21 వ సామాన్య ఆదివారము, YEAR C

21 వ సామాన్య ఆదివారము, సంవత్సరం C
యెషయ 66:18-21; హెబ్రీ 12:5-7, 11-13; లూకా 13: 22-30
“ఇరుకైన మార్గము”



ప్రియ సహోదరీ సహోదరులారా! నేడు మనం 21వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుచున్నాము. మన జీవితానికి నిజమైన అర్థం, అంతిమ లక్ష్యం ఏమిటి? ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఆత్మను కోల్పోతే ప్రయోజనం లేదు. మనుష్యుడు లోకమంతటినీ సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకొంటే, వాడికి లాభమేమిటి? (మత్త 16:26). కాబట్టి, మన అంతిమ గమ్యం రక్షణ, నిత్యజీవం. మన ఆత్మను, జీవితాన్ని రక్షించుకోవాలంటే, ప్రభువు చూపిన ఇరుకైన మార్గంలో నడవాలి.

ఒక వ్యక్తి యేసు వద్దకు వచ్చి, “రక్షణ పొందువారు కొలదిమంది మాత్రమేనా?” అని ప్రశ్నిస్తున్నాడు. అందుకు యేసు దానికి నేరుగా సమాధానం చెప్పలేదు. ఎందుకంటే, “ఎంతమంది రక్షింప బడతారు” అని ప్రశ్నించే బదులు, నేను రక్షింపబడతానా? అని ముందుగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇక్కడ యేసు ఆ వ్యక్తిని, తన రక్షణ గురించి ఆలోంచించుకోమని చెబుతున్నారు. రక్షణ అనేది ఒక వ్యక్తిగతమైన బాధ్యత అని యేసు స్పష్టం చేస్తున్నారు. ఇతరులు పరలోకానికి వెళ్తారా లేదా అని ఆలోచించే బదులు, మనం మన స్వంత విశ్వాసాన్ని, జీవితాన్ని పరిశీలించుకోవాలి అని ప్రభువు తెలియజేస్తున్నారు. కనుక, ఇతరుల గమ్యం గురించి అనవసరంగా చింతించే బదులు, మన సొంత ఆత్మ రక్షణపై దృష్టి పెట్టాలి.

కాబట్టి, మనం ఇతరుల గురించి ఆలోచించే ముందు, మన స్వంత ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకోవాలి. మనం నిజంగా యేసును అనుసరిస్తున్నామా? ఆయన బోధనలకు లోబడి జీవిస్తున్నామా? ఎందుకంటే, మన రక్షణకు మనమే బాధ్యులం. రక్షణ అనేది దేవుని బహుమానం అయినప్పటికీ, దానికి మన విశ్వాసం, ప్రయత్నం, మరియు పశ్చాత్తాపం అవసరం. మనం రక్షణ మార్గంలో స్థిరంగా ఉన్నప్పుడే, ఇతరులకు సహాయం చేయగలం. ఒక దీపం వెలిగితేనే కదా, ఇంకో దీపాన్ని వెలిగించగలం? అందువల్ల, మనం ఇతరుల రక్షణ కోసం ప్రార్థించడం, సేవ చేయడం చేయాలి, కానీ అంతకు ముందు, మనం ఇరుకైన ద్వారం గుండా ప్రవేశించడానికి ప్రయాసపడాలి. మన ఆత్మ రక్షణను ముందుగా స్థిరపరచుకున్న తర్వాత, ఇతరులకు సువార్తను ప్రకటించడానికి మనం బలమైన సాక్షులుగా మారగలం.

“ఇరుకైన మార్గమున ప్రవేశింపుము” అని ప్రభువు అంటున్నారు. “ఇరుకైన మార్గం” అంటే ఏమిటి? ఇరుకైన మార్గం అనేది రక్షణకు నడిపించే ఒక కష్టతరమైన, సవాలుతో కూడిన మార్గాన్ని సూచిస్తుంది. ఈ మార్గం కేవలం కొంతమందికి మాత్రమే కాకుండా, అందరికీ అందుబాటులో ఉన్నదే, అయితే దీనికి మనస్ఫూర్తిగా ప్రయత్నించడం చాలా అవసరం. తీవ్రమైన కృషి, ఆత్మీయ క్రమశిక్షణ, మరియు క్రీస్తు బోధనలను పూర్తిగా అనుసరించడం ఎంతో అవసరం. మన రక్షణ మన విశ్వాసం, నమ్మకం, జీవిత విధానం, మరియు మనం ఎంచుకునే మార్గంపై ఆధారపడి ఉంది. రక్షణ అంటే ముఖాముఖిగా దేవుణ్ణి చూడటం. రక్షణ విశ్వాసంతో మొదలవుతుంది. ఆ విశ్వాసాన్ని మనం అనుదిన జీవితంలో ఎలా ఆచరిస్తున్నామనేది చాలా ముఖ్యం. మన విశ్వాసాన్ని ఎలా ప్రకటిస్తున్నామనే దానిపైనే రక్షణ ఆధారపడి ఉంది.

అయితే, రక్షణ అనేది ఒక చిన్న ద్వారము గుండా వెళ్ళడం లాంటిదని యేసు బోధిస్తున్నారు. చాలామంది ఆ ద్వారము గుండా వెళ్లాలని ప్రయత్నిస్తారు కానీ విఫలమవుతారు, అది వారికి సాధ్యం కాదు. దీనికి కారణం, వారు కేవలం పైపైన మాత్రమే తమ విశ్వాసాన్ని ప్రకటిస్తారు కానీ తమ జీవితాలను నిజంగా దేవుని మార్గంలో మార్చుకోరు. చాలామంది ప్రజలు గుంపును అనుసరించడానికి ఇష్టపడతారు, ఎందుకంటే అది సులభం. అందరూ అదే చేస్తున్నారు కాబట్టి, అది సరైన మార్గం అని భావిస్తారు. అందుకే నాశనానికి దారి తీసే మార్గం విశాలంగా ఉంటుంది. విశాలమైన మార్గంలో ప్రయాణించడం అంటే, ఎటువంటి ఆత్మీయ క్రమశిక్షణ లేకుండా, పాపపు కోరికలకు లొంగిపోయి, లోకం చెప్పినట్లు జీవించడం. దేవుని నియమాలకు లోబడకుండా, మన స్వంత ఇష్టానుసారం నడుచుకోవడం, గుంపులో కలిసిపోవడం ద్వారా మన వ్యక్తిగత బాధ్యతను, రక్షణను పట్టించుకోకపోవడం.

ఇరుకైన మార్గం అనేది కేవలం బాహ్య ఆచారాలను, పద్ధతులను పాటించడం కాదు. ఇరుకైన మార్గం అంటే  యేసు బోధనలను పాటించడం, పాపం నుండి పశ్చాత్తాపపడటం, ఇతరులకు సేవ చేయడం, మరియు కష్టాలను ఓపికతో స్వీకరించడం. రక్షణ అనేది కేవలం విశ్వాసం మాత్రమే కాదు, అది విశ్వాసం మరియు మంచి కార్యాల కలయిక. మన విశ్వాసాన్ని మన క్రియల ద్వారా చూపించాలి. ప్రేమ, దయ, సేవ, దానధర్మాలు - ఇవన్నీ ఇరుకైన మార్గంలో మన ప్రయాణంలో ముఖ్యమైన భాగాలు. కాబట్టి, క్రైస్తవ జీవితం సులభమైనది కాదు, దానికి మన సంకల్పం, పోరాటం మరయు కృషి అవసరం అని ప్రభువు సూచిస్తున్నారు. ఈ పోరాటంలో మన స్వార్థాన్ని, పాపపు కోరికలను త్యజించాలి.

యోహాను సువార్త 10:9వ వచనంలో యేసు స్వయంగా, “నేనే ద్వారమును! ఎవడేని నా ద్వారా ప్రవేశించిన యెడల వాడు రక్షణ పొందును” అని చెప్పారు. యేసే రక్షణకు ఏకైక మార్గం. ఆయన ద్వారా కాకుండా వేరే మార్గంలో పరలోకానికి వెళ్లడం అసాధ్యం. మత్తయి సువార్త 7:13వ వచనంలో, “వెడల్పైన ద్వారము సులభముగా నున్న మార్గము, కాని అది వినాశనమునకు చేర్చును” అని చెబుతున్నారు. చాలామంది ఈ సులభమైన, లోకసంబంధమైన మార్గాన్ని ఎంచుకుంటారు. ఈ మార్గంలో లోక ఆశలు, పాపపు కోరికలు, స్వార్థం వంటివి ఉంటాయి. మత్త 7:14 – “జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది. మార్గము కష్టమైనది. కొద్దిమందే ఈ మార్గమును కనుగొందురు”. ఇరుకైన, కష్టమైన ద్వారం గుండా వెళ్లాలంటే, మనం మన స్వార్థాన్ని త్యజించి, క్రీస్తు బోధనలను పాటించాలి. ఈ మార్గం కష్టతరమైనది, అందుకే దీనిని ఎంచుకునేవారు తక్కువ.

ఇరుకైన మార్గమున ప్రవేశించుటకు “ప్రయత్నించండి” అని ప్రభువు అంటున్నారు. “ప్రయత్నించండి” అనే పదానికి యేసు ఉపయోగించిన గ్రీకు పదం, ఒక అథ్లెట్ పోటీ కోసం చేసే తీవ్రమైన కృషిని సూచిస్తుంది. ఇది కేవలం ఆట చూస్తూ ఐస్‌క్రీమ్, పాప్‌కార్న్ తినేవారికి కాదు, ఆటలో నిజంగా పాల్గొని, కఠోరంగా శిక్షణ పొందే అథ్లెట్‌లకు సంబంధించింది. అథ్లెట్ తన శరీరాన్ని కఠినంగా క్రమశిక్షణలో ఉంచుకొని, తన లక్ష్యం కోసం తీవ్రంగా శ్రమిస్తాడు. అలాగే, క్రైస్తవ జీవితంలో కూడా మన ఆత్మను క్రమశిక్షణలో ఉంచుకొని, మన పాపపు కోరికలను అదుపులో పెట్టుకోవాలి. ఇది ఒక నిరంతర పోరాటం. కేవలం చూసేవారిగా, లేదా పైపైన విశ్వాసం ఉన్నవారిగా ఉంటే సరిపోదు. విశ్రాంతి తీసుకుంటూ, సులభమైన మార్గాలను ఎంచుకుంటే, మనం రక్షణ నుండి దూరమవుతాం. యేసు చెప్పినట్లుగా, ఒకసారి ఇంటి యజమాని ఒకసారి ద్వారము మూసివేస్తే, ఎంత వేడుకున్నా లోపలికి రాలేరు. ఇది మరణం తరువాత వచ్చే తీర్పును సూచిస్తుంది. ఈ లోకంలో మనం ఎలాంటి కృషిచేయకుండా, ఎలాంటి ప్రయత్నం చేయకుండా, ఐస్‌క్రీమ్, పాప్‌కార్న్ తింటూ ఉంటే, చివరికి మనం బయటే ఉండిపోతాం. అందువల్ల, జీవితం ఉండగానే మన రక్షణ కోసం తీవ్రంగా కృషి చేయాలి.

ప్రభువు చెప్పినట్లుగా, “ఆయనే ఇరుకైన మార్గం”. ఎందుకంటే ఆయన మనకోసం కల్వరిని, అనగా ఇరుకైన మార్గాన్ని ఎంచుకున్నారు. యేసుకు కల్వరి లేదా సిలువ ఆ ఇరుకైన మార్గంలో భాగమైంది, అదేవిధంగా మనకు కూడా మన జీవితంలోని వ్యక్తిగత కల్వరి మార్గంలో భాగం. యేసు కల్వరిని సహించినట్లే, మనం కూడా మన జీవితంలోని బాధలను, కష్టాలను సహిస్తే అవి మన మంచి కోసమే పనిచేస్తాయి. దీనికి సంబంధించి పౌలు రోమీయులకు వ్రాసిన లేఖలో ఇలా అంటాడు, “దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన ఉద్దేశానుసారము పిలవబడిన వారికి, అన్నియును మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని మనకు తెలియును” (రోమీ 8:28). కాబట్టి, మన జీవితంలో కల్వరి ఉన్నా, లేకపోయినా, మనం ఇరుకైన ద్వారం ద్వారానే ప్రవేశించడానికి కృషి చేయాలి. ఎందుకంటే, ఆ ద్వారం మాత్రమే జీవానికి నడిపిస్తుంది. ఆ జీవం క్రీస్తు యేసులోనే ఉంది. ఆయనే మన రక్షణకు ఏకైక మార్గం. యేసును అనుసరించడం అంత సులభం కాదు. అందుకే, ఆ మార్గం ఇరుకైనది. యేసును అనుసరించడం అంటే కేవలం ఆయనను “ప్రభూ! ప్రభూ!” అని పిలవడమే కాదు (మత్త 7:21), ఆయన బోధనలకు పూర్తిగా లోబడి, ఆచరణలో పెట్టడం. ఈ మార్గం కష్టమైనదే అయినా, అది నిత్యజీవానికి నడిపిస్తుంది. అందుకే, ఇరుకైన ద్వారం ద్వారా వెళ్లడానికి మనం ప్రయత్నం చేయాలి.

ఇరుకైన మార్గానికి ఒక ఉదాహరణ, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన తీరు. వారి గమ్య స్థలమైన వాగ్ధాన భూమికి చేరుకోవడానికి వారు ఇరుకైన మార్గమును అనగా, బానిసత్వం, ఆకలిదప్పులు, పశ్చాత్తాపము, మన్నింపు, ప్రేమ, సేవ, నీతి, న్యాయములతో కూడిన మార్గమున పయనించవలసియున్నది. అదేవిధముగా, క్రీస్తు ప్రభువు, ఈ భూలోకమున, మన రక్షణ కోసం, ప్రేమ, సేవ, బోధన, త్యాగం, శ్రమలు, అవమానములు, మరణములతో కూడిన ఇరుకైన మార్గాన్నే ఎంచుకున్నారు.

హెబ్రీయులకు వ్రాసిన లేఖలో, పునీత పౌలుగారు, ఇరుకైన మార్గము అనగా, దేవుని క్రమశిక్షణ అని చెబుతున్నారు. విశ్వాసులు పొందే శ్రమలు, బాధలు, దేవుని క్రమశిక్షణలో భాగమే! ఇవన్నియుకూడా ప్రేమతో ఇవ్వబడతాయి. తల్లిదండ్రులు, తమ బిడ్డను శిక్షిస్తున్నారంటే, ఆ బిడ్డ నాశనం కావాలని కాదు. కాని, క్రమశిక్షణ ద్వారా, ఆ బిడ్డ బాధ్యతాయుతముగా ఎదగాలని, వారు ఆశిస్తారు. విశ్వాసులు దేవున్ని, తండ్రిగా భావించినప్పుడే, ఈ క్రమశిక్షణ విలువను అర్ధం చేసుకోగలరు.

మన జీవితములో, సరైన నిర్ణయాలను తీసుకొని, ఇరుకైన మార్గమున పయనించాలి. అనగా, ఇహలోక ఆలోచనలనుగాక, సంపదలనుగాక, అధికారమునుగాక, ఎల్లప్పుడూ దేవుని మార్గాన్ని ఎంచుకోవాలి. మనల్ని మనం త్యాగం చేసుకొని, దేవుని అనుగ్రహానికి సహకరించాలి. పాపపు కోరికలను విడిచిపెట్టాలి.

ఇరుకైన మార్గం మన రోజువారీ జీవితంతో ముడిపడి ఉంది. దేవునితోనూ, తోటివారితోనూ మంచి సంబంధాలు కలిగి ఉండడం, మంచి కారణాల కోసం మంచి పనులు చేయడం, మన పేరు, ప్రఖ్యాతులను కాకుండా దైవ రాజ్యాన్ని, నీతిని వెదకడం, పాపపు జీవితానికి పశ్చాత్తాపపడడం, విధేయత, వినయం, నీతి, న్యాయం, సత్యాలతో జీవించడం. ఈ విధముగా, ప్రార్ధన ద్వారా ఇరుకైన మార్గంలో ప్రవేశించుటకు, కృషి చేయాలి. ఇదే పరలోక రాజ్యానికి వెళ్లే మార్గం. ఈ మార్గంలో ప్రవేశించడానికి, మన జీవితములో వచ్చు అడ్డంకులన్నింటిని తొలగించమని దేవున్ని వేడుకోవాలి.

ప్రతీ రోజు ఆత్మపరిశీలన చేసుకోవాలి. సమయం చాలా తక్కువగా యున్నది. ప్రతీరోజు మనం ఎన్నో అవకాశాలను కోల్పోతున్నాం. “అవకాశం ఒకేసారి మన తలుపు తడుతుంది” అనే నానుడి మనకు తెలిసినదే! దేవుడు ఇచ్చిన అవకాశాలను, నేను ఎలా ఉపయోగించుకున్నాను? ఆ అవకాశాలకు నేను ఎలా స్పందించాను? క్షమించుట ద్వారా, అన్నదానము, వస్త్రదానముద్వారా, ఇతరులను ప్రేమించడముద్వారా, క్రీస్తుకు నేను సాక్ష్యం చెప్పానా? ఇరుకైన మార్గమున ప్రవేశించుటకు, నేను ఈరోజు ఎంతవరకు ప్రయత్నించాను? “ప్రభువా, నా పాపాలను క్షమించుము. నన్ను నడిపించుటకు, బలపరచుటకు, నీ ఆత్మను ఒసగుము”.

రక్షణ కొందరికి మాత్రమే కాకుండా, సర్వ మానవాళికి ఏర్పాటు చేయబడింది. అయితే, మన రక్షణ మన విశ్వాసం, నమ్మకం, జీవన విధానం, మరియు మనం ఎంచుకునే మార్గంపై ఆధారపడి ఉంటుంది. రక్షణ అంటే ముఖాముఖిగా దేవుణ్ణి చూడడం. రక్షణ విశ్వాసంతో మొదలవుతుంది. ఆ విశ్వాసాన్ని మనం రోజువారీ జీవితంలో ఎలా జీవిస్తున్నామనేది చాలా ముఖ్యం. మన విశ్వాసాన్ని ఎలా ప్రకటిస్తున్నామనే దాని నుంచే రక్షణ వస్తుంది. అలాంటి విశ్వాసాన్ని మనం అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరియు ప్రవక్తల జీవితాలలో చూస్తాం. రక్షణ పొందాలంటే, దేవుని అనుగ్రహం మన జీవితంలో కార్యరూపం దాల్చాలి. "నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం" అని పలికిన యేసయ్యే మన నిజమైన మార్గం. కాబట్టి, ఆయన బోధనలను పాటించి, ఆయన చెప్పిన, చూపిన మార్గంలో పయనిద్దాం!

ఇరుకైన ద్వారం అనేది ఒక హెచ్చరిక. రక్షణను పొందాలంటే మన జీవితాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేయాలని ఇది గుర్తుచేస్తుంది. పరలోకంలో ప్రవేశించడానికి, మన మరణం తర్వాత కాదు, ఇప్పుడే యేసును వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. యోహాను 17:3లో యేసు చెప్పినట్లు, “నిత్యజీవం అంటే, ఏకైక సత్యదేవుడగు నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలుసు కొనుటయే.” కాబట్టి, నిత్యజీవం కేవలం దేవునితో మరియు యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండటం ద్వారానే సాధ్యమవుతుంది.

మన జీవితం దేవునితో ఒక సజీవమైన, వ్యక్తిగత బంధం. ఈ బంధం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. యేసుతో వ్యక్తిగత పరిచయం ఉంటేనే మనం ఇరుకైన ద్వారం గుండా ప్రవేశించగలం. ఆ ద్వారం గుండా వెళ్ళినప్పుడు, మనం స్వర్గానికి వెళ్లే ఇరుకైన మార్గంలోకి అడుగుపెడతాము.

ఇరుకైన మార్గాన్ని అనుసరించడానికి కొన్ని ఆచరణాత్మక మార్గాలు: రోజువారీ ప్రార్థన మరియు బైబులు పఠనం: ఇవి దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని పెంచుకోవడానికి మూలస్తంభాలు. క్రమం తప్పకుండా దేవునితో మాట్లాడటం, ఆయన వాక్యాన్ని చదవడం ద్వారా మన విశ్వాసం బలపడుతుంది. క్రమం తప్పకుండా పశ్చాత్తాపపడటం: మన బలహీనతలను ఒప్పుకొని, దేవుని సహాయం కోసం అడగడం చాలా అవసరం. మనలో ఉన్న పాపపు కోరికలను గుర్తించి, వాటిని విడిచిపెట్టడానికి పశ్చాత్తాపం సహాయపడుతుంది. సేవ మరియు ప్రేమ: ఇతరులకు సహాయం చేయడం ద్వారా, మనం క్రీస్తు ప్రేమను ఆచరణలో చూపించవచ్చు. ఇది ఇరుకైన మార్గంలో ఒక ముఖ్యమైన భాగం. లోకపు ప్రలోభాలను నిరోధించడం: సోషల్ మీడియా, విలాసవంతమైన జీవితం వంటి వాటి నుండి మనల్ని మనం దూరంగా ఉంచుకోవడం ముఖ్యం. లోకం ఇచ్చే సులభమైన మార్గాలకు బదులుగా, దేవుని మార్గాన్ని ఎంచుకోవాలి.

ఇరుకైన మార్గం కష్టమైనదే. ఈ ప్రయాణంలో మనం పదేపదే విఫలమైనప్పటికీ, దేవుని దయ మరియు క్షమ ఎల్లప్పుడూ మనపై ఉంటాయి. ఇరుకైన మార్గంలో నడుస్తున్నప్పుడు మనం తరచుగా పొరపాట్లు చేస్తాం, కిందపడతాం. కానీ దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. మనం పశ్చాత్తాపపడినప్పుడు, ఆయన ప్రేమతో మనల్ని లేవనెత్తి, మళ్లీ ఆ మార్గంలో నడవడానికి బలాన్ని ఇస్తాడు. ఆయన మనల్ని ప్రేమించే తండ్రి, కాబట్టి ఆయన మన బలహీనతలను అర్థం చేసుకుంటాడు. కనుక, కష్టమైనా, ఇరుకైన మార్గమున ప్రవేశించడానికి ప్రయత్నం చేద్దాం!

No comments:

Post a Comment