పెంతకోస్తు మహోత్సవము, Year ABC

పెంతకోస్తు మహోత్సవము, Year ABC
అ.కా. 2:1-11; గలతీ 5:16-25 లేక 1 కోరింతు 12:2-13; యోహాను 15:26-27; 16:12-15 లేక 20:9-23

సర్వేశ్వరుని ఆత్మ లోకమంతట వ్యాపించెను.  సమస్తము వారి ఆదీనములో యున్నది.  ధ్వనించిన ప్రతి మాట వారికి తెలియును. అల్లెలూయ!

పెంతకోస్తు మహోత్సవమున, పవిత్రాత్మ శక్తితో శిష్యులపై వేంచేసెను.  అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకలవలె వ్యాపించి, ఒక్కొక్కరిపై నిలిచెను.  ఆవిధముగా, శ్రీసభ ప్రేషిత కార్యము ఈ లోకమున ఆరంభమైనది.  పవిత్రాత్మను పొందిన వారు ధైర్యముతో యేరూషలేములోను, పలుచోట్లలోను దైవ వాక్యమును బోధించిరి.  ఈ ప్రేషితకార్యమునకై ప్రభువే స్వయముగా తన ఉత్తానము తరువాత పలుమార్లు శిష్యులకు దర్శనమిచ్చియున్నాడు. మొక్షారోహణమునకు ముందుగా, వారిని యేరూషలేములోనే ఉండమని, తండ్రి దేవుని వాగ్ధానమును స్వీకరించుటకు సంసిద్దులవమని కోరియున్నాడు.  దానినిమిత్తమై శిష్యులు మరియతల్లితో కలసి ప్రార్ధనలో ఒక చోట కూడియుండిరి.

ఈరోజు శ్రీసభ జన్మ దినోత్సవము కూడా.  శ్రీసభ అనగా భూలోకమంతట వ్యాపించియున్న క్రీస్తు సంఘము.  ఈ సంఘము దైవ సాన్నిధ్యమును ప్రత్యక్షముగాను మరియు దైవ ప్రేషితకార్యమును ఈ లోకమున కొనసాగిస్తూ ఉన్నది.  ప్రభువు తన శిష్యులకు దర్శనమిచ్చినప్పుడు వారికి రెండు అనుగ్రహాలను అనుగ్రహించాడు: శాంతి మరియు పాపమన్నింపు.  పవిత్రాత్మ శక్తితో నింపబడి తన కార్యమును కొనసాగించమని క్రీస్తు శిష్యులను ఆదేశించియున్నాడు.  పవిత్రాత్మ వారికి క్రీస్తు సందేశమును తెలియపరచును.  ఈనాటి మొదటి పటనములో (అ.కా. 2:1-11) పవిత్రాత్మ రాకడ గూర్చి వింటున్నాము.  భయభ్రాంతులైన వారు పవిత్రాత్మ రాకడతో ధైర్యము పొంది క్రీస్తు సందేశమును  బహిరంగముగా బోధించారు.  రెండవ పటనములో (గలతీ 5:16-25 లేదా 1 కోరింతు 12:2-13) పవిత్రాత్మ వరాలు, పవిత్రాత్మ శక్తిని గూర్చి పునీత పౌలుగారి ప్రవచనాలను వింటున్నాము.  ఆత్మవరాలు ఆధ్యాత్మిక కార్యాలు మరియు అవి మనలను దైవ పవిత్రతలో నడిపించును.

పెంతకోస్తు మహోత్సవము యూదుల ప్రధాన మూడు పండుగలలో రెండవ ముఖ్యమైన పండుగ.  యూదులు పెంతకోస్తు దినమున, కోతకాలము ముగియు సందర్భమున దేవునికి కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలుపుటకు కొనియాడు ఉత్సవము.  ఈ ఉత్సవము పాస్కా పండుగ తరువాత 7 వారాల తరువాత కొనియాడబడును.  ఈ దినమున గోధుమ పంట ప్రధమ ఫలాలను దేవునికి అర్పించేవారు.

అలాగే ఈ దినమున, దేవుడు సినాయి పర్వతముపై మోషేకు ఒసగిన చట్టమును గుర్తుంచుకొని ఈ ఉత్సవమును కొనియాడేవారు. ఈ దినమునే పవిత్రాత్మ శిష్యులపై వేంచేసి, తద్వారా, శ్రీసభ జన్మించియున్నది.  క్రీస్తు ఉత్థానం తర్వాత 50 వ దినమున, శిష్యులలో గొప్ప మార్పు సంభవించినది.  వారు కలవరపడియున్నారు, భయపడియున్నారు, దిగులు చెందియున్నారు, నిరాశ పడియున్నారు.  పై గదిలో తలుపులు మూసుకొని, బిక్కుబిక్కుమని, యూదులకు భయపడుచూ,  దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.  ప్రార్ధనలో ఉన్న వారిపై పవిత్రాత్మ దిగి వచ్చియున్నది. అలాగే, యేరూషలేములో ఉన్న విశ్వాసులందరి పైకి వేంచేసి యున్నది.  భూలోకములోని ప్రతీ దేశమునుండి వచ్చిన దైవ భక్తులగు యూదులు, యేరూషలేములో నివసించుచుండిరి.  అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని ఒసగిన కొలది వారు అన్య భాషలలో మాటలాడ సాగిరి.  ఆ శబ్దము విని జనసమూహము అక్కడకు వచ్చెను.  అప్పుడు యూదులలో ప్రతీ వ్యక్తియు, అవిశ్వాసులు తన సొంత భాషలలో మాటలాడుట విని కలవర పడిరి.  ఇదీ పెంతకోస్తు అనుభవము.

యోహాను సువార్త 20:19-23 ప్రకారం, శిష్యులు పవిత్రాత్మను క్రీస్తు ఉత్తాన మైన రోజే పొందియున్నారు.  ఆదివార సమయమున యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసికొని ఉన్నపుడు , యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, "మీకు శాంతి కలుగునుగాక!" అనెను.  "నా తండ్రి నన్ను పంపినట్లు, నేను మిమ్ము పంపుచున్నాను" అని పలికి ఆయన వారిమీద శ్వాసను ఊది, "పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన యెడల అవి క్షమింపబడును; మీరు ఎవరి పాపములను క్షమింపని యెడల అవి క్షమింపబడవు" అని చెప్పెను. ప్రభువు ప్రేషిత కార్యము, శిష్యుల ప్రేషిత కార్యము ఒక్కటే! మన ప్రేషిత కార్యము కూడా అదియే! సృష్టి ఆరంభములో దేవుడు శ్వాసను ఊది మానవున్ని తన పోలికలో సృజించాడు. ఈనాడు, క్రీస్తు తన శ్వాసను ఊది, ఓ నూతన సృష్టిని రూపొందించాడు.  క్రీస్తులో మనము కూడా ఓ నూతన సృష్టి.  సోదర ప్రేమ, క్షమాపణ, క్రీస్తు సందేశములో ముఖ్యాంశాలు.  ఇదే సందేశాన్ని మనము కొనసాగించాలని ప్రభువు కోరుచున్నాడు.

మొదటి పటనములో ముఖ్యముగా గమనించవలసిన అంశాలు: శిష్యులు క్రీస్తు ఆదేశాన్ని విధేయించారు. యేరూషలేము వీడక దేవుని వాగ్ధానము వచ్చు వరకు అక్కడే వేచియుండమని చెప్పిన క్రీస్తు ఆదేశాన్ని వారు అక్షరాల పాటించారు.  అమూల్యమైన సమయాన్ని ప్రార్ధనలో గడిపారు.  పవిత్రాత్మ దిగి వచ్చినప్పుడు ఒక శబ్దము వచ్చెను.  అయితే, ఆ శబ్దము అందరు వినలేదు.  కేవలము, విశ్వాసులు, భక్తులు మాత్రమే వినగాలిగారు, విని ఒకచోట గుమికూడి యున్నారు. అవిశ్వాసులు పవిత్రాత్మను పొందుటకు అనర్హులైనారు. అగ్నిజ్వాలలు నాలుకలవలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరిపై నిలుచుట వారికి కనబడెను.  ఇది దైవ సాన్నిధ్యమునకు సూచికగా ఉన్నది.  అప్పుడు పవిత్రాత్మ శక్తిని పొందిన వారు అన్య భాషలలో మాటలాడసాగిరి.  వినినవారు వారి సొంత భాషలలో వినగలిగారు.  వారి భాషలలో క్రీస్తు సాన్నిధ్యమును చూడగలిగారు... అది ప్రేమ భాష అని గుర్తించారు.

ఈనాటి రెండవ పటనం, గలతీ 5:16-25 లో పునీత పౌలుగారు, జ్ఞానస్నానము ద్వారా పవిత్రాత్మ శక్తిని పొందిన మనము ఎల్లప్పుడూ ఆత్మయందు జీవించాలని చెబుచున్నాడు.  శరీరమునకు సంబంధించిన కోరికలకు లోనుగాక, ఆత్మయందు జీవించండని కోరుచున్నాడు. క్రీస్తు ద్వారా, నూతన సృష్టిగా మారిన మనము దేవునికి సంభందించిన వారము, కావున ఆత్మను అనుసరించి క్రమముగా జీవించాలి.  దైవ బిడ్డలముగా, పవిత్రముగా జీవించాలి.  శరీర కార్యములు చేయువారు దేవుని రాజ్యమునకు వారసులు కారు.  శరీరము కోరునది, ఆత్మ కోరుదానికి  విరుద్ధముగా ఉండును. ఆత్మ కోరునది, శరీరము కోరడానికి విరుద్ధముగా ఉండును.  ఈ రెంటికిని బద్ధవైరము.  ఆత్మ శక్తితో, శరీర కార్యములను అధిగమించగలం.  ఆత్మ ఫలాలు ఇవే: ప్రేమ, ఆనందం, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము.

యోహాను 15:26-27 లో "నేను తండ్రి యెద్దనుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చెడివాడును, తండ్రి యెద్దనుండి వచ్చు సత్య స్వరూపియును అగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును.  మీరు మొదటి నుండియు నా వెంట ఉన్నవారు.  కనుక, మీరును నన్ను గురించిన సాక్ష్యులు.  అని ప్రభువు చెప్పారు.  తనకు సాక్ష్యులుగా ఉండమని ప్రభువు తన శిష్యులను ఆహ్వానించియున్నారు.  ఎందుకన, వారు ఆయనతో జీవించారు, ఆయన జీవితాన్ని, ప్రేషిత కార్యాన్ని పంచుకొనియున్నారు, ఆయన బోధనలను ఆలకించియున్నారు, ఆయన అద్భుతాలలో పాలుపంచుకొన్నారు.  ఆయన జీవితానికి, శ్రమలకు, మరణానికి సాక్ష్యులయ్యారు.  ఇప్పుడు వారు ఆయన ఉత్తాన మహిమను అనుభవించియున్నారు.

పవిత్రాత్మ పని (యో 16:1-15): పవిత్రాత్మ వచ్చి పాపమును గురించియు , నీతిని గురించియు, తీర్పును గురించియు, లోకమునకు నిరూపించును.  సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు, సంపూర్ణ సత్యమునకు నడిపించును.  ఆయన తనంతట తాను ఏమియు బోధింపక తాను వినిన దానినే బోధించును.  జరగబోవు విషయములను మీకు తెలియజేయును.

పెంతకోస్తు మహోత్సవము తండ్రి ఆత్మ, కుమారుని ఆత్మ శిష్యులపైకి రావడాన్ని కొనియాడు పండుగ.  ఈ ఉత్సవము ద్వారా దేవుడు ఏవిధముగా మన జీవితాలలో జోక్యం చేసికొంటున్నాడో, త్రిత్వైక దేవునిలో మనలను ఏవిధముగా భాగస్తులను చేయుచున్నాడో, మనలను ఒక నూతన సృష్టిగా మార్చుతున్నాడో తెలిసికొంటున్నాము. ఆ కృతజ్ఞతా భావముతో ఈ మహోత్సవాన్ని కొనియాడుదాం.

ఆ పవిత్రాత్మ శక్తి, వరాలు మన పైన కూడా దిగి రావాలని ప్రార్ధన చేద్దాం. ఆయన ప్రేషిత కార్యములో పాలుపంచుకొనునట్లు తగు శక్తిని ఒసగమని వేడుకొందాం!

పాస్కా కాలపు ఆరవ ఆదివారము 13 మే 2012

పాస్కా కాలపు ఆరవ ఆదివారము 13  మే 2012
అ.కా.10:25-26, 34-35, 44-48, 1 యోహాను 4:7-10, యోహా 15:9-17
నిలచియుందాం! సేవకులమై, స్నేహితులమై...

'నిలకడ' అనేది అన్నింటికీ ముఖ్యం. పనిలో, చదువులో, ఆటలో, ఏరంగములోనైన నిలకడ ఎంతైనా అవసరం. ఈనాటి సువిషేశములో ఏసు ఈ మాటలనే ఒత్తి పలకుచున్నాడు.  నిలచియుంటే, నిలబడతారు! పంపబడతారు అని ప్రభువు బోధిస్తున్నాడు.  అసలు ఈ 'నిలిచియుండటం', 'నిలబడటం' అంటే ఏమిటో ఓసారి ఆలోచిద్దాం! సాధారణముగా, 'నిలిచి యుండటం' అంటే కాళ్ళ మీద నిలిచియుండటం అనేది మొట్టమొదటిగా మనకు అనిపిస్తుంది. అది నిజమే.  కానీ ఇంకా ముదుకెలితే ఆ మాటకు ఉన్న పలుఅర్ధాలు మనకు విశదమవుతాయి. యోహాను 15 వ అధ్యాయములో 'నిలచియుండటం' అనే మాటకు, సమీపముగా ఉండటం, దగ్గరగా ఉండటం, సంభందం కలిగియుండటం, అంటిపెట్టుకొని యుండటం, అనుబంధం కలిగియుండటం అనే అర్ధాలు ఉన్నాయి.  నాకు దగ్గరగా నిలిచియుండమని ప్రభువు అంటున్నాడు. ద్రాక్షావల్లిలో తీగలాగా నాలో నిలిచి యుండండి అని అంటున్నాడు.
నిలిచి యుంటే ఏం జరుగునో, ధ్యానించి తెలుసుకొందాం!


1. నిలచియుంటేనే నీకు తెలుస్తుంది-నీ వేవరోయని

ఆయనతో నిలిచి ఉండటం వలన, ఆయనలో కలసి ఉండటము వలన, ఆయన వెలుగులో నిలబడటం వలన మనమేవరమో! మన బలాలు, బలహీనతలు, మన శక్తులు-యుక్తులు, మన విలువ, మన ఆశయాలు, మన అసలు తత్వం తెలియవస్తుంది.

దేవుని ఎదుట, ఆయన వెలుగులో, ఆయన స్పర్శలో ఉన్నవాడైన పేతురు (అ.కా. 10:9) కోర్నేలితో "నేనును ఒక మనుష్యుడనే" అని అంటున్నాడు.  గర్వము లేక దీనుడై తన నిజతత్వమును ఒక అన్యుడైన కోర్నేలి ముందు అంగీకరిస్తున్నాడు (అ.కా.10:26).  తన నిజరూపమును, బలహీనతలను, స్వతంత్రముగా, సంతోషముగా అంగీకరిస్తున్నాడు.  ప్రభువుతో కలసి, ప్రభువులో నిలచియుండటం నేర్చుకొన్నాడు కాబట్టే, ఈ విధముగా దీన మనస్కుడిగా పేతురు ఉండగలిగాడు.

ఆయనలో నిలచియున్న అబ్రహాము తానేమిటో తెలిసికొన్నాడు.  ఆ.కాం. 18:27 లో అబ్రహాము దేవునితో ఈ విధముగా అంటున్నాడు.  "నేను మట్టి మనిషినే, నేను బూడిదనే".  దేవునిలో నడచినవానిగా, దేవుని స్నేహితునిగా, దేవునిలో నిలిచియుండుట వలన తన నిజరూపమును అబ్రహాము తెలిసికొంటున్నాడు.  (ఈ విధముగానే పరిసయ్యుడు కూడా తను పాపినని దేవుని సన్నిధిలో తెలిసికొంటున్నాడు, లూకా 18:9-14).

2. నిలిచి యుంటేనే నీకు తెలుస్తుంది, దేవుడు ఎవరోయని!

దేవునిలో నిలచియుంటే, దేవునితో కలిసియుంటే, ఆయన వెలుగులో నడుస్తుంటే, మన బల, బలహీనతలతో పాటు దేవుని గొప్పతనం, ఆయన మహిమ, ప్రభావం మనకు తెలియవస్తుంది.  ఆయన నీ కొరకు ఏమి చేయగలదో నీవు తెలిసికొంటావు.  కష్ట సమయములో, దు:ఖ సమయాలలో కూడా ఆయనలోనే ఉండటం మనం నేర్చు కోవాలి.  సంతానం లేని సమయములో, ఇక సంతానం కలుగడం అసాధ్యమని తెలిసిన సమయములో కూడా, అబ్రహాము దేవునిలో నిలిచి యుండటం నేర్చుకొన్నాడు. అందుకే, దేవుడు అసాధ్యమైనది సుసాధ్యం చేసి తనను తాను బయలు పరచుకొన్నాడు.

నిలచియుంటేనే ఆయన తనను తాను బయలుపరచుకొంటారు.  మగ్దల మరియ సమాధి వద్దనే నిలచియుంది, మరణించిన యేసును వెదకింది.  ఆయనను చూడాలనే కోరిక, ఆయన సన్నిధిలో ఉండాలనే ఆశ ఆమెను నడిపించింది.  ఆయనను కలిసింది (యోహా 20:11-18). తద్వారా ఆయనతో అనుబంధం ఏర్పడినది.

౩. నిలిస్తే ఫలిస్తావ్!

మనం ఆయనయందు, ఆయనలో ఉంటేనే (నిలిస్తేనే) మనం ఫలిస్తాము!  యోహాను 15:5 లో ప్రభువు ఇలా అంటున్నాడు, "నేను లేక మీరు ఏమీ చేయలేరు".  నిలకడ యుంటేనే ఫలితం వస్తుంది.  ద్రాక్ష తీగ, ద్రాక్ష వల్లిని అంటిపెట్టుకొని యున్నట్లు మనం ఆయనతో నిలిచియుంటే మన పనిలో, చదువులో, ప్రార్ధనలో, జీవితములో ఫలిస్తాం.  ఆయన ప్రేమను పొందుతూ, పొందిన ప్రేమను పంచుతూ, ఆ ప్రేమను తెలియని వారికి, ఆయన నామములో మన సేవ ద్వారా, స్నేహం ద్వారా తెలియ జేయగలుగుతాం!

అందుకే, నిలిచియుందాం!  ఆయన సన్నిధిలో సేవకులముగా!
ఫలియించుదాం!  ఆయన ప్రేమలో స్నేహితులముగా!

ఐదవ పాస్కా కాల ఆదివారము, 6 May 2012


ఐదవ పాస్కా కాల ఆదివారము
అ.పో.9:26-31, 1 యొహా 3:18-24, యోహాను 15:1-8

మన ప్రేమ కేవలము మాటలు, సంభాషణలు మాత్రమే కాదు.  అవి చేతలలో నిరూపింప బడు యదార్ధ ప్రేమ కావలయును (1 యోహా 3:18). ప్రేమ తన బహిరంగ జీవితములో అనేక సందర్భాలలో తన చుట్టూ ఉన్న పరిస్థితులను, పరిసరాలను, వ్యక్తులను గమనించి వాటిని ఉదాహరణగా తీసుకొని, గొప్ప పరలోక సత్యాలను, తన శిష్యులకు భోధించేవాడు.  ఉదాహరణకు, గొర్రెల కాపరులను, నీటిని, వెలుగును, రొట్టెను, మరియు పరిసయ్యులను ఉదాహరణగా చేసుకొని అనేక విషయాలను భోధించేవాడు.  ఈ కోవకు చెందిన ఒక ద్రాక్షావల్లి ని ఉదాహరణగా తీసుకొని, ఈనాటి సువిశేష పటనము ద్వారా మనలో మాట్లాడుచూ ఉన్నాడు.

యేసు ప్రభు జీవించిన సమయములో యూదయా దేశములో ద్రాక్షా తోటలు ఎక్కువగా సాగుచేసేవారు.  ద్రాక్షా యొక్క మరియు దాని ఎదుగుదల, ఫలాలు గురించి అందరికి కూడా ఒక అవగాహన అంటూ ఉండేది. అందువలననే యేసు ద్రాక్షా వల్లిని-తీగలను ఉదాహరణగా చేసుకొని దాని ద్వారా ఆయనను అనుసరించే శిష్యులకు, దేవునితో ఉండవలసిన బంధాన్ని గురించి భోదిస్తూ ఉన్నాడు.  కనుక ద్రాక్షా వల్లిని గురించి కొంత సేపు ద్యానిద్దాం.


మొదటగా, ద్రాక్షావల్లి యందు ఉండని తీగ దానియంతట అది ఫలింప జాలదు.  ద్రాక్షా వల్లి నుండి వేరు చేయబడిన రెమ్మలు జీవింపలేవు.  అందుకే, ద్రాక్షావల్లి రెమ్మలు ద్రాక్షావల్లిని అంటి పెట్టుకొని యుంటాయి.  అవి ద్రాక్షావల్లిని అంటి పెట్టుకొని ఉండుట వలన అధికముగా ఫలిస్తాయి.  ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి.  ద్రాక్షా రెమ్మల వలన ద్రాక్షావల్లి బలపడుట లేదు.  కారణం, మనం ఒక రెమ్మను కత్తిరిస్తే మరియొక రెమ్మ పుట్టుకొస్తుంది.  కాని ద్రాక్షా వల్లి వలన దాని రెమ్మలు లబ్ది పొందుతూ ఉన్నాయి.  ద్రాక్షావల్లి దానిలో ఉన్న జీవాన్ని, బలాన్ని, రెమ్మలకు ఇస్తుందే తప్ప, రెమ్మల నుండి అది జీవం పొందుట లేదు. ద్రాక్షా వల్లిని రెమ్మలు అంటి పెట్టుకొని యుండుట వలన, అవి ధృడముగా, ఎదగ గలుగు చున్నాయి.  మనందరి జీవిత సత్యం కూడా ఇదే!  మనం ప్రభువుని విశ్వసించి, ఆయనను అంటి పెట్టుకొని యుండుట వలన, మనము కూడా ఆయన జీవాన్ని, బలాన్ని పొందుతూ ఉన్నాము.  ఆయన విశ్వాసములో ధృడముగా ఎదగగలుగుతాము.   మన జీవితాలు సంతోషముతో, సమాదానముతో వర్హ్సిల్లుతాయి.  మనము ఆయనతో ఉండుట వలన, జీవితములో ఎదురయ్యే ప్రతీ కష్టాన్ని, సమస్యను, ఆయన నుండి వచ్చే బలము ద్వారా, పరిశుద్ధాత్మ సహాయ శక్తి ద్వారా అదిగా మించ గలము.  కనుక, ద్రాక్షావల్లి యగు క్రీస్తుకు మన జీవితాన్ని అంటి పెట్టినప్పుడు మన జీవితాలు అధికముగా ఫలిస్తాయి.

"నా యందు ఫలింపని  ప్రతీ తీగను ఆయన తీసి వేయును.  ఫలించు ప్రతీ తీగను అధికముగా ఫలించుటకై, ఆయన దానిని కత్తిరించి సరిచేయును." ద్రాక్షావల్లి అధికముగా ఫలించాలి అంటే, మనం దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  దానిని సరిగా అంటూ కట్టాలి.  కాలమును బట్టి ఎండిన ఆకులను, కొమ్మలను కత్తిరించి సరిచేయాలి.  దానికి కావలసిన ఎరువును, నీటిని సకాలములో అందించాలి. ఈ జాగ్రత్తలు పాటించినప్పుడే ద్రాక్షావల్లి మంచి రుచికరమైన ఫలాలను మనకు అందించగలదు.  ద్రాక్షావల్లి క్రీస్తు మనమంతా కూడా ఆయన రెమ్మలం. ఎండిన ఆకులు, కొమ్మలు మనలో ఉన్న చెడుకు, పాపానికి చిహ్నంగా నిలుస్తాయి.  వాటిని ఎ విధముగా కత్తిరించి, ప్రోగుచేసి నిప్పులో వేసి తగుల బెట్టుతామో, అదే విధముగా, మనలో ఉన్న చెడును, చెడు క్రియలకు, ఆలోచనలకు స్వస్తి చెప్పి మనల్ని మనం సక్రమమైన మార్గములో నడచుకోవడానికి ప్రయత్నించినప్పుడు మనం అధికముగా ఫలించగలుగు తాము.

"నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు"

ద్రాక్షావల్లి ఎదుగుదలకు, మరియు అది ఫలించడానికి దాని తీగలు ఎంతో తోడ్పడుతూ ఉంటాయి.  ద్రాక్షా రెమ్మలు, ద్రాక్షావల్లి నుండి వచ్చే బలాన్ని, జీవాన్ని స్వీకరించి, అవి బలపడుతూ, ఎదుగుతూ, ద్రాక్షావల్లిని జీవింప చేస్తాయి.  అదేవిధముగా ఈ ప్రపంచములో దేవునికి మానవుడు కూడా ఎంతో అవసరము.  మన సత్యోపదేశములో చదువుకున్నట్లు, మానవుడు  దేవుని ప్రేమించి, సేవించి అటు వెనుక మరణము పొందుటకు సృష్టింప బడెను.  మనం ఒక వ్యక్తిని ప్రేమించినపుడు లేదా ఒక వ్యక్తి చేత ప్రేమింప బడినప్పుడు, ఆ వ్యక్తి గురించి పదిమందికి చెబుతూ ఉంటాం.

అదేవిధముగా, మానవుడు దేవుని ఈ ప్రపంచానికి చాటగలగాలి.  దేవుని నామాన్ని ఆయన ప్రేమను ప్రకటించటం అంటే ఆయనను ఈ లోకములో జీవింప చేయటం.  ఆయన మరణమును ప్రకటించడం అంటే, ఆయనను ఈ లోకములో జీవింప చేయడం.  ఆయన మహిమను కొనియుండటం.  ఆయనను స్తుతించి గౌరవించడం.  కనుక, క్రీస్తు బిడ్డలుగా ఇది మనందరి కర్తవ్యం.

"మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమ పరప బడును."  ప్రియులారా! మానవ జీవితాన్ని ఒక ఉన్నతమైన ద్రుక్పదముతో చూసినప్పుడు, మనం అనుకున్న ఫలాలకంటే, అధికముగా ఫలిస్తూ ఉన్నాం.  మన అనుదిన జీవితములో ప్రతీసారి మనం మంచి చేసినప్పుడు, మంచిని గురించి ఆలోచించినప్పుడు అధికముగా ఫలిస్తూ ఉన్నాం.  ప్రేమ, శాంతి, సమాధానాన్ని ఇతరులకు పంచినప్పుడు మనం అధికముగా ఫలించినట్లే...  ఇతరులను మన్నించడం ద్వారా, మనకున్న దాన్ని ఇతరులతో పంచుకొనుట ద్వారా, మనం అధికముగా ఫలిస్తూ ఉన్నాం.  మన శత్రువులను ప్రేమించి, వారి కోసం ప్రార్ధించినప్పుడు మనం ఫలిస్తూ ఉన్నాం.  ఈ విధముగా, ప్రతీసారి, ప్రతీ రోజు, మన మాటల ద్వారా, క్రియలద్వారా ఫలిస్తూ తండ్రి దేవుని మహిమ పరస్తూ ఉన్నాము.  కనుక, మన ఫలములో దేవుని మహిమను  పరచ గలగాలి.

"మీరు నా యందు ఉండుడు"

ఈనాటి సువిశేష పతనములో ఈ వాక్యము 8 సార్లు చెప్పబడింది.  అంటే, ఈ వాక్యము ఎంత ముఖ్యమైనచో మనం గ్రహించాలి. కొన్ని సందర్భాలలో, కొంత మంది వ్యక్తులు ఒకే కుటుంబములో జీవిస్తూ ఉంటారు.  వారు కలసి ఉన్నప్పటిని పరదేశిగా బ్రతుకుతూ ఉంటారు.  ఒకరంటే ఒకరికి పడదు. పట్టించుకోరు. ఒకలాంటి విదేశీ మనస్తత్వాన్ని కలిగి ఉంటారు.  వారి మధ్య ప్రేమలు,  ఆప్యాయతలు ఉండవు.  నామమాత్రముగా కలసి జీవిస్తూ ఉంటారు.  అదే విధముగా, "ప్రభువు యందు ఉండటం" అంటే నామ మాత్రానికే క్రైస్తవులుగా ఉండి ఆయన శిష్యుడిని అని చెప్పుకుంటే సరిపోదు.  "మీరు నాయందు ఉండుడు" అను వాక్యము ద్వారా, ప్రభువు మనలను తనతో కలసి జీవించటానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు.  ఆయనతో జీవించడం, ఆయనతో పంచుకోవడం, ఆయనతో ఉండటం ఒకరి నుండి మరియొకరు పొందటం, ఒకరిని ఒకరు గౌరవించడం, ప్రభువు యందు ఉండటం అంటే, మన నమ్మకాన్ని ఉత్తాన క్రీస్తుయందు ఉంచటం. ఆయన యందు ఉండటం అంటే, ఆయనలో శాంతిని, సమాధానాన్ని, ప్రేమను పొందటం.  ఒక నిండిన విశ్వాసాన్ని, నమ్మకాన్ని  ఆయనలో కలిగి ఉండటం.  కారణం ఆయన కూడా "నేను మీ యందు ఉందును" అని మనకు మాట ఇచ్చి యున్నాడు. కనుక మనం మన జీవితంలో ఎన్ని కష్టాలు, భాదలు, నష్టాలు, రోగాలు ఎదురైనప్పటికిని ప్రభువుతో ఉన్నట్లయితే ఆయనే మనకు బలాన్ని ఇచ్చి, జీవితములో ముందుకు నడిపిస్తాడు.  కనుక ప్రభువు యందు ఉండటానికి ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించమని అర్ధిద్దాం.

చివరిగా, ఇది మే మాసం.  ఈ నెల మరియ తల్లికి అంకితం చేయబడిన నెల.  ఆమె దేవుని యొక్క తల్లి.  ఆమె దేవుని తల్లి కనుక మనందరికీ కూడా తల్లిగా నిలుస్తుంది.  ఈ కారణం చేత మనం  కూడా ఆమెను విన్నవించుకోవాలి. రక్షణ చరిత్రలో ఆమెకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది.  ఆమె ఈ ప్రపంచానికి యేసు ప్రభువును అందించింది.  ఆమె "తన గర్భ ఫలమును" మనకు కానుకగా ఒసగింది.  ఆమె ఇంకా ఈ ప్రపంచానికి ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంది. ఆమె తన విశ్వాస జీవితము ద్వారా ప్రభువు యందు ఉంటూ, ఆ ప్రభువులో జీవిస్తూ అధికముగా ఫలించింది.  కనుక, ఆమె నిత్య సహాయము ద్వారా మనము కూడా అధికముగా ఫలించుటకు ఆమె సహాయాన్ని వేడుకొందాం.  ఆమె చూపిన విశ్వాస మార్గములో జీవించడానికి ప్రయాసపడదాం.  ఆమెన్.