాక్యము ద్వారా మనకు ఇచ్చే సందేశమును ధ్యానించుకుందాం!

ఈనాటి మొదటి పటనం మూడు వచనాలే అయినా చాలా ముఖ్యమైన సందేశం నిగూఢమై ఉంది. కావున ఈ వాక్యములను క్షుణ్ణముగా పరిశీలించుదాం! మనం విన్న వాక్యములు (7-9), యిర్మీయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన మాటలు. ‘ఇశ్రాయేలును తలంచుకొని సంతసముతో పాటలు పాడమని’ ఆహ్వానిస్తున్నాడు. ఈ ఆహ్వానమును అర్థంచేసుకొనుటకు, ఈ మాటలు పలుకబడిన సందర్భమును విపులంగా అర్థం చేసుకోవాలి.

సందర్భం: సొలోమోను తర్వాత రాజయిన రెహబాము కాలములో సామ్రాజ్యం రెండుగా చీలిపోయింది. ఉత్తరమున 10 తెగలతో కూడిన సామ్రాజ్యమును ఇజ్రాయేలు అని, దక్షిణమున రెండు తెగలతో కూడిన (యూదా, బెంజమిన్ తెగలు) రాజ్యమును యూదా అని పిలిచినారు. ఈ విభజన దాదాపు క్రీస్తుపూర్వం 922 (B.C.) సంవత్సరంలో జరిగింది. క్రీస్తుపూర్వం 722 లో ఉత్తర రాజ్యం (ఇశ్రాయేలు), క్రీస్తుపూర్వం 586 లో దక్షిణ రాజ్యం (యూదా) పరాయి రాజులచే జయింపబడి బానిసత్వంలోకి కొనిపోబడ్డాయి. ఉత్తర రాజ్యమును సమరియా అని కూడా పిలిచేవారు. పూర్వం 722 లో అస్సీరియా రాజు ఇశ్రాయేలుపై దాడిచేసి వారిలో కొంతమందిని బందీలుగా కొనిపోయాడు. తమలో కొందరిని సమరియాలో నివసింపచేసి ఇజ్రాయేలు స్త్రీలను వారి భార్యలుగా చేసుకున్నారు. వీరికి కలిగిన సంతానాన్ని సువార్తలలో సమరీయులుగా, సంకరజాతి వారిగా, అంటరానివారిగా, అపవిత్రులుగా పరిగణించారు. బానిసత్వంలో ఉన్న రెండు రాజ్యముల ప్రజలు “ఇజ్రాయిలు” అను పేరు గుర్తుకు రాగానే వారికి పట్టిన దుర్గతిని గురించి చింతించి దుఃఖించే వారు. ఈ సందర్భంన ‘ఇశ్రాయేలు’ అంటే ఉత్తర రాజ్యం కాదు. యాకోబు కుమారుల సంతానము అనగా 12 తెగలను ఉద్దేశించి ఈ మాటలు పలుకబడినవి. ఈనాడు మనం విన్న వాక్యములను ఇర్మియా ప్రవక్త రెండు రాజ్యంలో ఉన్న శేషజనమును ఉద్దేశించి మాట్లాడిన వచనములు. ఈ శేషజనము ఎవరంటే, ముదుసలి ప్రాయంలో ఉన్నవారు, రోగస్తులు, బలహీనులు, అస్సీరియులకు పనికిరాని వారు. వారు తమను పోషించే కుమారులను, కుటుంబాలను తలచుకొని దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు. వీరిని ఉద్దేశించి ప్రవక్త సంతోషించమని ఆహ్వానిస్తున్నాడు. దానికి గల కారణాలను 7వ వచనంలో వివరిస్తున్నాడు. ప్రభువు”తన ప్రజలను” రక్షించెను. “తన ప్రజలు” అన్న ఈ మాటను మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఇశ్రాయేలు, యూదా రాజ్యములు కూల్చబడినప్పుడు, ప్రజలు బానిసలుగా కొనిపోబడినప్పుడు, దేవుడు తమను త్యజించాడని, తనను వదిలివేశాడని, తమను పట్టించుకోవడంలేదని, తమ పాపములను బట్టి త్రోసివేశాడని, తమతో జీవించడంలేదని, అందుకే ఈ దుర్గతి పట్టిందని అనుకున్నారు. దేవుడు తమతో తమ రాజ్యంతో తమ ప్రజలతో విసిగిపోయారని అనుకొన్నారు. తమను తమ ఇష్టానికి వదిలేశాడని అనుకున్నారు. కాని దేవుడు వారిని వదిలిపెట్టలేదు, వారిని త్యజింపలేదు. దేవుడు వారిని ఇంకా ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. బాబిలోను బానిసత్వంద్వారా, పరాయి రాజుల పాలనలో దేవుడు వారిని సరిచేయాలని, సవరించాలని, తన ప్రేమకు పాత్రులుగా సిద్ధపరచాలని దేవుడు ఆలోచించాడు. దేవునియొక్క రక్షణ, ఆయనయొక్క పునర్ నిర్మాణ కార్యక్రమం “ఉత్తర దేశం” నుండి ఆరంభమవుతుందని 8వ వచనం తెలియజేస్తుంది. “ఉత్తరం వైపు” నుండి (యిర్మీ. 4:6) విపత్తు, వినాశనం, శత్రువు వచ్చాడు. అదే మార్గము గుండా దేవుడు రక్షణమును, సంతోషమును, ఆనందమును, అభివృద్ధిని, ఆశీర్వాదమును కలుగజేస్తాడు. ఏ వైపును చూసి జనులు భయభ్రాంతులయ్యారో, ఆ వైపునుండి ప్రభువు అభయమును, ఆపన్నహస్తమును కలుగజేస్తాడు. ఆ వైపునుండి ప్రభువు తన ప్రజలను తిరిగి తోడ్కొని వస్తాడు. ఈ తిరుగు ప్రయాణంలో ప్రభువు ఎవరిని తిరస్కరించడు. అంధులను, కుంటివారిని, గర్భవతులను, ప్రసవించువారిని అందరిని సమూహముగా తోడ్కొని వస్తారు. పైన పేర్కొన్న వారు బలహీనులు, వేరే వ్యక్తుల సహాయము అవసరమైన వారు. వారి బలహీనతను బట్టిగాని వారి నిస్సహాయతను బట్టి గాని ఎవరు నిరాకరింపబడరు. అందరినీ కలుపుకొని అందరూ కలసి వారి దేశమునకు, వారి పట్టణములకు, వారి ఇళ్లకు, వారి దేవుని యొద్దకు వచ్చెదరు. బలవంతులు మాత్రమే కాదు, బలహీనులు కూడా దేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన వారే. వారిని దేవుడు వదిలిపెట్టడు. వారిని దగ్గర ఉండి తోడ్కొని వస్తాడు. 9వ వచనములో “వారు ఏడుపులతోను, ప్రార్థనలతోను, ప్రభువు నడిపింపున వచ్చెదరు” అని విన్నాము. “ఏడుపు, ప్రార్ధన” మానసిక భావోద్వేగములు. పశ్చాత్తాపమునకు, పరితాపమునకు గుర్తు. మారుమనస్సుకు మారిన వ్యక్తికి గుర్తు. తిరిగి వచ్చేవారు ప్రభువు యొక్క ప్రేమను ఆయన యొక్క గొప్పతనమును గుర్తించినవారు. పూర్వము అనగా, పరాయి బానిసత్వమునకు ముందు, వారి హృదయములు కఠినంగా, రాతివలె అనగా భావోద్వేగాలులేక ఉండెను. ఇప్పుడు వారి హృదయములు మారినవి. వారి హృదయములు దేవుని కార్యములకు, నడిపింపునకు స్పందించుచున్నవి. దేవుని నడిపింపులో ఆయన ప్రేమను వారు చవిచూస్తున్నారు.

సందేశం

ఈనాడు ఈ వాక్యమును ఆలకిస్తున్న సోదరా! సోదరీ! నీ జీవితంలో నీకు కష్టాలు వచ్చినప్పుడు దేవునిచే త్యజింపబడినావని అనుకుంటున్నావా? నీవు అనుకున్నట్లు నీకు జరగనప్పుడు దేవుడు నీతో లేడని అనుకున్నావా? దేవుడు నీతో రాడని అనుకున్నావా? ఆయన నీతో సంబంధం తెంచుకున్నాడని అనుకున్నావా? నీవు దేవుని ప్రేమకు దేవుని మాటకు స్పందించనపుడు దేవుడు నిన్ను సరిచేయాలని అనుకున్నాడు, స్పందింప చేయాలనుకున్నాడే కానీ, నిన్ను వదలలేదు, త్యజింపలేదు, నీతో సంబంధం తెంచుకోలేదు. ఆయన తన సంబంధాన్ని పెంచుకుంటున్నాడు. ఆయన నిన్ను తన బిడ్డగా ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను జేష్ఠపుత్రునిగా చేసుకుని నీకు వారసత్వమును ప్రసాదిస్తున్నాడు.

నీవు ఎక్కడైతే అవమానమును పొందావో, ఆవేదన చెందావో, అక్కడే ప్రభువు నిన్ను ఘనపరుస్తాడు. అక్కడే నిన్ను ప్రభువు హెచ్చిస్తాడు. ఏ వైపునుండి నీ శత్రువు వచ్చి, నిన్ను బెదిరించాడో, నిన్ను భయబ్రాంతులకు గురిచేశాడో, ఆ వైపునుండే ప్రభువు నీకు అభయమును, ఆశీర్వాదమును దయచేస్తాడు. ఏ వైపుకు చూసి నీవు ఆందోళన చెందావో, ఏ పేరు వింటే నీవు కలవరపడ్డావో, ఆ వైపునుండి ప్రభువు నీకు ధైర్యం ఇస్తాడు. ఆ పేరులోనే నీకు నిశ్చలతను ప్రభువు దయచేస్తాడు. సరళమైన, తిన్నమార్గముల గుండ నిన్ను నడిపిస్తాడు. బానిసత్వంలోనికి వెళ్లేటప్పుడు ఇంటిని, భార్యా బిడ్డలను, సంపదలను, సొంత జనమును, వీడునప్పుడు ఇశ్రాయేలీయులకు కలిగిన భావన నీకు కలిగితే, తిరిగి వచ్చేటప్పుడు ఏవిధముగా ప్రభువు నీదగ్గరుండి నడిపించాడో, అదే విధముగా నిన్ను తన ఇంటికి నడిపిస్తాడు. గుడ్డివారిని, కుంటివారిని, గర్భవతులను, బాలింతలను, ఏవిధముగా జాగ్రత్తగా నడిపించాడో, ప్రభువు నీ బలహీనతలో నిన్ను నడిపిస్తాడు; నీ పక్కనే ఉంటాడు; నీకు కావాలిగా, రక్షణగా, ఆసరాగా, అండగా ఉంటాడు. ఈ మహా కార్యమును నీ కనులారా చూచుటకు, అనుభవించుటకు నీవు చేయవలసిన కార్యం ఒక్కటే! ఇశ్రాయేలువలె దేవుని ప్రేమను తెలుసుకొని, ఆయన మాటను ఆలకించి, ఆయన మార్గమును తెలుసుకొని, ఆయన మంచితనాన్ని చూసి నీ తప్పిదములను, నీ పాపములను, నీ హృదయ కాఠిన్యమునకుగాను, నీ నడవడికకుగాను, నీ దుష్కార్యమునకుగాను, పశ్చాత్తాపంచెంది, పరితాపంపొంది, ఆయనయొద్దకు ఏడుపుతో, ప్రార్థనతో తిరిగి రావడమే! చేసిన తప్పులకు క్షమాపణలు కోరడమే! దానికి నీవు సిద్ధంగా ఉన్నావా? అయితే ఆలస్యమెందుకు, ప్రభువు నీ పక్కనే ఉన్నాడు. నీకు కావలసినవన్నీ ఆయన సమకూరుస్తాడు. ఎందుకంటే ఆయన నీ తండ్రి! నా తండ్రి! మనందరి తండ్రి!

తప్పు చేసినప్పుడు శిక్షించేవాడు, పశ్చాత్తాపం చెందితే రక్షించేవాడు, మాట విననప్పుడు చెడగొట్టేవాడు, మారినప్పుడు చేరదీసేవాడు, తప్పుడు మార్గంలో వెళ్ళినప్పుడు సరిచేయువాడు, ప్రతి అవసరములో సమకూర్చువాడు ఆయనే - మనందరి తండ్రి!

No comments:

Post a Comment