5 వ పాస్కా ఆదివారము (10 ఆగస్టు 2013)


ఐదవ పాస్కా కాల ఆదివారము

మన ప్రేమ కేవలము మాటలు, సంభాషణలు మాత్రమే కాదు.  అవి చేతలలో నిరూపింప బడు యదార్ధ ప్రేమ కావలయును (1 యోహా 3:18). ప్రేమ తన బహిరంగ జీవితములో అనేక సందర్భాలలో తన చుట్టూ ఉన్న పరిస్థితులను, పరిసరాలను, వ్యక్తులను గమనించి వాటిని ఉదాహరణగా తీసుకొని, గొప్ప పరలోక సత్యాలను, తన శిష్యులకు భోధించేవాడు.  ఉదాహరణకు, గొర్రెల కాపరులను, నీటిని, వెలుగును, రొట్టెను, మరియు పరిసయ్యులను ఉదాహరణగా చేసుకొని అనేక విషయాలను భోధించేవాడు.  ఈ కోవకు చెందిన ఒక ద్రాక్షావల్లి ని ఉదాహరణగా తీసుకొని, ఈనాటి సువిశేష పటనము ద్వారా మనలో మాట్లాడుచూ ఉన్నాడు.

యేసు ప్రభు జీవించిన సమయములో యూదయా దేశములో ద్రాక్షా తోటలు ఎక్కువగా సాగుచేసేవారు.  ద్రాక్షా యొక్క మరియు దాని ఎదుగుదల, ఫలాలు గురించి అందరికి కూడా ఒక అవగాహన అంటూ ఉండేది. అందువలననే యేసు ద్రాక్షా వల్లిని-తీగలను ఉదాహరణగా చేసుకొని దాని ద్వారా ఆయనను అనుసరించే శిష్యులకు, దేవునితో ఉండవలసిన బంధాన్ని గురించి భోదిస్తూ ఉన్నాడు.  కనుక ద్రాక్షా వల్లిని గురించి కొంత సేపు ద్యానిద్దాం.

మొదటగా, ద్రాక్షావల్లి యందు ఉండని తీగ దానియంతట అది ఫలింప జాలదు.  ద్రాక్షా వల్లి నుండి వేరు చేయబడిన రెమ్మలు జీవింపలేవు.  అందుకే, ద్రాక్షావల్లి రెమ్మలు ద్రాక్షావల్లిని అంటి పెట్టుకొని యుంటాయి.  అవి ద్రాక్షావల్లిని అంటి పెట్టుకొని ఉండుట వలన అధికముగా ఫలిస్తాయి.  ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి.  ద్రాక్షా రెమ్మల వలన ద్రాక్షావల్లి బలపడుట లేదు.  కారణం, మనం ఒక రెమ్మను కత్తిరిస్తే మరియొక రెమ్మ పుట్టుకొస్తుంది.  కాని ద్రాక్షా వల్లి వలన దాని రెమ్మలు లబ్ది పొందుతూ ఉన్నాయి.  ద్రాక్షావల్లి దానిలో ఉన్న జీవాన్ని, బలాన్ని, రెమ్మలకు ఇస్తుందే తప్ప, రెమ్మల నుండి అది జీవం పొందుట లేదు. ద్రాక్షా వల్లిని రెమ్మలు అంటి పెట్టుకొని యుండుట వలన, అవి ధృడముగా, ఎదగ గలుగు చున్నాయి.  మనందరి జీవిత సత్యం కూడా ఇదే!  మనం ప్రభువుని విశ్వసించి, ఆయనను అంటి పెట్టుకొని యుండుట వలన, మనము కూడా ఆయన జీవాన్ని, బలాన్ని పొందుతూ ఉన్నాము.  ఆయన విశ్వాసములో ధృడముగా ఎదగగలుగుతాము.   మన జీవితాలు సంతోషముతో, సమాదానముతో వర్హ్సిల్లుతాయి.  మనము ఆయనతో ఉండుట వలన, జీవితములో ఎదురయ్యే ప్రతీ కష్టాన్ని, సమస్యను, ఆయన నుండి వచ్చే బలము ద్వారా, పరిశుద్ధాత్మ సహాయ శక్తి ద్వారా అదిగా మించ గలము.  కనుక, ద్రాక్షావల్లి యగు క్రీస్తుకు మన జీవితాన్ని అంటి పెట్టినప్పుడు మన జీవితాలు అధికముగా ఫలిస్తాయి.

"నా యందు ఫలింపని  ప్రతీ తీగను ఆయన తీసి వేయును.  ఫలించు ప్రతీ తీగను అధికముగా ఫలించుటకై, ఆయన దానిని కత్తిరించి సరిచేయును." ద్రాక్షావల్లి అధికముగా ఫలించాలి అంటే, మనం దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  దానిని సరిగా అంటూ కట్టాలి.  కాలమును బట్టి ఎండిన ఆకులను, కొమ్మలను కత్తిరించి సరిచేయాలి.  దానికి కావలసిన ఎరువును, నీటిని సకాలములో అందించాలి. ఈ జాగ్రత్తలు పాటించినప్పుడే ద్రాక్షావల్లి మంచి రుచికరమైన ఫలాలను మనకు అందించగలదు.  ద్రాక్షావల్లి క్రీస్తు మనమంతా కూడా ఆయన రెమ్మలం. ఎండిన ఆకులు, కొమ్మలు మనలో ఉన్న చెడుకు, పాపానికి చిహ్నంగా నిలుస్తాయి.  వాటిని ఎ విధముగా కత్తిరించి, ప్రోగుచేసి నిప్పులో వేసి తగుల బెట్టుతామో, అదే విధముగా, మనలో ఉన్న చెడును, చెడు క్రియలకు, ఆలోచనలకు స్వస్తి చెప్పి మనల్ని మనం సక్రమమైన మార్గములో నడచుకోవడానికి ప్రయత్నించినప్పుడు మనం అధికముగా ఫలించగలుగు తాము.

"నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు"

ద్రాక్షావల్లి ఎదుగుదలకు, మరియు అది ఫలించడానికి దాని తీగలు ఎంతో తోడ్పడుతూ ఉంటాయి.  ద్రాక్షా రెమ్మలు, ద్రాక్షావల్లి నుండి వచ్చే బలాన్ని, జీవాన్ని స్వీకరించి, అవి బలపడుతూ, ఎదుగుతూ, ద్రాక్షావల్లిని జీవింప చేస్తాయి.  అదేవిధముగా ఈ ప్రపంచములో దేవునికి మానవుడు కూడా ఎంతో అవసరము.  మన సత్యోపదేశములో చదువుకున్నట్లు, మానవుడు  దేవుని ప్రేమించి, సేవించి అటు వెనుక మరణము పొందుటకు సృష్టింప బడెను.  మనం ఒక వ్యక్తిని ప్రేమించినపుడు లేదా ఒక వ్యక్తి చేత ప్రేమింప బడినప్పుడు, ఆ వ్యక్తి గురించి పదిమందికి చెబుతూ ఉంటాం.

అదేవిధముగా, మానవుడు దేవుని ఈ ప్రపంచానికి చాటగలగాలి.  దేవుని నామాన్ని ఆయన ప్రేమను ప్రకటించటం అంటే ఆయనను ఈ లోకములో జీవింప చేయటం.  ఆయన మరణమును ప్రకటించడం అంటే, ఆయనను ఈ లోకములో జీవింప చేయడం.  ఆయన మహిమను కొనియుండటం.  ఆయనను స్తుతించి గౌరవించడం.  కనుక, క్రీస్తు బిడ్డలుగా ఇది మనందరి కర్తవ్యం.

"మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమ పరప బడును."  ప్రియులారా! మానవ జీవితాన్ని ఒక ఉన్నతమైన ద్రుక్పదముతో చూసినప్పుడు, మనం అనుకున్న ఫలాలకంటే, అధికముగా ఫలిస్తూ ఉన్నాం.  మన అనుదిన జీవితములో ప్రతీసారి మనం మంచి చేసినప్పుడు, మంచిని గురించి ఆలోచించినప్పుడు అధికముగా ఫలిస్తూ ఉన్నాం.  ప్రేమ, శాంతి, సమాధానాన్ని ఇతరులకు పంచినప్పుడు మనం అధికముగా ఫలించినట్లే...  ఇతరులను మన్నించడం ద్వారా, మనకున్న దాన్ని ఇతరులతో పంచుకొనుట ద్వారా, మనం అధికముగా ఫలిస్తూ ఉన్నాం.  మన శత్రువులను ప్రేమించి, వారి కోసం ప్రార్ధించినప్పుడు మనం ఫలిస్తూ ఉన్నాం.  ఈ విధముగా, ప్రతీసారి, ప్రతీ రోజు, మన మాటల ద్వారా, క్రియలద్వారా ఫలిస్తూ తండ్రి దేవుని మహిమ పరస్తూ ఉన్నాము.  కనుక, మన ఫలములో దేవుని మహిమను  పరచ గలగాలి.

"మీరు నా యందు ఉండుడు"

ఈనాటి సువిశేష పతనములో ఈ వాక్యము 8 సార్లు చెప్పబడింది.  అంటే, ఈ వాక్యము ఎంత ముఖ్యమైనచో మనం గ్రహించాలి. కొన్ని సందర్భాలలో, కొంత మంది వ్యక్తులు ఒకే కుటుంబములో జీవిస్తూ ఉంటారు.  వారు కలసి ఉన్నప్పటిని పరదేశిగా బ్రతుకుతూ ఉంటారు.  ఒకరంటే ఒకరికి పడదు. పట్టించుకోరు. ఒకలాంటి విదేశీ మనస్తత్వాన్ని కలిగి ఉంటారు.  వారి మధ్య ప్రేమలు,  ఆప్యాయతలు ఉండవు.  నామమాత్రముగా కలసి జీవిస్తూ ఉంటారు.  అదే విధముగా, "ప్రభువు యందు ఉండటం" అంటే నామ మాత్రానికే క్రైస్తవులుగా ఉండి ఆయన శిష్యుడిని అని చెప్పుకుంటే సరిపోదు.  "మీరు నాయందు ఉండుడు" అను వాక్యము ద్వారా, ప్రభువు మనలను తనతో కలసి జీవించటానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు.  ఆయనతో జీవించడం, ఆయనతో పంచుకోవడం, ఆయనతో ఉండటం ఒకరి నుండి మరియొకరు పొందటం, ఒకరిని ఒకరు గౌరవించడం, ప్రభువు యందు ఉండటం అంటే, మన నమ్మకాన్ని ఉత్తాన క్రీస్తుయందు ఉంచటం. ఆయన యందు ఉండటం అంటే, ఆయనలో శాంతిని, సమాధానాన్ని, ప్రేమను పొందటం.  ఒక నిండిన విశ్వాసాన్ని, నమ్మకాన్ని  ఆయనలో కలిగి ఉండటం.  కారణం ఆయన కూడా "నేను మీ యందు ఉందును" అని మనకు మాట ఇచ్చి యున్నాడు. కనుక మనం మన జీవితంలో ఎన్ని కష్టాలు, భాదలు, నష్టాలు, రోగాలు ఎదురైనప్పటికిని ప్రభువుతో ఉన్నట్లయితే ఆయనే మనకు బలాన్ని ఇచ్చి, జీవితములో ముందుకు నడిపిస్తాడు.  కనుక ప్రభువు యందు ఉండటానికి ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించమని అర్ధిద్దాం.

చివరిగా, ఇది మే మాసం.  ఈ నెల మరియ తల్లికి అంకితం చేయబడిన నెల.  ఆమె దేవుని యొక్క తల్లి.  ఆమె దేవుని తల్లి కనుక మనందరికీ కూడా తల్లిగా నిలుస్తుంది.  ఈ కారణం చేత మనం  కూడా ఆమెను విన్నవించుకోవాలి. రక్షణ చరిత్రలో ఆమెకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది.  ఆమె ఈ ప్రపంచానికి యేసు ప్రభువును అందించింది.  ఆమె "తన గర్భ ఫలమును" మనకు కానుకగా ఒసగింది.  ఆమె ఇంకా ఈ ప్రపంచానికి ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంది. ఆమె తన విశ్వాస జీవితము ద్వారా ప్రభువు యందు ఉంటూ, ఆ ప్రభువులో జీవిస్తూ అధికముగా ఫలించింది.  కనుక, ఆమె నిత్య సహాయము ద్వారా మనము కూడా అధికముగా ఫలించుటకు ఆమె సహాయాన్ని వేడుకొందాం.  ఆమె చూపిన విశ్వాస మార్గములో జీవించడానికి ప్రయాసపడదాం.  ఆమెన్.

No comments:

Post a Comment