29వ సామాన్య ఆదివారము, Year B

29వ సామాన్య ఆదివారము, Year B
యెషయ 53:10-11; కీర్తన. 32; హెబ్రీ. 4:14-16; మార్కు. 10:35-45.

అధికార వ్యామోహం - సిలువ పరమార్ధము
ధర్మ, అర్ధ, కామ, మోక్షలు పురుషార్ధాలు అని మన భారతీయ సనాతన ధర్మం తెలియజేస్తుంది. అంటే పుట్టిన ప్రతి మనిషి ధర్మంగా ఉంటూ ఆస్తి అంతస్తులు సంపాదించి, సంసారం చేసి, పిల్లలను కని, అటు వెనుక మోక్షం పొందాలనే అర్థాన్ని తెలియజేస్తుంది. కాని, దానికి భిన్నంగా, క్రీస్తు జీవిత పరమార్ధం ఇతరులను ప్రేమతో సేవిస్తూ, జాలి, కనికరము, సోదరభావంతో సేవక పాత్ర పోషిస్తూ కార్య నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను, శ్రమలను భరిస్తూ దైవరాజ్య స్థాపనకై శ్రమిస్తూ జీవితాంతము ఇతరులకై జీవించడమే జీవిత పరమావధి అని తెలియజేస్తున్నారు. మోక్ష రాజ్యాన్ని మనము పొందాలంటే క్రీస్తును అనుసరిస్తూ సేవాభావంతో జీవిస్తూ, ఆయన సిలువలో భాగస్థులను కావాలి. ఆయన పాత్రను నుండి మనము పానము చేయగలమా ఆయన సిలువను మనము మోయగలమా అని ప్రశ్నించుకోవాలి. ఆయన పాత్ర చేదుగా ఉంటుంది కాని మనకన్నా ముందే ఆయన పానంచేసి, మనము కూడా పానము చేయగలమని తెలిపియున్నారు. ఆయన సిలువ బరువుగా ఉంటుంది కానీ మన కన్నా ముందే ఆయన సిలువను మోసి దానిని తేలికగా చేసి ఉన్నాడు. సిలువ ప్రేమకు సేవకు చిహ్నం.

క్రీస్తు జీవితమే మనకు ఆదర్శం. ఆయన సేవింపబడుటకు కాక సేవచేయుటకు తన జీవితమును అర్పించుటకు వచ్చిఉన్నాడు - మార్కు. 10:45; మత్త. 20:24-28; లూకా. 22: 24-27.

శ్రమలు - అంతరార్థం
జీవితం సుఖమయం కావాలని అందరూ ఆశిస్తారు. కాని శ్రమలు బ్రతుకు బండిని కుంగదీయాలని ఎవరు కోరుకోరు. అందరిలో గొప్పగా ఉండాలని, అందరూ చెప్పుకునే విధంగా ఆస్తి అంతస్తులతో, అధికారంతో, ఇతరులను శాసించాలని మనసు అంతరాలలో వ్యామోహం మనుషుల్లో దృఢంగా ఉంటుంది. కానీ బాధను భరిస్తూ ఇతరుల యోగక్షేమాలపై వారి పాపాల పరిహారమై ఒకరు మరణించటం మనం క్రీస్తునందు చూస్తున్నాము. “అతని మరణం పాపపరిహారబలి అయ్యెను...అతనిని చూసి నేను వారి తప్పిదాలను మన్నింతును” (యెషయ 54:10-11). ఈనాటి మొదటి పటనములోని బాధామయ సేవకుడు, క్రీస్తు రక్షకుని సరిగ్గా పోలియున్నాడు. శ్రమలు అనుభవించి తన మరణము ద్వారా క్రీస్తు మానవాళిని పాప బంధవిముక్తులను చేయటం తండ్రి దేవుని చిత్తం. ఈ బలియాగంలో క్రీస్తు సేవ, శ్రమలే బలియాగం లేక జీవిత అర్చన ప్రార్ధనలని, మానవ బలహీనతలను తనే స్వయముగా భరించి శోధనలను గెలిచి మనకై బలియై, ప్రధాన అర్చకుడై, మన రక్షణకు అవసరమైన కృపావరాన్ని మనకు అందించాడు (హెబ్రీ. 4:14-16). ప్రేమకోసం, ఇతరులను పాపవిముక్తులను చేయటంకోసం శ్రమలను అనుభవిస్తూ, కావాలంటే చివరకు ప్రేమకోసం మరణించడం క్రీస్తు శ్రమల్లోని పరమార్ధం.

అధికార వ్యామోహం - సేవాభావం
జెబదాయి పుత్రులు యోహాను, యాకోబులు యేసుని తన రాజ్యంలో మహిమాన్విత సింహాసనముపై కుడి ఎడమ కూర్చుండ అవకాశం కావాలని కోరారు (మార్కు. 10:35-37). క్రీస్తుని అనుసరించడం అంటే అధికారం, సింహాసనం, క్రీస్తు తరువాత ప్రధాన పదవి అని వారు అనుకున్నారు. సేవ పేరిట వచ్చి సంఘంలో పదవి, అధికారంకోసం ఎందరో జీవితాన్ని కోల్పోవటం చూస్తున్నాము. సంఘములో చూసిన మేమే పెత్తనం చేయాలని, మావాళ్లే, పైన ఉండాలని చూస్తూ ఉన్నాం. శ్రీ సభ బలహీనంగా ఉండటానికి కారణం అధికార వ్యామోహం, సేవించటానికి వచ్చి సేవించబడటం; సిలువ మోస్తాను అని వచ్చి సింహాసనముపై కూర్చోవటం; ప్రేమిస్తాను అని చెప్పి ఇతరులను అగౌరవపరచటం. అధికారం కావాలి అంటే, సేవ, శ్రమల పాత్రను సేవించాలని క్రీస్తు ఆదేశిస్తున్నారు. జబదాయి కుమారుల మనవిని క్రీస్తు అంగీకరించలేదు.

క్రీస్తుమార్గం - జీవిత సాఫల్యం
జీవిత పరమార్ధం పదవులు అధికారం ఆధిపత్యం కాదని, జీవితం సోదరభావం, అందరిలో చిన్నవాడిగా అందరికీ సేవకునిగా తనను తాను కరిగిపోతూ, ప్రేమ, కరుణ, జాలి, అదే జీవిత పరమార్థమని క్రీస్తు తెలియజేస్తున్నారు. జబదాయి కుమారులు క్రీస్తుని అధికారం కోసం మనవి చేసినప్పుడు, శిష్యుల  బృందంలో అలజడి మొదలైంది. ఈర్ష, ద్వేషం, భేదభావంకోసం అనేక విధాలైన వ్యతిరేక భావనలు కలిగాయి. వెంటనే క్రీస్తు వారిని దగ్గరకు పిలిచి వారిని ఐక్యపరచి వారిలోని భావాలను తీసివేసి సోదరభావాన్ని నింపారు. అధికారము, ఆధిపత్యము, కోపాగ్నిని రగుల్చుతుంది. సేవ, సేవాభావం మనుషుల్లో దీనత, కరుణ, జాలిని నింపుతుంది. శ్రీసభ అధికారంతో విచ్ఛిన్నమైనప్పుడు నిస్వార్థ సేవకులు పుట్టాలి. అందరూ సింహాసనాల కోసం ప్రాకులాడుతున్నప్పుడు, సంఘంలో ప్రజల మధ్య పనిచేసి, సేవలో అలసిపోయే మంచి సేవకులు రావాలి. సంఘములో చిన్నవానిగా ఉండటం, శోధన జయించిన వారికే సాధ్యం. అన్నీ ఉండి ఏమీ లేని వారిగా, అధికారం ఉండి సర్వ సామాన్యంగా ఉంటూ, సన్మానాలకు, ఆర్భాటాలకు, పూజలందుకొనుటకు దూరంగా ఉండి, ప్రజలకు ఏది మంచో తెలియచేసే సేవకులు కావాలి. ఇదే జీవితం. ఇదే క్రైస్తవ జీవిత పరమార్థం.

ప్రపంచాన్ని సేవతో జయించాలి. మనం జ్ఞానంతో జీవించాలి. పరలోక రాజ్యము ను పొందాలంటే మనము యేసుప్రభువును ఎన్నుకోవాలి. ఎందుకనగా క్రీస్తే మన ఆశయం. ఆయనే మన జీవితానికి అర్థాన్ని ఇవ్వగలడు.

No comments:

Post a Comment