26వ సామాన్య ఆదివార ప్రసంగము, Year B

26వ సామాన్య ఆదివార ప్రసంగము, Year B
పఠనాలు: సంఖ్యా 11: 25-29; యాకో 5: 1-6; మా 9: 38-43, 45, 47-48

మానవ క్రైస్తవ సంఘాన్ని నిర్మించుదాం

మానవ కుటుంబాన్ని, సంఘాన్ని నిర్మించాలని ప్రభువు ఆహ్వానిస్తున్నారు. దైవరాజ్య నిర్మాణానికి ఇది మొదటి మెట్టు. దైవరాజ్యములో విభజనలు, బేధాభిప్రాయాలు ఉండవు. శాంతి, సమాధానాలు వర్ధిల్లును. ఇది అందరి ఏకత్వం; ఒకరినొకరు అర్థంచేసుకోవడం, గౌరవించడం. పునీత పౌలుగారు ఈ విధముగా అంటున్నారు: “దేవుని రాజ్యము అనగా తినుట త్రాగుట కాదు. పవిత్రాత్మ ఒసగు నీతి, శాంతి, సంతోషములే (రోమీ. 14:17). దైవ రాజ్యం అనగా మానవ కట్టడలు, సంస్థలు కావు. ఒకే దేవుడు, ఆయన మనందరి తండ్రి అనే నిజాన్ని దైవరాజ్యం తెలియజేయును. ఇదే సువార్తను క్రీస్తుప్రభువు బోధించాడు. ఇదే సువార్తను మనము కూడా ప్రకటించాలి. దేవుడు అందరివాడు. “ఆయన దుర్జనులపై, సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింప చేయుచున్నాడు. సన్మార్గులపై, దుర్మార్గులపై, ఒకే విధముగా వర్షింపజేయుచున్నాడు” (మత్త. 5:45). ఆయన యందు అందరూ సమానులే. ఆయనకు మనమందరము బిడ్డలమే. దేవుడు అందరిని ఒకే ప్రేమతో చూచునని యేసు తెలియజేసియున్నాడు.

క్రైస్తవులు ఒక మంచి మానవ ప్రపంచాన్ని నిర్మించాలి. క్రైస్తవులు ప్రత్యేక బాధ్యతను ఈ లోకములో కలిగియున్నారు - దైవరాజ్యమునకు సాక్షులుగా జీవించాలి. విశ్వాసములోను, సత్యములోను, జీవించాలి. ఆత్మలో జీవించాలి. ఎందుకన ఆత్మ మనలను ఐక్యం చేయును. సోదరభావంతో జీవింపచేయును. మనందరి తండ్రి దేవుడు అని తెలియజేయును.

‘మనకు విరోధి కాని వాడు మన పక్షమున ఉండువాడు” (మార్కు. 9:40). మంచి చేయు ప్రతివాడు ప్రభువుతో ఉండును. ఆ వ్యక్తి వేరుగా ప్రభువును అనుసరించక పోయినప్పటికిని, ప్రభువు అనుచరు డే. శిష్యులకు ప్రభువు రెండు విషయాలు నేర్పుతున్నాడు: 1. శిష్యులకు మరియు ఇతరులకు మధ్యన గోడలు నిర్మించారు. క్రీస్తు నామములో మంచి కార్యాలను చేయు ప్రతి వారిని శిష్యులుగా స్వీకరించాలి. 2. శిష్యులు అసూయను, ద్వేషమును జయించాలి సత్యాన్వేషణ చేయాలి.

దేవుని వాక్య ప్రకటన పవిత్రాత్మ వరం. మనమందరం దేవుని ప్రవక్త లం. కనుక దేవుని వాక్యమును బోధించాలి ప్రకటించాలి దైవ రాజ్య స్థాపనకై పాటుపడాలి. పవిత్ర ఆత్మ నందు మనమందరం ఒకే సంఘము. మనము దైవ సంఘము. మనలో ఉన్న స్వార్ధాన్ని, అసూయను, ద్వేషాన్ని వీడి అందరితో సఖ్యతగా జీవించుదము. ఇతరులను ఆలకించుదాం. అందరిని గౌరవించుదాం. కాబట్టి, మన జీవితప్రయాణంలో మార్పు చెందినవారుగా జీవించాలి. మంచి పనులు చేసే ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యములోనికి అర్హులు. క్రైస్తవులుగా సంఘాన్ని విడగొట్టకూడదు. దానికి బదులుగా సంఘాన్ని ఐక్య పరచాలి, బలపరచాలి.

No comments:

Post a Comment