యేసు సాక్షత్కార మహోత్సవము

యేసు సాక్షత్కార మహోత్సవము
పఠనాలు: యెషయా 60: 1-6; కీర్తన 72: 1-2, 7-8 , 10-13; ఎఫెసీ 3:2-3, 5-6; మత్తయి 2:1-12
ఇదిగో! సర్వాధికారియైన సర్వేశ్వరుడు వచ్చుచున్నాడు. తన చేతియందు రాజ్యాధికారము, శక్తి సామర్ధ్యములను కలిగి వచ్చుచున్నాడు.

ఉపోద్ఘాతము:

క్రీస్తు జనమ్మునకు దాదాపు 550సం.ల పూర్వమే, ఇశ్రాయేలు ప్రజలు బాబిలోనియా బానిసత్వ చివరి దశలో ఉన్నప్పుడు, యెషయ ప్రవక్తద్వారా, రక్షణ వెలుగును పంచుకొనుటకు అన్ని దేశములను యేరూషలేమునకు నడిపిస్తానని దేవుడు వాగ్ధానము చేసియున్నాడు, "నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును" (యెషయ 49:6). కీర్తనకారునిద్వారా, ఇదే వాగ్దానాన్ని మరోమాటలో చెప్పియున్నాడు: "తర్శీషు రాజులు, ద్వీపముల నృపులు కప్పము కట్టుదురు. షేబా, సెబా పాలకులు కానుకలు కొనివత్తురు. రాజులెల్లరు అతనికి శిరము వంతురు." (కీర్తన. 72:10-11). నేటి మొదటి పఠనములో, "జాతులు నీ వెలుగు వద్దకు వచ్చును. రాజులు కాంతిమంతమైన నీ అభ్యుదయమును చూడ వత్తురు" (యెషయ 60:3) అని చదువుచున్నాము. చీకటి ఆవరించిన జీవితాలలో (ఇశ్రాయేలు ప్రజల ప్రస్తుత దుర్భలస్థితి) దేవుడు వెలుగును (భవిష్యత్తులో క్రీస్తుద్వారా రక్షణ) నింపునని యెషయ ప్రజలకు ఒక గొప్ప ప్రవచనాన్ని తెలుయజేయుచున్నాడు. ఈ ప్రవచనాలన్ని క్రీస్తులో నెరవేరాయని మత్తయి సువార్తికుడు చూపించాడు.

ఎన్నో సం.లు యుద్ధాలు జరిగినను, ప్రజలు వలసలు పోయినను, చారిత్రాత్మక కలతలు జరిగినను, నాగరికత ప్రపంచములో వేర్వేరుసార్లు ప్రపంచ పటమును తిరగరాసినను, దేవుడు వాగ్ధానము చేసిన దానిని నెరవేర్చియున్నాడు. మంచి వ్యక్తులు, నమ్మకము కలిగిన వ్యక్తులు మాత్రమే మంచి వాగ్దానాలను నిలబెట్టగలరు. జ్ఞానులద్వారా, వారి కానుకలద్వారా, సకల దేశాలు, జాతులు, రక్షణ వెలుగులోనికి ప్రవేశించియున్నాయి.

జ్ఞానుల శిశుసందర్శనము - దేవుని విస్వసనీయతకు, నమ్మకమునకు, ఋజువుగా, బైబిలు గ్రంధములోనున్న అత్యంత అందమైన ప్రామాణాలలో ఒకటి.  జ్ఞానుల శిశుసందర్శనము దేవుని మంచితనాన్ని, ఆయన శక్తికలవాడని నిరూపిస్తున్నది. ఆయన మన దేవుడు, అందరి దేవుడు. దేవుని మంచితనము, ఆయన శక్తి మనవే, ఎందుకన, మనము క్రీస్తుకు చెందినవారము. దేవుడు, నీకు, నాకు వ్యక్తిగతముగా విశ్వసనీయుడు, నమ్మదగినవాడు. ఆయన మన ఆధ్యాత్మిక జీవితానికి ఆధారం. అన్నివేళల, అన్నిసమయాలలో, ఆయనను పరిపూర్తిగా విశ్వసించుదాం, పూర్ణహృదయముతో ప్రేమించుదాం. మనమూ ఆయనకు నమ్మదగినవారముగా జీవించుదము.

సాక్షాత్కారము: 
సాక్షాత్కారము అనగా 'కనబడుట', 'బహిర్గతమొనర్చుట', ముఖ్యముగా దైవీకమునకు సంబంధించినవి; కనుక, సాక్షాత్కారము అనగా, క్రీస్తుద్వారా దేవుడు తననుతాను ఈ లోకములో కనబరచుట లేదా బహిర్గత మొనర్చుట. "యిస్రాయేలు ప్రజలు నిరీక్షించిన మెస్సయ్యా, దేవుని కుమారుడు, ప్రపంచ ముక్తిదాతగా యేసు ప్రదర్శించిన ఘట్టం సాక్షాత్కారం" (సత్యోపదేశం నం. 528).

నేడు, ప్రభువు మొదటిసారిగా అన్యులకు సాక్షాత్కరిస్తున్నాడు. దీని సందేశం, యూదులతో పాటు, దేవుడు సమస్త మానవాళిని ప్రేమిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. ఈ పండుగకు నిజమైన అర్ధం, ఎఫెసీ. 2:14లో చూడవచ్చు: "యూదులను, అన్యులను ఏకమొనర్చుటద్వారా క్రీస్తే మన సమాధానము అయ్యెను. వారిని వేరుచేసి, విరోధులను చేసిన మధ్యగోడను ఆయన తన శరీరముతో ధ్వంసమొనర్చెను." సిమియోను బాలుని హస్తములలోనికి తీసుకొని, "అది అన్యులకు ఎరుకపరచు వెలుగు, నీ ప్రజలగు యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు" (లూకా. 2:32). అనగా, దేవుని రక్షణ అందరికీ అని స్పష్టమగుచున్నది.

నేటి రెండవ పఠనములో ఇలా చదువుచున్నాము; "గతమున మానవులకు ఈ పరమ రహస్యము తెలుపబడలేదు. కాని, నేడు దేవుడు తన ఆత్మద్వారా పవిత్రులగు అపోస్తలులకును ప్రవక్తలకును దీనిని తెలియ జేసెను. అనగా, సువార్త వలన అన్యులకును యూదులతోపాటు దేవుని దీవెనలలో పాలు లభించును. వారును ఈ శరీరము యొక్క అవయవములే. క్రీస్తు యేసుద్వారా దేవుడు చేసిన వాగ్దానములో వారును భాగస్తులగుదురు. ఇదియే ఆ పరమ రహస్యము" (ఎఫెసీ. 3:5-6).

కనుక, నేటి పండుగ, సంఘటన సారాంశం:  క్రీస్తు ప్రతీరోజు అనేక విధాలుగా మనకు సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. మన మనసాక్షిద్వారా, శ్రీసభ బోధనలద్వారా, దేవుని కృపావరములద్వారా, ఇతర వ్యక్తులు, సంఘటనలద్వారా, మనకి దర్శనమిస్తున్నాడు. హేరోదువలె కలతచెంది, క్రీస్తును నిరాకరించుటకు ప్రయత్నింపక, జ్ఞానులవలె, గొల్లలవలె సంతోషముగా, ఆనందముతో ఆయనను సందర్శించాలి, మనలోనికి, మన జీవితములోనికి ఆయనను ఆహ్వానించాలి. రక్షకుడిగా, రాజుగా అంగీకరించాలి. ఆరాధించాలి. మన జీవితాలనే ఆయనకు కానుకగా అర్పించాలి. అలాగే, అందరూ క్రీస్తుద్వారా దేవుని చెంతకు నడిపింప బడాలని, అందరూ రక్షింపబడాలని కోరుకోవాలి. మనలను ద్వేషించే వారిని ప్రేమించాలి. మతం, కులాలు, ప్రాంతాలకు అతీతముగా వ్యవహరించాలి. ఇది నిజముగా ఓ గొప్ప సవాలు!

వాటికన్ II, 'లోకానికి వెలుగు శ్రీసభ' అను అధికార పత్రంలో ఇలా చదువుచున్నాము: దేవుడు నిర్దేశించిన రక్షణ ప్రణాళిక అన్యజనులకు కూడా విస్తరింప జేశాడు. వారు దేవుడు ఉన్నాడనీ ఆయనే సమస్త విశ్వానికి సృష్టికర్త అనీ మనసారా విశ్వసిస్తే చాలు - వారందరు దేవుడనుగ్రహించే రక్షణ భాగ్యాన్ని స్వీకరించడానికి యోగ్యులవుతారు. కొంతమందికి, క్రీస్తు సువార్తా సందేశం గురించిగాని, శ్రీసభ గురించిగాని తెలియదు. అలా తెలియక పోవడానికి పరిస్థితులే కారణంగాని, అందులో వారి దోషమేమీ ఉండదు. అయినా, వారు చిత్తశుద్ధితో దైవసాన్నిధ్యాన్ని, సాన్నిహిత్యాన్ని కోరుకుంటూ, నిజాయితీగా దేవుడి కోసం అన్వేషిస్తూ ఉంటారు. దేవుడు అనుగ్రహించే కృపావర ప్రభావముతో తమ అంతరాత్మల ప్రబోధాలకు విధేయులై ధర్మబద్ధంగా జీవిస్తూ, తమకు తెలియకుండానే దైవసంకల్పాన్ని నెరవేర్చుతూ ఉంటారు. ఇలాంటివారు సైతం, రక్షణభాగ్యం పొందడానికి యోగ్యులు కాగలుగుతారు (నం. 16). కనుక, క్రీస్తు విశ్వాసులుగా, శ్రీసభగా క్రీస్తును గురించి తెలియని వారికి తెలియబరచాలి. సువార్తను బోధించాలి.

నిజమైన, పరిపూర్ణమైన సాక్షాత్కార పండుగను మనం కొనియాడాలి అంటే, మనముకూడా మన మంచి క్రైస్తవ విలువలు కలిగిన జీవితము ద్వారా, ఇతరులకు క్రీస్తును సాక్షాత్కరం చేయగలగాలి.

దైవరాజ్యము, శ్రీసభ
జ్ఞానుల శిశుసందర్శనములో, లోకరాజు జన్మనుగూర్చి ఎరిగి, హేరోదు రాజు కలత చెందాడు. అదే వార్తను ఎరిగిన జ్ఞానులు ఎంతో ఆనందించారు. హేరోదు తన జీవితాంతం హత్యలు చేస్తూ, అన్యాయముగా, స్వార్ధముతో జీవించి యున్నాడు. వ్యక్తిగత కీర్తికోసం, పేరుప్రతిష్టలకోసం రాజ్యాన్ని పరిపాలించాడు. పరలోకమునుండి, గొప్ప అధికారముతో క్రీస్తు లోకరాజుగా ఈ లోకములో ఉద్భవించాడు. హేరోదు భయపడి, క్రీస్తును హంతం చేయకపోతే, తన జీవితం ముగుస్తుందని కలత చెందాడు. మరోవైపు, అన్య దేశాలనుండి వచ్చిన జ్ఞానులు లోకరక్షకునిపట్ల ఎంతగానో సంతోషించారు. లోకరక్షకుడు, రాజునైన క్రీస్తుపైనే వారి జీవితాలు, రాజ్యాలు ఆధారపడి యున్నాయని గ్రహించారు.

క్రీస్తు ఈ లోకమును పాలించుటకు వచ్చెను, అనగా, సర్వమానవాళిని ఆధ్యాత్మికముగా పాలించి దైవరాజ్యమున చేర్చుటకు ఆధ్యాత్మిక రాజుగా వచ్చాడు. ఆయన ఈలోకమున దైవరాజ్యాన్ని స్థాపించాడు. ఆయన బోధనలద్వారా, ఆయన చూపించిన మార్గములద్వారా, ముఖ్యముగా, శ్రీసభద్వారా ఆ దైవరాజ్యం ఈనాటికిని కొనసాగుతూనే ఉంది. దైవరాజ్యములో అందరు భాగస్తులే. కాలగతిలో, అనేకమంది శ్రీసభ రూపముననున్న ఈ దైవరాజ్యాన్ని హేరోదువలె నిర్మూలించాలని ప్రయత్నించారు. వారి ఆధీనములో నుంచుటకు ప్రయత్నించారు. కాని, ఎవరూ నాశనం చేయలేక పోయారు. శ్రీసభ జీవిస్తూనే ఉన్నది, అభివృద్ది చెందుతూనే ఉన్నది, వ్యాప్తి చెందుతూనే ఉన్నది. ఎందుకన, ఈ రాజ్యానికి దేవుడే అధిపతి. ఈ రాజ్యము కలకాలము నిలచును. సర్వము దేవుని ఆధీనములో ఉన్నది.

నక్షత్రమువలె మార్గదర్శకులమవుదాం
"తూర్పుదిక్కున జ్ఞానులు ముందు నడచిన నక్షత్రము మరల కనిపించి వారికి మార్గదర్శినియై, ఆ శిశువు ఉన్న స్థలము పైకి వచ్చి నిలచెను" (మత్త. 2:9). మన అనుదిన జీవితములోకూడా దేవుడు మనకు చూపించే నక్షత్రాల లాంటి గురుతులను, సూచనలను అనుసరించుదాం! మనం చేసే అనుదిన కార్యాలలో దేవున్ని చూడగలగాలి. "దేవుని వాక్యం" (బైబులు) మనకు గొప్ప మార్గచూపరి. బైబులు పఠనం, ధ్యానం, ఆచరణద్వారా, దేవున్ని కనుగొనవచ్చు. అలాగే, పిల్లలకు తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు, ఉపదేశకులు, యేసును పరిచయం చేసే మార్గచూపరులు. ఇతరులు బైబులు బోధకులు, శ్రీసభ బోధనలు, పునీతుల జీవితాలు, దైవార్చన సాంగ్యాలు...

ప్రతీ ఒక్కరం ఓ నక్షత్రమువలె ఉండాలి. ఆ క్రీస్తే నిజమైన నక్షత్రము, వెలుగు. ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ క్రీస్తు ప్రేమకు సదాసాక్షులమై ఉండాలి. ఈలోకానికి అతీతముగా ఇతరులు వారి కన్నులను పైకెత్తి అనంతమైన దైవరాజ్యమువైపు చూచునట్లు ప్రోత్సహించాలి. క్రీస్తురాజ్యములో మనం పౌరులం, ఈ లోకమున ఆయన దూతలం లేదా ప్రతినిధులం.

అందరూ పరిపూర్ణమైన జీవితాన్ని ఆశిస్తారు. కాని, పొందలేకున్నారు. ఎందుకన, ఆ పరిపూర్ణతను వారికున్న సంపదలో, సుఖములో, అధికారములో, మానవ సంబంధాలలో, లోకాశలలో వెదకుచున్నారు. ఇలాంటి వారికి మనము నిజమైన రాజ్యాన్ని, కలకాలము నిలచే రాజ్యాన్ని చూపించగలగాలి.

మనం చేసే ప్రతీపని, మనం మాట్లాడే ప్రతీమాట క్రీస్తును ప్రతిబింబించాలి. మనం మరో క్రీస్తులా మారాలి. ఎలా? మనలను ప్రేరేపించుటకు, మార్గము చూపుటకు పవిత్రాత్మ దేవుని సహాయం కొరకు ప్రార్ధన చేద్దాం. అలాగే, జ్ఞానులకు మార్గదర్శినియై క్రీస్తువద్దకు చేర్చిన నక్షత్రమువలె మనముకూడా మన జీవితాదర్శముద్వారా ఇతరులను క్రీస్తు చెంతకు చేర్చుదాం. ఇతరుల జీవితాలలో నక్షత్రమువలె ప్రకాశించాలంటే, తోటివారిపట్ల ప్రేమ, కరుణ, క్షమను కలిగి యుండాలి. దేవుని కృపానుగ్రహమే మనలను క్రీస్తు వైపుకు నడిపించే నక్షత్రము!

మత్త. 2:1-12 వ్యాఖ్యానం: యేసు దావీదు కుమారుడు, యూద వంశములో జన్మించిన రాజు. తూర్పు దేశాలలో అనాధికాలముగా, దేవుని రాజుగా ఆరాధించడం సాధారణమే! ఇశ్రాయేలు ప్రజలు యావే దేవుని పరలోక రాజుగా ఆరాధించేవారు. "ప్రభువు రాజు... విశ్వ ధాత్రికి అధిపతి" (కీర్తన. 97:1,5). హేరోదురాజు పరిపాలనా కాలమున [దాదాపు క్రీ.పూ. 6వ శతాబ్దములో] యూదయా సీమయందలి బెత్లెహేము నందు యేసు జన్మించెను (మత్త. 2:1). యేసు క్రీస్తు నిజమైన రాజు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన రాజరికం దావీదు వంశమునుండి వచ్చెను. తన జన్మముతో, యేసు యూదయాసీమలోని బెత్లెహేమున (మత్త. 2:1), దేవుని రాజ్యమును స్థాపించాడు.

అప్పుడు తూర్పుదిక్కునుండి జ్ఞానులు యెరూషలేము వచ్చి, "యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింప వచ్చితిమి" (మత్త 2:2) అని అనిరి. జ్ఞానులు ఆ "నక్షత్రమును" ఇశ్రాయేలు దేశమున రాజ జననమునకు సూచనగా గుర్తించారు. ఇది విని హేరోదు రాజు, యెరూషలేము వాసులందరు కలత చెందారు (మత్త. 2:1-3). కారణం, హీరోదులోనున్న భయం. తన రాజ్యాన్ని, అధికారాన్ని ఇంకెవరైనా లాగేసుకుంటారేమోనన్న భయం! ఆ భయముతోనే పసిబిడ్డలను హతమార్చాడు. ఈ భయమే అతన్ని మూర్కునిగా చేసింది. ఏదేమైనప్పటికిని, హేరోదు దేవుని మార్గమును నిజాయితీగా వెదకలేదు. కాని, జ్ఞానులు మాత్రము తూర్పుదిక్కున నక్షత్రమును చూచి, యూదయా సీమలోని బెత్లేహేమునకు అనుసరించారు. వారు నిజాయితీగా దేవుని మార్గమును వెదకి కనుగొన్నారు. జ్ఞానము గలవారు దేవుని వాక్కును ఆలకిస్తారు. దేవుడు జ్ఞానమునకు, ప్రేమకు, ఆనందమునకు, శాంతికి మూలాధారుడు.

మత్తయి సువార్తీకుడు, ముగ్గురు జ్ఞానుల పేర్లను చెప్పలేదు. పశ్చిమ సంప్రదాయమున ఆ ముగురు పేర్లు: గాస్పరు, మెల్కియోరు, బల్తజారు. మత్తయి ఎంతమంది జ్ఞానులు అని కూడా చెప్పలేదు, కాని, మూడు కానుకలు సమర్పించిరని చెప్పాడు.

"జ్ఞానులు నక్షత్రమును చూచినప్పుడెంతో ఆనందించిరి. వారు గృహమున ప్రవేశించి, తల్లి మరియమ్మతో నున్న బిడ్డను చూచి, సాష్టాంగపడి ఆరాధించిరి" (మత్త. 2:10-11). జ్ఞానుల దృష్టి అంతయుకూడా యేసుపై యుండెను. "ఆ శిశువునకు బంగారము (ప్రేమ), సాంబ్రాణి (ప్రార్ధన), పరిమళ ద్రవ్యములను (త్యాగాలు) కానుకలుగా సమర్పించిరి" (మత్త. 2:11). మరియ, యోసేపులు కూడా అనుకోకుండా వచ్చిన జ్ఞానులను సంతోషముతో ఆహ్వానించారు.

ఈ సంఘటనద్వారా, మనము క్రీస్తు కొరకా [జ్ఞానులవలె] లేదా క్రీస్తుకు వ్యతిరేకమా [హేరోదువలె] అన్న నిర్ణయం చేయాలి. భయము, విశ్వాసము మధ్య నిర్ణయం చేయాలి. హేరోదు ఎంతో దగ్గరలో ఉన్నను, నిజరాజును కనుగొనలేక పోయాడు. కారణం: స్వార్ధం, ద్వేషం, అధికారదాహం, కపటము, భయం... జ్ఞానులు ఎంతో దూరములో ఉన్నను, వారి ప్రయాణం ఎంతో ప్రయాసతో కూడినను, వారు, లోకమునకు వెలుగైన  క్రీస్తు రాజును కనుగొన్నారు, ఆరాధించారు. కారణం: నిస్వార్ధం, నిజాయితీ, విశ్వాసం, దృఢసంకల్పం.

జ్ఞానుల ప్రయాణం కేవలం తూర్పు నుండి బెత్లేహేమునకు చేసిన ప్రయాణం మాత్రమే కాదు. వారి ప్రయాణం అన్యమతవాదమునుండి క్రీస్తును ఆరాధించుట! వారు యూదులు కాదు. బైబులు పండితుల ప్రకారం, వారు తూర్పుమత యాజకులు (జోరాస్ట్రియన్ పూజారులు). వారిలో ఒకరు రాజు అయి ఉండవచ్చు (అజెస్ II). ఏదిఏమైనా, వారు అన్యులు అనునది వాస్తవము. వారు నక్షత్రాలను చూసే జ్యోతిష్కులను సంప్రదించి యుండవచ్చు. నేడు ఇంకా ఎంతోమంది మార్గదర్శకాలకోసం జాతకాలు చూసేవారు ఉన్నారు. దేవుడు మన నిజమార్గదర్శకుడు అని వారు తెలుసుకోవాలి. 

మొదటి ఆజ్ఞ బహుదేవతారాధనను ఖండిస్తుంది. జీవాన్ని ఇచ్చేవాడు, చరిత్రలో జోక్యం చేసుకొను "సజీవ దైవం" అసలు దేవుడు (సత్యోపదేశం, నం. 2112). భావిజీవితం గూర్చి ఉబలాటాన్ని వదిలి భవిష్యత్తును దేవుని చేతుల్లో పెట్టడం సరైన క్రైస్తవం అవుతుంది (సత్యోపదేశం, నం. 2115). అన్నిరాకాల సోదెలను - దయ్యాలను ఆశ్రయించడం, మంత్ర ప్రార్ధనలు... మొదలగునవి తిరస్కరించాలి. అవి దేవునికి మాత్రమే ఇవ్వవలసిన గౌరవమర్యాదలకు, ప్రేమపూరిత భావనకు విరుద్ధం (సత్యోపదేశం, నం. 2116).

మన ప్రయాణములో కూడా ప్రతీక్షణం క్రీస్తుకు దగ్గర కావాలి - సంపూర్ణ విశ్వాసం, హృదయ పరివర్తన. మన ప్రయాణములో వేటిపైగాక, కేవలం దేవునిపైనే ఆధారపడాలి.

No comments:

Post a Comment