ప్రేమను కురిపించే ప్రకృతి:
ఈ సృష్టిలో ప్రకృతి అందం అద్భుతం. ప్రకృతి అందానికి పరవశులై ఎంతోమంది హృదయాలనుండి కవిత్వం జాలువారుతుంటుంది. ఉదయించే సూర్యునినుండి జాబిలమ్మ వెన్నెలవరకు ప్రకృతి మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. ఆకాశంలోని నక్షత్రాలు చమక్కులతోటి మన కనులలో కాంతులను నింపుతాయి. నీటిబిందువు మనబుగ్గలపై పడినప్పుడు మనస్సు పొందే ఆనందం, తన్మయం అంతా ఇంతా కాదు. పువ్వునిచూసి పులకించనివారు ఎవరు? చల్లనిగాలులకు గుండెబరువు తేలిక కానివారు ఎవరు? మండు వేసవిలో చల్లనినీటిని, చెట్టునీడను కోరుకోనివారు ఎవరు? నెమలి నాట్యానికి, పక్షుల కిలకిల రాగాలకి పరవశులు కానివారు ఎవరు?
ఇలాంటి ప్రకృతిలో మనము జీవించడానికి ఎంతో అదృష్టం చేసుకున్నాము. అందమైన ప్రకృతినుండి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉన్నది. మనం ఇతరులకు ఏదైనా సందేశాన్ని చెప్పాలనుకున్నప్పుడు ప్రకృతిలోని అంశాలను ఉదాహరణగా తీసుకొని చెబుతూ ఉంటాము. మన ప్రభువుకూడా తన సందేశాన్ని ఉపమానాలద్వారా అనేకసార్లు ప్రకృతి అంశాలను జోడించి బోధించియున్నాడు. మనం వెలిగించే నిప్పునుండి, త్రాగే నీటినుండి, ధరించే దుస్తులనుండి, నివసించే గృహాలనుండి, పక్షులనుండి, జంతువులనుండి, సూర్యచంద్ర నక్షత్రాలనుండి, మనం నేర్చుకోవలసింది ఎంతో ఉన్నది.
నిస్వార్ధ ప్రేమ:
ప్రకృతినుండి ప్రప్రధమంగా ప్రేమను మనం నేర్చుకోవాలి. ప్రేమలో నిస్వార్ధ ప్రేమ గొప్పది. ఏమి ఆశించనటువంటిది. దేవునిప్రేమ నిస్వార్ధప్రేమ. మానవుని ప్రేమ కొంతవరకు స్వార్థం అయినది. సాధారణముగా, ఇతరులు మనలను ప్రేమించడానికి, వారి మెప్పుపొందటానికి ప్రేమిస్తూ ఉంటాము. ఒక్కోసారి ఈ ప్రేమకోసం ఈర్ష, ద్వేషం, విమర్శలను కలిగి ఉంటాము. మనల్ని ప్రేమించే వారిని మాత్రమేకాకుండా ప్రతిఒక్కరిని ప్రేమించాలి. ఇటువంటి ప్రేమ నిస్వార్ధమైనది. ప్రకృతిలో నిస్వార్ధమైన ప్రేమ ఉన్నది. చెట్టు ఇతరులనుండి ఏమీ ఆశించకుండానే పూలను, నీడనిస్తుంది. ఎండా, వాన, వెన్నెల అందరిపై ఒకేలా ఉంటాయి. అలాగే ప్రకృతిలో ప్రతిదీ అంతే! నేను అలాగే ఉన్నానా? నా ప్రేమ స్వార్థమయినదా లేక నిస్వార్ధమైనదా?
సంతృప్తికరమైన జీవితం:
నేను ఎటువంటి స్థితిలో జీవిస్తున్నప్పటికీ సంతృప్తికరంగా జీవించాలి. అసంతృప్తి ఎన్నో చెడుమార్గాలకి దారితీస్తుంది. మన జీవితాలలో జరిగిన చెడు సంఘటనలను పదేపదే గుర్తుకుతెచ్చుకొని బాధపడేకంటే, ప్రస్తుత స్థితినుండి లేవడానికి ప్రయత్నించాలి. మనకి చెడు తలపెట్టే వారిని క్షమించాలి. మన చుట్టూ ఉన్నవారితో అన్యోన్యంగా జీవించాలి. స్వార్థాన్ని, ద్వేషాన్ని, అహంకారాన్నివీడి నిస్వార్ధ ప్రేమను, విధేయతను, దయ, కనికరము, దానగుణములను అలవరుచుకోవాలి. అప్పుడే సంతృప్తికరమైన జీవితాన్ని జీవించగలము. సంపూర్ణ సంతృప్తి మనము నమ్మెడి దేవునిపై ఉండాలి. ఆయన తోడునీడతోనే మనము జీవించగలము. అందుకే దేవుడు ప్రకృతినంతటిని సృష్టించిన తర్వాతనే, ఇది మానవునికి సరిపోతుందని భావించిన తర్వాతనే మానవునికి జీవంపోశాడు. మానవుడు తననుతాను రక్షించుకోవడానికి ఎన్నోఏర్పాట్లను భద్రతను ఏర్పాటుచేసుకున్నాడు. కానీ ప్రకృతికి ఎటువంటి ఏర్పాట్లుగాని, భద్రతగాని లేవు. అనేక పరిస్థితులలో ప్రకృతియే మనకి భద్రతను కలిగిస్తుంది.
ప్రకృతి ఎప్పుడుకూడా అసంతృప్తికి లోను కాదు. సముద్రపు అలల తాకిడికి భరించలేనని తెలిసికూడా సముద్రపు ఒడ్డు ఎప్పుడు సంతృప్తిగా ఉండాలి. ఒక్కరోజు సూర్యుడు అలిగితే ఈ లోకం ఏమవుతుందో! మనముకూడా ఉన్నదానితో సంతృప్తిపడినట్లయితే మన జీవితాలు సాఫీగా సాగిపోతాయి. ఈనాటి యుద్ధాలు హత్యలు మతఘర్షణలు దూషణలు మొదలగు వాటిని కూకటివేళ్లతో పెకిలించవచ్చును.
ప్రకృతితో పయనం:
ప్రకృతి నీకోసం ఒక క్షణంకూడా ఆగదు. సమయం గతించిపోతూనే ఉంటుంది. లేనిచో ఈ లోకం ముందుకు సాగదు. భూమి బద్దలవుతోందని భూకంపాలు రాకమానవు. కొండలు బద్దలు అవుతాయని తుఫాన్లు రాకమానవు. చీకటి భయంకరమైనదని తెలిసికూడా రాత్రి రాకమానదు. అలాంటప్పుడు మనం ప్రకృతితో పయనం చేయాలి. ఒక్కక్షణం వెనుకబడిన దాని పరిణామం తీవ్రంగా ఉంటుంది. కష్టాలు బాధలు వచ్చినప్పుడు కృంగిపోక వాటిని ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి. గుండెలు ద్వేషంతోగాక ధైర్యముతో నింపుకోవాలి. వ్యక్తిత్వముకన్నా పేరు, పరువుప్రతిష్టలు గొప్పవేమీ కావు. ఒకవ్యక్తి తన తప్పును తెలుసుకున్నప్పుడు నిండు ప్రేమతో స్వీకరించాలి. వృధా అయిన క్షణం జీవితములో ఎప్పుడు తిరిగిరాదు. పలికినమాట వెనకకు తీసుకోవడం అసంభవం. కాబట్టి ప్రతి క్షణాన్ని ఈ లోకాభివృద్ధికి వినియోగించుకోవాలి. మాట్లాడే ముందు ఆలోచించాలి. హృదయం పగిలితే అతకదని తెలిసికూడా మరణము తప్పదు. ఆ మరణం మనకి రాకముందే మనము మంచి జీవితాన్ని జీవించాలి. మరణానికి మనము ఎప్పుడుకూడా సిద్ధంగా ఉండాలి.
No comments:
Post a Comment