24 వ సామాన్య ఆదివారము, Year B

24 వ సామాన్య ఆదివారము, Year B
యెషయ 50:5-9; యాకో 2:14-18; మార్కు 8:27-35

మనం దేవుని చేత అభిషేకింపబడిన సేవకులము

"నన్ను గూర్చి మీరు ఏమనుకునుచున్నారు?" అని యేసు తన శిష్యులను అడుగుగా, పేతురు, "నీవు క్రీస్తువు" అని ప్రత్యుత్తర మిచ్చెను. ప్రియ స. స.లారా! యేసు అనగా రక్షకుడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు (మెస్సయ్య). 

తండ్రి దేవుడు తన రక్షణ ప్రణాళికను తెలియచేయటానికి, దానిలో భాగస్థులను చేయటానికి తన కుమారుడైన యేసుక్రీస్తును మన మధ్యలోనికి పంపారు. 'అభిషేకం' అనేది ఒక ప్రత్యేకమైన ప్రేషిత కార్యము కొరకు. క్రీస్తు విషయములో అది లోకరక్షణ కొరకు. నూతన నిబంధనలో కూడా దేవుడు పవిత్ర తైలంతో ఎంతోమందిని అభిషేకించాడు - ఉదాహరణకు, ప్రవక్తలు, రాజులు, అర్చకుల ను అభిషేకించారు.

సువిషేశములో, యేసు తన శిష్యులను "నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు" అని ప్రశ్నించినప్పుడు, "నీవు క్రీస్తువు" అని పేతురు సమాధానం ఇచ్చి ఉన్నాడు. అనగా, క్రీస్తు అభిషిక్తుడు అని శిష్యులు తమ వ్యక్తిగత అభిప్రాయాన్ని, విశ్వాసాన్ని ప్రకటించియున్నాడు. మనముకూడా నేడు మన విశ్వాసాన్ని ప్రకటించాలి. మన సమాధానం మన విశ్వాసముపై ఆధారపడి ఉంటుంది. ఇతరుల అభిప్రాయముకాక మన విశ్వాసాన్ని మన అభిప్రాయాన్ని ప్రకటించగలగాలి. "ప్రజలు" ఏమనుకుంటున్నారు అన్నది ముఖ్యం కాదు (ఇతరులు - క్రీస్తు దేవుడు కాదని చెప్పడం మీడియాలో చెప్పడం వింటున్నాము). ఆయన శిష్యులమైన మనం ఏమనుకుంటున్నాము అన్నది ముఖ్యం.

క్రీస్తుతో వ్యక్తిగత పరిచయం, అనుభూతి కలిగి ఉన్నప్పుడే (నిజమైన శిష్యరికం), మన విశ్వాసాన్ని మనము ప్రకటించగలం. క్రీస్తుతో, వ్యక్తిగత అనుభూతి కలిగి ఉండాలంటే మనం ఆయనతో ఉండాలి; ప్రార్థన, ధ్యానం చేయాలి; దేవుని వాక్యమును మననం చేయాలి; యేసుతో, ఆధ్యాత్మిక బంధాన్ని కలిగి ఉండాలంటే, పాపసంకీర్తనం చేయాలి, దివ్య పూజాబలిలో పాల్గొనాలి. నిజ శ్రీసభ సభ్యులుగా, క్రీస్తు శరీరంలో భాగస్తులుగా జీవించాలి. క్రీస్తులో ఐఖ్యమై జీవించాలి.

అభిషిక్తుడు - నిజమైన అర్ధం (సిలువ ద్వారా నిత్యజీవం): అభిషిక్తుడైన దేవుని కుమారుడు శ్రమలను పొంది, మరణించి ఉత్తానం చెందాలి (మార్కు. 8:31). క్రీస్తు లేదా అభిషిక్తుడు (మెస్సయ్య) అని దానికి నిజమైన అర్థాన్ని యేసు శిష్యులకు బోధించాడు. “మనుష్యకుమారుడు అనేక శ్రమలను అనుభవించి, నిరాకరింపబడి, చంపబడి, మూడవ రోజున ఉత్థానమగుట అగత్యము” అని ఉపదేశించాడు. ఈ విధముగా “క్రీస్తు” అను పేరులోని నిగూఢ అర్థాన్ని యేసు తన శిష్యులకు ఉపదేశించాడు.

క్రీస్తు బాధామయ సేవకుడు (యెషయ 50:5-9) అని మొదటి పఠనములో విన్నాము. బాధామయ సేవకుడు దేవుని నుండి వచ్చు వాక్కును వినుటవలన, దానిని బోధించడంవలన, కష్టాలను శ్రమలను పొందును. అతను జ్ఞానముతో నిండి, శ్రమలలో కూడా అతను తన బోధనను కొనసాగించును, ఎందుకన “ప్రభువైన దేవుడు తనకు తోడ్పడును” (యెషయ 50:7-9).

క్రైస్తవులుగా మన గుర్తింపు ఏమిటి?: క్రీస్తు తన ఉపదేశము ద్వారా,  తనను గూర్చి తెలియజేసియున్నాడు. ఆయనను విశ్వసించు వారిగా, క్రైస్తవులుగా మన గుర్తింపు ఏమిటి? మనము చేయు మంచి కార్యములను బట్టి మన గుర్తింపును తెలుపగలము (మార్కు. 7:15-20). మనమ చేయు మంచి కార్యములను బట్టి, మనం జీవించే పరస్పర ప్రేమను బట్టి, మనం క్రీస్తు శిష్యులుగా, దేవుని బిడ్డలముగా గుర్తింపును కలిగి యుంటాము.

దివ్య సంస్కారముల ద్వారా మనము అభిషిక్తులము గావించబడి ఉన్నాము. జ్ఞానస్నానముద్వారా, క్రీస్తు నామమును మనము ధరించియున్నాము; భద్రమైన అభ్యంగనముద్వారా, పవిత్రాత్మతో నింపబడి క్రైస్తవులుగా జీవిస్తున్నాము. ఈ గుర్తింపును మనం ఎల్లప్పుడూ కాపాడు కోవాలి. పాపసంకీర్తనం, దివ్యబలిపూజ ద్వారా దేవుని కృపచేత పోషింపబడి క్రైస్తవ ప్రేషిత కార్యాన్ని కొనసాగిస్తున్నాము. మన ప్రేషితకార్యం ఏమనగా - క్రీస్తువలే జీవించడం, మరో క్రీస్తుగా మారడం.

క్రీస్తు తన గుర్తింపును తెలియజేసిన తర్వాత, తన జీవితంలో భాగస్తులు కమ్మని తన శిష్యులను ఆహ్వానించి ఉన్నాడు. ఆయనను ఆలకించువాడు, అనుసరించువాడు, దైవ ప్రేషిత కార్యమునకు అభిషిక్తుడు కావలెను. ఇదే మన పిలుపు: “నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను మోసుకొని నన్ను అనుసరింప వలయును. తన ప్రాణము కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము నా సువార్త నిమిత్తము తన ప్రాణమును ధారపోయువాడు దానిని దక్కించుకొనును” (మార్కు. 8:34-35). మార్గమును గురించి మనం చింతించవలసిన అవసరము లేదు. “సిలువ మార్గమును” ప్రభువు సిద్ధము చేసి ఉన్నాడు. మన లోకాశలను, లోకపు పనులను విడచి మంచి పనులు అనగా దైవసంభంధమైన పనులను చేయాలి. దేవుని ఆజ్ఞల ప్రకారముగా, దేవుని చిత్తాన్ని బట్టి జీవించాలి. విశ్వాసమును ప్రకటించడంతో పాటు దానిని జీవించాలి.

No comments:

Post a Comment