5 వ సామాన్య ఆదివారము, 10 ఫిబ్రవరి 2013
యెషయ 6:1-2, 3-8; 1 కోరింతు 15:1-11; లూకా 5:1-11
యెషయ 6:1-2, 3-8; 1 కోరింతు 15:1-11; లూకా 5:1-11
గడచిన రెండు ఆదివారాలలో యేసు తన సొంత గ్రామమైన నజరేతులో గడపటం మనం చదువుకొని,
ధ్యానం చేసియున్నాము. తన స్వగ్రామమైన నజరేతులో వారు ఆయనను తృణీకరించారు. వారందరికీ
తెలిసిన వ్యక్తిగానే వారు యేసును భావించారు.ఆయన మాటలు పెడచెవిన పెట్టారు.తనను తాను
నిరూపించుకోవటానికి అద్భుతం చేయమన్నారు. కాని, యేసు వారికి తిరస్కారాన్ని గ్రహించి,
ప్రక్క గ్రామమైన కఫర్నామునకు తిరిగి వచ్చాడు. అక్కడ ఆయన అనేక మహిమలను, అద్భుతాలను చేసాడు.
ఆయన పేరు ఆ ప్రాంతమంతా కూడా వ్యాప్తి చెందినది. ప్రజలు ఆయనను గుర్తించారు. ఆయన మాటలను
ఆలకించారు. అందుకే యేసు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అనేకులు ఆయన చెంతకు వచ్చారు.
కఫర్నాములో ప్రజలు యేసు చెంతకు వచ్చింది కేవలం ఆయనను చూడటానికి మాత్రమే
కాదు, ఆయన చెప్పే మాటలను వినడానికి వారందరు అక్కడకు వచ్చారు. దేవుని వాక్యం ఎంత గొప్పదో,
ప్రధానమైనదో, మనం చూస్తూ ఉన్నాము. మనం, మన అనుదిన జీవితాలలో, మన ఆరాధన సమయములో, పూజా
బలి అర్పణలో దేవునివాక్యాన్ని విని, దానిని ధ్యానించి, జీవితములో ఆచరించడానికి ఎంత
ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నాం? దేవుని వాక్యాన్ని వినడానికి శ్రద్ధను కనబరుస్తూ ఉన్నాము?
మనం చెప్పే మాటలు, చేసే క్రియలు దేవుని వాక్యానుసారముగా ఉంటున్నాయా?
ఈనాటి సువిషేశములో, యేసు తన రక్షణ కార్యాన్ని ఈ లోకములో కొనసాగించటాన్ని
మనం చూస్తూ ఉన్నాము. అయితే, ఈ రక్షణ ప్రణాళికలో యేసుకు మనిషి తోడ్పాటు కూడా చాలా అవసరం.
మనకున్న సంపద, సకల విద్యలు, తెలివితేటలు, నైపుణ్యమంతా కూడా దేవుని రాజ్య వ్యాప్తికి
ఉపయోగపడాలి. దేవుడు మనకు ఒసగే సకల వరాలు, ఆశీర్వాదాలు, ఆయన మహిమ కొరకు వినియోగించాలి.
యేసు తన ఉపదేశమును ముగించిన పిదప, పేతురుతో, "మీరు పడవను ఇంకను లోతునకు
తీసుకొని వెళ్లి చేపలకి మీ వలను వేయుడు" అని చెప్పి యున్నాడు. యేసు మాటలు పేతురులో
ఆశను, విశ్వాసాన్ని నింపాయి, ధైర్యాన్ని ఇచ్చాయి. వారు రాత్రంతా శ్రమించినను, యేసు
మాటలు వారిలో కొత్త ఆశను నింపాయి. ఆదే ఆశతో వలను వేసినప్పుడు, వారికి వల చినుగునన్ని
చేపలు పడ్డాయి. అద్భుతం, ఆశ్చర్యం! యేసుపై ఉన్న నమ్మకం, విశ్వాసం ఈ అద్భుతానికి తోడ్పడ్డాయి.
దేవుని వాక్యం రెండంచుల ఖడ్గము కన్న పదునైనది. గొప్పది. అద్భుత శక్తి కలది.
మనలో కూడా దృఢ విశ్వాసం ఉండాలి. ప్రభువు వాక్యం మనలో జీవించినప్పుడు, మనలను ముందుకు
నడిపించినప్పుడు, మన విశ్వాస ఎదుగుదలకు తోడ్పడినప్పుడు, దాని శక్తిని మనం చూస్తాం.
అప్పుడు మనము కూడా ఆయన మహిమను మనం చూస్తాం. మొదటగా దేవునిపై విశ్వాసం ఉండాలి.
ఈనాటి పఠనాలలో, యెషయా ప్రవక్త మరియు పేతురు, వారి అపవిత్రతను దేవుని ఎదుట
ప్రకటిస్తున్నారు. వారు, దేవుని మహిమను, పవిత్రతను, గొప్పతనాన్ని చూచినప్పుడు వాళ్ళ
చిన్నతనాన్ని గుర్తించారు. దేవుని పవిత్రతలో నిలబడలేక పోయారు. యెషయా ప్రవక్త ఇలా అన్నాడు:
"నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించు
వాడను, నేను నశించితిని." అలాగే పేతురు, "ప్రభూ! నేను పాపాత్ముడను, నన్ను
విడచి పొండు." అని పలికాడు.
పాపాత్ములమైన మనలను దేవుడు తన ప్రేమ వలన, పవిత్రత వలన తన వారినిగా చేసికొని,
తనను తాను మనకు అనుదిన సంఘటనల ద్వారా, తెలియ జేస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను గుర్తెరిగి,
ఆయన సేవలో జీవించుదాం. ఆయనకు సాక్షులుగా జీవించుదాం.
No comments:
Post a Comment