25వ సామాన్య ఆదివారము, Year B

25వ సామాన్య ఆదివారము, Year B
సొ.జ్ఞాన. 2:12, 17-20; యాకో. 3:16-4:3; మార్కు. 9:30-37

జీవితము నుండి... శాశ్వత జీవితములోనికి...
(అదే మన జీవితానికి అర్థం... లేకుంటే అంతా వ్యర్థం)

క్రీస్తునాధునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా! ఈనాటి మొదటి పఠనములో, రెండు రకాల దృక్పథాలను (దుష్టుల, నీతిమంతుల) గూర్చి వింటున్నాము. దుష్టులకు ఇహాలోక జీవితంపై ఉన్న అభిప్రాయం, ఆలోచనలను, అవగాహనను, మరియు నీతిమంతుల అభిప్రాయాలను, ఆలోచనను గురించి వింటున్నాము. ఒకే జీవితం రెండు విధాలుగా వివరించబడుతుంది. ఒకే సత్యమును ఒక వర్గం వారు వ్యర్ధంగా భావిస్తే, మరొక వర్గం వారు అర్థపూరితముగా భావిస్తున్నారు. వీరి ఆలోచనలు అవగాహనలలో తేడా ఉండటానికి కారణం ఏమిటి? ఈ భిన్నత్వానికి కారణం ఏమిటో ఈరోజు తెలుసుకుందాం!

మొదటి పఠన సందర్భమును, సందేశమును వివరించుకొందాము. గ్రంథకర్త జ్ఞానగ్రంథములోని రెండవ అధ్యాయములో దుష్టులను గురించి, నీతిమంతుల గురించి ప్రస్తావిస్తున్నారు. ఇహలోకపు జీవితమును గురించి, దుష్టుల ఆలోచనలను వివరిస్తున్నాడు. దుష్టుడు, జీవితము స్వల్పకాలికమైనదని, దుఃఖముతో నిండినదని, నిరాశాజనకంగా ఉందని, మృత్యువుతో అంతా నాశనం అవుతుందని అందుకే నీతిమంతునిగా విలువలతో, విజ్ఞానములో జీవించడం అర్థంలేనిదని, ఆచరణకు అర్హంకాదని, కాబట్టి ఇష్టం వచ్చినట్లు ఈ లోకపు భోగములను అనుభవించమని, ఎలాగైనా ఉన్నన్ని రోజులు, జీవించినన్ని రోజులు అనుభవించు, ఆనందించు అని పిలుపునిస్తున్నాడు.

అసలు ఈ దుష్టులు ఎవరు? వారి గుణాలు ఏమిటి? పాత నిబంధన గ్రంథములో "దుష్టులు" అనగా తమను తాము దేవుని నుండి వేరుపరచుకొన్న వారు. దేవునితో ఉన్న బంధమును, అనుబంధమును తెంచుకున్నవారు. దైవభీతి, దైవభయం లేకుండా అన్యాయం చేయువారు; అవినీతిని ప్రేమించువారు; విశ్వాసం లేనివారు; దేవుని నియమములను చట్టములను పాటించనివారు; అది మాత్రమే కాదు, దేవున్ని తిరస్కరించువారు; దేవుని నిబంధనను ఉల్లంఘించువారు. 'దుష్టులు' అనగా కల్మషం కలవారు. దేవునితో బంధమును తెంచుటకు అలవాటు పడినవారు. అలాగే దేవుని నుండి వేరుపడినవారు; దేవుని స్థానమును మరియొకరికి గాని ఇతర వస్తువులకు గాని అంకితం చేయువారు.

దుష్టులు తమను తాము దేవుని నుండి వేరుపరచుకొన్న తర్వాత, తమ ఇష్టము వచ్చినట్లు చేయువారు, జీవించువారు. ఈ లోకములో జీవితం క్షణికం, యాదృచ్చికం, కనుక దానికి ఒక లక్ష్యంగాని, విలువలుగాని లేవని, జీవించినన్ని రోజులు ఆనందించు, ఆస్వాదించు అని, నీవు ఆనందించిన క్షణాలు తప్ప నీకు ఏమీ లేదు అను ఆలోచనలు గలవారు దుష్టులు. 

ఈనాటి మొదటి పఠనములో విన్నట్లుగా, దుష్టులు నీతిమంతులను వదిలించుకోవాలని చూస్తున్నారు, ఎందుకంటే, నీతిమంతులు దేవుని నియమాలను బోధిస్తూ, గుర్తుచేస్తూ తమ ఆనందానికి అడ్డుగా ఉన్నారు. దుష్టులకు పీడకలగా ఉన్నారు. తమ చెడు కార్యములకు అసౌకర్యంగా ఉన్నారు; తమ మాటలను, చేతలను వ్యతిరేకిస్తున్నారు. తమ పాపములను ఎత్తి చూపుతున్నారు. నీతిమంతులు దేవునియందు విశ్వాసం కలిగి ఉన్నారు, వారి విశ్వాసం యదార్థము అని దుష్టులు చెప్పుకొనుచున్నారు.

రెండవ వర్గమునకు చెందిన సజ్జనులు అనగా నీతిమంతులు ఎవరు? సజ్జనులు ఎవరంటే, దేవుడు తమ తండ్రి ('అబ్బా' = ప్రియమైన తండ్రి) అని తమను సృష్టించి పోషించి కాపాడువారని అని నమ్మేవారు. ఈ లోకపు జీవితం స్వల్పకాలికమైననూ, దానికి ఒక లక్ష్యం ఉందని, కష్టమైనా నష్టమైనా, విలువలను పాటించాలని, శోధనలో దేవుని విడువకుండా ఉండాలని, ఆయనపై నమ్మకం ఉంచాలని ఆయన నమ్మదగిన దేవుడు అని, ఎల్లప్పుడూ దేవుని నియమాలను పాటిస్తూ, ఆయన నిబంధనను గౌరవించాలని, దైవభయము, దైవభీతి కలిగి ఉండాలని చెప్పేవారు మరియు చేసేవారు. జీవితములో కష్టములు, సమస్యలు ఎదురైనంత మాత్రాన జీవితమంతా శోకమయం కాదు అని నమ్మేవారు.

జీవితం వ్యర్థంకాదు. సమస్యలను, సందేహాలను, కష్టాలను, అవరోధాలను చూసి భయపడకుండా, వీటన్నింటినీ నడిపించే దేవుడున్నాడని, మనం చూపిన విశ్వసనీయతకు, నమ్మకమునకు, సహనమునకు తగిన బహుమానమును  దేవుడు ఒసగుతాడు అని నమ్మేవారు నీతిమంతులు. వీరు సంపద మీద కాని, అధికారం మీద కాని, ఈలోక శక్తుల మీద కాని ఆధారపడకుండా, దేవుని మీద, దేవుని నడిపింపు మీద, దేవుని ప్రేమయందు విశ్వాసముంచు వారు.

సందేశం

ప్రియ సోదరా, సోదరీ! నీవు దుష్టునివలెనా లేక నీతిమంతునివలె జీవించాలని అనుకుంటున్నావు? నీవు దేవునితో సంబంధాన్ని పెంచుకుంటున్నావా? ఆయన కట్టడలను నియమాలను పాటిస్తున్నావా? లేదా ఆయన మాటలను నిర్లక్ష్యం చేయుచున్నావా? నీ సంతోషం కొరకు, నీ ఆనందం కొరకు నీ తృప్తి కొరకు మాత్రమే ప్రయాస పడుచున్నావా? లేక నీ సంతోషములను త్యాగంచేస్తూ కష్టమైనా, నష్టమైనా దేవుని మార్గంలో నడచుటకు ప్రయత్నం చేస్తున్నావా? నీ కోసం జీవిస్తున్నావా లేక దేవుని మహిమకోసం, ఆయన ఘనతకోసం విలువలకోసం, విజ్ఞానంకోసం జీవిస్తున్నావా? 

ఈ జీవితాన్ని శాశ్వత జీవితంగా మార్చుకోవాలంటే దేవున్ని నీ జీవితానికి కేంద్ర బిందువుగా మార్చుకోవాలి. ఆయనచుట్టూ ఆయన సహాయంతో, సహవాసంతో నీ జీవితాన్ని మలచుకోవాలి, మార్చుకోవాలి. దుష్టుడు జీవితాన్ని చూసినట్టు కాకుండా, సజ్జనుడు జీవితాన్ని చూసినట్లు దేవునితో సంబంధం కలిగిన జీవితాన్ని జీవించాలి. దేవునితో నీకు గల సామీప్యం, నీ జీవితాన్ని ఇతరులతో గల సంబంధాన్ని మలుస్తుంది.  ఆ సామీప్యం నిన్ను దేవుని కుమారునిగా, కుమార్తెగా మారుస్తుంది (సొ.జ్ఞా. 2:18). మరణం విడదీయలేని బంధంగా మారుస్తుంది. మరణాన్ని, దాని ముల్లును విరచివేస్తుంది. ఈ జీవితాన్ని శాశ్వత జీవితంగా మార్చుకోవడానికి నిర్ణయం తీసుకోవలసింది నీవే! మార్గమును, మాధ్యమును ఎంచుకోవాలసినది నీవే!

నిర్ణయించుకో, ఆ నిర్ణయమును నిలుపుకో!

1 comment: