పెంతకోస్తు
మహోత్సవము, Year ABC
అ.కా. 2:1-11; గలతీ
5:16-25 లేక 1 కోరింతు 12:2-13; యోహాను 15:26-27; 16:12-15 లేక 20:9-23
సర్వేశ్వరుని ఆత్మ లోకమంతట వ్యాపించెను. సమస్తము వారి ఆదీనములో యున్నది. ధ్వనించిన ప్రతి మాట వారికి తెలియును. అల్లెలూయ!
పెంతకోస్తు మహోత్సవమున, పవిత్రాత్మ శక్తితో శిష్యులపై వేంచేసెను. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకలవలె వ్యాపించి, ఒక్కొక్కరిపై
నిలిచెను. ఆవిధముగా, శ్రీసభ ప్రేషిత కార్యము
ఈ లోకమున ఆరంభమైనది. పవిత్రాత్మను పొందిన వారు
ధైర్యముతో యేరూషలేములోను, పలుచోట్లలోను దైవ వాక్యమును బోధించిరి. ఈ ప్రేషితకార్యమునకై ప్రభువే స్వయముగా తన ఉత్తానము
తరువాత పలుమార్లు శిష్యులకు దర్శనమిచ్చియున్నాడు. మొక్షారోహణమునకు ముందుగా, వారిని
యేరూషలేములోనే ఉండమని, తండ్రి దేవుని వాగ్ధానమును స్వీకరించుటకు సంసిద్దులవమని కోరియున్నాడు. దానినిమిత్తమై శిష్యులు మరియతల్లితో కలసి ప్రార్ధనలో
ఒక చోట కూడియుండిరి.
ఈరోజు శ్రీసభ జన్మ దినోత్సవము కూడా. శ్రీసభ అనగా భూలోకమంతట వ్యాపించియున్న క్రీస్తు
సంఘము. ఈ సంఘము దైవ సాన్నిధ్యమును ప్రత్యక్షముగాను
మరియు దైవ ప్రేషితకార్యమును ఈ లోకమున కొనసాగిస్తూ ఉన్నది. ప్రభువు తన శిష్యులకు దర్శనమిచ్చినప్పుడు వారికి
రెండు అనుగ్రహాలను అనుగ్రహించాడు: శాంతి మరియు పాపమన్నింపు. పవిత్రాత్మ శక్తితో నింపబడి తన కార్యమును కొనసాగించమని
క్రీస్తు శిష్యులను ఆదేశించియున్నాడు. పవిత్రాత్మ
వారికి క్రీస్తు సందేశమును తెలియపరచును. ఈనాటి
మొదటి పటనములో (అ.కా. 2:1-11) పవిత్రాత్మ రాకడ గూర్చి వింటున్నాము. భయభ్రాంతులైన వారు పవిత్రాత్మ రాకడతో ధైర్యము పొంది
క్రీస్తు సందేశమును బహిరంగముగా బోధించారు. రెండవ పటనములో (గలతీ 5:16-25 లేదా 1 కోరింతు
12:2-13) పవిత్రాత్మ వరాలు, పవిత్రాత్మ శక్తిని గూర్చి పునీత పౌలుగారి ప్రవచనాలను వింటున్నాము. ఆత్మవరాలు ఆధ్యాత్మిక కార్యాలు మరియు అవి మనలను
దైవ పవిత్రతలో నడిపించును.
అలాగే ఈ దినమున, దేవుడు సినాయి పర్వతముపై మోషేకు ఒసగిన చట్టమును గుర్తుంచుకొని
ఈ ఉత్సవమును కొనియాడేవారు. ఈ దినమునే పవిత్రాత్మ శిష్యులపై వేంచేసి, తద్వారా, శ్రీసభ
జన్మించియున్నది. క్రీస్తు ఉత్థానం తర్వాత
50 వ దినమున, శిష్యులలో గొప్ప మార్పు సంభవించినది. వారు కలవరపడియున్నారు, భయపడియున్నారు, దిగులు చెందియున్నారు,
నిరాశ పడియున్నారు. పై గదిలో తలుపులు మూసుకొని,
బిక్కుబిక్కుమని, యూదులకు భయపడుచూ, దిక్కుతోచని
పరిస్థితిలో ఉన్నారు. ప్రార్ధనలో ఉన్న వారిపై
పవిత్రాత్మ దిగి వచ్చియున్నది. అలాగే, యేరూషలేములో ఉన్న విశ్వాసులందరి పైకి వేంచేసి
యున్నది. భూలోకములోని ప్రతీ దేశమునుండి వచ్చిన
దైవ భక్తులగు యూదులు, యేరూషలేములో నివసించుచుండిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని ఒసగిన కొలది
వారు అన్య భాషలలో మాటలాడ సాగిరి. ఆ శబ్దము
విని జనసమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు యూదులలో
ప్రతీ వ్యక్తియు, అవిశ్వాసులు తన సొంత భాషలలో మాటలాడుట విని కలవర పడిరి. ఇదీ పెంతకోస్తు అనుభవము.
యోహాను సువార్త 20:19-23 ప్రకారం, శిష్యులు పవిత్రాత్మను క్రీస్తు ఉత్తాన
మైన రోజే పొందియున్నారు. ఆదివార సమయమున యూదుల
భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసికొని ఉన్నపుడు , యేసు వచ్చి వారి మధ్య నిలువబడి,
"మీకు శాంతి కలుగునుగాక!" అనెను.
"నా తండ్రి నన్ను పంపినట్లు, నేను మిమ్ము పంపుచున్నాను" అని పలికి
ఆయన వారిమీద శ్వాసను ఊది, "పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన
యెడల అవి క్షమింపబడును; మీరు ఎవరి పాపములను క్షమింపని యెడల అవి క్షమింపబడవు" అని
చెప్పెను. ప్రభువు ప్రేషిత కార్యము, శిష్యుల ప్రేషిత కార్యము ఒక్కటే! మన ప్రేషిత కార్యము
కూడా అదియే! సృష్టి ఆరంభములో దేవుడు శ్వాసను ఊది మానవున్ని తన పోలికలో సృజించాడు. ఈనాడు,
క్రీస్తు తన శ్వాసను ఊది, ఓ నూతన సృష్టిని రూపొందించాడు. క్రీస్తులో మనము కూడా ఓ నూతన సృష్టి. సోదర ప్రేమ, క్షమాపణ, క్రీస్తు సందేశములో ముఖ్యాంశాలు. ఇదే సందేశాన్ని మనము కొనసాగించాలని ప్రభువు కోరుచున్నాడు.
మొదటి పటనములో ముఖ్యముగా గమనించవలసిన అంశాలు: శిష్యులు క్రీస్తు ఆదేశాన్ని
విధేయించారు. యేరూషలేము వీడక దేవుని వాగ్ధానము వచ్చు వరకు అక్కడే వేచియుండమని చెప్పిన
క్రీస్తు ఆదేశాన్ని వారు అక్షరాల పాటించారు.
అమూల్యమైన సమయాన్ని ప్రార్ధనలో గడిపారు.
పవిత్రాత్మ దిగి వచ్చినప్పుడు ఒక శబ్దము వచ్చెను. అయితే, ఆ శబ్దము అందరు వినలేదు. కేవలము, విశ్వాసులు, భక్తులు మాత్రమే వినగాలిగారు,
విని ఒకచోట గుమికూడి యున్నారు. అవిశ్వాసులు పవిత్రాత్మను పొందుటకు అనర్హులైనారు. అగ్నిజ్వాలలు
నాలుకలవలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరిపై నిలుచుట వారికి కనబడెను. ఇది దైవ సాన్నిధ్యమునకు సూచికగా ఉన్నది. అప్పుడు పవిత్రాత్మ శక్తిని పొందిన వారు అన్య భాషలలో
మాటలాడసాగిరి. వినినవారు వారి సొంత భాషలలో
వినగలిగారు. వారి భాషలలో క్రీస్తు సాన్నిధ్యమును
చూడగలిగారు... అది ప్రేమ భాష అని గుర్తించారు.
ఈనాటి రెండవ పటనం, గలతీ 5:16-25 లో పునీత పౌలుగారు, జ్ఞానస్నానము ద్వారా
పవిత్రాత్మ శక్తిని పొందిన మనము ఎల్లప్పుడూ ఆత్మయందు జీవించాలని చెబుచున్నాడు. శరీరమునకు సంబంధించిన కోరికలకు లోనుగాక, ఆత్మయందు
జీవించండని కోరుచున్నాడు. క్రీస్తు ద్వారా, నూతన సృష్టిగా మారిన మనము దేవునికి సంభందించిన
వారము, కావున ఆత్మను అనుసరించి క్రమముగా జీవించాలి. దైవ బిడ్డలముగా, పవిత్రముగా జీవించాలి. శరీర కార్యములు చేయువారు దేవుని రాజ్యమునకు వారసులు
కారు. శరీరము కోరునది, ఆత్మ కోరుదానికి విరుద్ధముగా ఉండును. ఆత్మ కోరునది, శరీరము కోరడానికి
విరుద్ధముగా ఉండును. ఈ రెంటికిని బద్ధవైరము. ఆత్మ శక్తితో, శరీర కార్యములను అధిగమించగలం. ఆత్మ ఫలాలు ఇవే: ప్రేమ, ఆనందం, శాంతి, సహనము, దయ,
మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము.
యోహాను 15:26-27 లో "నేను తండ్రి యెద్దనుండి మీ యొద్దకు పంపనున్న
ఓదార్చెడివాడును, తండ్రి యెద్దనుండి వచ్చు సత్య స్వరూపియును అగు ఆత్మ వచ్చినప్పుడు
ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి
నుండియు నా వెంట ఉన్నవారు. కనుక, మీరును నన్ను
గురించిన సాక్ష్యులు. అని ప్రభువు చెప్పారు. తనకు సాక్ష్యులుగా ఉండమని ప్రభువు తన శిష్యులను
ఆహ్వానించియున్నారు. ఎందుకన, వారు ఆయనతో జీవించారు,
ఆయన జీవితాన్ని, ప్రేషిత కార్యాన్ని పంచుకొనియున్నారు, ఆయన బోధనలను ఆలకించియున్నారు,
ఆయన అద్భుతాలలో పాలుపంచుకొన్నారు. ఆయన జీవితానికి,
శ్రమలకు, మరణానికి సాక్ష్యులయ్యారు. ఇప్పుడు
వారు ఆయన ఉత్తాన మహిమను అనుభవించియున్నారు.
పవిత్రాత్మ పని (యో 16:1-15): పవిత్రాత్మ వచ్చి పాపమును గురించియు
, నీతిని గురించియు, తీర్పును గురించియు, లోకమునకు నిరూపించును. సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు, సంపూర్ణ సత్యమునకు
నడిపించును. ఆయన తనంతట తాను ఏమియు బోధింపక
తాను వినిన దానినే బోధించును. జరగబోవు విషయములను
మీకు తెలియజేయును.
పెంతకోస్తు మహోత్సవము తండ్రి ఆత్మ, కుమారుని ఆత్మ శిష్యులపైకి రావడాన్ని
కొనియాడు పండుగ. ఈ ఉత్సవము ద్వారా దేవుడు ఏవిధముగా
మన జీవితాలలో జోక్యం చేసికొంటున్నాడో, త్రిత్వైక దేవునిలో మనలను ఏవిధముగా భాగస్తులను
చేయుచున్నాడో, మనలను ఒక నూతన సృష్టిగా మార్చుతున్నాడో తెలిసికొంటున్నాము. ఆ కృతజ్ఞతా
భావముతో ఈ మహోత్సవాన్ని కొనియాడుదాం.
ఆ పవిత్రాత్మ శక్తి, వరాలు మన పైన కూడా దిగి రావాలని ప్రార్ధన చేద్దాం.
ఆయన ప్రేషిత కార్యములో పాలుపంచుకొనునట్లు తగు శక్తిని ఒసగమని వేడుకొందాం!
No comments:
Post a Comment