27 వ సామాన్య ఆదివారం, Year B

27 వ సామాన్య ఆదివారం, Year B
ఆది. 2:18-24; హెబ్రీ. 2:9-11; మార్కు 10:2-16

నరుడు-నారి-విడాకుల సమస్య

“నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అతనికి తోడుగా స్త్రీని సృష్టింతును” అని దేవుడు అనుకొనెను. అనుకున్న తోడనే దేవుడు మానవుని ఈ విధముగా సృష్టించెను. దేవుడైన యావే భూమిని, ఆకాశమును సృష్టించెను, కాని, నేలమీద పచ్చని చెట్టుచేమలేవియును లేవు. ఏలయన, దేవుడు భూమిమీద వానలు కురిపించలేదు. నేలను సాగుచేయువాడు ఎవడును లేడు. కాని, వానలు లేకపోయినా, భూమినుండి నీరు పెల్లుబికి నేలను తడుపుచుండెను. అప్పుడు, దేవుడైన యావే, నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను. అతని ముక్కురంధ్రములలో ప్రాణవాయువును ఊదెను. అనగా దేవుడుతన శ్వాసను, జీవమును, జీవితమును, ఆత్మను మానవునిలో నింపెను. అప్పుడు నరుడు జీవముగలవాడయ్యెను.

దేవుడు ప్రేమ. ఆయన ప్రేమ స్వరూపుడు. దేవుడు ఒంటరి వాడు కాదు. ఆయన త్రిత్వైక సర్వేశ్వరుడు. దేవుడు ఒక కుటుంబము. పిత, పుత్ర, పవిత్రాత్మల కుటుంబము. వీరి మధ్య ఎల్లప్పుడూ ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను పంచుటకే, దేవుడు మానవుని తన పోలికలో, తన రూపంలో సృష్టించాడు, అనగా దేవుడు నరుని ప్రేమలో మరియు ప్రేమ కొరకు సృష్టించాడు. కనుక నరుని లో ప్రేమించే గుణము, ప్రేమించే శక్తి ఉన్నది. ప్రేమ కోసం ప్రేమ కొరకు సృష్టింపబడినప్పుడు, నరుడు ఒంటరిగా ఉండలేడు.

అంతట దేవుడైన యావే “నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు అతనికి సాటి అయిన తోడును సృష్టింతును” అని పలికెను. కావున దేవుడైన యావే నేలనుండి అన్ని రకముల మృగములను, పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలిసికొనగోరి వాని నన్నిటిని అతని కడకు కొనితెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేరే వాని పేరుగా నిలిచిపోయినది. ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూరమృగములకు నరుడు పేరు పెట్టెను కాని అతనికి తగిన తోడెవ్వరు దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాడ నిద్ర పోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటెముక నొక దానిని తీసి ఆ చోటును మరలా మాంసముతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడుకొని వచ్చెను. అప్పుడు నరుడు “చివరకు ఈమె నా వంటి దైనది. ఈమె నరుని నుండి రూపొందినది కావున నారి యగును” అనెను. దేవుడు స్త్రీని పురుషుని యొక్క దేహము నుండి సృష్టించాడు. దీని మూలముగా వారిరువురూ సమానము అని, దేవుని సృష్టి అని, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని, మనం అర్థం చేసుకోవాలి.

కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొనిపోవును. ఇదియే ప్రేమయొక్క స్వభావము. వారిరువురు ఏక శరీరులగుదురు. నరుడు నారిలను, దేవుడు వేరువేరుగా సృష్టించినప్పటికీ వారు శరీరంలోనూ, ఆత్మ లోను ఒకటిగా జీవించెదరు; ఈ విధముగా, దేవుడు మానవాళి పై ఉన్న తన ప్రేమను చాటుకున్నారు. త్రిత్వైక దేవుని లో కూడా ఇదే చూస్తున్నాము: వారు ముగ్గురు వ్యక్తులు అయినప్పటికిని, వారు ఏకమై ఒకే సర్వేశ్వరుడుగా ఉన్నారు.

కనుక ఈ మానవ ప్రేమలో, వివాహ బంధములో విడాకులు లేదా పరిత్యజింపు ఉండకూడదని దేవుని సంకల్పం. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ కలకాలం ఉండాలనేది దేవుని ప్రణాళిక, చిత్తం. ఈ లోక సృష్టిలోనే ప్రేమను మానవునిలో నింపియున్నాడు. నరుడు నారీలను ఐక్యము చేసేది దేవుడే. వారిరువురు కూడా సమానులే.

పరిసయ్యులు యేసు ప్రభువును విడాకుల గురించి అడిగినప్పుడు మరియు మోషే చట్టమును ప్రస్తావించినప్పుడు, “మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే విడాకులను అనుమతించెను” అని చెప్పెను. హృదయ కాఠిన్యము వలన మనము దేవుని యొక్క ప్రేమను, మానవాళిలో దేవుడు ఉంచిన ప్రేమను, ఇతరులలో ఉన్న ప్రేమను, తృణీకరిస్తూ ఉన్నాము. కనుక ప్రభువు సృష్టిలో తండ్రి దేవుడు నరునిలో ఉంచిన ప్రేమను గుర్తుచేస్తున్నాడు. తండ్రి దేవుని యొక్క ప్రణాళికను చిత్తమును గుర్తు చేయుచున్నాడు. ఈ ప్రేమ అనంతమైనది, శాశ్వతమైనది. కనుక, “దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరరాదు.”

వివాహ బంధములో స్త్రీ పురుషుల మధ్య ఉన్న ప్రేమ ఇతర ప్రేమలకు ఆదర్శవంతంగా ఉన్నది. ఎందుకన, ఈ ప్రేమ త్రిత్వైక దేవునిలో ఉన్న ప్రేమ నుండి ఉద్భవించినది. నిజమైన ప్రేమ స్వార్ధం లేనిది; ఒక వ్యక్తి తనకు తాను పూర్తిగా ఇచ్చుకొనును. ఇలాంటి ప్రేమలోనే దేవుని పోలికను, దేవుని రూపమును చూడగలము. ఇలాంటి పవిత్రమైన ప్రేమ వివాహ బంధం, కుటుంబంలోనూ ఉంటుంది. ఈ ప్రేమే సమాజంలో వ్యక్త పరచ బడుతుంది. కనుక భార్యాభర్తలు, కుటుంబము కలకాలం కలిసి ఉండాలి.

కష్ట కాల సమయములో, అపార్ధ సమయంలో, వ్యాధి బాధలలో, పిల్లలులేమి సమయంలో, మొదలగు సమయంలో ఒకరినొకరు పరిత్యజింపక, వివాహ వాగ్దానములను గుర్తుచేసుకుంటూ, దేవుని పై ఆధార పడుతూ, ప్రార్థనలు దేవునిపై భారం వేస్తూ, సమస్యలకు పరిష్కారం కనుగొని ఐక్యంగా కలకాలము జీవించుట మనము అలవర్చుకొనవలెను. ప్రభువు అంటున్నారు: “తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడు వాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ, వ్యభిచరించుచున్నది.”

భార్యాభర్తలిరువురు తమ జీవితంలో చివరి వరకు తోడుగా నీడగా ఉండవలసి వస్తుంది. కనుక ఒకరినొకరు ప్రేమించాలి, గౌరవించాలి. అమ్మ మనకు జన్మనిస్తుంది, భార్య ఆ జన్మకు అర్థం ఇస్తుంది. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు. కనుక అమ్మ భారం కాకూడదు, భార్య బానిస కాకూడదు. అర్థం చేసుకొని మసలుకోవడంలోనే అనంతమైన ఆనందం ఉందని గుర్తిస్తే, జీవితం సంతోషమయం అవుతుంది. ఒకే వ్యక్తితో ప్రతిరోజు ప్రేమలో పడటం వివాహము.

No comments:

Post a Comment