మూడవ పాస్కా ఆదివారము, 14 ఏప్రిల్ 2013
పఠనములు: అ.కా. 5:27-32, 40-41; దర్శన గ్రంధము 5:11-14; యోహాను 21:1-19
విశ్వాసం దేవుని వరం. మన విశ్వాసానికి సాక్షమివ్వడానికి కూడా మనకు దైవ సహాయం అవసరం. పెంతకోస్తు పండుగకు ముందు పేతురుకి, పెంతకోస్తు పండుగ తరువాత పేతురుకి మధ్య ఉన్న తేడా మనకు సుపరిచితమే! పెంతకోస్తు ముందు అంటే ప్రభువు మరణానికి ముందు యేసు తనకు తెలియదని పేతురు మూడుసార్లు బొంకాడు. పెంతకోస్తు తరువాత, పవిత్రాత్మతో నింపబడి పేతురు, ఇతర అపోస్తలులు బాహాటముగా, నిర్భయముగా తమ విశ్వాసాన్ని ప్రకటించారు. భయస్థానములో ధైర్యం ప్రవేశించినది. పిరికితనం స్థానములో ధృడత్వం చోటు చేసుకున్నది. బ్రతుకు జీవుడా అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పారిపోయినవారు, మేము నమ్మిన ప్రభువు కొరకు మా ప్రాణాలను సహితం ఇవ్వడానికి సిద్ధం అని బాహాటముగా చెబుతున్నారు. తమ విశ్వాసానికి సాక్ష్యం ఇస్తున్న సంఘటనను మనం ఈ రోజు మొదటి పఠనములో చదువుతున్నాం. "యేసు కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభనుండి వెడలి పోయిరి" (అ.కా 5:41).
మన అనుదిన జీవితములో కూడా యేసుకు సాక్ష్యం ఇచ్చుటకు అనేక అవకాశములు ఉన్నవి. వాటిని సద్వినియోగ పరచుకొని యేసుకు దైర్యముతో సాక్ష్యం ఇద్దాం. మన విశ్వాస అనుభవాలను ఇతరులతో పంచుకొనడం ద్వారా, ఇతరుల విశ్వాసాన్ని వికసింప జేసినవారము అవుతాము. వారి కష్ట సమయములో మన నోటిమాట ఒక మంత్రములా పనిజేసి, పరిష్కార మార్గాన్ని చూపవచ్చు. చిన్న చేతిస్పర్శ, ఇతరులకు ఊరటను ఇవ్వవచ్చు. కాబట్టి, దైవ ప్రేమ పంచుటకు, పెంచుటకు ఉదార స్వభావముతో మనం ముందుకు వెళదాం!
ఈనాడు రెండవ పఠనములో పునీత యోహానుగారు ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నారు. సకల జీవకోటి ప్రభువును స్తుతించునట్లుగా అతను ఒక దివ్య అనుభూతిని పొందాడు. ప్రభువునకు స్తుతి, ఆరాధనలు, ఘనత, మహిమలు అర్పించడం ఇక్కడే మొదలు పెట్టాలి. అది ఒక అలవాటుగా మారాలి. మన స్వభావములో భాగమై పోవాలి. అపుడు, మనము, మన సంఘము, పునీతులతో, దేవదూతలతో ఏకమై ప్రభువును నిరంతరం స్తుతించగలుగుతాము.
ఈనాడు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపుగారి కొరకు, వారు ఉద్దేశాల కొరకు ప్రార్ధన చేద్దాం. వారికి దేవుడు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించి విశ్వ శ్రీసభను విశ్వాస పధంలో ముందుకు నడిపేలాగున ప్రార్ధించుదాం.
No comments:
Post a Comment