పవిత్ర శుక్రవారము

పవిత్ర శుక్రవారము: పరిశుద్ధ సిలువ ఆరాధన
యెష 52:13-53:12; హెబ్రీ 4:14-16, 5:7-9; యోహా 18:1-19:42

ఉపోద్ఘాతము:
సకల వరముల ఊటయగు ఓ దేవా! మీ సేవకుల కొరకు మీ కుమారుడగు క్రీస్తు తన రక్తముద్వారా పాస్క పవిత్ర క్రియలను స్థాపించెను. మీ దయా కటాక్షములను స్మరించుకొని వారిని నిత్య రక్షణతో పవిత్ర పరచుడు.


ఈ రోజు పవిత్ర శుక్రవారము. ఈ రోజుని "గుడ్ ఫ్రైడే" అని అంటున్నాము. యేసు ప్రభువు శ్రమలను పొంది మరణించిన రోజును మనం ఎందుకు మంచిరోజు, పవిత్రమైన రోజు అంటున్నాము? ఎందుకనగా, క్రీస్తు మరణం మనకు విజయాన్ని సంపాదించి పెట్టింది. ఆయనను విశ్వసించు వారందరికి జీవమును, అనుగ్రహమును, రక్షణను, విముక్తిని సంపాదించి పెట్టింది. తన మరణముద్వారా, మనలను పాపదాస్యమునుడి విముక్తి గావించారు. "నిష్కళంకమైన గొర్రెపిల్లవంటి అమూల్యమైన క్రీస్తు బలిద్వారా మీరు విముక్తి కావింపబడితిరి" (1 పేతు 1:19).

పవిత్ర గురువారమున, క్రీస్తు శిష్యులతో కలసి, 'పైగది'లో ప్రవేశించి, దేవుని గొప్పవరమైన దివ్యసత్ప్రసాద భోజనమును స్వీకరించియున్నాము. క్రీస్తు ప్రభువుని నిజమైన శరీరరక్తములు, ఆత్మ దైవత్వమును మనం పొందియున్నాము. ఈనాడు పవిత్ర శుక్రవారమున, మన శ్రీసభకు తల్లియైన మరియమ్మతో కలసి క్రీస్తు సిలువచెంత నిలుస్తున్నాము. పవిత్ర శుక్రవారమున, గొప్ప నమ్మకముతో, ఆశతో, క్రీస్తు సమాధిపై కప్పబడిన రాయి దొరలు సమయముకొరకై వేచిచూస్తున్నాము. ఆ క్షణమున, క్రీస్తు ఉత్థాన ఉజ్వలముతో మన హృదయాలు దేదీప్యమవుతాయి. ఆక్షణమున పరలోకములో పునీతులతో మరియు మన తోటి సహోదరీ సహోదరులతో కలసి, "లెమ్ము, ప్రకాశింపుము. నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభువు తేజస్సు నీపై వెలుగు చున్నది" (యెషయ 60:1) అని 
ఎలుగెత్తి స్తుతించెదము.

ఈ రోజు క్రీస్తు సిలువచెంత నిలచియున్నాము. మరియ తల్లివలె, నిర్మల హృదయముతో ఈ సిలువచెంతకు వచ్చియున్నట్లయితే, దైవప్రేమ పరమరహస్యాలలోనికి ప్రవేశిస్తాము. సిలువను గాంచుదాం. సిలువలో వ్రేలాడుచున్న క్రీస్తును గాంచుదాం. ప్రేమగల మన ప్రభువు మనకోసం తన ఇష్టపూర్తిగా ఈ సిలువ మరణాన్ని పొందారు. తన సిలువ వేదన, మరణముద్వారా మనలను రక్షించి యున్నారు. ఆయన మన మరణమునుండి రక్షించారు.

ధ్యానం: ఈరోజు మనం పాస్క పరమ రహస్యాన్ని ప్రత్యేక విధముగా కొనియాడుచున్నాము. క్రీస్తు సిలువ మరణం ఒక బలి. అది మన పాపాలను పరిహరించే బలి. యావత్ ప్రపంచానికి విమోచనాన్ని, విముక్తిని కలిగించినటువంటి బలి. ఈ బలిలో గురువు క్రీస్తే మరియు బలి వస్తువు కూడా క్రీస్తే. కలువరిగిరిపై అర్పించిన బలి, తండ్రి దేవుని చిత్తానుసారముగా జరిగియున్నది. అందుకే, తండ్రి దేవుడు క్రీస్తును మహిమపరచి మహోన్నత స్థితికి హెచ్చించారు. మనముకూడా తండ్రికి పూర్తిగా విధేయులై, బాధామయ సేవకుడగు క్రీస్తు ప్రభువుతో కలసి పోవాలి. మన దు:ఖాలు, కష్టాలు, శోధనలు, వేదనలన్నింటిని క్రీస్తుబలితో ఒకటిగా చేసి తండ్రి దేవునికి సమర్పించాలి. అప్పుడే సిలువ మార్గములో ప్రభుని అనుసరించే వారందరికి విమోచనం కలుగుతుంది.

ఈ రోజు మనం ప్రత్యేక విధముగా ప్రభువు సిలువ మరణాన్ని స్మరిస్తున్నాము. మనకోసం ఆయన ఎన్నో శ్రమలను, బాధలను అనుభవించారు. అవమానాలను భరించారు. సిలువపై ఘోరాతి ఘోరమైన మరణాన్ని పొందారు.

యేసును బంధించుట (యోహాను 18:1-12): కడరాత్రి భోజనం తరువాత, యేసు తన శిష్యులతో కేద్రోను లోయ దాటి ఓలీవు కొండపై నున్న, గెత్సేమని తోటకు వెళ్ళెను. యేసు తరుచుగా ప్రార్ధనకై అచటకు వెళ్ళేవారు. యేసును అప్పగింపనున్న యూదాకు ఆ స్థలము తెలియును (18:1-2). యేసు యూదాకు తెలియని స్థలమునకు వెళ్ళలేదు. ఎందుకన, యేసు తననుతాను బలిగా అర్పించు కొనుటకు సిద్ధపడ్డారు (18:4-8, 11). యేసును బంధించుటకు యూదా ఇస్కారియోతు, రోమా సైనికులు, ప్రధానార్చకులు, పరిసయ్యులు పంపిన బంట్రౌతులు, అధికారులు వచ్చిరి (18:3) - అనగా [అవిశ్వాస, చీకటి] 'లోకమంత' యేసుకు వ్యతిరేకం అని సూచిస్తుంది. ప్రతీ పాపాత్ముడు యేసు మరణానికి కారణం. వారు చీకటిలో, వెలుగును బంధించుటకు వచ్చిరి. చివరి వరకు వెలుగులో జీవించువాడు యేసునకు ప్రియ శిష్యుడు. పేతురు ప్రధానార్చకుని సేవకుని (మాల్కుసు) కుడిచెవిని తెగనరికెను. యేసు పేతురుతో, "నీ కత్తిని ఒరలో పెట్టుము. తండ్రి నాకు ఇచ్చిన శ్రమల పాత్రను నేను పానము చేయవలదా?" (18:10-11) అని అనెను. "కత్తిని ఎత్తువాడు కత్తితోనే నశించెదరు" (మత్త 26:52). క్రైస్తవులు హింసలలో, ప్రతీకారాన్ని కోరరాదు. "ఎన్నటికిని మీరు పగ తీర్చు కొనకుడు" (రోమీ 12:19).

న్యాయ పీఠము ఎదుట యేసు - పేతురు బొంకు (యోహాను 18:12-27): యేసును మొదటగా అన్నా (ప్రధానార్చకుడైన కైఫాకు మామ) యొద్దకు తీసికొని పోయిరి (అన్నా క్రీ.శ. 6-15 వరకు, కైఫా క్రీ.శ. 18-36 వరకు ప్రధానార్చకులుగా పనిచేసిరి). యేసును విచారించు సమయములోనే, పేతురు, యేసు ఎవరో తెలియదని బొంకాడు (18:15-18, 25-27). పేతురు బొంకు రాత్రి చీకటిలో జరిగినది. వెలుగైన క్రీస్తుతో జీవించినను, పేతురు తన బలహీనత వలన అంధకారంలో పడిపోయాడు. ఒకవైపు యేసు "నేనే" అని సమ్మతిస్తుంటే, మరోవైపు పేతురు "నేను కాదు" అని తిరస్కరించాడు. మనం యేసు అనుచరులమే, కాని మన పాపల వలన సాతానుకు లోబడి జీవిస్తున్నాం.
ప్రధానార్చకుడు యేసు శిష్యులను గురించి, ఆయన బోధనలను గురించి ప్రశ్నించెను (18:19). యేసు చెప్పిన సమాధానం (18:20-23), అన్నాకు ఎలాంటి పరిష్కారం దొరకపోవడముతో, యేసును ప్రధానార్చకుడగు కైఫా యొద్దకు పంపెను (18:24). యేసులో ఎలాగైనా తప్పు పట్టాలని చూసారు. అన్నా, కైఫాలు యేసులో ఎలాంటి దోషమును కనుగొనలేదు.
పిలాతు ఎదుట ప్రభువు - ప్రజలకు లొంగిన పిలాతు (యోహాను 18:28-40; 19:1-16): అందుకే, యూదుల అధికారులు యేసును కైఫా యొద్దనుండి అధిపతి మందిరములోనికి తీసికొని వెళ్ళిరి. రోమను గవర్నరు అయిన పిలాతు ఎదుట ప్రభువును నిలబెట్టిరి. ఎందుకన, మరణదండన విధించు అధికారము యూదులకు లేకుండెను (18:31). దేనిని మనం 7 భాగాలుగా చూడవచ్చు: (1). పిలాతు-యూదులు: నింద / తీర్పు (18:28-32); (2). పిలాతు-యేసు: రాజ్యము / సత్యము (18:33-38); (3). పిలాతు-యూదులు-బరబ్బ (18:38-40); (4). యేసును కొరడాలతో కొట్టెను, ముళ్ళ కిరీటము తలపై పెట్టెను, ముఖముపై కొట్టిరి (19:1-3); (5). పిలాతు-యూదులు: "ఇదిగో ఈ మనుష్యుడు" (19:4-7); (6). పిలాతు-యేసు: "నీవు ఎక్కడనుండి వచ్చితివి?" (19:8-11); (7). పిలాతు-యూదులు: "సీజరు తప్ప మాకు వేరొక రాజు లేడు" (19:12-16). 

సిలువ, మరణం, భూస్థాపితం (యోహాను 19:17-42): సిలువ, సిలువపై బిరుదము (19:16-22); యేసు అంగీకొరకు చీట్లు వేసుకొనుట (19:23-24); సిలువ చెంత మరియ తల్లి, ప్రియ శిష్యుడు (19:25-27); యేసు మరణం (19:28-30); యేసు ప్రక్కలో బల్లెపు పోటు (19:31-37); భూస్థాపితం (19:38-42).

సిలువ మరణం: 
ఆనాడు, అన్ని శిక్షలలోకెల్ల సిలువ మరణం చాలా క్రూరమైనది, ఘోరమైనది. ఇది బానిసలకు విధించే అతి నీచమైన మరణదండనగా పిలువబడేది. యేసు చాలా అవమానకరమైన, అమానుషమైన, అతి భయంకరమైన, హేయమైన, బానిస మరణాన్ని, నేరస్థుని మరణాన్ని పొందియున్నాడు.
సిలువ: సిలువ క్రీస్తు శ్రమలు, మరణమునకు, ఆయన అర్పించిన బలికి, రక్షణ విజయానికి చిహ్నము. సిలువను చూసినప్పుడెల్ల ఈ పరమ రహస్యమును మనము ధ్యానించాలి. ఈనాడు సిలువను ఆరాధిస్తున్నాము. ప్రతిమలో సిలువపై ఉన్న క్రీస్తు రూపము కొంతవరకు అందముగా ఉంటుంది. కాని, వాస్తవానికి ఇది అతీతం. ఈనాడు సిలువను ఆరాధించగలగడానికి గల కారణం, అవమానానికి ప్రతీక అయిన సిలువ, క్రీస్తు సిలువపై మరణముతో మహిమకి సాధనముగా, జీవమునకు చిహ్నముగా మారియున్నది.
ఆయన సిలువ మరణాన్ని మనకోసం అంగీకరించారు: "తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయు వానికంటె ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడును లేడు" (యో 15:13). సిలువ ప్రేమకు గుర్తు. ప్రభువు అందరి కోసం మరణించారు. సిలువ పరలోక ద్వారము. సిలువ గురుతు ఒక వరం. దీని ద్వారా దేవుని ఆశీస్సులను, అనుగ్రహాలను పొందుచున్నాము.
సిలువ ప్రేమకు చిహ్నం: 
సిలువ మరణం యేసుకు మనపైగల ప్రేమకు నిదర్శనం. పునీత పౌలు తన లేఖలలో, యేసు మరణాన్ని ప్రస్తావించినప్పుడెల్ల, యేసు/దైవ ప్రేమనుగూర్చి చెప్తారు: "క్రీస్తు మనలను ప్రేమించినందు చేతనే, దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగను, బలిగను, మన కొరకై తన ప్రాణములను సమర్పించెను" (ఫిలిప్పీ 5:2). యేసు మరణముద్వారా, దేవుని ప్రేమకూడా వ్యక్తమగుచున్నది. "నీతి మంతుని కొరకు కూడా ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు. బహుశా, సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో కాని మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మనకొరకై మరణించెను గదా! ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు" (రోమా 5:7-8). "ఆయన తన స్వంత కుమారునికూడా మన అందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు. మరి ఇతరమైన సమస్తమును కూడా మనకు ఉచితముగా ఇచ్చివేయడా?" (రోమా 8:32).
సిలువ ఆరాధన: ఈ రోజు శ్రీసభ కలువరి గిరి క్రీస్తు సిలువపై చూస్తూ ఉన్నది. ప్రతి శ్రీసభ సభ్యుడు, సభ్యురాలు, సిలువ మ్రానుద్వారా క్రీస్తు సాధించిన రక్షణ గూర్చి ధ్యానించును. మోకరిల్లి సిలువను ముద్దిడి ఆరాధించడము ద్వారా, సిలువద్వారా క్రీస్తు అందించిన రక్షణకుగాను కృతజ్ఞులమై ఉంటున్నాము. క్రీస్తును ఆరాధిస్తున్నాము: "క్రీస్తువా! మిమ్ము ఆరాధించి, మీకు స్తోత్రములు అర్పిస్తున్నాము. ఎందుకన, మీ సిలువచేత, ఈ లోకమును రక్షించితిరే"
కార్యసాధనలో సిలువ మరణం: యేసు ఎందుకు మరణించ వలసి వచ్చినది? ఏ కారణం ఆయన మరణానికి దారితీసింది? దేవునితో మానవ సంబంధాన్ని పునరిద్దరించడానికి ఆయన ఏ లోకానికి వచ్చారు. లోకమును నీతి న్యాయం, సోదరభావముతో కూడిన జీవితాన్ని స్థాపించడానికి వచ్చారు. లోకమును రక్షించాలని వచ్చారు. దేవుని ప్రేమను, కరుణను, శాంతిని బోధించాలని వచ్చారు. ఈ కార్యసాధనలో ఆయన సిలువ మరణాన్ని పొందాల్సి వచ్చినది.
క్రీస్తు శ్రమలు దైవచిత్తమేనా?: "నేను పరలోకము నుండి దిగివచ్చినది, నన్ను పంపినవాని చిత్తమును నెరవేర్చుటకేకాని, నా ఇష్టానుసారము చేయుటకు కాదు. ఆయన నాకు ఒసగినది ఏదియు పోగొట్టుకొనక, అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపినవాని చిత్తము. కుమారుని చూచి విశ్వసించు ప్రతీవాడు నిత్యజీవితమును పొందుటయే నన్ను పంపినవాని చిత్తము" (యోహాను 6:38-40). పతనమైన మానవున్ని ఔన్నత్యమునకు చేర్చుటయే దేవుని చిత్తం. దేవుడు ఆశించేది మానవుని సంరక్షణ, సౌభాగ్యమే కాని రక్తపాతము కాదు. క్రీస్తు మానవునికి విముక్తిని, పాపక్షమాపణను, నూతన జీవాన్ని, మరణానంతరం శాశ్వత జీవాన్ని ప్రసాదించడానికి వచ్చియున్నారు.
అయితే, లోతుగా ధ్యానించినట్లయితే, యేసు పొందిన శ్రమలన్ని, దైవనిర్ణయమని అర్ధమగుచున్నది. అయితే, ఆయన గ్రుడ్డిగా శ్రమలను పొందలేదు. దానిలో దైవచిత్తం ఉంది. మనలను రక్షించాలనే ప్రేమభావం ఉంది. యేసు సిలువపై "సమాప్తమైనది" (యోహాను 19:30) అని పలికారు. దీని అర్ధం: తన శ్రమలు, మరణముద్వారా పాపాన్ని, పూర్తిగా నిర్మూలించారు. శ్రమలు, సిలువ, ముళ్ళకిరీటం అన్నీకూడా ఈ లోకములో ఇమడగలవు, లేనిచో వాటిని ప్రభువు అంగీకరించేవారు కాదు. మరో మాటలో చెప్పాలంటే, పవిత్ర శుక్రవారము లేనిదే ఈస్టర్ ఆదివారము లేదు. మనం ఈ లోకమున మరణించినట్లయితేనే, దైవరాజ్యమున జీవించగలం. ముళ్ళకిరీటం ఉన్నచోటనే, దేవుని మహిమ ఉంది. క్రీస్తుతో మరణించినప్పుడే, ఆయనతో ఉత్థానమవుతాం. ఇదే దేవుని చిత్తం.
క్రీస్తు సిలువపై "దాహమగుచున్నది" (యోహాను 19:28) అని పలికారు. క్రీస్తు దాహము మన రక్షణము. ఆయన దాహము దైవచిత్త పరిపూర్ణము. ఆయన దాహం మనపై సంపూర్ణ ప్రేమ (చూడుము: యోహాను 4:10-14, 6:54 -56). ఈనాడు సిలువ చెంత ఉన్న మనం, సిలువపై ఉన్న క్రీస్తు మనకోసం ఎంత దాహమును కలిగియున్నారో గుర్తించుదాం. దివ్యపూజాబలిలో తన శరీర రక్తములద్వారా, క్రీస్తు మన దాహాన్ని తీరుస్తున్నారు. మనలను మనం ఆయనకు సంపూర్ణముగా అర్పించుకొందాం.

మన కర్తవ్యం?: 
క్రీస్తు కడరా భోజన స్మరణద్వారా ఆయన మరణమును మనము జ్ఞప్తియందు ఉంచుకొనవలయును (చూడుము: 1 కొరింతు 11:24-25, 1 పే 3:18). యేసు చేసిన పోరాటాన్ని, ఆయన ప్రసాదించే శక్తితో, ఆయన శిష్యులమైన మనం కొనసాగించాలి. సంఘములోని అవినీతి, అన్యాయాన్ని, పేదరికాన్ని, బానిసత్వాన్ని, వ్యాధిబాధలను నిర్మూలించాలి. శాంతిని, ప్రేమను, నీతి న్యాయాలను, సోదరభావాన్ని స్థాపించాలి. ఇది మన కర్తవ్యం, ధర్మం. ఈ కర్తవ్యంకోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహాత్ములు ఎంతమందో ఉన్నారు. మనముకూడా అన్నీ ఓర్పుతో సహించుదాం. ఓకే సంఘముగా ప్రేమతో జీవించుదాం. పరస్పర క్షమాపణ కలిగి జీవించుదాం.

No comments:

Post a Comment