దైవ కారుణ్యం


దైవ కారుణ్యం
అ.కా. 4: 32-35, I యోహాను 5:1-6, యోహాను 20:19-31

క్రీస్తు పునరుత్థాన పండుగ తరువాత ఆదివారమును దైవ కారుణ్య పండుగగా జరుపుకోవాలని పరిశుద్ధ రెండవ జాన్ పౌల్ పాపుగారు పిలుపునిచ్చారు.  అప్పటినుండి రోమను కతోలిక సంఘమునందు ఈ పండుగను జరుపు కొంటున్నారు.

అసలు 'దివ్య కారుణ్యం' అంటే ఏమిటి? ఈ పండుగ జరుపుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? దివ్య కారుణ్యం అంటే, 'దేవుని కరుణ' అని అర్ధం. 'కరుణ' అనే తెలుగు మాటకు ఆంగ్లములో 'Mercy' అందురు.  'Mercy' అనే ఆంగ్ల మాట mercedem లేదా merces అనే లాటిన్ మాట నుండి ఉద్భవించింది.  ‘mercedem’ లేదా ‘merces’ అనే మాటకు ప్రతిఫలము, జీతము, కిరాయి అనే అర్ధాలు గలవు.  బైబిలు పరి భాషలో ఈ మాటకు (Mercy) ప్రతిఫలము లేదా జీతము లేదా కిరాయి చెల్లించ బడినది అని అర్ధము.

దివ్య కారుణ్య అపోస్తరాలుగా పిలువబడే పునీత ఫౌస్తీనమ్మ గారి మాటలలో చెప్పాలంటే, ఈ పండుగ ముఖ్య ఉద్దేశాలు మూడు:
దేవుని కరుణను కోరుకోవడం
యేసుని అనంత కరుణను నమ్మడం
మనం పొందిన/పొందుతున్న ఆ దేవుని కరుణను పంచడం

ఈ పండుగ సందర్భముగా మనం ఈ నాడు విన్న సువిశేషమును ధ్యానిద్దాం.   దానికి ముందుగా....

నీకు తెలిసిన వారు ఎవరైనా అకస్మాత్తుగా తటస్థ పడితే ఏమి చేస్తావు? లేదా ఏమి అడుగుతావు?
నీకు మంచి చేసిన వాడితే, మేలు చేసిన వాడితే, నీ అభివృద్ది కోరేవాడితే, వారు మనల్ని చూడకపోయినా, మనమే ఎదురెళ్లి, వారికి అగుపడి గతమున చేసిన మేలును జ్ఞప్తికి తెచ్చుకొని కృతజ్ఞతలు తెలియజేసి, కుశల ప్రశ్నలు అడుగుతాం!

అదే మనకు చెడు చేసిన వారైతే, మనల్ని మోసగించిన వారైతే, మన నమ్మకాన్ని వమ్ము చేసినవారైతే, వంచనతో మన స్నేహాన్ని కోరిన వారైతే, స్వార్ధం కొరకు ప్రేమగా నటించిన వారైతే, వారిని చూసినా కాని, చూడనట్లు నటించి వారి చూపులనుండి, వారి చుట్టు ప్రక్కల నుండి తప్పించుకొనడానికి ప్రయత్నిస్తాం!  కొద్దిగా దైర్యవంతులైతే, తప్పు చేయని వాడిని నా కెందుకు భయం అని చూసి చూడనట్లుగా వెళతాం!   ఇంకా అతను/ఆమె కాని మనతో మాట్లాడాలని ప్రయత్నిస్తే, జరిగింది, చేసింది, చెప్పింది చాలు! ఇక వెళ్ళు అంటాం!  ఇంకా మాట్లాడాలని ప్రయత్నిస్తే మోసగించిన, వంచన చేసిన, అవమానము, ఆ సందర్భము, ఆ సందర్భములో జరిగిన మాటలు, సంభాషణ అవి హృదయపు లోతులలో చేసిన గాయాలను గుర్తుకు తెచ్చుకొని కోపపడతాము లేదా బాధపడతాము!

ఇదంతా ఎందుకు వివరిస్తున్నానంటే, ఈ నాటి సువార్తలో, యేసు ప్రభువు అటువంటి పరిస్థితులలోనే ఉన్నా, దానికి భిన్నముగా ప్రవర్తించారు.  ఆయనే వారికి అగుపడుచున్నారు.  ఆయనే వారితో మాట్లాడుచున్నారు.  యూదుల భయముతో ఉన్న వారికి ధైర్యాన్ని నూరిపోస్తున్నారు.  ఏమి చేయాలో అని పాలుపోని స్థితిలో, ఏమి చేయాలో, ఎలా చేయాలో చెప్పుచున్నారు.  బాధను, భయమును పోగొడుచున్నారు. ఇంత జరిగినా, ఏమీ జరగనట్లు, ఏమీ తెలియనట్లు ఉన్నాడు. 

అదే మనమైతే,
నాయవంచాకులారా! విశ్వాస ఘాతకులారా! గురుద్రోహులారా! పిరికి పందల్లారా! అని అనే వాళ్ళం!
కాని ఆయన మాత్రం, షాలోం (శాంతి) సమాధానం కలుగుగాక! సమృద్ధి కలుగును గాక! ఆనందం సంతోషం వర్ధిల్లుగాక! అని వారిని సంభోదిస్తూ ఉన్నారు. ఎందుకంటే, (ఆయన) మన పాపాలకు తగినట్లుగా మనలను శిక్షింపడు, మన దోషములకు తగినట్లుగా మనలను దండింపడు   (కీర్తన 103:10).

ఆయన కరుణ గలవాడు, దయగలవాడు.  అతడు కరుణామయుడు, దయాపరుడైన దేవుడు.  సులభముగా కోపపడువాడు కాదు.  ప్రేమామయుడు, విశ్వాసమందు అనంతుడు (నిర్గమ కాండము 34:6).

అందుకే నమ్మని తన శిష్యులకు, తనకు కలిగిన గాయాలను చూపిస్తున్నాడు.  ఈ సందర్భములో మనమైతే, ఇదిగో మీ/నీ నయవంచనకు మోసమునకు, విశ్వాస ఘాతమునకు, గురు ద్రోహమునకు గుర్తు! అని అంటాం!

కాని ప్రభువు అంటున్నాడు:
ఇదిగో మీ రక్షణ చిహ్నాలు, మీ పాపమునకు పరిహారముగా సిలువ మీద నన్ను సమర్పించుకొన్నాను అనడానికి చిహ్నాలు -
మీ పాపములకు జీతము/ప్రతిఫలము/కిరాయి చెల్లించ బడినది అనుటకు గుర్తు.
మీ కొరకై, మీ విముక్తి కొరకై, అమ్మబడ్డాను, చంపబడ్డాను/ పరిహార బలిగా అర్పింపబడ్డాను అని అనడానికి గుర్తు.  మీపై గల ప్రేమకు, రక్షణకు, కరుణకు గుర్తులు నా తీపి జ్ఞాపకాలు.  మీరు చెల్లించవలసిన మూల్యం (అప్పు) చెల్లించబడినది అని నిరూపించే రసీదు.

మీరు పొందిన ఈ పరిహారమును, మన్నింపును, విముక్తిని, మీ తోనే, మీ కొరకే, పరిమితం చేసికొనకుండా, ఇతరులకు పంచండి.  మన్నింపులోని  మహత్యమును కరుణలోని కమనీయతను వెదజల్లండి అని భోదిస్తున్నాడు యేసు.

ఇంకా ఈ కరుణకు దూరముగా ఉంటె, కరుణకు దగ్గరవ్వాలని కోరుకొందాం! మనకు దగ్గరయి, మనలను దేవుని దరికి చేర్చిన క్రీస్తు కరుణను నమ్ముదాం! నమ్మిన ఆ కరుణను పొంది, పంచుదాం ... మన తోటి వారందరికీ...

1 comment:

  1. Thank you for the wonderful words👍🏻

    ReplyDelete