28వ సామాన్య ఆదివారము, Year B

28వ సామాన్య ఆదివారము, Year B
సొ. జ్ఞాన. 7:7-11; హెబ్రీ. 4:12-13; మార్కు. 10:17-30
జ్ఞానం విలువైనది
మొదటి పఠనములో దైవభక్తుడు ఇజ్రాయేలు రాజు సొలోమోను జ్ఞానంకోసం ప్రార్ధించాడు. “నేను ప్రార్ధన చేయగా దేవుడు నాకు వివేకమును ఒసగెను. నేను మనవి చేయగా, జ్ఞానాత్మము నా మీదికి దిగి వచ్చెను”. సొలోమోను దైవజ్ఞానముతో ప్రజలను పరిపాలించెను. సంపద, అధికారముకన్న జ్ఞానమును వేడుకొనుటలో, సొలోమోను వినయము, వివేచనమును చూడవచ్చు. అన్నింటికంటే జ్ఞానము విలువైనది. మానవ ప్రయత్నముతో మాత్రమే పొందేది కాదు. జ్ఞానము దైవీక బహుమానము. ప్రార్ధన, దేవుని దయవలన ఒసగబడుతుంది. వెండి, బంగారము, సంపద, అధికారము, ఆరోగ్యము, సౌందర్యము, వెలుతురుకన్న జ్ఞానము గొప్పది. జ్ఞానముతో పోల్చితే, బంగారం ఇసుక ముద్ద, వెండి మట్టి పెళ్ల. జ్ఞానము యొక్క కాంతి ఏనాడు తరిగిపోదు. జ్ఞానము యొక్క కాంతి దైవీక మూలాన్ని సూచిస్తుంది. మనకు మార్గనిర్దేశం, జ్ఞానోదయం చేయగల సామర్ధ్యాన్ని సూచిస్తుంది. జ్ఞానములో నిజమైన సంపదను కనుగొన బడుతుంది. జ్ఞానముతో సమస్త ప్రశస్త వస్తువులను, బహుసంపదలను పొందుతాము. ఇది యేసు క్రీస్తు బోధనలను గుర్తుకు చేస్తుంది, “మొదట దేవుని రాజ్యమును, నీతిని వెదకుడు. అప్పుడు అన్నియు మీకు అనుగ్రహింప బడును” (మత్త 6:33).
పరిశుద్ధాత్మ సప్తవరాలలో జ్ఞానము ఒకటి (యెషయ 11:2-3). కనుక, కతోలిక ధ్రుక్పధములో, జ్ఞానమును వెతకుట ప్రాముఖ్యము. జ్ఞానము మనకు నిజమైన ఆనందాన్ని కలుగజేస్తుంది. దైవజ్ఞానం మనలను దేవునితో లోతైన సహవాసములోనికి నడిపిస్తుంది. జ్ఞానము యొక్క విలువ కేవలం మేధోపరమైనది మాత్రమే కాదు, ఆచరణాత్మకమైనది. ఎందుకన, మనలను దేవునికి దగ్గర చేస్తుంది. సరైన మార్గాన్ని గుర్తించడములో, ప్రేమ, వినయము, న్యాయము ప్రతిబింబించే నిర్ణయాలు తీసుకోవడములో తోడ్పడుతుంది. ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకుంటాము. జ్ఞానముద్వారా, దేవునినుండి మాత్రమే వచ్చే శాశ్వతమైన శాంతిని కనుగొంటాము. దేవుని చిత్తానికి అనుగుణముగా ఉంచుతుంది. ధర్మబద్ధముగా జీవించడానికి నడిపిస్తుంది. తద్వారా, మన జీవితాన్ని సరైన క్రమములో ఉంచడములో జ్ఞానము ప్రధాన పాత్ర పోషిస్తుంది.
క్రీస్తు దేవుని జ్ఞానము
దేవుని జ్ఞానమే నూతన నిబంధనలో యేసుక్రీస్తు రూపంలో ప్రజలమధ్య ప్రత్యక్షమై ఉన్నది. “క్రీస్తు దేవుని జ్ఞానమునై ఉన్నాడు” (1 కొరి 1:24). క్రీస్తు దేవుని జ్ఞానముయొక్క స్వరూపము. దేవుని జ్ఞానమును వెంబడించడం అనగా క్రీస్తుతో సహవాస సంబంధాన్ని కొనసాగించడం. “క్రీస్తుయందు దేవుని వివేక విజ్ఞానముల సంపదలన్నియు గుప్తమై యున్నవి” (కొలొస్సీ 2:3). క్రీస్తు దేవుని జ్ఞానమునకు మూలము. జ్ఞానము సృష్టి ఆరంభమునుండి దేవునితో నున్నది (సామె 8:22-31). ఇది ఆదిలో దేవునితో నుండిన వాక్కు అయిన క్రీస్తును సూచిస్తున్నది (యోహాను 1:1-3). దేవుని జ్ఞానం, యేసుక్రీస్తులో శరీరధారి యాయెను. “వాక్కు మానవుడై మనమధ్య నివసించెను” (యోహాను 1:14) అనగా మానవాళికి దేవుని జ్ఞానము సంపూర్ణముగా బయలుపరచ బడినది. యేసుద్వారా దేవుని జ్ఞానం మానవాళికి అందించబడినది. దేవుని చిత్తానికి అనుగుణముగా ఎలా జీవించాలో చూపిస్తుంది. ఆయన బోధనలు, అద్భుతాలు, శ్రమలు, మరణ-పునరుత్థానములు దేవుని జ్ఞానమును కార్యరూపమును దాల్చినవి. శ్రీసభ పితరులు పునీత అథనాసియస్ యేసు దేవుని జ్ఞానముగా దేవుని సృష్టిలో పాల్గొన్నాడు. మానవాళిని రక్షించుటలో ముఖ్య పాత్రను పోషించాడు అని, పునీత అగుస్తీను క్రీస్తు శాశ్వతమైన జ్ఞానము అని పేర్కొన్నారు. యేసు దేవుని జ్ఞానము అనునది మన రక్షణను అర్ధం చేసుకోవడములో కూడా సహాయపడుతుంది. క్రీస్తును అనుసరించడం ద్వారా దైవీక పరమ రహస్యములోనికి ఆకర్షింపబడి నిత్యజీవితమువైపు నడిపింప బడుచున్నాము. అందుకే కతోలిక దైవార్చన సంవత్సరములో, ముఖ్యముగా ఆగమన కాలములో యేసును దేవుని జ్ఞానముగా కొనియాడుతూ ఉంటాము.
అందుకే ఈనాటి రెండవ పఠనములో దేవునివాక్కు గురించి దాని ప్రతిఫలం గురించి అర్థవంతంగా వివరించబడినది, “దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమునైనది. పదునైన రెండంచుల ఖడ్గము కంటెను పదునైనదిమానవుల హృదయము లందలి ఆశలను ఆలోచనలను అది విచక్షింప గలదు” (హెబ్రీ 4:12). దేవుని వాక్యమును అర్థం చేసుకోవాలంటే ప్రతి మానవునికి దేవుని జ్ఞానము అవసరం. ఎందుకన, కీర్తన కారుడు 119:105 లో ఈ విధముగా సెలవిస్తున్నాడు, “నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు.” మన అనుదిన జీవితంలో, మన నడవడికలో, దేవుని వాక్కురూపంతో కూడిన జ్ఞానం అవసరం. బైబిల్ గ్రంధంలో పలుచోట్ల దేవుని వాక్కుగురించి ఈ విధంగా వివరించబడింది: దేవుని అద్భుతం: కంటికి కనిపించని వానినినుండి కంటికి కనిపించునట్లుగా దేవుని వాక్కుచేత ప్రపంచం సృజింపపబడింది. దేవుని వాక్కు యొక్క ఫలం: “వానయు మంచుయు ఆకాశమునుండి దిగివచ్చి, అచ్చటికి మరలిపోకదేవుని నోటనుండి వెలువడు వాక్కు నిష్ఫలంగా తిరిగిపోక దేవుని సంకల్పం నెరవేర్చును”. (యెషయ 55:10-11). దేవుని వాక్కు నూతన సృష్టి: ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు తన వాక్కుద్వారా సృష్టిని, జీవరాసులను, కాలములను, యుగములను చివరికి మానవుని తనదైన రీతిలో వాక్కు ద్వారా సృజించెను.
ధనాపేక్ష – దేవరాజ్యము
ఇటువంటి గొప్పదైన జ్ఞానమును మరచిపోయి ధనాపేక్ష వలన పరలోకాన్ని కోల్పోయిన ఒక యువ ధనికుని ఉపమాన రీతిలో ప్రభువు, తానే నిజమైన జ్ఞానాన్ని అని సువిశేష పఠనములో నిరూపిస్తున్నారు. నేటి సువిశేష పఠనాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు: (1) ధనాన్ని పేదలకు పంచి యేసుని అనుసరించ ఇష్టము లేని ధనవంతుని పాత్ర. (2) యేసుని అనుసరించటానికి తనకున్న సమస్తమును త్యజించాలన్న శిష్యుని పాత్ర. (3) దైవరాజ్యంలో ప్రవేశించటం ధనవంతులకు అసాధ్యం అన్న యేసు పాత్ర.
ఈ మూడింటిపై మనకు దేవుడు ఇచ్చే గొప్ప జ్ఞానం ధనం కంటే దేవునిరాజ్యం చాలా విలువైనది అని తెలుపబడుతుంది. సకల అనర్థాలకు మూలం ధనాపేక్ష (1 తిమో 6:10). ధనవంతులు ఏమైనా చేయగలరు అనునది నిజమైన జ్ఞానం కాదు. ధనం మానవుని మనుగడకు సృజించుకొన్న ఒక వ్యాపనం. దీపం విలువ చీకట్లో తెలుస్తుంది. రూపాయి విలువ అవసరంలో తెలుస్తుంది. స్నేహితుని విలువ ఒంటరితనంలో తెలుస్తుంది. కాని దేవుని ప్రేమ, కృపను మనం వెలకట్టలేము. దాన్ని అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది.
యువ ధనికుడు నిత్యజీవమును పొందుటకు ఏమి చేయవలయును అని అడుగగా, నీతిమంతమైన జీవితాన్ని జీవించడానికి మొదటిగా యేసు దైవాజ్ఞలను సూచించాడు. అతను దైవాజ్ఞలను అన్నింటిని బాల్యము నుండి పాటించుచునే ఉన్నాను అని పలికాడు. నైతికముగా అతను చాలా దృఢముగా ఉన్నట్లు. అయితే, చట్టానికి కట్టుబడి ఉంటె మాత్రమే శాశ్వత జీవితాన్ని పొందవచ్చునన్నది అతని నమ్మకం అని అర్ధమగుచున్నది. యేసు అతని నిష్కపటతను గుర్తించి, అతని వంక ప్రేమతో చూచాడు. “నీవు వెళ్లి నీకు ఉన్నదంతయు వెచ్చించి, పేదలకు దానము చేయుము. పిమ్మట వచ్చి నన్ను అనుసరింపుము. పరలోకమందు నీకు ధనము చేకూరును” అని గొప్ప సవాలును విసిరాడు. ఈ సవాలు, పిలుపు కేవలం పేదరికం గురించి కాదు, దేవునిపై పూర్తిగా ఆధార పడటం గురించి. ఆ యువకుడిని అసలుసిసలు అయిన శిష్యరికములోనికి ఆహ్వానిస్తున్నాడు. సంపదలను వదిలిపెట్టి, యేసు ప్రభువును హృదయపూర్వకముగా అనుసరించాలి. ఆ యువకుడు అధిక సంపద గలవాడగుటచే, మొగము చిన్నబుచ్చుకొని ‘వెళ్ళిపోయెను’ [ఎప్పటికీ తిరిగి రాలేదు]. సంపదతో అతనికున్న అనుబంధం, యేసును అంగీకరించకుండా అడ్డుకున్నది. అందుకే ప్రభువు తన శిష్యులతో, “ధనవంతులు దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము!” అని అన్నాడు. ఇది నిజముగా శిష్యులను ఆశ్చర్యపరచింది. ఎందుకంటే, తరచుగా సంపదలు దేవుని అనుగ్రహముగా భావించేవారు. “ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించట కంటె, ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభము” అనగా సంపదలను అంటిపెట్టుకొని ఉండేవారు దేవునికి సంపూర్ణముగా లొంగిపోవడం ఎంత కష్టమో ఈ అతిశయోక్తి తెలియ జేస్తుంది. ఎందుకన, సంపదలను అంటిపెట్టుకోవడం దేవునిపై ఆధార పడటానికి అడ్డంకిగా ఉంటుంది.
శిష్యులు మరింత ఆశ్చర్యముతో, “అట్లయిన ఇక ఎవడు రక్షణ పొందగలడు?” అని గుసగుసలాడుకొనిరి. ఎందుకన, మానవ ప్రయత్నముగానే రక్షణ సాధ్యం అని వారు నమ్మారు. అందుకే ప్రభువు, “మానవులకు ఇది అసాధ్యము. కాని, దేవునకు సమస్తము సాధ్యమే” అన్నాడు. రక్షణ అనేది దేవుని దయానుగ్రహము. మానవ ప్రయత్నం, యోగ్యత కాదు అని అర్ధమగుచున్నది.
అప్పుడు పేతురు, యేసుకోసం తమ సమస్తాన్ని విడిచి పెట్టామని గుర్తుచేస్తూ, “ఇదిగో! అంతయు విడిచి పెట్టి మేము మిమ్ము అనుసరించితిమి” అన్నాడు. అందుకు యేసు, “ఇది వాస్తవమే, నా కొరకు, నా సందేశము కొరకు ఇంటిని, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తండ్రిని, తల్లిని, బిడ్డలను, భూములను త్యజించువాడు, ఈ లోకముననే నూరంతలుగా ప్రతి ఫలమును పొందును...పరలోకములో శాశ్వత జీవమును పొందును” అని శిష్యులకు భరోసా ఇచ్చాడు. అట్లే హింసల గురించి ప్రస్తావించడం, యేసును అనుసరించడం కష్టాలు లేకుండా, త్యాగాలు చేయకుండా ఉండదని సూచిస్తుంది. అయితే, త్యాగాలకన్న ప్రతిఫలము నూరంతలుగా ఉండును.
ధనానికి దైవానికి ఉన్న వ్యత్యాసం
ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం (1 తిమో 6:10). ధనమును నమ్ముకున్నవాడు పాడయిపోవును (సామె 11:28). నీ ధనము ఎక్కడ ఉండునో, అక్కడే నీ హృదయము ఉండును (మత్త 6:21). భూమిమీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు (మత్త 6:19). పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడు (మత్త 6:20). వారు సమృద్ధిగా కానుకలు వేసిరి కాని పేద విధవరాలు తన లేమినుండి ఉన్నదంతయు త్యాగం చేసింది (మార్కు 12:44). దేవుడు ధనవంతునితో, ఓరి! అవివేకి, ఈ రాత్రికి నీ ప్రాణములు తీసివేయబడును. నీ సంపద ఎవరిదగును? (లూకా 12:20).
ఈనాటి మూడు పఠనాల సారాంశమును గ్రహిస్తే, సొలోమోనువలె జ్ఞానవంతులై, ధనానికి దైవానికి గల వ్యత్యాసాన్ని గ్రహించగలం. ధనము అనేది మంచికి ఉపయోగించాలి కాని దానికి మనం లొంగితే దేవుని జ్ఞానాన్ని, ప్రేమను, ఆశీర్వాదాన్ని, పరలోక సంపదను కోల్పోతాము. దేవుడు మనకు కలిగించిన దానిని, దేవుని సేవకై, దేవుని వాక్కు ప్రకటనకై, వెచ్చిస్తూ సంతృప్తి కలిగిన దేవుని బిడ్డలవలె జీవించుదాం! మన అనుబంధాలు, ప్రాధాన్యతలు ఏమిటో, క్రీస్తును అనుసరించడములో మనకున్న అడ్డంకులు ఏమిటో పరిశీలించుకుందాం!

No comments:

Post a Comment

Pages (150)1234 Next