ఐదవ తపస్కాల ఆదివారము, YEAR C


ఐదవ తపస్కాల ఆదివారము
యెషయా 43:16-21; ఫిలిప్పీ 3:8-14; యోహాను 8:1-11
క్రీస్తులో నూతన జీవితం


పవిత్ర వారానికి ఒక వారం దగ్గరిలో మాత్రమే ఉన్నాము. పవిత్ర వారములో క్రీస్తు శ్రమలు, మరణము, ఉత్థానము ద్వారా దేవుని యొక్క ప్రేమను ధ్యానిస్తూ ఉంటాము. తపస్కాలములో ప్రత్యేకముగా దేవుని సాన్నిధ్యాన్ని, ఆయన ప్రేమను అనుభవిస్తూ ఉన్నాము. మనం చేయవలసినదెల్ల, మనలను మనం మార్చుకొని దైవాను చిత్తముగా జీవించాలి. ఆయన యందు మన బలహీనతలను అంగీకరించి, ఆయన మాత్రమే మనకు రక్షణ ఇవ్వగలడని విశ్వసించాలి. తపస్కాలం ఓ ఆనందకరమైన కాలం, ఎందుకన, క్రీస్తు ఉత్థాన మహిమలో, ఆనందములో ఆశీర్వాదములో భాగస్తులమవుటకు మనలను మనం సిద్ధపరచుకొను కాలం. మనం ఎంతటి పాపాత్ములమైనను, ప్రభువు మనలను క్షమించుటకు సిద్దముగా ఉన్నారు. అందుకు ఉదాహరణ ఈనాటి సువిషేశములో విన్నట్లుగా వ్యభిచారమున పట్టుబడినదని ప్రభువు చెంతకు తీసుకొని రాబడిన స్త్రీని ప్రభువు సంపూర్ణముగా క్షమించడమే!

మొదటి పఠనములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన కార్యాలను, చూపిన ప్రేమను చూస్తూ ఉన్నాము. మోషే నాయకత్వములో, వారిని వాగ్దత్త భూమి వైపుకు నడిపించారు. ఎర్ర సముద్రాన్ని చీల్చి, ఫరో సైన్యాన్ని నాశనము చేసి, ఈజిప్టు బానిసత్వము నుండి వారిని కాపాడారు. పాపములో పడిన ప్రతీసారి, తన ప్రజలను సరిచేసి కాపాడుకొన్నారు.

అయితే, గతాన్ని చూడక, ముందుకు సాగిపోవాలని యెషయా ప్రవక్త ద్వారా తెలియ జేయుచున్నారు. గతం ఎప్పుడు కూడా మన మనస్సులను మూసివేసి, ప్రస్తుతం ఉన్నది ఉన్నట్లుగా చూడకుండా చేస్తుంది. అందుకే ప్రభువు ఇలా అంటున్నాడు: “మీరు పూర్వపు సంగతులను జ్ఞప్తికి తెచ్చుకోనక్కర లేదు. పాత సంఘటనలను తలచుకోనక్కరలేదు” (యెషయ 43:18). “ఇప్పుడు నేనొక నూతన కార్యమును చేసెదను” (యెషయ 43:19) అని వాగ్దానం చేసి యున్నారు. అనగా దేవుడు ఎప్పుడుకూడా మనకోసం నూతనత్వాన్ని సృష్టిస్తూ ఉంటారు. నూతన అవకాశాలను కల్పిస్తూ ఉంటారు.

రెండవ పఠనములో కూడా, పునీత పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖలో, గతాన్నుండి బయట పడాలని తెలియ జేస్తున్నారు. పౌలుగారు, క్రీస్తును మాత్రమే పరిగణిస్తున్నాడు. మిగతా వాటన్నింటిని, ముఖ్యముగా గతాన్ని చెత్తగా భావించాడు. “నా ప్రభు యేసు క్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడితిని. క్రీస్తును తెలిసి కొనవలెనని, ఆయన పునరుత్థాన ప్రభావమును అనుభవింపవలెనని నా వాంఛ” (ఫిలిప్పీ 3:8,10). పౌలు పరిపూర్ణతను వెదకుటలో ఒక పరిసయ్యునివలె ధర్మశాస్రమును విధేయించాడు. కాని, చివరికి క్రీస్తులో ఆ పరిపూర్ణతను కనుగొన్నాడు. అప్పుడు క్రీస్తుకై సమస్తమును విడనాడాడు. క్రీస్తును పొందడం అనగా కేవలం జ్ఞానమును కలిగి యుండుట మాత్రమేగాక, క్రీస్తుతో వ్యక్తిగత అనుభూతిని కలిగి యుండటము. క్రీస్తుతో వ్యక్తిగత అనుభూతిని పొందియున్నప్పుడు, మన శ్రమలన్ని కూడా ఆశీర్వాదాలుగా మారతాయి.

మనలను మనం ప్రశ్నించుకొందాం!

1. తండ్రి యావే దేవుడు మనకు గతములో ఎన్నో చేసాడని, అలాగే మన కొరకు ప్రతీ క్షణం నూతనత్వాన్ని సృష్టిస్తున్నాడని విశ్వసిస్తున్నామా?
2. ఆ తండ్రి దేవుడు సృష్టించిన ఆ నూతనత్వం క్రీస్తునిలో మన జీవితం అని విశ్వసిస్తున్నామా?
3. ఆ క్రీస్తు కొరకు సమస్తమును విడనాడుటకు సిద్దముగా ఉన్నామా?
4. పౌలువలె, క్రీస్తు పునరుత్థాన ప్రభావమును అనుభవింపవలెనను వాంఛను కలిగియున్నామా?

ఈనాటి సువిశేష పఠనమును ధ్యానిద్దాం!

పర్ణశాలల పండుగకు, యేసు యెరూషలేమునకు వెళ్ళినపుడు, ఓలీవు పర్వతమునకు వెళ్లి తెల్లవారగనే దేవాలయమునకు రాగా, ప్రజలు ఆయన యొద్దకు వచ్చారు. ఆయన వారికి కూర్చుండి బోధించుచుండగా, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని (యో 8:1-11) యేసు చెంతకు తీసుకొని వచ్చి అందరి ఎదుట నిలువ బెట్టారు. ఆమెపై తీర్పు విధించమని, లేదా తన అభిప్రాయాన్ని చెప్పమని యేసును అడిగారు. ఇటువంటి స్త్రీలను రాళ్ళతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రమున ఆజ్ఞాపించెనని వారు యేసుకు గుర్తుకు చేసారు. ఇలాంటి శాసనాన్ని ద్వితీ 22:23-24; లేవీ 20:10; యెహెజ్కె 23:43-47లో చూడవచ్చు. వ్యభిచారం చాలా తీవ్రమైన నేరం అని అర్ధమగుచున్నది. అయితే ఇక్కడ ధర్మశాస్త్ర బోధకుల, పరిసయ్యుల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, యేసు మాటలలో తప్పు పట్టి ఆయనపై నేరారోపణ చేయుటకై అలా అడిగారు (8:6). ఆయనను ఇరకాటములో, సందిగ్ధములో పడవేయాలని చూసారు. నీతితో ధర్మశాస్త్రాన్ని సమర్ధించడం కొరకుగాక, యేసును పరీక్షించి, అతనిపై నేరారోపణకు ఆధారాలు వెతకాలని చూసారు. ఎందుకంటే, అప్పటికే వారు యేసును చంపడానికి ప్రయత్నాలు చేయు చున్నారు (యో 7:1). ఆయనను బంధించుటకై అధికారులను కూడా పంపించారు (7:32).

ఒకవేళ, చట్టం ప్రకారం చేయుడు అని యేసు చెప్పినట్లయితే, పాపులపట్ల కనికరము, ప్రేమకలవాడని చెరగని ముద్రవేసుకున్న పేరును కోల్పోతాడు! ప్రజాదరణ కోల్పోయే అవకాశం ఉంది. అలాగే రోమను అధికారులతో విభేదాలు ఎదురవుతాయి, ఎందుకన, ఆ రోజుల్లో, రోమను ప్రభుత్వానికి మాత్రమే మరణశిక్ష విధించే అధికారం ఉండేది. ఒకవేళ ఆమెను చంపవద్దు అని యేసు చెబితే, చట్టానికి, సంప్రదాయాలకు విరుద్ధముగా వెళుతున్నాడని అతనిని నిందించవచ్చు. ఎలాగైనా యేసును ఇరకాటములో పెట్టాలన్నదే ధర్మశాస్త్ర బోధకుల, పరిసయ్యుల ఉద్దేశ్యం! వారి కుటిల బుద్ధి స్పష్టముగా కనిపిస్తున్నది. యేసు ప్రభువుకు ఇది శోధన లాంటిదే! యేసు మొదటిగా ఏమీ మాట్లాడలేదు. బదులుగా, అప్పుడు “యేసు వంగి వ్రేలితో నేలమీద వ్రాయసాగెను” (7:6). అయితే, ప్రభువు వారి ఉచ్చులో పడలేదు. అయితే, వారు పదేపదే యేసు సమాధానము కొరకు అడుగగా, ఆయన లేచి వారితో, “మీలో పాపము చేయని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును” (7:7) అని చెప్పి వారికి బుద్ది చెప్పారు. యేసు చెప్పిన ఈ మాటలు, పదునైన ఖడ్గములా, తూటాల్లా వారి హృదయాలకు తాకాయి. తాముకూడా పాపులమే అని గుర్తుకు చేసాయి. “దోషిని చంపునపుడు సాక్షులే మొదట రాళ్ళు రువ్వవలయును. తరువాత జనులెల్లరు రాళ్ళు రువ్వి ఆ వ్యక్తిని వధింతురు” అని ద్వితీ 17:7లో చట్టం నిర్దేశిస్తుంది. మరల యేసు వంగి నేల మీద వ్రాయుచుండగా, ఆ మాటలు విని, అచట ఉన్నవారు పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు అక్కడనుండి వెళ్ళిపోయారు.

ఈ సన్నివేశాన్ని చదివినప్పుడు లేదా విన్నప్పుడు మొట్టమొదటిగా, ఇతరులపై మనం ఎలాంటి తీర్పు చేయరాదని గుర్తించాలి. ఇతరులలో తప్పులను వెదకి వారిని నిందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము! దీనిని టైం పాస్ వలె భావిస్తూ ఉంటాం! “పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు...నీ కంటిలోని దూలమును గమనింపక, ఇతరుల కంటిలోని నలుసును వ్రేలేత్తి చూపెదవేల?” అని యేసు చెప్పియున్నారు (మత్త 7:1-5).

అలాగే, మన ఈ ప్రస్తుత సమాజములో స్త్రీలపట్ల ఎన్నో అన్యాయాలు, అక్రమాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. స్త్త్రీని గౌరవించడం నేర్చుకోవడం ఎంతగానో అవసరం ఉన్నది! ఈ సన్నివేశములో, ఒకవైపు ధర్మశాస్రబోధకుల కుటిలబుద్ధి, మరోవైపు యేసు క్షమాగుణం చూస్తున్నాము. అలాగే ఆ స్త్రీతో, “ఇక పాపము చేయకుము” అని చెప్పియున్నారు. పాపక్షమాపణ దయచేసి, ఆమెకు నూతన జీవితాన్ని ఇచ్చియున్నారు. యేసు ఆ స్త్రీని ఖండించలేదు అంటే, ప్రభువు పాపాన్ని సమర్ధిస్తున్నట్లు కాదు. యేసు పాపాన్ని ఖండిస్తారు, కాని పశ్చాత్తాపము చెంది, మారుమనస్సు పొందే పాపిని ఆయన క్షమిస్తారు. నూతన జీవితాన్ని తప్పక ప్రసాదిస్తారు.

ఈ సన్నివేశాన్నుండి, మనము నేర్చుకోవలసిన ప్రధాన అంశాలు:

1. యేసు ప్రభువు యొక్క దయ, క్షమను గుర్తించాలి. ఆయన తప్పక క్షమిస్తారు. అయితే మనలో తప్పకుండ కలుగవలసినది పశ్చాత్తాపం, మారుమనస్సు, హృదయపరివర్తన. ఆ స్త్రీ పశ్చాత్తాపముతో చివరి వరకు ప్రభువు క్షమ కొరకు వేచియున్నది కనుక, ఆమె ప్రభువు క్షమను పొందియున్నది. పుణ్య స్త్రీగా జీవించినది. ప్రభువు అందరిని క్షమిస్తారు. ఆమెను నిందించడానికి ఎంతోమంది వచ్చారు. అందరూ పాపాత్ములే. ఎప్పుడైతే ప్రభువు వంగి నేలమీద వ్రేలితో వ్రాయసాగెనో, ప్రభువు మాటలు విని అచ్చట నున్నవారు పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్లి పోయారు. ఇక్కడ గమనించ వలసిన విషయం ఏమిటంటే, వారి పాపాలను ప్రభువు బట్టబయలు చేసినను వారిలో ఒక్కరు కూడా పశ్చాత్తాప పడలేదు. అందరూ ఆ పాప జీవితానికే తిరిగి వెళ్లి పోయారు. పశ్చాత్తాప పడియుంటే, ప్రభువు తప్పక వారిని కూడా క్షమించి యుండేవారు, వారికి నూతన జీవితాన్ని ఒసగి యుండేవారు. మనముకూడా మన పాపాలకు పశ్చాత్తాప పడదాం. క్షమించుటకు, నూతన జీవితాన్ని, హృదయాన్ని ఇచ్చుటకు ప్రభువు ఎప్పుడూ సిద్ధమే. అలాగే, దేవుడు మనపై చూపిస్తున్న దయను, కనికరమును మనం ఇతరులపై చూపాలి. 2. ఎవరిపై తీర్పు చేయరాదు. ఎందుకన, మనం అందరం పాపాత్ములమే (రోమీ 3:23). మనము ఖండించే వారి హృదయములో ఏముందో మనకు తెలియదు. వారి పరిస్థితి ఏమిటో మనకు తెలియదు. నిజమైన తీర్పరి దేవుడు మాత్రేమే. ఇతరులు పశ్చాత్తాపపడి, మారుమనస్సు పొంది ప్రభువు సన్నిధిలో జీవించులాగున చేయగిలిగితే మనము నిజముగా అదృష్టవంతులమే! ప్రభువు మనలను ఆశీర్వదిస్తారు. ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం: “మనము ఆత్మపరిశీలనము కావించుకొనినచో, మనము దేవుని తీర్పునకు గురికాము” (1 కొరి 11:31). కనుక, ఇతరులపై మన అభిప్రాయాలను వ్యక్తపరచే ముందు, ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనలోనున్న లోపాలను తెలుసుకోవాలి. పబ్లిక్ షేమింగ్ ప్రబలముగానున్న సోషల్ మీడియా యుగములో ఇది చాలా గొప్ప పాఠం. ఇతరులపై వ్రేలెత్తి చూపడంకన్న, ఖండించడం కన్న, సామాజిక తప్పులను సరిదిద్దుకొనే పునరుద్ధరించుకొనే విషయములో మనం ఇతరులపట్ల బాధ్యత కలిగి యుండాలి. మత్త 127 ధ్యానిద్దాం, “నేను కనికరమును కోరుచున్నాను, బలిని కాదు. అను వాక్యము నందలి భావమును మీరి ఎరిగిన యెడల నిర్దోషులను మీరిట్లు నిందింపరు.” ప్రతీకారముగాక దయ, కనికరముతో సఖ్యత కొరకు కృషి చేయాలి. మరింత న్యాయమైన, మానవీయ సమాజం కొరకు కృషి చేయాలి.

3. వ్యభిచారము మహాపాపము. ఆ స్త్రీ ఏ పాపము చేయలేదని ప్రభువు శిక్షించలేదు. కాని, ఆమెలో పశ్చాత్తాపాన్ని చూసి ఆమెను క్షమించారు. “ఇక పాపము చేయకుము” అని చెప్పి వ్యభిచారము పాపము అని తెలియ జేశారు. శారీరక వాంఛలకు లోనుకాకూడదన్నదే పౌలు బోధనలలో కూడా చూస్తున్నాము. “పాపము యొక్క వేతనం మరణం, కాని, దేవుని కృపానుగ్రహము, మన ప్రభువగు క్రీస్తుయేసు నందు శాశ్వత జీవనము” (రోమీ 6:23). మత్త 5:27-28 వచనాలను ధ్యానిద్దాం, “వ్యభిచరింపరాదు. ఒక స్త్రీని కామేచ్చతో చూచు ప్రతి వాడు ఆ క్షణముననే తన హృదయములో వ్యభిచరించినట్లే”. మార్కు 10:11-12, “తన భార్యను విడనాడి వేరొక స్త్రీని వివాహమాడు వాడు వ్యభిచారి యగును. అట్లే తన భర్తను విడనాడి వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించు చున్నది”

4. కతోలిక క్రైస్తవులుగా దేవుని దయ, కరుణగల క్రీస్తు ప్రేమను, ముఖ్యముగా దివ్యసంస్కారాల ద్వారా మనం జీవించాలి. పునరుద్ధరణకు, సఖ్యతకు సాధనాలుగా ఉండాలి. దీనికొరకై ప్రభువుతో వ్యక్తిగత అనుభూతిని కలిగియుండాలి. ప్రభువుతో ఒకసారి వ్యక్తిగత అనుభూతిని పొందినట్లయితే, మనం పాపములో ఉండము. క్రీస్తులో నూతన జీవితాన్ని జీవిస్తాం. దీనికి ఉదాహరణ, పునీత పౌలు మరియు వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ. మనకుకూడా అలాంటి అనుభూతి ప్రభువుతో ఉండాలి. అప్పుడు మన జీవితాలలో నిజమైన మార్పును చవిచూస్తాం.

No comments:

Post a Comment