27 వ సామాన్య ఆదివారము, YEAR C
హబ.
1:2-3, 2:2-4; 2 తిమో. 1:6-8, 13-14; లూకా. 17: 5-10
ఈనాటి
పఠనాలు విశ్వాసము గూర్చి బోధిస్తున్నాయి. "నీతిమంతులు భక్తి విశ్వాసముల వలన జీవింతురు"
అని హబక్కూకుద్వారా ప్రభువు తెలియజేస్తున్నారు. హీబ్రూ భాషలో హబక్కూకు అనగా "కౌగిలించుట".
క్రీ.పూ. 686-642 మద్య కాలములో ఇతను ప్రవక్తగా ప్రవచించియున్నాడు. యూదానేలిన మనష్శే
(క్రీ.పూ. 687-642) కాలములో జీవించాడు. యూదా రాజ్యములోని దుర్మార్గాన్ని, అన్యాయాన్ని,
హబక్కూకు దేవునికి ఫిర్యాదు చేసాడు. ప్రజలు హింసతో, అన్యాయముతో జీవిస్తున్నారు. దుష్టులు
సజ్జనులను అణగద్రొక్కుచున్నారు. న్యాయము తారుమారు అగుచున్నది. దానికి బదులుగా ప్రభువు
"నీతిమంతులు భక్తి విశ్వాసముల వలన జీవింతురు" (2:4) అని చెప్పియున్నాడు.
"ఈ సంగతి నిర్ణీతకాలమున జరుగును కాని, ఆ కాలము త్వరలో వచ్చును; ఆ సంగతి నెరవేరి
తీరును. అది ఆలస్యముగా నెరవేరునట్లు కన్పించినా, నీవు దానికొరకు వేచియుండుము. అది తప్పక
జరుగును; ఇక ఆలస్యము జరగదు" (2:3). మనం దేవుడు చెప్పిన ఆ కాలములోనే ఉన్నాము. కనుక
మన చెడు మార్గాలను, జీవితాలను వీడి నీతిన్యాయముతో, విశ్వాసముతో జీవించాలి. దేవుని ఆజ్ఞలను
పాఠించాలి. అప్పుడే మనం శాశ్వతముగా దేవుని రాజ్యములో జీవింపగలము.
రెండవ
పఠనములొ పౌలుగారు తిమోతికి వ్రాసిన లేఖలో క్రీస్తు బోధించిన స్వచ్చమైన సిద్ధాంతమును
ఆదర్శముగ పాటించాలని, క్రీస్తుయేసునందు లభించు విశ్వాస ప్రేమలందు నిలిచి ఉండాలని, ఒప్పగింపబడిన
ఉత్తమ విషయములను మనయందు వసించు పవిత్రాత్మ సహాయముతో పదిల పరచుకొనవలయునని తెలియజేస్తున్నాడు.
"దేవుడు మనకు పిరికితనముగాక, తన ఆత్మచే శక్తి, ప్రేమ ఇంద్రియనిగ్రహమును ప్రసాదించెను."
(1:7). కనుక కష్టములో, బాధలలోను విశ్వాసముతో జీవించాలి. దేవుని శక్తివలన సువార్తకై
పాటుపడాలి. క్రీస్తు సందేశమును మన జీవితముద్వారా ఇతరులకు బోధించాలి. మనమందరమూ దేవుని
ప్రవక్తలుగా మారాలి.
సువుశేష
పఠనములొ శిష్యులు ప్రభువుతో "మా విశ్వాసమును పెంపొందింపుము" (17:5) అని కోరియున్నారు.
దేవుని ఆజ్ఞలను పాటించాలన్న, క్రీస్తును నిత్యమూ అనుసరించాలన్న, మనకి విశ్వాసము ఎంతో
అవసరము. మన క్రైస్తవ జీవితం విశ్వాసముపై ఆధారపడి యున్నది. శిష్యులు వారికి ముందుగానే
విశ్వాసమున్నదని భావించి, వారి విశ్వాసాన్ని పెంపొందింపుము అని కోరియున్నారు. అయితే
ప్రభువు అంటున్నారు: "మీకు ఆవగింజంత విశ్వాసమున్నచొ, ఈ కంబలి చెట్టును వేరుతో
పెల్లగిల్లి సముద్రములో నాటబడునుగాక అని ఆజ్ఞాపించిన అది మీకు లోబడును"
(17:6). మన జీవితములో ఉన్న అనేక అడ్డంకులు తొలగి పోవాలంటే, మనలో విశ్వాసం ఉండాలి.
విశ్వాసం
దేవుని వరం. విశ్వాసముతో అసాధ్యమైనది సాధ్యమగును. అయితే, మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు
తెలుపుతూ, మన విశ్వాసమును దృఢపరచుమని ప్రార్ధన చేయాలి. ఈ లోకాశలలో, సంపదలలో పడిపోయి
దేవుని ఉదారత్వమును మరచిపోతూ ఉన్నాము. దేవుడు
మనకు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలపాలి. ఇతరులకు సేవ చేయడములో మన విశ్వాసం బలపడును.
విశ్వాసమును ప్రార్ధనద్వారా, బైబులు గ్రంధ పఠనము ద్వారా, ఆధ్యాత్మిక జీవితముద్వారా,
దృఢపరచుకోవాలి. అలాగే, ఇతర విశ్వాసులతో బాంధవ్యాలు మన విశ్వాసాన్ని బలపరచును. కావున, దివ్యపూజాబలిలో పాల్గొనడం తప్పనిసరి అని
భావించాలి.
No comments:
Post a Comment