పశ్చాత్తాప జీవితం

పశ్చాత్తాప జీవితం

    ‘పశ్చాత్తాపము’ అను పదమునకు ‘తపస్సు’ అని ‘ప్రాయశ్చిత్తము’ అని ‘తనకుతానే విధించుకును శిక్ష’ లేక ‘స్వీయ అవమానము’ అనే అర్ధాలు ఉన్నాయి. సాధారణ భాషలో పశ్చాత్తాపము అనగా ఒక వ్యక్తి చేసిన తప్పులకు, పాపాలకు దుఃఖపడుట, పాపాత్ముడు తన పాపాలకు పశ్చాత్తాప పడుట. అలాంటి వ్యక్తి మత్తయి సువార్త 5:3 లో చెప్పబడిన ‘దీనాత్ములు ధన్యులు’ గా ఉండుట. పశ్చాత్తాపం ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పును తీసుకుని వస్తుంది. అయితే ఈ మార్పుకోసం పశ్చాత్తాపపడే వ్యక్తి ఎలాంటి మార్పులనైనా లేదా సవరణలనైనా చేయటానికి సిద్ధపడతాడు. 

    పశ్చాత్తాప పడటం అనగా వినయాన్ని కలిగియుండటం. పశ్చాత్తాప పడటం అనగా విచారాన్ని, దుఃఖాన్ని తెలియజేయటం లేదా చింతించటం, దేవుని క్షమాపణను పొందటం. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించాలి. విచారానికి, పశ్చాత్తాపానికి మధ్య భేదాన్ని మనము గుర్తించి తెలుసుకోవాలి. పశ్చాత్తాప పడటం అనగా చేసిన పాపాలకు కేవలం విచారిస్తే, బాధపడితే, దుఃఖపడితే సరిపోదు. ఒక వ్యక్తి తప్పుగాని, పాపంగాని చేసి వాటి వల్ల వచ్చిన పరిణామాలనుబట్టి చాలా బాధపడవచ్చు, కాని పశ్చాత్తాప పడకపోవచ్చు; తన తప్పుడు నిర్ణయానికి చింతించ వచ్చు - అయ్యో! నేను అలా చేసి ఉండకూడదు అని, కాని చేసిన పాపానికి పశ్చాత్తాప పడకపోవచ్చు. పునీత పౌలుగారు రెండవ కొరింతీయులకు వ్రాసిన పత్రిక 7:10 లో నిజమైన పశ్చాత్తాపం గురించి తెలియజేస్తూ ఉన్నారు. 

ఇచ్చట పౌలుగారు రెండు రకాలైన విచారముల గురించి తెలియజేస్తూ, నిజమైన పశ్చాత్తాపం గురించి తెలియజేస్తూ ఉన్నారు: “దేవునిచే వినియోగించబడిన విచారము రక్షణకు దారిచూపు హృదయ పరివర్తనను కలిగించును. కనుక విచారింప పనిలేదు. కాని ప్రాపంచిక విచారమే మృత్యుహేతువగును.” మొదటిది ‘దేవునిచే వినియోగించబడిన విచారము’ - ఇది రక్షణకు దారిచూపు హృదయ పరివర్తనను కలిగించును. దీని భావము ఏమంటే, నిజమైన పశ్చాత్తాపంనకు అర్థము ‘హృదయ పరివర్తన’ చెందడం. 

దీనినే యిర్మియా ప్రవక్త 8:6 లో ‘ఆత్మ విచారము’గా చెప్పియున్నారు. అనగా ‘ఆత్మ విచారము’ చేసికొనుట నిజమైన పశ్చాత్తాపం. ‘దేవునిచే వినియోగించబడిన విచారము’ లేదా ‘ఆత్మ విచారము’ అనగా పాపము ఎంత చెడ్డదో అని దేవునితో ఏకీభవించటం; చేసిన పాపము ఏమిటో తెలిసికోవటం మరియు దేవునియొక్క సహాయముతో ఆ పాపము పునరావృతం కాకుండా చేయటం. ‘ప్రాపంచిక విచారము’ కేవలం మన చెడు భావాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది; అనగా మనం తప్పు చేసినప్పుడు ఇతరులు ఏమనుకుంటారో అని, ఈ తప్పువల్ల పరిణామాలు ఎలా ఉంటాయో అన్న విషయాలపై మాత్రమే దృష్టి ఉంటుంది; ఇలాంటి విచారం నిజమైన పశ్చాత్తాపము కాదు.

    యోహాను 8:11 న, వ్యభిచారములో పట్టుబడిన స్త్రీతో ప్రభువు “ఇక పాపము చేయకుము” అని చెప్పియున్నారు.  “ఇక పాపము చేయకుము” అన్నది నిజమైన పశ్చాత్తాపం. అలాగే యోహాను 5:14 న కోనేటి వద్ద 38 ఏండ్లనుండి వ్యాధి పీడితున్ని, అనగా నడవలేని స్థితిలోనున్న వ్యక్తిని స్వస్థపరచి ప్రభువు “ఇదిగో నీవు స్వస్థుడవైతివి. నీకు మరింత కీడు కలుగకుండుటకు ఇక పాపము చేయకుము” అని చెప్పియున్నాడు. “ఇక పాపము చేయకుము” అన్నది నిజమైన పశ్చాత్తాపం.

    నిజమైన పశ్చాత్తాపం గురించి 51వ కీర్తనలో దావీదు తెలియజేయుచున్నాడు. దావీదు ఊరియా భార్య అయినా బత్షెబతో పాపము చేసాడు. నాతాను ప్రవక్త దావీదును మందలించినప్పుడు దావీదు పశ్చాత్తాప పడ్డాడు. దావీదు నాతానుతో, “నేను యావేకుకు ద్రోహముగా పాపము చేసితిని” అని అన్నాడు (2 సమూ 12:13). తన పాపమునకు పశ్చాత్తాపమును వెల్లడిస్తూ, దావీదు ఈ కీర్తనను వ్రాసియున్నాడు. ఎప్పుడైతే తను చేసిన పాపమును తెలిసికొన్నాడో, తన పాపము కొరకు కన్నీరు పెట్టుకున్నాడు; పాపక్షమకై ప్రార్థన చేసి ఉన్నాడు. తన పాపము వలన దేవునితో తెగిపోయిన బంధాన్ని తిరిగి నిర్మించమని వేడుకున్నాడు. తను చేసిన పాపానికి పరిణామముగా, తనకు పుట్టిన బిడ్డడు మరణించినప్పటికిని, దావీదు చేసిన పాపానికి పశ్చాత్తాప పడ్డాడు. అతని పశ్చాత్తాపము నిజమైనది, శాశ్వతమైనది. 4 వ వచనములో దావీదు అంటున్నాడు “నీకే, నీకే ద్రోహముగా నేను పాపము చేసితిని.”ఈ వాక్యం దావీదుయొక్క నిజమైన పశ్చాత్తాపాన్ని తెలియజేస్తుంది. తను ఎంత ఘోర పాపము చేశాడో, దాని స్వభావము ఏమిటో మరియు అది దేవుని ఎంతగా బాధించిందో తెలియజేస్తుంది. అందుకే 17 వ వచనములో దావీదు అంటున్నాడు “దేవా! నేను అర్పించు బలి పశ్చాత్తాప పూరితమైన హృదయమే. పగిలి నలిగినట్టిదియు, వినయాన్వితమైన హృదయమును నీవు అనాదరము చేయవు.” పగిలి, నలిగిన హృదయం, పరివర్తన చెందిన హృదయం, పశ్చాత్తాపానికి ఆధారాలు.

    తను చేసిన పాపానికి దావీదు రక్షణ ఆనందమును కోల్పోయాడు (వ. 12), సంతోషమును ఉత్సాహమును కోల్పోయాడు (వ. 8). అయినప్పటికిని దావీదు పశ్చాత్తాపము నిజమైనది కనుక, దేవుడు ఆయన పాపమును క్షమించి ఉన్నాడు; దావీదు మరణించక బ్రతికెను (2 సమూ 12:13).

    కనుక, పశ్చాత్తాపము అనగా పాపము నుండి దేవుని వైపునకు మరలుట (అ. కా. 20:21); హృదయ పరివర్తనము అనగా ఎన్నటికిని పాపము చేయకుండుట; యేసుక్రీస్తు నందు విశ్వాసము కలిగియుండుట; దేవుని యొక్క చట్టానికి విధేయత కలిగి జీవించుట; ప్రేమ కలిగి జీవించుట.

    యెహెజ్కేలు 18:30-31 ప్రకారం, పశ్చాత్తాపం అనగా ‘దుష్కార్యములనుండి మరియు పాపకార్యములనుండి వైదొలగుట”. యావేలు 2:12 ప్రకారం, పశ్చాత్తాపము అనగా ‘పూర్ణ హృదయముతో దేవుని చెంతకు మరలుట”. యిర్మియా 8:6 ప్రకారం పశ్చాత్తాపము అనగా “ఆత్మ విచారము చెందుట” (2 కొరిం. 7:10, ‘దేవునిచే వినియోగించబడిన విచారము’).

    బప్తిస్మ యోహాను పశ్చాత్తాపము గురించి బోధించి యున్నాడు: “మీరిక హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేయుడు” (మ 3:8). ఇదే విషయాన్ని యేసుప్రభువు కూడా “తప్పిపోయిన కుమారుడు” (లూకా 15) మరియు “పరిసయ్యుడు - సుంకరి” (లూకా 18) ఉపమానాలలో బోధించి ఉన్నాడు. సీమోను ఇంటిలో యేసు భోజనమునకు కూర్చుండగా ఒక స్త్రీ, పాపాత్మురాలు పశ్చాత్తాపముతో ఏడ్చుచు తన కన్నీటితో యేసు పాదములు తడిపి, తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనెను (లూకా 7:36-50). ఆ స్త్రీ పశ్చాత్తాప వృదయముతో తన పాపములను కడిగి వేసుకున్నది.

శ్రీసభ బోధన:
పశ్చాత్తాపము ఎంతో అవసరమని శ్రీసభ బోధిస్తుంది. ఎందుకనగా, ఘోరపాపమునుండి ఉపశమనం, విముక్తి, పాప మన్నింపు కొరకు పశ్చాత్తాపం ఎంతో అవసరం. పశ్చాత్తాపము చెందని chor దేవుడు పాపాన్ని మరణించాడు అని కొంతమంది పునీతులు చెప్పియున్నారు (ఉదా,, పునీత తోమాసు అక్వినాస్). యేహేజ్కేలు 18:24, “దుష్కార్యములు చేయువాడు బ్రతకడు. అతని సత్కార్యములు కూడా లెక్కకు రావు. అతని ద్రోహములకు పాపములకు అతడు చచ్చితీరును.” లూకా 13:5, “హృదయ పరివర్తనము చందనిచో, నాశనముగుదురు.” కనుక పశ్చాత్తాపము ఎంతో అవసరం.

పశ్చాత్తాపము - దివ్య సంస్కారం
    ఈ దివ్య సంస్కారాన్ని స్వయముగా క్రీస్తు ప్రభువే స్థాపించి ఉన్నారు. ఈ సంస్కారము ద్వారా, జ్ఞానము పొందిన తరువాత మనము చేసిన పాపములకు శ్రీసభ ద్వారా దేవుడు మనకు పాపక్షమాపణను దయచేస్తున్నాడు; ఒక గురువు ద్వారా పాపవిమోచనను దేవుడు మనకు దయ చేయుచున్నాడు.

    పాప సంకీర్తనము ఒక సాంగ్యము కాదు; ఇది ఒక దివ్య సంస్కారము; దీని ద్వారా మనము చేసిన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొనుచున్నాము. దీనిలో మనము చేసిన పాపములకు పశ్చాత్తాప పడుట ఎంతో ముఖ్యము. దీని ద్వారా ఆత్మకు దైవానుగ్రహము లభించును.

    ఈ రోజుల్లో ఈ పశ్చాత్తాప సంస్కారం గురించి ఎన్నో అపోహలను కలిగి ఉన్నాము. మనం గ్రహించ వలసిన విషయాలు:

    ఈ దివ్య సంస్కారం ఎంత మాత్రము మానవుడు స్థాపించినది కాదు. పాప మన్నింపు కొరకు స్వయముగా క్రీస్తు ప్రభువే ఈ సంస్కారమును స్థాపించి యున్నారు. కనుక, క్రైస్తవులమైన మనకు ఇది పోతివి సంస్కారము మరియు మనకు ఇది ఎంతో అవసరము.

    పాపసంకీర్తనములో మన పాపములను మన్నించునది గురువు కాదు; పాపమును మన్నించు అధికారము కేవలము దేవునికి మాత్రమే ఉన్నది. కనుక శ్రీసభ పరిచర్య ద్వారా, గురువు ద్వారా, దేవుడు పాపవిమోచనమును మనకు దయచేయుచున్నాడు.

    పాపసంకీర్తనములో పాపములను ఒప్పుకొనినంత మాత్రమున, పాప మన్నింపు దొరుకుననునది వాస్తవము కాదు. పాపమన్నింపునకు ప్రధానముగా కావలసినది పశ్చాత్తాపము. చేసిన పాపములకు నిజముగా పశ్చాత్తాప పడవలెను ఇది లేనప్పుడు పాపసంకీర్తనం వృధాయే!

    పాపములు క్షమింపబడుతున్నాయని మరల పాపము చేయవచ్చు అన్నది తప్పుడు భావన. చేసిన పాపము మరల చేయనప్పుడే నిజముగా పశ్చాత్తాప జీవితమును జీవించినట్లు అవుతుంది.

    పాపమును మన్నించు అధికారమును మొట్టమొదటిగా యేసుప్రభువు పేతురు గారికి ఇచ్చి ఉన్నారు (మ 16:19). ఆ తరువాత అందరి శిష్యులకు ఈ అధికారమును ఇచ్చియున్నారు (మ 18:18). మరల ప్రభువు ఘనమైన తర్వాత కూడా తన శిష్యులతో దీని గురించి చెప్పి ఉన్నారు (యో 20:21-23). కనుక శిష్యుల ప్రేషిత కార్యములో, పరిచారములో, సేవలో, బోధనలో, పాపమన్నింపు తప్పక ఉండవలెను. ఎందుకన, ఇది ప్రభువు ఆజ్ఞ. ఈ విధముగా, శ్రీసభలో ఓ దివ్యసంస్కారమై ఉన్నది. కనుక, దీనిని మనము గౌరవించవలెను.

    పాపసంకీర్తనమును స్వస్థత సంస్కారమని, పాపవిమోచన సంస్కారమని, సఖ్యత సంస్కారమని, పరివర్తన సంస్కారమని, పాపోశ్చరణ సంస్కారమని, క్షమా సంస్కారమనికూడా  పిలుస్తారు.

    ఈ దివ్యసంస్కారము వలన దేవునికి విరుద్ధమైన పాపములనుండి క్షమాభిక్ష దేవుని దయవలన మనకు కలుగును మన పాపముతో గాయపరచిన శ్రీసభతో కూడా సఖ్యత పడగలము. ఇది “పరివర్తన సంస్కారం” ఎందుకనగా, పాపము వలన దేవుని విడచి వెళతారు; అయితే ఈ సంస్కారము ద్వారా యేసుప్రభువు పరివర్తనమునకు పిలుస్తున్నాడు; తండ్రి వద్దకు తిరిగి రావటానికి ఇది “పరివర్తన తొలిమెట్టు.” పరివర్తనం, ప్రాయశ్చిత్తం, అపరాధం చెల్లింపులు, దశలవారిగా ఉంటాయి. ఇది “పాపోశ్చరణ” లేదా “పాపముల ఒప్పుకోలు సంస్కారం” ఎందుకనగా, ఈ సంస్కారములు గురువుకు పాపములను చెప్పటం లేదా ఒప్పుకోవటం అతిముఖ్యమైన అంశము. ఇది “క్షమా సంస్కారం” ఎందుకనగా గురువు సంస్కారములు ఇచ్చే పాపక్షమాపణ ద్వారా ‘క్షమను, శాంతిని’ దేవుడు పాపికి అనుగ్రహిస్తాడు. ఇది “సఖ్యత సంస్కారం” ఎందుకనగా దీనిద్వారా దేవునితో సఖ్యపడుతున్నాము మరియు సోదరులతో  సఖ్యపడుతున్నాము.

పశ్చాత్తాప క్రియలు
    చేసిన పాపములకు శిక్షణ ప్రాయశ్చిత్తము అంటారు. పాపసంకీర్తనములో మనము చేసిన పాపములకు గురువు ప్రాయశ్చిత్తమును ఇస్తారు: ప్రార్థనలు చేయమని, మంచి కార్యములు చేయమని, దేవాలయములను సందర్శించమని, సిలువ మార్గము చెప్పమని మొ,,వి.

    పశ్చాత్తాప క్రియలు రెండు రకాలుగా మనము చెప్పుకోవచ్చు: 1. అంతరంగ ప్రాయశ్చిత్తం 2. బాహ్యప్రాయచిత్తం. పరివర్తనకు, ప్రాయశ్చిత్తానికి ప్రభువు పిలుపునిచ్చాడు. అంతరంగ పరివర్తనమే యేసు పిలుపుయొక్క లక్ష్యం. ఇవి లేకుంటే ప్రాయశ్చిత్తం నిష్ఫలం, కృత్రిమం. అయితే బాహ్యమైన ప్రాయశ్చిత్త క్రియలు అంతరంగ పరివర్తనను వ్యక్తం చేయటానికి అవసరం (చదువుము: యోవెలు 2:12-13; యేష 1:16-17; మ 6:1-6;16-17). అంతరంగ ప్రాయశ్చిత్తం అనగా హృదయం పూర్తిగా దేవుని వైపు మరలటం; పరివర్తన చెందడం; దుష్క్రియలనుండి, చెడు నుండి వెనుదిరగడం; పాపానికి అంతం పలకటం; హృదయ పశ్చాత్తాపం చెందడం; నూతన హృదయాన్ని కలిగి ఉండటం. ప్రాయశ్చిత్త క్రియలు: ఉపవాసం, ప్రార్ధన, దాన ధర్మాలు.

ముగింపు: 
    పశ్చాత్తాపము అనగా హృదయ పరివర్తనను, పాపము నుండి దేవుని వైపుకు మరలడం.

No comments:

Post a Comment