పాస్కా కాలపు నాలుగవ ఆదివారము, 21 April 2013
అ.కా. 13:14,43-52; దర్శన గ్రంధము 7:9, 14-17; యోహాను 10:27-30
మార్పుకు మార్గం - వినుట
'వినగలిగే వాడే మాట్లాడ గలడు'. వినడానికి విడ్డూరముగా ఉన్నా ఇది నిజం. మాటలురాని పిల్లలపై పరిశోధనలు జరిపిన వైద్యుల అంచనాల ప్రకారం, వినికిడి లేని పిల్లలే ఎక్కువగా మూగత్వమునుకూడా పొందుతూ ఉంటారు. భౌతిక విషయాలలో ఇదెంత నిజమో, ఆధ్యాత్మిక విషయాలలో అంతకంటే నిజం.
ఈనాటి మూడు పఠనముల యందు కూడా, 'వినుట' యొక్క ప్రాముఖ్యతను గూర్చి తెలుపబడినది.
మొదటి పఠనం: 44 వ వచనం - ప్రతి వ్యక్తి ప్రభువు వాక్కు వినుటకు వచ్చెను. 48 వ వచనం - అన్యులు దీనిని విని ఎంతో సంతోషించి దేవుని వాక్కును ప్రస్తుతించిరి.
సువార్త పఠనం: 27 వ వచనం - నా గొర్రెలు నా స్వరమును వినును.
రెండవ పఠనం: 14 వ వచనం - గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను క్షాళన మొనర్చుకొని... 17 వ వచనం - ఆ సింహాసనం మధ్యనున్న గొర్రెపిల్ల వారికి కాపరి అగును.
మాట రావాలన్న, మాటలాడాలన్నా - వినగాలగాలి.
వినటం ద్వారా ఏం జరుగుతోంది?
వినటం ద్వారా తెలుసుకొంటాం.
తెలుసు కొనటం ద్వారా అర్ధం చేసుకొంటాం.
అర్ధం చేసుకొనటం ద్వారా ఎదుగుతాం, అభివృద్ది చెందుతాం!
ఆ ఎదుగుదల ఆత్మ యందు, సత్యమందు, ఆయనయందై ఉండాలి!
అందుకే పౌలుగారు, రోమీయులకు వ్రాసిన లేఖలో, "వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును (10:17).
తండ్రి దేవుడు కూడా పదే పదే ఈ మాటను పలికి యున్నారు. ఉదాహరణకు, ద్వితియో.కాం. 6:4-9 నందు ఆ మాట వాక్కానిస్తున్నారు. ఈ భాగమునందు "వినుము, ప్రేమింపుము, భోధింపుము,
ముచ్చటింపుము, వ్రాసికొనుము మరియు జ్ఞప్తియుంచుకొనుము." క్లుప్తముగా వివరించాలంటే, ఆయన మాటను వినాలి, విన్న దానిని పాటించాలి, పాటించే దానిని భోధించాలి, భోధించే దానిని, ముచ్చ టించాలి, ముచ్చటించిన దానిని వ్రాసి, జ్ఞప్తియుంచుకోవాలి.
మనం ఏమి వినాలి?
వినికిడి శక్తియున్న ప్రతి ఒక్కరు వినగలరు. వినిపించే ప్రతి శభ్దమును వినగలరు. కాని, మనం ఏమి వినాలి? ఎవరి మాట వినాలి? ఎందుకు వినాలి? ఈ ప్రశ్నలకు సమాధానం యాకోబు గారు వ్రాసిన లేఖలోని మొదటి అధ్యాయములో మనకు లభిస్తుంది.
21 వ వచనం: "ఆయన మీ హృదయములపైన ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు. అది మిమ్ము రక్షించు శక్తి కలది."
25 వ వచనం: స్వాతంత్రమునొసగు పరిపూర్ణమైన చట్టమును జాగ్రత్తగా పరిశీలించి కేవలము విని మరచుటకాక, దానిని ఆచరించువాడు దేవుని దీవెనలు పొందును." దేవుని పరిశుద్ధమైన వాక్కు మనందరి హృదయములపై ముద్రించబడినది. దాని ప్రకారము నడచుకొనువాడు, నీతిమంతుడగును (రోమా 2:14,15). మనలను నీతి మంతులుగా చేసే శాసనం (మాట, వాక్యం) ఎంతో దూరంలో లేదు. అది "మీ (మన) చెంతనే ఉన్నది, మీ (మన) నోటనే మీ (మన) హృదయముననే ఉన్నది" (ద్వితియో 30:14). దానిని మనం శ్రద్ధతో ఆలకించాలి (మార్కు 4:24). మనం వినుచున్న దానిని "ఎట్లు వినుచున్నామో గమనించాలి" (లూకా 8:18).
ఆ పరిశుద్ధ వాక్యమును వినేముందు, రైతు భూమిని విత్తనములు వెదజల్లుటకు సిద్ధము చేసిన విధముగా,మన హృదయమును శుద్ది చేసుకోవాలి. "పాపములు ఒప్పుకొనుచు క్షమాపణను అర్ధిస్తూ... (1 యోహా 1:9), హృదయ కాఠిన్యాతను తొలగిస్తూ... (యిర్మియా 4:3) మరియు సాత్వికతను కలిగియుంటూ (యాకోబు 1:21) ఆ వాక్యం వినాలి. ఈ విధముగా ఆ పరిశుద్ధ వాక్యాన్ని వింటే, స్వీకరిస్తే మనయందు ఆత్మబలం నూత్నీకరించ బడుతుంది మరియు విశ్వాసపు పునాదులు గట్టిపడతాయి.
అందుకే, మన మాటలను తగ్గించి, మాట్లాడే ప్రభుని మాటలను, జీవమునిచ్చు మాటలను, నడిపించే మాటలను, స్వస్థ పరచే మాటలను, బలపరచే మాటలను ఆలకిద్దాం! ఆచరిద్దాం!
No comments:
Post a Comment