పాస్కా కాలపు ఆరవ ఆదివారము 13 మే 2012

పాస్కా కాలపు ఆరవ ఆదివారము 13  మే 2012
అ.కా.10:25-26, 34-35, 44-48, 1 యోహాను 4:7-10, యోహా 15:9-17
నిలచియుందాం! సేవకులమై, స్నేహితులమై...

'నిలకడ' అనేది అన్నింటికీ ముఖ్యం. పనిలో, చదువులో, ఆటలో, ఏరంగములోనైన నిలకడ ఎంతైనా అవసరం. ఈనాటి సువిషేశములో ఏసు ఈ మాటలనే ఒత్తి పలకుచున్నాడు.  నిలచియుంటే, నిలబడతారు! పంపబడతారు అని ప్రభువు బోధిస్తున్నాడు.  అసలు ఈ 'నిలిచియుండటం', 'నిలబడటం' అంటే ఏమిటో ఓసారి ఆలోచిద్దాం! సాధారణముగా, 'నిలిచి యుండటం' అంటే కాళ్ళ మీద నిలిచియుండటం అనేది మొట్టమొదటిగా మనకు అనిపిస్తుంది. అది నిజమే.  కానీ ఇంకా ముదుకెలితే ఆ మాటకు ఉన్న పలుఅర్ధాలు మనకు విశదమవుతాయి. యోహాను 15 వ అధ్యాయములో 'నిలచియుండటం' అనే మాటకు, సమీపముగా ఉండటం, దగ్గరగా ఉండటం, సంభందం కలిగియుండటం, అంటిపెట్టుకొని యుండటం, అనుబంధం కలిగియుండటం అనే అర్ధాలు ఉన్నాయి.  నాకు దగ్గరగా నిలిచియుండమని ప్రభువు అంటున్నాడు. ద్రాక్షావల్లిలో తీగలాగా నాలో నిలిచి యుండండి అని అంటున్నాడు.
నిలిచి యుంటే ఏం జరుగునో, ధ్యానించి తెలుసుకొందాం!


1. నిలచియుంటేనే నీకు తెలుస్తుంది-నీ వేవరోయని

ఆయనతో నిలిచి ఉండటం వలన, ఆయనలో కలసి ఉండటము వలన, ఆయన వెలుగులో నిలబడటం వలన మనమేవరమో! మన బలాలు, బలహీనతలు, మన శక్తులు-యుక్తులు, మన విలువ, మన ఆశయాలు, మన అసలు తత్వం తెలియవస్తుంది.

దేవుని ఎదుట, ఆయన వెలుగులో, ఆయన స్పర్శలో ఉన్నవాడైన పేతురు (అ.కా. 10:9) కోర్నేలితో "నేనును ఒక మనుష్యుడనే" అని అంటున్నాడు.  గర్వము లేక దీనుడై తన నిజతత్వమును ఒక అన్యుడైన కోర్నేలి ముందు అంగీకరిస్తున్నాడు (అ.కా.10:26).  తన నిజరూపమును, బలహీనతలను, స్వతంత్రముగా, సంతోషముగా అంగీకరిస్తున్నాడు.  ప్రభువుతో కలసి, ప్రభువులో నిలచియుండటం నేర్చుకొన్నాడు కాబట్టే, ఈ విధముగా దీన మనస్కుడిగా పేతురు ఉండగలిగాడు.

ఆయనలో నిలచియున్న అబ్రహాము తానేమిటో తెలిసికొన్నాడు.  ఆ.కాం. 18:27 లో అబ్రహాము దేవునితో ఈ విధముగా అంటున్నాడు.  "నేను మట్టి మనిషినే, నేను బూడిదనే".  దేవునిలో నడచినవానిగా, దేవుని స్నేహితునిగా, దేవునిలో నిలిచియుండుట వలన తన నిజరూపమును అబ్రహాము తెలిసికొంటున్నాడు.  (ఈ విధముగానే పరిసయ్యుడు కూడా తను పాపినని దేవుని సన్నిధిలో తెలిసికొంటున్నాడు, లూకా 18:9-14).

2. నిలిచి యుంటేనే నీకు తెలుస్తుంది, దేవుడు ఎవరోయని!

దేవునిలో నిలచియుంటే, దేవునితో కలిసియుంటే, ఆయన వెలుగులో నడుస్తుంటే, మన బల, బలహీనతలతో పాటు దేవుని గొప్పతనం, ఆయన మహిమ, ప్రభావం మనకు తెలియవస్తుంది.  ఆయన నీ కొరకు ఏమి చేయగలదో నీవు తెలిసికొంటావు.  కష్ట సమయములో, దు:ఖ సమయాలలో కూడా ఆయనలోనే ఉండటం మనం నేర్చు కోవాలి.  సంతానం లేని సమయములో, ఇక సంతానం కలుగడం అసాధ్యమని తెలిసిన సమయములో కూడా, అబ్రహాము దేవునిలో నిలిచి యుండటం నేర్చుకొన్నాడు. అందుకే, దేవుడు అసాధ్యమైనది సుసాధ్యం చేసి తనను తాను బయలు పరచుకొన్నాడు.

నిలచియుంటేనే ఆయన తనను తాను బయలుపరచుకొంటారు.  మగ్దల మరియ సమాధి వద్దనే నిలచియుంది, మరణించిన యేసును వెదకింది.  ఆయనను చూడాలనే కోరిక, ఆయన సన్నిధిలో ఉండాలనే ఆశ ఆమెను నడిపించింది.  ఆయనను కలిసింది (యోహా 20:11-18). తద్వారా ఆయనతో అనుబంధం ఏర్పడినది.

౩. నిలిస్తే ఫలిస్తావ్!

మనం ఆయనయందు, ఆయనలో ఉంటేనే (నిలిస్తేనే) మనం ఫలిస్తాము!  యోహాను 15:5 లో ప్రభువు ఇలా అంటున్నాడు, "నేను లేక మీరు ఏమీ చేయలేరు".  నిలకడ యుంటేనే ఫలితం వస్తుంది.  ద్రాక్ష తీగ, ద్రాక్ష వల్లిని అంటిపెట్టుకొని యున్నట్లు మనం ఆయనతో నిలిచియుంటే మన పనిలో, చదువులో, ప్రార్ధనలో, జీవితములో ఫలిస్తాం.  ఆయన ప్రేమను పొందుతూ, పొందిన ప్రేమను పంచుతూ, ఆ ప్రేమను తెలియని వారికి, ఆయన నామములో మన సేవ ద్వారా, స్నేహం ద్వారా తెలియ జేయగలుగుతాం!

అందుకే, నిలిచియుందాం!  ఆయన సన్నిధిలో సేవకులముగా!
ఫలియించుదాం!  ఆయన ప్రేమలో స్నేహితులముగా!

No comments:

Post a Comment