పరమ పవిత్ర త్రిత్వైక దేవుని మహోత్సవము, Year B
ద్వితీ.కాం.4 :32-34,39-40; రోమీ 8:14-17; మత్త 28:16-20
మనం
చిన్నతనములో ఉన్నప్పుడు మన తాత అమ్మమ్మ లేక నాయనమ్మలు మనకు సిలువ గుర్తు ఏవిధముగా
వేయాలో నేర్పించారు. దాని అర్ధం మనకు తెలియక పోయిన, అది అర్ధం కానప్పటికిని వారు చెప్పింది నేర్చుకున్నాము.
తరువాత సత్యోపదేశం నేర్చుకున్నప్పుడు, దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, వారే పిత, పుత్ర, పవిత్రాత్మ
అను ముగ్గురు; వారు వేరువేరు వ్యక్తులు అయినప్పటికిని, ఒకే దేవునిగా లేక వ్యక్తిగా
ఉన్నారు అని తెలుసుకొన్నాము. ఇదే త్రిత్వైక దేవుని మహిమ, పరమ రహస్యం అని గుర్తించాము.
కాని, తరువాత మనం
జీవితములో ఎదిగేకొద్ది, మన జీవితములో పిత, పుత్ర,
పవిత్రాత్మ దేవునితో బంధాన్ని ఏర్పరచుకొని,
చివరకు త్రిత్వైక దేవుడే మన జీవితానికి పునాదిగా
నిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మన గ్రహించాలి! అదే, ఈ త్రిత్వైక దేవుని ముగ్గురు వేరువేరు వ్యక్తులు కాని,
ఒకే దేవుడు అను పరమరహస్యాన్ని మనం మానవుని తెలివి
తేటలతో అర్ధం చేసుకోలేము అని గ్రహించి, మన హృదయముతో ఆయనను అంగీకరించి, విశ్వసించి, ఆయన అనుభూతిని
పొందగలగాలి. ఆ త్రిత్వైక దేవుని ప్రేమ బంధములో జీవించినప్పుడు మాత్రమే,
అది మనకు సాధ్యపడుతూ ఉంది.
ఈ
ఆదివారము తల్లి తిరుసభ పరమ పవిత్ర త్రిత్వైక దేవుని మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది.
“దేవుని యొక్క మహిమను” జరుపుకుంటూ ఉన్నాము. మన దేవుడు ప్రేమగలవాడు. అందుచేత ఒక “ప్రేమ
బంధము”లో మాత్రమే ఆయన తననుతాను ఈ ప్రపంచానికి చాటుకుంటూ ఉన్నాడు. కనుక,
ఈ పండుగ రోజున దేవుని మహిమగల ప్రేమ బంధాన్ని గురించి
ధ్యానం చేసికొందాం.
మన
దేవుడు ఒంటరితనాన్ని కోరుకోడు. ఆయన ఒక కుటుంబము లాంటివాడు. ఆ కుటుంబములో పిత,
పుత్ర, పవిత్రాత్మ అను ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈ ముగ్గురు కలసి ఒక సంఘముగా
జీవిస్తూ ఉన్నారు. వారు ముగ్గురు కూడా
సరిసమానులు, వారిలో
హెచ్చుతగ్గులు లేవు. తారతమ్యాలులేవు. ఎవరి భాధ్యతలు వారు నిర్వహిస్తూ ఉంటారు. ఈ
ముగ్గురుకూడా ప్రేమలో జీవిస్తూ, వారి ప్రేమనే ఈ ప్రపంచానికి పంచుతూ ఉన్నారు. తండ్రి దేవుడు “ఈ లోకమును ఎంతో
ప్రేమించెను” అని మనం యోహాను సువార్తలో చూస్తూ ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపుడు
కనుకనే ఆయన ఈ లోకాన్ని సృష్టించాడు. దానిని ప్రేమించాడు. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు అని చెప్పటానికి
నిదర్శనం, తన ప్రియమైన,
ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించటం. యేసుప్రభు తన
తండ్రికి ప్రియమైన కుమారుడిగా, తండ్రికి విధేయుడుగా ఈ లోకానికి తండ్రి దేవుని గురించి తెలియ చేసాడు. ఆయన
ప్రేమను తెలియ చేసాడు. దేవుని రూపం ఎలా ఉంటుందో, ఆయన ఈ ప్రపంచాన్ని, సర్వమానవాళిని ఎంత గాడముగా ప్రేమిస్తున్నాడో తెలియ జేసాడు. చివరికి, ఈ లోకాన్ని, పాపపు సంకెళ్ళ నుండి రక్షించడానికి తన ప్రాణాన్ని సైతము ఫణంగా పెట్టి,
మానవాళికి రక్షణను, పరలోక ప్రాప్తిని ప్రసాదించాడు. తన సిలువ రక్తంద్వారా,
సర్వ మానవాళిని తండ్రి ప్రేమకు అర్హులను చేసాడు. మానవాళి రక్షణ క్రీస్తు ప్రేమ ఫలంగా మనం
గుర్తించాలి.
మరణ
పునరుత్థానాల తరువాత మోక్షారోహాణమైన క్రీస్తు, “నేను మిమ్ములను అనాధలుగా విడిచి
పెట్టను” అని చెప్పి తన పరిశుద్ధాత్మను వాగ్ధానము చేసాడు. “లోకాంతము వరకు సర్వదా నేను
మీతో ఉందును” అని అభయ మొసగాడు. ఈ మాట ప్రకారము, తండ్రి కుమారుల ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని రూపములో మూడవ వ్యక్తిగా మనలో
ఎల్లప్పుడూ వసిస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్దాత్మ దేవుడే మనలో విశ్వాసాన్ని,
ప్రేమను కలిగింప జేసి, మనలను విశ్వాస మార్గములో ముందుకు నడుపుచున్నాడు.
ఈ
విధముగా, తండ్రి కుమార
పరిశుద్ధాత్మల ప్రేమ బంధం, వారి జీవితం మన జీవితాలకు ఆదర్శముగా నిలుస్తూ ఉంది. మనలను కూడా వారి ప్రేమ
బంధములోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు. కనుక తండ్రి దేవుడు క్రీస్తుద్వారా,
మనకు ఈ పవిత్ర దేవుని ప్రేమను తెలియజేస్తే,
దానిని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో నింపుతూ
ఉన్నాడు. కారణం, దేవుడు మనలను
తన రూపములో సృష్టించాడు. కాబట్టి, మనము కూడా, ఆయన ప్రేమ
కలిగి, ఆ ప్రేమలో
జీవించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆ దేవుని ప్రేమలో మనం జీవించాలంటే,
మనముకూడా ఇతరులను అంగీకరించాలి. ఇతరులను ఆదరించాలి.
వారితో సహనముతో మెలగాలి. మనకు ఉన్నదానిని సంతోషముగా ఇతరులతో పంచుకోవాలి. అందరికి
శాంతిని, ప్రేమను
పంచగలగాలి. మనం అంతా సహోదరి, సహోదరులం అన్నవిధముగా జీవించ గలగాలి.
ఈ నాటి
సువిశేషములో, క్రీస్తు
ప్రభువు తన శిష్యులకు ఈ విధముగా చెప్పుచున్నాడు: “ఇహపరములందు నాకు సర్వాధికారము
ఇవ్వబడినది. కనుక మీరు వెళ్లి, సకల జాతి జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ
నామమున జ్ఞానస్నానమొసగుచు, వారిని నా శిష్యులను చేయుడు.” ఈ రక్షణ సువార్తను ప్రపంచానికి చాటమని,
ఆయన ప్రేమను తోటివారితో పంచమని చెప్పటానికి ప్రభు
ఈనాడు మనందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ లోకములో పిత, పుత్ర, పరిశుద్ధాత్మల ఐక్యతకు, స్నేహానికి, వారి ప్రేమకు
సాక్షులుగా ఉండమని, జ్ఞానస్నానం
పొందిన ప్రతీ బిడ్డను కోరుతూ ఉన్నాడు. మన ప్రయాణంలో ఆత్మ దేవుని తోడ్పాటుతో
ముందుకు సాగుదాం. దేవుని ప్రేమ చిహ్నాలుగా వర్దిల్లుదాం!
No comments:
Post a Comment