పవిత్ర గురువారం, YEAR B, 5 ఏప్రిల్ 2012

పవిత్ర గురువారం, YEAR B, 5 April 2012
నిర్గమకాండము 12: 1-8, 11-14, భక్తి కీర్తన 116:12-13, 15-16,17-18
1 కొరి 11: 23-26, యోహాను 13: 1-15

Br. Kiran Kumar Avvari, OFM Cap

తపస్కాలము మనలను మనం దైవీకముగా మార్చుకొనుటకు దేవుడిచ్చిన సమయం. అలాంటి తపస్కాలమందు విభూది బుధవారము నుండి మ్రానుకొమ్మల ఆదివారం వరకు ఒక ఎత్తైతే, ఈ చివరి తపస్కాల వారం ఇంకొక ఎత్తు. అటువంటి ఈ తపస్కాల చివరి వారమందు ఉత్థాన పండుగకు ముందు వచ్చు గురువారమును పవిత్ర గురువారముగా పిలవడం ఆనవాయితి.. తపస్కాలమందు పవిత్ర గురువారమునకు ఎంతో ప్రాముఖ్యత కలదు. ఈ ప్రాముఖ్యతకు గల కారణములను మనము ఈనాటి పటనముల ద్వారా గ్రహించవచ్చును.

నిర్గమకాండము 12: 1-8, 11-14 - పాస్కబలి నియమములు

ఈ పఠనము ద్వారా యెహోవా దేవుడు ఇస్రాయేలీయులతో పాస్కాబలి ఒప్పందము చేసుకొనుటను మనము చదువుచున్నాము. ఈనాడు ఇస్రాయేలీయులు పరిశుద్ధమైన మగ గొర్రెపిల్లలను చంపి, వాటి రక్తమును వారి ఇంటి గుమ్మములకు పూయవలెనని దేవుడు ఆజ్ఞాపించాడు. అప్పుడు తాను ఐగుప్తు దేశమునందు జనుల తొలిచూలు పిల్లలను చంపునపుడు ఇస్రాయేలీయుల పిల్లలు క్షేమంగా ఉండెదరు. ఇది దేవుని పాస్క బలి అని, పాస్క నియమములను, పాస్క ఒప్పందము గురించి ప్రభువు విడమరచి చెప్పియున్నారు.


ఈ పాస్క గొర్రెపిల్లను ఏ విధముగా తినవలేనో కూడా యెహోవా చెప్పియున్నారు. ఆ నియమములు ఏమనగా:
- తినునపుడు వారి నడుముకు దట్టి ఉండవలెను
- కాళ్ళకు చెప్పులు తొడుగుకొనవలెను
- చేతిలో కర్ర ఉండవలెను
- మాంసమును త్వరగా తినవలెను.

ఈ నియమములను మనము ఒక్కసారి గమనిచినట్లయితే, ఇవన్ని ఎవరో ముఖ్యమైన వారు వచ్చుచున్నపుడు మనలను మనము త్వరితగతిన తయారుచేసుకొంటున్నట్లు గోచరించును. ఆ విధముగా మనము ఎంత ఉత్కంటభరితముగా దేవుని పాస్క గురించి తయారు కావలెనో మనము అర్ధము చేసుకొనవచ్చును. ఏ విధముగానైతే ఒక పాలనాధికారి వచ్చినపుడు మనము ఎంత ఉత్కంటభరితముగా ఉంటామో అంత కన్నా ఎక్కువగా దేవుని పాస్క గురించి ఉత్కంటగా తయారుకవాలనేది దేవుని ఉద్దేశ్యము. అంటే దేవుని పాస్క బలిని ఎంతో ఉత్కంటతోను, దీక్షతోను, ఎదురుచూచు గుణముతోను జరుపుకోనవలెను.

ఈ పాస్క బలి ఐగుప్తీయుల చెరనుండి ఇస్రాయేలీయులను విడుదల చేయుటకు సూచికగా అవగతమగుచున్నది. అదే విధంగా ఈ పాస్క బలి ఎన్నో సంవత్సరముల తరువాత వచ్చు క్రీస్తు బలికి సూచికగాను జరిగినట్లుగా మనము అర్ధము చేసుకొనవచ్చును.

1 కొరి 11: 23-26 - దివ్య సత్ప్రసాద స్థాపనము, పవిత్ర యాజక అంతస్తు స్థాపన

ఏ విధముగా అయితే మొదటి పటనములో యెహోవా దేవుడు తన పాస్క బలి నియమములను చెప్పియున్నారో అదేవిధముగా ఈ రెండవ పఠనములో పునీత పౌలుగారు దివ్య సత్ప్రసాద బలి స్థాపన గురించి, బలి ఏ విధముగా జరపాలనే నియమముల గురించి, పవిత్ర యాజక అంతస్తు స్థాపన గురించి మనకు విశదీకరించుచున్నారు.

దివ్య సత్ప్రసాద స్థాపనము

యేసుప్రభు తాను అప్పగి౦పబడనున్న రాత్రి దివ్య సత్ప్రసాద బలి ద్వారా తనను ఏ విధముగా జ్ఞాపకము చేసుకోవలెనో చెప్పియున్నారు. ఈ దివ్య సత్ప్రసాద బలి యేసుప్రభు యొక్క నిజమైన ప్రాణబలికి గుర్తుగా పౌలుగారు చెప్పుచున్నారు. ఈ దివ్య సత్ప్రసాదబలి ద్వారానే మనము ప్రతిదినము ప్రభు చెప్పిన నియమానుసారముగా ఆయన మరణమును స్మరించుకొంటున్నాము. ఈ బలిలో ముఖ్య అంశములు ఏమనగా :

కృతజ్ఞతాబలి

యేసుప్రభు దివ్యసత్ప్రసాద స్థాపనలో మొదటగా దేవునకు కృతఙ్ఞతలు చెల్లించారు. తాను పొందవలసినటువంటి బాధలు తనకు తెలిసినప్పటికీ తాను ముందుగా దేవునకు కృతఙ్ఞతలు చెప్పియున్నారు. అనగా దివ్య సత్ప్రసాద బలి యేసుక్రీస్తు ప్రాణబలిని సూచించినప్పటికీ దేవునికి కృతఙ్ఞతలు చెప్పడము ఎంత ముఖ్యమో తెలుస్తున్నది. అందుకే దివ్య సత్ప్రసాదబలిని కృతజ్ఞతాబలిగను వ్యవహరిస్తారు.
దివ్య (ప్రాణ) బలి

దేవునికి కృతఙ్ఞతలు తెలిపిన తరువాత రొట్టెను తుంచడము ద్వారా తన మరణమును గురించి సంకేతనమును యేసుప్రభు తన శిష్యులకు ఇచ్చియున్నారు. ఈ విధముగా ప్రభు తీసుకొన్న రొట్టె తనకే సూచికగా నిలుచుచున్నది. తాను రొట్టెను తుంచడము ద్వారా తనను తాను ఇష్టపూర్తిగా దేవునికి అర్పిస్తున్నట్లు, తాను ఇష్టపూర్తిగా తన ప్రాణమును ధారపోస్తున్నట్లుగా తన మనస్సును తేటతెల్లము చేసియున్నాడు.
దివ్య రక్తము

భోజనము తరువాత యేసుప్రభు ద్రాక్షరసపు పాత్రను తీసుకొని, అది తాను చిందబోవు రక్తమునకు చిహ్నముగా చెప్పియున్నారు (లూకా 22:20). ఈ రక్తపు చిహ్నము నూతన ఒడంబడికగా యేసుప్రభు చెప్పినవిధముగా పునీత పౌలుగారు అభివర్ణించారు. అందువలన ప్రతి దివ్యబలిపూజలో ద్రాక్షరసము అర్పింపబడునప్పుడు ప్రభు మనందరి పాపములను శుద్ధిచేయుటకు చిందిన దివ్యరక్తమును జ్ఞాపకము చేసుకొనుచుందుము. అంతే కాకుండా ఈ నాటి రెండవ పఠనములో పునీత పౌలుగారు మనకు యేసుప్రభుని రక్తముద్వారా నిత్యమరణము నుండి విముక్తి కలిగినదని చెప్పుచున్నారు. ఎందుకనగా ఇస్రాయేలు సంస్కృతిలో రక్తము జీవమునకు చిహ్నము. యేసుప్రభు తన రక్తమును చిందించుట ద్వారా తన జీవమును స్వచ్చందముగా అర్పించి, తద్వారా మనందరిని నిత్యమరణమునుండి శాశ్వత విముక్తులను చేసారు. యేసుప్రభు రక్తము చిందించుట మనకు మొదటి పటనములో గొర్రె చంపబడుట గుర్తుకు తెచ్చును. ఏ విధముగా ఐతే గొర్రె రక్తము గుమ్మములకు పూయడము ద్వారా ఇస్రాయేలీయుల తొలిచూలు బిడ్డలు రక్షించబాడ్డారో అదేవిధముగా క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనందరమూ రక్షించపడ్డామని తెలుస్తున్నది.

నూతన నిబంధన

మనందరికోసం యేసుప్రభు చిందించిన రక్తము దేవుడు మనతో చేసుకొన్న నూతన ఒడంబడికగా ప్రభు చెప్పినట్లుగా పునీత పౌలుగారు చెప్పియున్నారు (1 కోరి 11: 25). ఈ సమయములో పాత ఒడంబడిక గురించి ఆలోచించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. సినాయీ కొండపై యావే ప్రభువు వేంచేసి ఇశ్రాయేలు ప్రజలతో ఒడంబడిక చేసుకొనియున్నాడు. కాని తరువాత ఎన్నోసార్లు ఇస్రాయేలీయులు ప్రభు మాట మీరి, ఒడంబడిక మీరి తప్పు చేయుచుంటిరి. ఐనప్పటికీ ప్రభువు తనదైన కరుణతో ఎన్నోమార్లు వారిని క్షమించారు. చివరికి తన కుమారుడైన క్రీస్తు రక్తమును చిందించి వారితో శాశ్వత నిత్య నిబంధనను చేసుకొనియున్నారు. ఐతే ఈ శాశ్వత నిత్య నిబంధన ఇస్రాయేలీయులకే కాక మానవజాతి అంతటికీ వర్తిస్తుంది. అందువలన ఎవరైతే ఈ నూతన నిత్యనిభందనలో బాప్తిస్మము ద్వారా భాగస్తులగుదురో వారందరితోనూ ప్రత్యేకముగా నిబంధనను చేసుకొంటూ ప్రతిఒక్కరికి నిత్య జీవభాగ్యమును ఒసగుచున్నారు.

పవిత్ర యాజక అంతస్తు స్థాపన

ఈ రోజు ఇంకొక మహత్తర ఘట్టాన్ని కూడా ఆవిష్కరించిన రోజు. అదే పవిత్ర యాజక అంతస్తు స్థాపన. యేసు ప్రభు తను ఆదినుండి యెహోవా దేవుని ప్రధాన యజకుడైనను, తననుతాను యాజకునిగా ఈ లోకానికి పరిచయం చేసినది తనను తాను అర్పించుకొనే. ఆ విధముగా తననుతానే అర్పించుకొని, తనే అర్పకుడుగాను, తనే బలి వస్తువుగాను అయితన జీవిత చరమాంకానికి తెరతీసారు. తద్వారా తన శ్రమల పర్వాన్ని తనదైన మేలి అర్పణ ద్వారా మొదలుపెట్టారు. ఎప్పుడైతే యేసుప్రభు "దీనిని నా జ్ఞాపకార్ధము చేయుడు" (1 కొరి 11: 24-25; లూకా 22:19) అని శిష్యులకు ఆజ్ఞ ఇచ్చియున్నారో అప్పుడు, ఆ సమయమున అపోస్తలులందరూ యేసు వాక్యములద్వారా గురువులుగా అభిషక్తులయ్యారు. తరువాత కాలములో అపోస్తలులు ఎవరినైతే ఎన్నుకోనేవారో వారికి క్రీస్తు యాజకత్వం దయచేయబడినది. అందుచేత ఈ రోజు క్రైస్తవ గురువులందరి గురించి ప్రత్యేకముగా ప్రార్ధించవలసిన సుదినం.
యోహాను 13: 1-15 - శిష్యుల పాదాలను కడుగుట

మొదటి పఠనములో దేవుడు ఏర్పరచినటువంటి పాస్కపండుగ ముందురోజున, యేసుప్రభు తనయొక్క భోదనలకు, వాక్కులకు కార్యరూపం ఇచ్చాడు. యాజకత్వమునకు నిజమైన నిర్వచనమును తన చేతలతో మనందరికీ చూపించాడు. పునీత పౌలుగారు ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖలోని రెండవ అధ్యాయములో చెప్పిన విధముగా దైవప్రతినిధిగా, దైవ సేవకునిగా, ప్రజాసేవకునిగా, దైవకుమారునిగా తన శిష్యులకు దర్శనమిచ్చాడు. ఆ మహాత్కార్యమే శిష్యుల పాదాలను కడుగుట.
తాను దేవుని కుమారుడైనను శిష్యుల పాదములను కడుగుటకు సిద్ధపడగా, పేతురు ఆ దైవీక చిహ్నమును అర్ధము చేసుకోలేక నిరాకరించెను (యోహాను 13:8). అందుకు యేసు "నేను నిన్ను (నీ పాదములను) కడుగనియెడల నాతొ నీకు భాగము ఉండదు" (యోహాను 13:8) అని చెప్పుటద్వారా శిష్యులందరు తన యొక్క కార్యములోను, శ్రమలలోను, మహిమలోను భాగము పంచుకొంటారని చెప్పకనే చెప్పారు. అందుకనే యేసు తన శిష్యులను సేవకులుగా పరిగణింపక స్నేహితులని పిలిచెను (యోహాను 15:15).

మీరందరు శుద్దులు కాదని చెబుతూనే యూద ఇస్కరియోతు కాళ్ళను కూడా యేసుప్రభు కడిగారు. ఎందువలననగా, తాను యుదాతోసహా శిష్యులందరినీ చివరిదాకా ప్రేమించెను (యోహాను 13:1). యుదా తనను అప్పగిస్తాడని తెలిసికూడా అతనిని ప్రేమించెను. యుదాకాళ్ళు కడగడము ద్వారా తనలో యుదాకి కూడా భాగముందని చెప్పకనే చెప్పెను. కాని యుదా ప్రభువు మనస్సుని అర్ధము చేసుకోలేక ఆ భాగమును నిరాకరించి యేసుని రోమనుసైనికులకి అప్పగించెను. ఈ యొక్క కార్యము ద్వారా యేసుక్రీస్తుయొక్క షరతులు లేనటువంటి నిష్కల్మషమైన ప్రేమను అర్ధము చేసుకొనవచ్చును. ఈ విధముగా ప్రభు ప్రేమకు మంచివారు చెడ్డవారు అను తారతమ్యములు లేవని నిరూపించుచున్నారు.

అంతేకాకుండా యేసుప్రభు, తాను ఏవిధముగా చేసెనో తన శిష్యులను కూడా అనగా మనందరినీ అదేవిధముగా చేయుమని ఆజ్ఞను, ఆదర్శమును ఇచ్చెను. తద్వారా మనందరికీ ఒకరిలో ఒకరికి క్రీస్తునందు భాగము కలదని తెలియుచున్నది. ఈ విధముగా ఈ వినమ్ర కార్యం పరుల ప్రేమకు తార్కాణముగా నిలుస్తుందని యోహానుగారు మనకు ఈనాటి సువార్తలో చెప్పుచున్నారు.

చివరిగా క్రీస్తు మొదటి పటనములోని ప్రజలకోసం చనిపోవుగొర్రెగా సూచించబడగా, రెండవ పఠనంలో యజకుడిగాను, బలిఅర్పణగాను సూచించబడగా, సువార్తలో వినమ్రహృదయుడిగా వర్ణించపడ్డాడు. ఈ విధముగా ఈనాటి పఠనాల ద్వారా తిరుసభ మనకు క్రీస్తుని గురించి, క్రిస్తుని ప్రేమ గురించి విపులముగా వివరిస్తున్నది. అనగా యేసుని ప్రేమను ఒక నాణెముగా పరిగణిస్తే, యేసుని యొక్క స్వచ్చందబలి అర్పణ మరియు సేవాపూరిత ప్రేమలను చెరొక పార్శ్వముగా అర్ధము చేసుకొనవచ్చును. అంతేకాకుండా ఈనాటి పఠనాలు, దేవుడు ఇచ్చిన పాస్క పండుగ నియమాలు, దివ్య సత్ప్రసాదక్రమము, క్రీస్తు ఇచ్చిన వినయాదర్శము ఏ విధముగా ఆచరించవలెనో, ఏ విధముగా జ్ఞాపకము చేసుకోవలెనో సూచనాప్రాయముగా తెలియచేయుచున్నాయి. ఈవిధముగా ఈనాటి పఠనాలు ఈ పవిత్ర గురువారము ప్రాముఖ్యత గురించి, ఈ పవిత్ర గురువారమును ఎందుకు భక్తిశ్రద్ధలతో జరుపుకొనవలెనో తెలియచేయుచున్నవి.

No comments:

Post a Comment