Friday, August 30, 2013

22 వ సామాన్య ఆదివారము, 01 సెప్టెంబరు 2013, YEAR C

22 వ సామాన్య ఆదివారము, 01 సెప్టెంబరు 2013, YEAR C
పఠనములు: సీరా 3:17-18,20,28-29; హెబ్రీ 12:18-19,22-24; లూకా 14:1,7-14 
వినయము

ఈనాటి పఠనాల సారాంశం: వినయము. మనం సాధారణముగా అధికారాన్ని మరియు సర్వం మన ఆధీనములో ఉండాలని ఆశిస్తూ ఉంటాము. ఇతరులకన్న తగ్గకుండా ఉండాలని, ఆధిక్యములో ఉండాలని ఆశిస్తూ ఉంటాము. మనలో ఉన్నటువంటి గర్వం, వినయమును అణచివేయడము వలన మన జీవితములో ముందుకు కొనసాగలేకపోవుచున్నాము. క్రైస్తవ జీవితానికి వినయము (వినమ్రత, తనను తాను తగ్గించుకొనుట) అతి ముఖ్యమైన సుగుణము. ఈ సుగుణాన్ని మనం ప్రభువునుండి నేర్చుకోవాలి. "సాధు శీలుడననియు, వినమ్ర హృదయుడననియు మీరు నానుండి నేర్చుకొనుడు" (మత్త 11:29). వినయమను సుగుణము, ఇతరులతో పంచుకొను గొప్ప స్వభావాన్ని నేర్పుతుంది.

క్రీస్తు శిష్యరికత్వానికి తప్పకుండా కావలసినది ఈ సుగుణము. ఈ సుగుణముపైనే, ఇతర క్రైస్తవ సుగుణాలన్నీకూడా ఆధారపడియున్నాయి. కాబట్టి మనం ముందుగా వినయము అను సుగుణాన్ని అలవర్చుకోవాలి. దేవునిపట్ల వినయ వినమ్రతలను కలిగి యుండాలి. మరియు, మన సమాజములో అణచివేయబడినవారిని, పేదవారిని ఆదరించాలి. ధనవంతులు దేవుని పట్ల వినయాన్ని కలిగియుండటము చాలా కష్టము. ఎందుకన, వారి స్వబలముపై, భద్రతపై ఆధారపడుతూ ఉంటారు.

మొదటి పఠనములో, ఒక జ్ఞాని తన శిష్యులకు వినయముగూర్చి భోదిస్తున్నాడు. "కుమారా! నీవు చేయు పనులన్నిటను వినయముతో మెలుగుము. బహుమతులిచ్చు వానికంటెగూడ వినయవర్తనుని నరులు అధికముగా మెచ్చుకొందురు. నీవెంత అధికుడవో అంత వినయవంతుడవు కమ్ము. అప్పుడు ప్రభువు మన్ననను బడయుదవు."

వినయము అనగా స్వసేవగాక, ఇతరులకు సేవచేయడము. దైవ భక్తుని యొక్క సుగుణము వినయము. ఒక వ్యక్తి ఎంత గొప్పగా ఉండాలని కోరుకుంటాడో, అంతగా వినయాన్ని అలవర్చుకోవాలి. మనలో వినయమున్నప్పుడే, మనం ఏమిటో తెలుసుకోగలము. తద్వారా, మనలను మనం దేవునికి అర్పించుకొనగలము.

'పరలోకానికి నిజమైన, సురిక్షితమైన మార్గము వినయము' (పు. అగుస్తీను). 'మనలను మనం మోసము చేసుకోకూడదు. మనలో వినయము లేనిచో, ఏదియు లేనట్టే' (పు. విన్సెంట్ ది పౌల్). వినయము అనగా మనలను మనం కించపరచుకోవడము కాదు, అవమాన పరచుకోవడము కాదు. మనల గురించి అసలు ఆలోచించుకోపోవడమే వినయము. అనగా మనలను మనం గొప్పగా చేసుకొని, ఇతరులను తక్కువ చేయడము కాదు. "వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు" (మ 5:5). వినయమునకు మరియ తల్లి ఆదర్శం. ఆమె దేవుని చేత గొప్ప స్థానానికి ఎత్తబడినది. ఆమె "అనుగ్రహ పరిపూర్ణురాలు" (లూకా 1:28-29), "స్త్రీలందరిలో ఆశీర్వదింప బడినది" (లూకా 1:42), దైవ కుమారునికి తల్లి. అయినను, ఆమె వినయముతో జీవించినది. మనలో ఉన్న మంచి గుణాలన్నియుకూడా, వినయమను సుగుణముతో జతచేయనిచో అవి వ్యర్ధమే! 

క్రీస్తు స్థాపించిన సంఘముద్వారా, పరలోకాన్ని ముందుగానే చూడగలిగియున్నాము. క్రీస్తు శిష్యులముగా, దేవుని మంచితనమును నమ్ముకొంటూ, మన జీవితాలను వినయముతో దేవుని చిత్తానికి సమర్పించుకోవాలి. అలాగే, మనం మారుమనస్సు పొందకముందు జీవించిన పాత జీవితానికి తిరిగి వెళ్లక, జీవితాంతము వరకు కూడా, మనలను పరలోకమున చేర్చు మార్గముననే పయనించాలని బోధిస్తుంది.  వినయమున్నచోట, స్వార్ధం, గర్వం, మొండితనము ఉండవు.

ఈనాటి సువిషేశములోని క్రీస్తు భోదనా సారాంశం కూడా వినయము. స్వార్ధముతో, గర్వముతో, మొండితనముతో ఉన్న వారికి ముఖ్యముగా, పరిసయ్యులకు, ధర్మశాస్త్రబోధకులకు వినయము గూర్చి ప్రభువు బోధిస్తున్నారు. అలాగే, ఈ బోధన మనందరికీ కూడా వర్తిస్తుంది.
దేవుని రాజ్యము అనగా, పరిపూర్ణమైన సంఘము. ఈ సంఘము అనేకసార్లు విందుతో పోల్చబడినది. దైవరాజ్యము అనే ఈ విందుకు అందరూ ఆహ్వానితులే. విందుకు వచ్చిన వారు మొదటి స్థానాలలో కాక, చివరి స్థానాలలో కూర్చోవాలని ప్రభువు చెప్పియున్నారు. అప్పుడు, ఆహ్వానించిన వ్యక్తి, ఎవరి అర్హతను బట్టి వారికి చెందిన స్థలాలను వారికి ఇవ్వగలడు. ఇతరులచేత నిరాకరించబడిన వారిని గౌరవించాలనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాలి. అప్పుడే ప్రభువు ఆశీర్వాదాలు మనపై తప్పక ఉంటాయి. దేవుని రాజ్యములో ధనికులని, పేదవారని, ప్రాంతాలవారని, జాతులవారని, కులాలవారని, భాషలవారని భేదాభిప్రాయాలు ఉండవు. ఈ రాజ్యములో ప్రవేశించాలంటే, వినయము అనే సుగుణమును కలిగి యుండాలి.

సంఘములో గొప్పవారిగా ఎదగాలంటే, మనలను మనం త్యజించుకోవాలి, తగ్గించుకోవాలి. "తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును . తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును" (మత్త 23.12).

క్రీస్తు వినయము: "తనను తాను రిక్తుని చేసుకొని, సేవకుని రూపమును దాల్చి, మానవ మాత్రుడుగా జన్మించెను. అన్నివిధముల మానవ మాత్రుడై ఉండి, అంతకంటె వినయము కలవాడై, సిలువపై మరణము వరకు విధేయుడాయెను" (ఫిలిప్పీ 2:7-8). ఆయన దేవునితో సమానము, దేవునిచేత పంపబడినవాడు. సకల జ్ఞానమును, శక్తియును కలిగియున్నవాడు. అయినను, వినయమును కలిగియున్నాడు. "ఆయన ఎల్లప్పుడును దైవ స్వభావమును కలిగియున్నను, దేవునితో తన సమానత్వమును గణింపలేదు" (ఫిలిప్పీ 2:6). వినయమమే మోక్షమునకు మార్గమని బోధించాడు. వినయముతో పవిత్రాత్మ శక్తితో నింపబడుటకు అంగీకరించాడు (లూకా 4:1). వినయముతో దేవుని చిత్తానికి విధేయుడై జీవించాడు. వినయముతో తండ్రి దేవునిపై సంపూర్ణముగా ఆధారపడి జీవించాడు. (యో 5:19, 30, 41; 6:38; 7: 16, 28; 8:28, 42, 50; 14: 10, 24). సమాజమునుండి వెలివేయబడిన వారితో, పాపాత్ములతో, రోగులతో, పేదవారితో సాన్నిహిత్వం చేయడానికి ఆయన భయపడలేదు (మ 9: 9-13; మా 2:14-17; లూకా 5:27-32; 15:1).

వినయముతో జీవించుదాం. మనం జీవించే జీవితం దేవుని వరం. కనుక దేవుని రాజ్య స్థాపనకు కృషి చేద్దాం. మానవులందరు సమానులని గుర్తించుదాం.

No comments:

Post a Comment