క్రిస్మస్ నవదిన ప్రార్ధనలు

క్రిస్మస్ నవదిన ప్రార్ధనలు
మొదటి దినము: 16 డిశంబర్
దేవుని ప్రేమ ఆయన మనుష్యావతారమునందు బయలుపరచడమైనది.

ధ్యానాంశం:  ఆదాము తన అవిధేయతవలన ఏదేనుతోటనుండి గెంటివేయబడ్డాడు.  దేవుని అనుగ్రహమును కోల్పోయి ఉన్నాడు. మరియు, అతనిపై అతని సంతతిపై శాశ్వత మరణమను శిక్షను తీసుకొనివచ్చాడు. కాని, దైవకుమారుడు, ఇలా జీవితమును కోల్పోయిన మానవున్ని రక్షింపకోరాడు.  దీనినిమిత్తమై, మానవస్వభావమునుదాల్చి, శిలువపై దోషిగా నిందింపబడి, మరణవేదనను పొందియున్నాడు.  మన రక్షణనిమిత్తమై అన్నింటిని సంతోషముగా భరించియున్నాడు. ఆయన ప్రభువు అయినప్పటికిని, పాపమువలన మానవుడు పోగొట్టుకున్న జీవితము అను దైవానుగ్రహమును ఒసగుటకు మానవుని స్వభావమును ధరించడానికి నిర్ణయించుకున్నాడు.

ప్రార్ధన:  ఓ దైవ సుతుడా!  మానవుని చేత ప్రేమింపబడుటకు, మానవరూపమును దాల్చియున్నావు.  కాని, ఆ ప్రేమ ఎక్కడ? మా ఆత్మలను రక్షించుటకు, నీ రక్తమును చిందించియున్నావు. అయినప్పటికిని, మేము మిమ్ములను పరిపూర్ణముగా ప్రేమించలేక పోతున్నాము.  ప్రభువా! అందరికన్న ఎక్కువగా, నేను మిమ్ములను నొప్పించియున్నాను.  నా పాపములను క్షమించండి.  నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను.  నీ ప్రేమను నాకు ఒసగండి.
ఓ మరియమ్మా, దేవుని మాత, నా తల్లి, నా కొరకు మీ కుమారున్ని ప్రార్ధించండి.  తద్వారా, మీ దివ్యకుమారున్ని, ఎల్లప్పుడూ, నా మరణాంతము వరకు ప్రేమించే అనుగ్రహమును పొందుదునుగాక!  ఆమెన్. 
రెండవ దినము: 17 డిశంబరు
దైవ ప్రేమ దివ్యబాలుని జన్మము ద్వారా బయలు పరచడమైనది

ధ్యానాంశం: దైవ కుమారుడు మన కొరకు పవిత్రాత్మ శక్తివలన దివ్య బాలునిగా ఈ లోకమున జన్మించియున్నాడు.  ఆయన ఆదామును ఒక యువకునిగా చేసినట్లు తను కూడా ఒక యువకునివలె ఈలోకమున అవతరించియుండవచ్చు, కాని ప్రభువు మన అందరిలాగే పసికందై మరియ గర్భమున జన్మించియున్నాడు.  చిన్న బిడ్డలంటే, అందరికీ చాలా ఇష్టం మరియు ప్రేమ.  దేవుడు ఆ ప్రేమను పొందుటకు, ఆయనకు బయపడక ఉండుటకు, మరియు ఆ గొప్ప ప్రేమను మనదరికి నేర్పించుటకు తన మొదటి దర్శనాన్ని పసి బాలుడై జన్మించడాని పునీత పీటర్ క్రిసోలోగుస్ చెప్పియున్నారు.  దైవ కుమారుడు ఒక చిన్న బిడ్డవలె జన్మించునని యెషయ ప్రవక్త ఎన్నో సంవత్సరముల క్రితమే ప్రవచించియున్నాడు.

ఆ దివ్యబాలుడు రాజభవంతిలోగాక, వెముకలు కొరికే చలిలో, ఒక పశువుల గాటిలో, నిరుపేదత్వములో జన్మించుటకు నిర్ణయించుకున్నాడు.  నా దేవా, నా ప్రభువా!  నిన్ను ఈ స్థితికి తీసుకొని రావడానికి గల కారణమేమిటి?  'ప్రేమే' అని పునీత బెర్నార్డు గారు అంటున్నారు.  మనపై గల దేవుని ప్రేమే ఈలోకమున ఈ స్థితిలో జన్మించుటకు కారణమైయున్నది.

ప్రార్ధన: ఓ దివ్య బాలయేసువా! నీవు ఎవరికోసం ఈ లోకమునకు వచ్చియున్నావు?  నీవు ఈ లోకమున ఎవరి కోసం వెదకుచున్నావు?  అవును. నాకు తెలుసు.  నన్ను నరకమునుండి రక్షించుటకు, నా కోసం మరణించుటకు వచ్చియున్నావు.  తప్పిపోయిన గొర్రెయైయున్న నన్ను వెదకుటకు వచ్చియున్నావు.  తద్వారా,  నేను నీనుండి పారిపోక, నీ ప్రేమగల హస్తములలో సేద తీరెదనుగాక!  నా యేసువా!  నీవే నా సంపద, నా జీవితం, నా ప్రేమ, నా సర్వస్వం.  నిన్ను తప్ప నేనింక ఎవ్వరిని ప్రేమించగలను?  నీకన్న మిన్నగా ప్రేమించే స్నేహితుడు, తండ్రి నాకెక్కడ దొరకును?

ప్రియ తండ్రీ!  నేను మిమ్ము అధికముగా ప్రేమిస్తున్నాను.  నిన్ను ప్రేమించని క్షణాలకు మిక్కిలిగా చింతిస్తున్నాను.  నా ప్రియ రక్షకుడా!  హృదయపూర్వకముగా క్షమించుమని వేడుకొంటున్నాను. నన్ను క్షమించండి. మిమ్ములను ఎన్నటికిని విడువకుండునట్లు మరియు మిమ్ములను సదా ప్రేమించుటకును  మీ అనుగ్రహాన్ని దయచేయండి.  నన్ను నేను సంపూర్ణముగా మీకు అర్పించుకొనుచున్నాను.  నన్ను త్రోసివేయక, నీ హక్కున చేర్చుకొనండి.

మరియ, నిత్య సహాయమాతా!  మీ కుమారుని చిత్తమే నాకు జరుగునట్లు, మరణ సమయమువరకు ఓర్పును దయచేయమని నాకోసం ప్రార్ధించండి. 

మూడవ దినము: 18 డిశంబర్
యేసు పేదరిక జీవితం

ధ్యానాంశం: దేవుడు తన కుమారుని జన్మమునకు ఈ లోకమున సమస్తమును ఏర్పాటు చేసియున్నాడు.  యేసు జన్మించే సమయానికి, సీజరు ఆగస్తు చక్రవర్తి తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరించవలెనని ప్రకటించి అధికారులకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు.  ఈ విధముగా, యోసేపు దావీదు వంశస్తుడైనందున గలిలయ సీమలోని నజరేతునుండి యూదయా సీమలోని దావీదు పట్టణమగు  బెత్లేహేమునకు జనాబా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై తనకు నిశ్చిత్తార్ధం చేయబడిన, గర్భవతియైన మరియమ్మను వెంటబెట్టుకొని వెళ్ళాడు.  వారికి సత్రములో చోటు దొరకపోవడముచేత, మరియమ్మకు ప్రసవకాలము సమీపించుటచేత వారు పశువులశాలయైన  ఒక గుహలో ఉండవలసి వచ్చినది.  బెత్లెహేములోని ఈ పశువుల పాకలోనే మరియ పరలోక రారాజునకు జన్మనిచ్చినది.

జ్ఞానులు, గొల్లలవలె, మనముకూడా ఈ పశువులపాకను సందర్శించుదాం. విశ్వాసముతో సందర్శించుదాం.   విశ్వాసము లేనిచో ఆగుహలో మనం ఏమీ చూడలేము.  విశ్వాసముతో చూస్తే దైవకుమారున్ని, మన పాపాలకోసం శ్రమలను పొందుటకు, మనలను రక్షించుటకు దిగివచ్చిన యేసయ్యను చూస్తాము.

ప్రార్ధన:  ఓ ప్రియమైన దివ్య బాల యేసువా!  నాకోసం ఈ భూలోకానికి వచ్చినందులకు నీకు వేలాది కృతజ్ఞతా స్తోత్రములు.  నాకొరకు పేదరికములో జన్మించి, శ్రమలనుపొంది నన్ను రక్షించావు.  ''నా ప్రభువా! నా దేవా!''.  నిన్ను నిత్యము ప్రేమించుటకు నీ అనుగ్రహాన్ని దయచేయండి.  నీవుతప్ప నాకింకేమియు  అవసరము లేదు.

ఓ మరియమ్మా!  నీ దివ్యకుమారున్ని ప్రేమించుటకు, మీ కుమారునిచేత ప్రేమింపబడుటకు ప్రార్ధన చేయండి. ఆమెన్. 
నాలుగవ దినము: 19 డిశంబర్
ప్రభువు మనకోసం అవమానకర జీవితమును జీవించాడు

ధ్యానాంశం: అప్పుడే జన్మించిన రక్షకుని కనుగొనడములో సహాయపడుటకు దేవదూత గొల్లలకు ఇచ్చిన ఆనవాలు అతని వినయ విధేయతలను సూచిస్తుంది. 'సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదునగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు. ప్రభువు. శిశువు పొత్తి గుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండ బెట్టి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవా లు'.

ఆయన ఇతర నవ శిశువులవలెగాక, ఒక పశువుల పాకలో జన్మించెను. పేదరికములో పుట్టాడు. ఇలా తన అణకువతను, నమ్రతను, వినయ విధేయతలను, నిగర్వమును చాటుకున్నాడు. ఆయన ఆహంకారులను నాశనము చేసి, వినయ విధేయతలు గలవారిని లేవనెత్తుటకు జన్మించాడు.

రక్షకుడు అనేక అవమానములకు గురికావలసి ఉంటుందని ప్రవక్తలు ప్రవచించియున్నారు. అలాగే ఆయన ఎన్నో అవమానములను పొందియున్నాడు. ఆయనను త్రాగుబోతు అని, దైవదూషనము చేసాడని నిందించారు. ఆయన అనుచరులలోని ఒకడే ఆయనను అప్పగించాడు. ఆయనపై ఉమిసారు, ఆయన ముఖమును మూసి గ్రుద్దుచూ హేళన చేసారు. భటులు ఆయనను పిడికిళ్ళతో గ్రుద్దారు, ముండ్ల కిరీటమును ఆయన తలపై పెట్టారు. కఱ్ఱతో తలపై మోదారు. ఇలా ఎన్నో విధాలుగా ఆయనను పరిహసించారు. ఒక దొంగావానివలె ఆయనను సిలువ వేసారు

ప్రార్ధన: ఓ ప్రియ రక్షకుడైన ప్రభువా! నా మీదగల ప్రేమ చేత, నీవు ఎన్నో అవమానములను, నిందలను, భాదలను, శ్రమలను పొందియున్నావు. కాని, నేను మాత్రం, నీ కొరకు ఒక మాట గాని, ఒక అవమానాన్ని గాని భరించలేకున్నాను. నేను పాపిని. నీ శిక్షకు అర్హుడను. అయినప్పటికిని, నన్ను క్షమించండి, నీ కరుణను చూపుమని వేడుకొంటున్నాను. ఇక మిమ్ములను అవమానించను, నినదించను, ద్వేషించను. ప్రభువా! నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను. మీ కొరకు ప్రతీ అవమానాన్ని భరించే శక్తిని, అనుగ్రహాన్ని దయచేయండి

ఓ మరియమ్మగార! నాకొరకు ప్రభువును ప్రార్ధించండి. 
ఐదవ దినము: 20 డిశంబర్
యేసునాధుని శ్రమల జీవితము

ధ్యానాంశం:  యేసు క్రీస్తు శ్రమలను పొందకుండానే, మానవాళిని రక్షించియుండగలడు. కాని, ఆయన మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో నిరూపించుటకు శ్రమలతోకూడిన జీవితమును ఆయన ఎన్నుకున్నాడు.  అందులకే, యెషయా ప్రవక్త ఆయనను ''బాధామయ సేవకుడు''  అని పిలచియున్నాడు.  ఆయన జీవితమంతయు కూడా, భాదలతో నిండియున్నది.  ఆయన శ్రమలు కేవలం మరణమునకు కొన్ని గంటలముందు మాత్రమే గాకా, ఆయన పుట్టుకతోనే ప్రారంభమయ్యాయి. ఆయన పుట్టినప్పుడు ఒక మంచి స్థలముగాని, కనీసం సత్రములో కూడా చోటు దొరకలేదు.  చివరికి, ఊరి చివరిలో పాడుబడిన గుహలోని  ఒక పశువుల పాకలో, చిమ్మ చీకట్లలో, మురికి వాసనలో, గరుకైన నేలమీద, కనీస సౌకర్యములు లేనిచోట జన్మించవలసి వచ్చినది.  తను జన్మించిన కొంత సమయానికే, ఐగుప్తునకు పలాయనము కావలసి వచ్చినది, ఎందుకన, హేరోదు శిశువును చంపుటకు వెదకబోవుచున్నాడు.  అక్కడ హేరోదు మరణించే వరకు ఉండెను.  ఐగుప్తు దేశములో పేదరికములోను, కష్టాలలోను జీవించవలసి వచ్చెను. యువకునిగా నజరేతులో కాయాకష్టం చేసి జీవించవలసి వచ్చెను.  చివరిగా, యెరూషలేములో కఠినమైన బాధలను, శ్రమలను పొంది, శిలువపై మరణించవలసి వచ్చెను.

వీటన్నింటిని భరించాలని, ప్రభువునకు ముందే తెలుసు.  అయినప్పటికిని, సంతోషముగా వాటిని మన రక్షణ కోసం స్వీకరించాడు.  ఇదంతయు ఆయనకు మనమీద ఉన్న ప్రేమవలన చేసియున్నాడు.  అయితే, ఈ వేదన, శ్రమలకన్నా, మన పాపభారమే ఆయనను ఎక్కువగా భాదించింది.  ''నా కన్నీటిని నేను ఎలా ఆపగలను. నా పాపాలే ప్రభువును జీవితాంతం వేదనలు పొందేలా చేసాయి'' అని పునీత కోర్తోన మర్గరీతమ్మగారు అంటుండేవారు.

ప్రార్ధన:  ఓ నా యేసువా!  నేను కూడా నా పాపాలవలన నిన్ను జీవితాంతం భాధలు, కష్టాలు పొందేట్లు చేసాను.  నీ క్షమాపణను పొందుటకు నేనేమి చేయాలో తెలియబరచండి. నీవు చెప్పునది చేయుటకు సిధ్ధముగా ఉన్నాను. నీకు వ్యతిరేకముగా చేసిన ప్రతీ పాపానికి పశ్చాత్తాపముతో క్షమాపణను వేడుకొంటున్నాను.  దయతో నన్ను క్షమించండి.  నాకన్న మిన్నగా మిమ్ములను ప్రేమిస్తున్నాను.  ప్రేమించుటకు కోరికను పుట్టించిన మీరే, మిమ్ములను కలకాలము ప్రేమించుటకు కావలసిన శక్తిని కూడా దయచేయండి.  నా హృదయం మిమ్ములను ప్రేమించేలాగున చేయండి.  నీ ప్రేమతో నన్ను బంధించండి.  నీ ప్రేమలోనే మరణించాలని ఆశిస్తున్నాను.

ఓ మరియమ్మగారా!  మన తండ్రియగు దేవుణ్ణి ప్రేమించుటకు ప్రార్ధన చేయండి. 
ఆరవ దినము: 21 డిశంబర్
మనలను రక్షించుటకు పరలోకమునుండి భూలోకమునకు తన రాకతో దేవుని కృప బయలు పరచడమైనది.

ధ్యానాంశం:  ''మన రక్షకుడగు దేవుని కృపయు, ప్రేమయు ప్రత్యక్షమగుటతో ఆయన మనలను రక్షించెను'' (తీతు 3:4) అని పౌలుగారు అంటున్నారు.  దేవుడు మానవావతారం ఎత్తి భూలోకమునకు విచ్చేయడమువలన అతని మంచితనము, ప్రేమ ఎంత గొప్పదో మనకి అర్ధమగుచున్నది. దేవుని శక్తి మొట్టమొదటిగా, సృష్టిని చేయడములో నిరూపితమైనది. మరియు అతని జ్ఞానము, సృష్టిని పరిరక్షించడములో నిరూపితమైనది.  కాని, అతని కృపగల మంచితనము, పడిపోయిన మానవుని, తన శ్రమలు, మరణము ద్వారా రక్షించుటకు మానవ రూపమును దాల్చడములో నిరూపితమైయున్నది. 

పశువుల పాకలో జన్మించినప్పుడు నిస్సహాయునివలె, పొత్తిగుడ్డలలో చుట్టబడి కనిపించాడు. ఆ తరువాత, పిలాతు సభ ఆవరణలో ఆయనను కొరడాలతో కొట్టారు.  ముళ్ళ కిరీటమును అల్లి, ఆయన శిరస్సుపై పెట్టి, ఆయన చెంపపై కొట్టి అవమానించారు.  భారమైన శిలువ మ్రానును మోశారు. చివరిగా, నిస్సహాయ స్థితిలో, భాదలో, ఆవేదనలో ఆ మ్రానుపై ప్రాణాలను విడచారు. మనపైఉన్న ఆయనప్రేమ మనహృదయాలను గెలచుకోవాలని కోరుకొనియున్నది. మనలను రక్షించడానికి, ఒక దేవదూతను ఆయన పంపియుండవచ్చు.  కాని, తనే స్వయముగా, శ్రమల మరణము ద్వారా, మనలను రక్షించడానికి మానవ రూపములో ఈ భువికి ఏతెంచారు. 

ప్రార్ధన: ఓ నాప్రియ రక్షకుడా!  నీవు నాకొరకు ఈ భువిలో జన్మించకపోయినయెడల, పాపమునుండి జీవమునకు పిలువబడకపోయినయెడల, నేను ఇప్పుడు ఎక్కడ, ఏ స్థితిలో ఉండేవాడినో!  నాకొరకు నీవు ఇంతకాలము ఎదురుచూసియున్నావు.  నా పాపములను క్షమించండి.  మిమ్ములను నిత్యము ప్రేమించుటకు సహాయము చేయండి.

ఓ మరియమ్మగారా! నా సహాయమా! నా కొరకు ప్రార్ధన చేయండి.  నీవు ప్రార్ధన చేసినచో, దేవుని అనుగ్రహమును నేను తప్పక పొందెదను.  ఆమెన్.
ఏడవ దినము: 22 డిశంబర్
దివ్య బాలయేసు ఐగుప్తునకు పలాయనము

ధ్యానాంశం:  మానవాళిని రక్షించుటకు పరలోకమునుండి భూలోకమునకు ఏతెంచిన క్షణమునుండియే, రక్షకుడిని చంపాలని ప్రయత్నాలు కొనసాగాయి.  బెత్లెహేముపురిలోని పశువుల పాకలో జన్మించిన శిశువు, తన సామ్రాజ్యమును, అధికారమును ఆక్రమిస్తాడని హేరోదు భయపడ్డాడు.  ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి, 'శిశువును, చంపుటకు హేరోదు వెదక బోవుచున్నాడు. కావున లేచి, బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను చెప్పువరకు అచ్చటనే ఉండుము' అని ఆదేశించినది. యోసేపు దేవుని ఆజ్ఞను విధేయించాడు. ఆక్షణమున, మరియతల్లి బిడ్డను చూసి తన హృదయములోనే దేవుని ప్రణాళికను మననము చేసి యున్నది.

తిరు కుటుంబం మన కోసం ఎన్నో కష్టాలను అనుభవించింది.  ఆ రాత్రియే ఐగుప్తునకు పలాయనం అయ్యింది.  ఐగుప్తునకు చేరుకోవడానికి, ఎన్ని రోజులు, రాత్రులు ప్రయాణించవలసివచ్చిందో!  బెత్లెహేమునుండి  ఐగుప్తు సరిహద్దునకే 120.7   కిలో,,మీ,, ఉంటుంది.  సరిహద్దునుండి యూదుల స్థావరమువరకు మరో 160.9 కిలో,,మీ,, ఉంటుంది. దీనిని బట్టి వారు ఎన్ని రోజులు, ఎన్ని వారాలు ప్రయాణం చేసిఉంటారో! మరియు ఆ ప్రయాణం అంత సులువుగా ఉండక పోవచ్చు!

ప్రార్ధన:  ప్రియ దివ్య బాలయేసువా!  ఐగుప్తు పలాయనములో నీవు ఆకలికి, చలికి, ఎంతగానో ఏడ్చి ఉంటావు! హేరోదు దుష్ట తలంపుల వలన ఎన్నో కష్టాలు గురి అయ్యావు.  నేను కూడా, నా పాపాల వలన నిన్ను ఎంతగానో నొప్పించియున్నాను.  క్షమించండి ప్రభువా.  పాపములో పడిపోకుండా కాపాడండి.  శోధనలను ఎదుర్కొనుటకు కావలసిన శక్తినివ్వండి. యోసేపువలె తండ్రి చిత్తమును నెరవేర్చ శక్తినివ్వండి.  నీనుండి నన్ను ఏ శక్తియు వేరుపరపకుండునట్లు చేయండి.  మీ అనుగ్రహములో జీవించి మరణింప భాగ్యమును దయచేయండి.

ఓ మరియమ్మ గారా!  నేను ఎల్లప్పుడూ దైవ ప్రేమలో జీవించునట్లు, మరియు ఆయనను ప్రేమిస్తూ మరణించు భాగ్యమును దయచేయ ప్రార్ధించండి. ఆమెన్. 
ఎనిమిదవ దినము: 23 డిశంబర్
ఐగుప్తు, నజరేతులో దివ్య బాలయేసు

ధ్యానాంశం:  మన ప్రియ రక్షకుడైన బాల యేసు తన మొదటి బాల్య జీవితాన్ని ఐగుప్తు దేశములో అనేక సంవత్సరాలు పేదరికములోను, అణకువలోను జీవించాడు.  ఐగుప్తులో యోసేపు, మరియలు పరదేశీయులు. అక్కడ బంధువులుగాని, స్నేహితులుగాని లేకుండెను. ప్రతీరోజు కష్టపడుతూ వారి జీవితాలను కొనసాగించారు.  వారి జీవనశైలి చాలా పేదరికములో కొనసాగింది.  బాలయేసు ఇక్కడే తన తప్పటడుగులు వేసాడు. తన ముద్దుముద్దు మాటలను నేర్చాడు.

ఐగుప్తునుండి, నజరేతునకు తిరిగి వచ్చిన తరువాతకూడా, తిరుకుటుంబం పేదరికములోను, అణకువతోను జీవించింది.  ముప్పైసంవత్సరములు వచ్చేవరకు యేసు తన తండ్రి యోసేపుతో వడ్రంగి దుకాణములో ఒక సాధారణ పనివానివలె కష్టపడియున్నాడు.  విశ్వాన్ని సృష్టించిన దేవుడే స్వయముగా మనకొరకు ఇలాంటి జీవితాన్ని సంతోషముగా జీవించాడు.  ఇదంతయు చూసి ఆయన మీద మనకు ప్రేమ పుట్టక ఉంటుందా?

ప్రార్ధన:  ఓ యేసువా! నా రక్షకుడా!  ముప్పది సంవత్సరముల పాటు అనామకమైన, కష్టాలతో కూడిన జీవితమును నాకొరకు జీవించియున్నావు.  అలాంటప్పుడు, ఈ లోకములో నేను సంపదలను, ఉన్నతమైన జీవితమును ఎలా ఆశించగలను?  మీవలె అణకువతో, విధేయతతో జీవించు వరమును అనుగ్రహించండి.  నిజమైన సంపదను పరలోకమున వెదకు హృదయమును దయచేయండి.  నేవే ఆ నిజమైన సంపద అని తెలుసుకొనే జ్ఞానమును ఒసగండి.

స్వార్ధముతో నా వాంఛలను, కోరికలను సంతృప్తిపరచుకొనుటకు అనేకసార్లు నీ స్నేహాన్ని తృణీకరించాను.  నన్ను క్షమించండి.  పాపముచేత నా జీవితాన్ని నాశనం చేసుకోవడం నాకిష్టములేదు. నీ అనుగ్రహములో జీవించడమే నాకిష్టం. మిమ్ములను ఎల్లప్పుడూ ప్రేమించుటకు సహాయం చేయండి.

ఓ మరియతల్లి!  పాపాత్ముల శరణమా!  నేవే నా నమ్మకము.  ఆమెన్.
తొమ్మిదవ దినము: 24 డిశంబర్
బేత్లెహేమున పశువులపాకలో యేసు జన్మించుట

ధ్యానాంశం:  తన సామ్రాజ్యమునందు జనాభా లెక్కలు సేకరింప వలెనని ఆగస్తు చక్రవర్తి  అధికారులకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు, యోసేపు, దావీదు వంశస్తుడైనందున గలిలయ సీమలోని నజరేతునుండి యూదయా సీమలో ఉన్న దావీదు గ్రామమగు బేత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుటకై, తన భార్యయు, గర్భవతియునైన మరియమ్మనుకూడా వెంట బెట్టుకొని వెళ్ళెను.  గర్భవతియైయున్న మరియ నాలుగుదినాలపాటు, చలిలో, కొండలమీద ప్రయాణముతో ఎంత వేదన పడి ఉంటుందో!  వారు బేత్లెహేములో ఉండగానే మరియమ్మకు ప్రసవకాలము సమీపించెను.  యోసేపు వారికి సత్రమున స్థలమును వెదికాడు.  కాని, ఎక్కడ స్థలము లేకుండెను.  వారు పేదవారు కాబట్టి, అన్ని సత్రములనుండి వారు వెడలగొట్టబడ్డారు.

ఆ రాత్రంతయు చోటుకోసం వెదికారు.  చివరికి, గ్రామమునకు బయట పశువులపాకగాఉన్న ఒక గుహను కనుగొన్నారు.  యోసేపు మరియతో, 'మరియ, ఇంత చలిలో ఈ పశువుల పాకలో రాత్రంతయు నీవు ఎలా ఉండగలవు?'  అప్పుడు మరియ 'యోసేపు, రాజులకు రాజైన దైవకుమారుడు జన్మించకోరుకున్న రాజభవనము ఈ గుహనే! పాన్పు ఈ పశువుల తోట్టియే!’  ఆహా...!  ఎంత గొప్ప మనసు! ఎంత గొప్ప వినయం!  ఎంత గొప్ప సహనం!.

ప్రసవకాలం ఆసన్నమైనప్పుడు, మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని, పొత్తి గుడ్డలలో చుట్టి పశువులతొట్టిలో పరుండబెట్టెను.  దైవకుమారుడు, భూలోకమునకేతెంచిన అద్భుత క్షణాలు!  ప్రభువుమహిమ ప్రకాశించిన మధుర క్షణాలు!  గుహ అంతయు కూడా, జ్వాలలతో ప్రకాశించిన క్షణాలు! దేవున్ని మరియ తన హృదయానికి హత్తుకున్న క్షణాలు!  మరియ యోసేపులు, ప్రకృతితోకలసి, మోకరిల్లి, దివ్య బాలయేసుని ఆరాధించిన క్షణాలు! చిన్నియేసయ్యను పోత్తిగుడ్డలలో చుట్టి పశువులతొట్టిలో పరుండబెట్టిన క్షణాలు! ఇలా దైవ కుమారుడు మనమధ్యలో జన్మించడమువలన, ఆయన అనంతమైనప్రేమ నిరూపితమగుచున్నది.

ప్రార్ధన:  ఆరాధనకు పాత్రుడవైన ఓ దివ్యబాలయేసువా!  నేను నీనుండి ఎంతగా పరుగెడాలని ప్రయత్నంచేసినా, నీవు మాత్రం నావెంటే ఉన్నావు.  అన్ని ఆపదలనుండి రక్షిస్తున్నావు.  నేను నీ పాదముల దగ్గరైనా ఉండుటకు అర్హుడనుకాను. నా పాప భారమే, బేత్లెహేములోని పశువుల తొట్టిలో నీకన్నీటికి కారణం. పాపాత్ములను మన్నించి రక్షించుటకే పరలోకమునుండి, భూలోకానికి ఏతెంచావు.  ఈ పాపినికూడా క్షమించి, రక్షించమని దీనముగా వేడుకొంటున్నాను.  నేవే నాదేవుడవు, నా రక్షకుడవు!

ఈలోకాన్ని నీవెలుగుతో ప్రకాశింప భువికేగిన నీవు ఈ రాత్రికి నన్నునూ, నా హృదయాన్ని, నా జీవితాన్ని, నీ వెలుగుతో నింప అర్ధిస్తున్నాను.  నిన్ను ఎల్లప్పుడూ ప్రేమించువరాన్ని దయచేయండి.

ఓ మరియా, యేసుని తల్లి, నా తల్లి! నీ ప్రార్ధనలవలన నీ కుమారునినుండి సమస్తమును ప్రాప్తించగలవు.  నాకొరకు యేసయ్యను ప్రార్ధింపమని నా ఒకే ఒక ప్రార్ధన.  ఆమెన్.

No comments:

Post a Comment