తిరు కుటుంబ పండుగ, Year C

తిరు కుటుంబ పండుగ, Year C
1 సమూ. 1:20-22, 24-28; 1 యోహాను 3:1-2, 21-24; లూకా 2: 41-52

క్రీస్తు జయంతి పండుగ వెలుగులో, శ్రీసభ తిరు కుటుంబ పండుగను కొనియాడుతూ ఉన్నది. క్రీస్తు జననం ద్వారా, దేవుడు గొర్రెల కాపరులకు చీకటిలో ఒక చిహ్నాన్ని ఇచ్చి యున్నాడు. తన ఏకైక కుమారున్ని, ఈ ప్రపంచానికి వెలుగు చిహ్నముగా ప్రసాదించాడు. అయితే, ఈ కుమారుని కర్తవ్యం, తండ్రి దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడం.  ఈ పనిని యేసు ప్రభువు ఈ రోజు ప్రారంభిస్తున్నాడు.
లూకా సువార్తీకుడు మాత్రమే యేసు కుటుంబం గూర్చి చెప్పియున్నాడు. మనం ఈనాటి సువిషేశములో వింటున్నాము. ఈ సంఘటన ఒక చరిత్ర గట్టముగా మనం చెప్పు కోవచ్చు. ఈ సంఘటన క్రీస్తు ప్రభువులో దాగియున్న వ్యక్తిని గూర్చి తెలియ జేస్తుంది. అయితే, ఈ సంఘటన, క్రీస్తు జయంతి పండుగకు సంబంధించినది కాదు. ఇది పాస్కా పండుగ సందర్భములో చోటు చేసుకొన్నటువంటి ఘటన. మోషే ఆజ్ఞానుసారము, యూదా మతానికి చెందిన ప్రతి మగ బిడ్డ సం,,కి కనీసం మూడు సార్లు, యెరూషలేము దేవాలయాన్ని సందర్శించు కోవాలి. అది ఒక ఆచారము. యోసేపు ప్రతి సం,,ము ఈ యాత్రకు మరియమ్మతో వెళ్ళాడు. అయితే ఈ సారి మాత్రం తన కుమారుడైన యేసును కూడా వెంట తీసుకొని వెళ్ళాలి, ఎందుకన, యేసుకు 12 సం,,లు వచ్చాయి. మోషే ఆజ్ఞ ప్రకారం, 12 సం,,లు దాటిన ప్రతి మగ బిడ్డకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ కారణం చేత, యేసు, యోసేపు, మరియమ్మలు కుటుంబ సమేతముగా వెళ్ళారు.
సువిషేశములో వింటున్న విధముగా, బాలయేసు ఆయన తల్లి దండ్రులతో కలసి యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ జరిగే ప్రార్ధనలో పాల్గొన్నాడు. దేవుని వాక్యాన్ని విన్నాడు. కాని పండుగ తరువాత, తన తల్లి దండ్రులతో తిరుగు ప్రయాణం కాలేదు. అక్కడే దేవాలయములో ఉండి పోయాడు. యోసేపు మరియమ్మలు ఎంతగానో కలవర పడ్డారు, ఆయన కోసం ఎంతగానో వెదికారు. చివరికి మూడవ రోజు, దేవాలయములో ఆయనను కనుగొన్నారు. ఈ మూడు రోజులు కూడా ఆయన మరణ పునరుత్థానములను సూచిస్తుంది. యేసు సిలువపై మరణించి, సమాధి చేయబడి, మూడవ దినమున ఉత్థానం అయ్యాడు. కనుక, బాల యేసు తప్పిపోయిన మూడు రోజులను కూడా ఆయన జీవితములో రాబోయే సంఘటనలను సూచిస్తుంది.
బాల యేసును దేవాలయములో చూడగానే, మరియమ్మ, "కుమారా! ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు, నేనును విచారముతో నిన్ను వెతుకుచుంటిమి" (లూకా 2:48) అని ప్రశ్నించినది. అందుకు యేసు, "మీరు నాకొరకు ఎలా వెదికితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలయునని మీకు తెలియదా? (లూకా 2:49) అని సమాధానం ఇస్తూ తను వచ్చిన దైవ కార్యము గూర్చి తన తల్లి దండ్రులకు తెలియ జేసి యున్నాడు. గబ్రియేలు దూత మరియమ్మతో, యేసు ఈలోకానికి ఎందులకు వస్తున్నాడో ముందుగానే తెలియజేయడం జరిగింది, " ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరి పాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు" (లూకా 1:33). అదే విధముగా, కలలో దూత యోసేపుతో, "ఏలయన, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును" (మత్త 1:21). అయితే ఈ రోజు దేవాలయములో, యేసు స్వయముగా తన గూర్చి, తన దైవ కార్యము గురించి తెలియ జేస్తున్నాడు.
యేసు ఈ లోకములో తన తల్లి దండ్రులకు విధేయుడై జీవించాడు. వారి అడుగు జాడలలో నడిచాడు. ఆయన యోసేపు మరియమ్మ ల కుమారుడుగా గుర్తించ బడ్డాడు. అయితే ఆయన దేవుని కుమారుడుకూడా! ఆయన నిజ దేవుడు. ఈ నాడు, యేసు మాటల ద్వారా తండ్రి దేవుడు సంకల్పించిన కార్యాన్ని కొనసాగించాలని యోసేపు మరియమ్మలు గుర్తించారు. రక్షణ కార్యములో వారి సహకారం కొనసాగాలని గుర్తించారు. మనము కూడా ఈ రక్షణ కార్యములో సహకరించాలి. మరియ యోసేపులు మన ఆదర్శం!
మన సహకారం లేకుండా మనలను సృష్టించిన దేవుడు, మన సహకారం లేకుండా మనలను రక్షించలేడు. మన రక్షణ నిమిత్తమై తండ్రి దేవుడు తన కుమారున్ని ఈ లోకానికి పంపాడు. ఈ రక్షణ కార్యములో మరియ యోసేపులు పాలు పంచుకొన్నారు. వారి ఆదర్శాన్ని మనము పాటించాలి. అందుకే ప్రభువు మరియను మనందరికీ ఆధ్యాత్మిక తల్లిగా ఒసగాడు. మన కొరకు ఒక తల్లిగా తండ్రి దేవునికి ప్రార్ధన చేస్తుంది.
తిరు కుటుంబం, మనకు ముఖ్యముగా మూడు విషయాలను భోధిస్తుంది:
1. ప్రతీ విశ్వాసి, క్రీస్తు రక్షణలో భాగస్తులు కావాలి. ఆయన కార్యాన్ని ఈ లోకములో కొనసాగించాలి. దానిని కాపాడాలి. క్రీస్తు విశ్వాసాన్ని పొంది, దానిని ఇతరులతో పంచు కోవాలి, ఆయన రక్షణలో పాల్గొనే విధముగా చూడాలి. ఇది మన భాద్యత, కర్తవ్యం!
2. ఈ రక్షణ కార్యములో తిరు కుటుంబం, మనకు ఆదర్శముగా నిలుస్తుంది. ప్రతీ కుటుంబములో, సంతోషాలు, కష్టాలు, భాదలు, సహజం.తిరు కుటుంబం ఎన్నో కష్టాలను అనుభవించారు. అయితే, ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు. ప్రార్ధనలో గడిపారు. వారి విశ్వాసమే వారిని ముందుకు నడిపించింది. మనం కష్టములో ఉన్నప్పుడు, తిరు కుటుంబాన్ని ఆదర్శముగా తీసుకొందాం. అదే స్పూర్తితో, ప్రార్ధనలో, విశ్వాసములొ ముందుకు సాగుదాం.
3. "నేను నా తండ్రి పని మీద ఉండవలయునని మీకు తెలియదా?" ఈ లోకములో తండ్రి పని ఏమిటి? తన ప్రేమను, వాక్కును, రక్షణము, శాంతిని స్థాపించడం. తిరు కుటుంబం ప్రేమలో జీవించింది. దేవుని వాక్యాన్ని విని ధ్యానించింది. ఆ వాక్కు ద్వారా జీవాన్ని, శాంతిని పొందింది.
ఈనాడు శాంతి లేక, మనస్పర్ధలతో ముక్కలైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. తిరు కుటుంబ ఆదర్శముగా, ఆ కుటుంబాలన్నీ ఒకటి కావాలని, తిరిగి ప్రేమలో, శాంతితో జీవించాలని ప్రార్ధన చేద్దాం! ఒకరి నొకరు అర్ధం చేసుకోవాలని, ఒకరి నొకరు మన స్పూర్తిగా అంగీకరించాలని ఆ తిరు కుటుంబాన్ని వేడు కొందాం!

No comments:

Post a Comment