తపస్కాల మొదటి ఆదివారము, Year B

తపస్కాల మొదటి ఆదివారము, Year B
ఆదికాండము 9:8-15; భక్తి కీర్తన 25:4-9; 1 పేతురు 3 :18-22; మార్కు 1:12-15

"యేసు ఆత్మప్రేరణ వలన ఎడారి ప్రయాణమునకు కొనిపోబడి సైతానుచే శోధింప బడెను"

యేసు శోధన పరమార్ధం:
ఈ లోకములో మనషి సంతోషం, శోధనలు లేకపోవడములో కాదుగాని, వాటిని జయించడములో ఉంది. ఎందుకన, ప్రతీ ఒక్కరికి శోధనలు తప్పవు. వాటిని జయించడములోనే నిజమైన ఆనందము. అందులకే, తపస్కాలం దేవుడిచ్చిన ప్రత్యేక కాలం. యేసు ప్రభువు చేసిన ఉపవాసం, ప్రార్ధనలో పాలుపంచుకొని పరివర్తన పొందడానికి, తపస్కాలం ఒక మంచి అవకాశం. యేసు కూడా శోధింప బడ్డాడు. అయితే, ఆయన శోధనలను జయించిన తీరు మనకు ఆదర్శం కావాలి. 

హెబ్రీ 2:18 - "తాను శోదింపబడి వ్యధ నొందెను కనుక, ఇప్పుడు ఆయన శోధింప బడు వారికి సాయ పడగలడు." ఎందుకన, అదే లేఖలో చదువుచున్నాం, "మన బలహీనతల గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాదు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మనవలెనే అన్ని విధములుగా శోధింపబడి, పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతము. అచట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందము" (హెబ్రీ 4:15-16). 

నేటి సువిషేశములో యేసు ప్రభువు ఎడారిలో ఎదుర్కొన్న శోధనల గురించి ఆలకిస్తున్నాం. ఆత్మ ప్రేరణ వలన ఎడారికి నడిపింపబడి, నలుబది దినములు గడిపినపుడు సైతానుచే శోధింపబడ్డాడు. సైతాను యేసుప్రభువును శోధించినది. ఎందుకంటే, ఆయన దేవునికి ప్రియమైన కుమారుడు. ప్రపంచముపై ఆధిపత్యం చెలాయించాలన్న కోరికతో సైతాను యేసుప్రభువును శోధించడానికి శతవిధాల ప్రయత్నం చేసింది. అయితే, యేసు సాతాను శోధనలను జయించిన తీరు మనకు ఆదర్శం. "సైతాను, నానుండి దూరముగా పొమ్ము!" అని గద్దించాడు. ఈ భావాన్ని యేసు పేతురుపట్ల చూపించాడు. "ఛీ, పో! సైతాను! నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కాని, దేవునికి సంబంధించినవి కావు" (మార్కు 8:33).
శోధనలపై యేసు ప్రభువు విజయం, సకల మానవాళిలో, సరిక్రొత్త నమ్మకాన్ని, సరిక్రొత్త ఆశను నింపుతుంది అని చెబుతున్నారు. యేసు ప్రభువు, శోధనలపై మరియు సాతానుపై తాను సాధించిన విజయము ద్వారా గొప్ప సందేశమును ఇస్తున్నారు:

మొదటి శోధన: "నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుము" (మత్త 4:3). స్వప్రయోజనం కొరకు తన శక్తిని ఉపయోగించమని శోధన. అధికారమునకు శోధన. "మానవుడు కేవలము రొట్టె వలన జీవింపడు. కాని దేవుడు వచించు ప్రతీ వాక్కు వలన జీవించును" (ద్వితీ 8:3) అని యేసు సమాధానమిచ్చాడు. అనగా విశ్వాసము వలన జీవించును. నిజమైన ఆనందం దైవవాక్కును ఆలకించి దేవుని చిత్తం నెరవేర్చడములో నున్నదని అర్ధము. యేసు దైవకార్యాన్ని గురించి చేసిన భోదనల అంతరార్ధం ఈ వాక్యములో ఇమిడి ఉన్నది: "కాలము సంపూర్ణమైనది. దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు" (మార్కు 1:15). రాళ్ళను రొట్టెలుగా మార్చే శక్తి యేసుకు ఉన్నను, ఆ శక్తిని తన స్వార్ధము కోసం ఎప్పుడు ఉపయోగించలేదు. ఈ శోధనను, యేసు సిలువ చెంతవరకు కూడా ఎదుర్కున్నాడు, "దేవుని కుమారుడవైనచో సిలువ నుండి దిగిరమ్ము" (మత్తయి 27:40). అయినను, ప్రభువు తన స్వార్ధమును చూడలేదు. "అందరి మేలుకొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింప బడినది" (1 కొరి 12:7). యేసు ప్రేషిత సేవలో, అయిదు రొట్టెలను, రెండు చేపలను ఐదువేలమందికి పంచిపెట్టాడు. యేసు తన ఆకలి తీర్చుకోవడానికికాక, ఇతరుల ఆకలి తీర్చడానికి ఆ గొప్ప అద్భుతాన్ని చేసాడు (మత్త. 14:13-21). అధికార వ్యామోహం మనలను నాశనం చేస్తుంది. అందుకే ప్రభువు మనం అలా ఉండకూడదని స్పష్టముగా మత్త 20:25-28లో తెలియజేసారు. ఒకరి పాదములు ఒకరు కడగటం నిజమైన అధికారమని కడరాత్రి భోజన సమయములో తెలియజేసారు.

దేవుని వాక్యం మనకు మార్గదర్శం కావాలంటే రెండు ముఖ్య విషయాలున్నాయి. మొదటగా, దేవుని వాక్యమును సరిగా అర్ధము చేసుకోవాలి. రెండదిగా, దైవచిత్తానికి పూర్తిగా లోబడాలి. మనం వాక్యాన్ని చదివినప్పుడు, మన స్వంత ఇష్టము కంటే, దైవ చిత్తానికి అధిక ప్రాధాన్యం ఇవ్వకుంటే, పరిశుద్ధ గ్రంధం మనలకు నిరాశపరిచేదిగానే ఉంటుంది. కొంతమంది విశ్వాసులు కొన్ని సార్లు వాక్యములోని ఆజ్ఞలకు అడ్డదారులు కనిపెట్టి తమకు ఇష్టం వచ్చినట్లుగా జరిగిస్తూనే తమకుతాము సమర్ధించుకునే మార్గం వెదకుతూ ఉంటారు. ఉదా: పరిసయ్యులు.

రెండవ శోధన: "నీవు దేవుని కుమారుడవైనచో, ఈ శిఖరమునుండి క్రిందికి దుముకుము" (మత్త 4:6) అని సాతాను శోధించెను. ప్రతిష్ట కొరకు శోధన. యేసు మరొకసారి తిరస్కరించారు. "ప్రభువైన నీ దేవుని నీవు శోధింపరాదు" (ద్వితీ 6:16). మన సామర్ధ్యాలను, గర్వముగా ప్రదర్శించుకొనే శోధన, ఆడంబరముగా గొప్పలు చెప్పుకొనే శోధనలో మనము అప్పుడప్పుడూ పడుతూ ఉంటాము. ఇవి దేవుని చిత్తాన్ని నేరవేర్చలేవు. యేసు లేఖన భాగాలను ఉదాహరించడము ద్వారా, శోధనలను జయించాడు. దేవుని వాక్యానికి కట్టుబడి ఉంటే, సాతాను శోధనలు ఎప్పటికీ మనపై విజయం సాధించలేవు. యేసు ప్రభువు ఎన్ని అద్భుతాలు చేసిన, తన గొప్పతనాన్ని, తన సామర్ధ్యాన్ని, తన బలాన్ని నిరూపించుకొనే ప్రయత్నం ఏనాడు చేయలేదు. ఎప్పుడుకూడా, ప్రతీ అద్భుతాన్ని దేవుణ్ణి మహిమ పరచడానికి చేసాడు. ఉదా: "నీవు నీ ఇంటికి నీ బంధువుల యొద్దకు పోయి, ప్రభువు నిన్ను కనికరించి, నీకు చేసిన మేలును గూర్చి వారికి తెలియ చెప్పుము" (మార్కు 5:19).

మూడవ శోధన: "నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన యెడల నీకు సమస్తమును ఇచ్చెదను" (మత్త 4:9). ఇతరులకు సేవ చేసే బదులుగాఇతరులు మనకు సేవచేయాలి అనే శోధన. అప్పుడు యేసు, "సైతానూ! పొమ్ము! ప్రభువైన నీ దేవుని ఆరాధింపుము. ఆయనను మాత్రమే సేవింపుము" (ద్వితీ 6:13) అని చెప్పెను. అధికారం, ప్రభావం అంతా తనదేనని, యేసుకు దానినంతటినీ ఇవ్వగలననే సాతాను అబద్ధం చెప్పాడు. చెడుతనముతో, లోకముతో రాజీపడితే దేవుని కోసం ఏదైనా చేయడం మరింత సులువుగా సాధ్యపడుతుందని అప్పుడప్పుడూ మనం భావిస్తాం.

ఇటువంటి బేరసారాలకి మన జీవితములో అనేక సార్లు లొంగిపోతాం. దేవునికి దగ్గరగా ఉండాలని ఆరాటపడతాం. కాని, లోకాశలకులోనై సాతాను శోధనలకు లొంగిపోతాం. ఇక్కడ ఒక వాక్యాన్ని గుర్తుకు చేసికోవాలి. "మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మనే కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఈయగలదు? (మ 16:26).

యేసు ప్రభువు సాతాను శోధనలను జయించిన తీరు ఎంతో గొప్పది. మానవుని జీవితములో ప్రతీ రోజు సాతాను శోధనలకు గురవుతున్నాడు. శోధనలను జయించే శక్తికోసం దేవుణ్ణి ప్రార్ధించాలి. తపస్సు కాలములో ఉపవాసం, త్యాగక్రియలు చేయడము ద్వారా సాతానుకి చిక్కకుండా దేవునికి ప్రియమైన బిడ్డలముగా, దేవుని నామానికి మహిమను చేకూర్చిపెట్టే బిడ్డలుగా జీవించడానికి కావలసిన శక్తిని దయచేయమని దేవుణ్ణి ప్రార్ధిద్దాం.

యేసు శోధనలను ఎలా జయించాడు? ఆయన సైతానుతో వాదించలేదు, తర్కించలేదు. కేవలం దేవుని వాక్కును మాత్రమే సైతానుకు తెలియజేసాడు. మన శోధనలను ఎలా జయించాలి? మన శోధనలను జయించడానికి దేవుని వాక్కు, ప్రార్ధన ఆయుధాలుగా కావాలి. శోధనల సమయములో ప్రార్ధన చేయాలి. పాపములో పడిపోయే పరిస్థితులకు (వ్యక్తులు, స్థలాలు, వస్తువులు) మనము దూరముగా ఉండాలి. ప్రభువు ఇలా అన్నారు, “నీ కుడి కన్ను నీకు పాపకారణ మైనచో దానిని పెరికి పారవేయుము. నీ దేహమంతయు నరకమున త్రోయబడుట కంటె నీ అవయవములలో ఒక దానిని కోల్పోవుట మేలు” (మత్త. 5:29). అలాగే, “నీ కుడి చేయి నీకు పాపకారణ మైనచో, దానిని నరికి పారవేయుము. నీ దేహమంతయు నరకము పాలగుట కంటె నీ అవయవములలో ఒక దానిని కోల్పోవుట మేలు” (మత్త. 5:30).

శోధనలు జయించాలంటే, శోధనలు జయించాలంటే, దేవుని కృప మనకు కావాలి (హెబ్రీ 4:16); దేవుని వాక్కుతో జయించ గలము. మూడు పుణ్య క్రియలైన ఉపవాసము, దానధర్మాలు, ప్రార్ధన ద్వారా జయించవచ్చు.

No comments:

Post a Comment