Thursday, March 7, 2013

నాలుగవ తపస్కాల ఆదివారము, 10 March 2013


నాలుగవ తపస్కాల ఆదివారము, 10 March 2013
యెహోషువా 5: 9a, 10-12; 2 కొరింతు 5:17-21; లూకా 15:1-3, 11-32

తపస్కాలములోని నాలుగవ ఆదివారముతో, పాస్కా పండుగకు మనం మరింత చేరువయ్యాము. ఈ సమయములో, మనం మరింతగా దృష్టి సారించవలసినది, మన పాప జీవితానికి పశ్చాత్తాపపడి, పాస్కా పండుగకు సిద్ధపడటము.

బాప్తిసంద్వారా దైవపుత్రులముగా చేయబడినాము. మరియు క్రీస్తునిలో నూతన సృష్టిగా చేయబడినాము.  దైవ బిడ్డలముగా, మన జీవితములో ఎల్లప్పుడూ నిజమైన ఆనందము కొరకు వెదకాలి. క్రీస్తు ఆనందానికి సూచిక. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దత్త భూమికి చేరుకొన్నప్పుడు, దేవుని యొక్క ఆనందాన్ని అనుభవించారు. పౌలుగారు నిజమైన ఆనందం క్రీస్తులో పొందుతాము అని చెప్పియున్నారు.

నిజమైన వెలుగును, ఆనందాన్ని పొందాలంటే, ఈజిప్టులాంటి పాపదాస్యమునుండి బయటపడాలి. ఎర్రసముద్రములాంటి శోధనలను దాటాలి. ఇశ్రాయేలు ప్రజలు ఆ ఆనందాన్ని పొందడానికి 40 సం,,లు పట్టింది. మనం ఈనాడు 40 రోజుల తపస్కాలములో ఉన్నాము. మనం ఎంతవరకు ఆ ఆనందానికి చేరువయ్యామో ఆలోచిద్దాం!

ఈనాటి సువిశేష పఠనములో "తప్పిపోయిన కుమారుని" కథను ప్రభువు చెప్పడం వింటున్నాము. దుడుకువాడైన చిన్నవాడు, ఈ లోకములో సంతోషాన్ని వెదకడం కోసం, తన ఆస్తిని తీసుకొని, తండ్రినుండి దూరముగా వెళ్ళిపోయాడు. తన దగ్గర ఉన్న ధనములో సంతోషం ఉంటుందని భావించాడు. తనను మోసం చేసిన స్నేహితుల దగ్గర ఆనందం ఉంటుందని భావించాడు. కాని, నిజమైన ఆనందం అతను ఎక్కడా పొందలేక పోయాడు.

మనము కూడా, అప్పుడప్పుడు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాము. కుటుంబ సభ్యులకన్న, నిజమైన ఆనందము, ఆధ్యాత్మిక విషయాలకన్నా, మనకు వచ్చే ఆస్తిపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటాము. దాని కొరకై ఏమైనా చేయడానికి సిద్ధ పడుతూ ఉంటాము. మన చుట్టూ ఉన్న చెడు పరిస్థితులను, చెడు స్నేహాలను గమనింపక, వాటిలో నాశనమై పోవు చున్నాము.

ఈ కథలో, ఒక తండ్రి, మన పరలోక తండ్రి ప్రేమను చూస్తున్నాము. లోక వ్యామోహాలలో, పాపములో పడిన తన బిడ్డలు మారుమనస్సు పొంది, తిరిగి తన చెంతకు రావాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న తండ్రి దేవుని చూస్తున్నాము. తిరిగి వచ్చినప్పుడు, మన గతాన్ని గాని, మన పాప జీవితాన్ని గాని ప్రశ్నింపక, మనలో ఉన్న మారు మనస్సు, పశ్చాత్తాప హృదయాన్ని మాత్రమే చూసి, తన హక్కున చేర్చుకొనే తండ్రిని, మరియు తిరిగి తన కుటుంబములో పూర్వ వైభవాన్ని ఒసగడానికి చేతులు చాచి, ఎదురు చూస్తున్న తండ్రి దేవుని చూస్తున్నాము. ఇలాంటి గొప్ప, అనంతమైన ప్రేమ కలిగిన తండ్రి ఒడిలో ఒదిగిపోవడానికి ఈ తపస్కాలం మంచి సమయం.
మనం చేయవలసినదల్లా, దుడుకు చిన్నవానివలె, తండ్రికి, కుటుంబాలకు దూరమై, బిజీ బిజీగా ఉన్న మనం, ఎన్నో సమస్యలతో ఉన్న మనం, ఒక్కసారి ఆగి, ఆత్మ పరిశీలన చేసికొందాం. ఎందుకు నా జీవితం ఇలా ఉన్నది? ఎందుకు నాలో ఆధ్యాత్మిక లేమితనం? మనం అందరం పాపాత్ములమే. మనలో పశ్చాత్తాపం కలగాలి. అప్పుడే, తండ్రి యొద్దకు చేరుకోగలం.

ఈ కథలో, నాకు నచ్చినది, తండ్రి తన పెద్ద కుమారునితో చెప్పిన మాట: "నాకున్నదంతయు నీదే కదా". మనతో కూడా ప్రభువు ఈ మాటను అంటున్నారు. ఏవిధముగానైతే, తండ్రి బయటకు వచ్చి, చిన్న కుమారుని ఆహ్వానించాడో, అదేవిధముగా, పెద్ద కుమారుడు అలిగినప్పుడు కూడా, తండ్రి బయటకు వచ్చి ఆహ్వానించాడు, పండుగలో పాలుగొనమని పిలిచాడు. మన నిజమైన ఆనందం ఇదే: "నాకున్న దంతయు నీదే."

మనం కూడా, మన జీవితములో, ఇతరులు మనకన్న ఎక్కువ అనే భావనతో ఉంటాము. ఈ భావనతో, పెద్ద కుమారుని వలె, మనలో మనం భాదపడుతూ ఉంటాము. దేవుని దృష్టిలో అందరం సమానులమే. అందరం ఆయన సృష్టియే, అందరం ఆయన బిడ్డలెమే! మనమే, ఆస్తి, కులం, మతం, భాష, ప్రాంతం, రంగు మొ..గు వాటితో, ఎక్కువ, తక్కువ అనే భావనలతో జీవిస్తున్నాం! ఇది సరైనది కాదు! ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనే భావనతో జీవింపక, అందరినీ సమానత్వముతో గౌరవిస్తూ, మనలో ప్రేమించే శక్తిని బలపరచుటకు ప్రయత్నిద్దాం!

ప్రభువు, తప్పిపోయిన కుమారుని కథ ద్వారా, మన జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉన్నదని తెలియ జేస్తున్నారు. పాత జీవితాన్ని విడచి పెట్టి, క్రీస్తు అయిన క్రొత్త జీవితములోనికి వచ్చే గొప్ప అవకాశం ఉన్నది. ఎప్పుడైతే, దేవునివైపు మరలాలి అని అనుకొంటామో, అది దేవునికి మనపై ఉన్న ప్రేమను సూచిస్తుంది. ఎందుకంటే, మనలో ఎవరినీ కోల్పోవడం ఆయనకు ఇష్టం లేదు.

ఆయన మనకోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన దరికి వచ్చిన మనలోని పాపాలను కడిగి వేస్తాడు. మారు మనస్సు-పశ్చాత్తాపం చెందుదాం. పాస్కా పరమ రహస్యాన్ని నిజమైన ఆనందముతో కొనియాడటానికి సంసిద్దులమవుదాం!

Little brother gopu

No comments:

Post a Comment