సామాన్య 33వ ఆదివార వాక్యోపదేశము – A

 సామాన్య 33వ ఆదివార వాక్యోపదేశము – A


దేవుడు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తూ... ఈ లోకమనే చీకటిలో జీవించకుండా... దేవునికి సంబంధించిన జీవితాన్ని జీవిస్తూ... కష్టపడి జీవితంలో ఫలిస్తూ, దేవుడిచ్చే ధన్యతను పొందుకుందాం. ప్రియ విశ్వాసులారా! ఈరోజు పరిశుద్ధ గ్రంథం మనకు అందిస్తున్న దివ్య వాక్యాలను, ధ్యానాంశాలను మన హృదయాల్లోకి స్వీకరిద్దాం. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో... ఏ సత్యాలను మనలను గ్రహించుమని కోరుతున్నారో ధ్యానిద్దాం.

మొదటి పఠనము - ఆదర్శ గృహిణి ( సామెతలు 31:10-13, 19-20, 30-31 )

“యోగ్యురాలైన గృహిణి ఎచట దొరుకును? ఆమె పగడములకంటెను విలువైనది. ఆమె పెనిమిటి ఆమెను విశ్వసించును. ఆమె వలన అతనికి చాల లాభము కలుగును. ఆమె జీవించినంత కాలము అతడికి మేలునేగాని కీడుచేయదు. ఆ గృహిణి నిత్యము ఉన్ని, నారను వడుకును. నిరంతరము ఆసక్తితో పనిచేయును. ఆ గృహిణి తన నూలు తాను వడుకుకొని, తన బట్టలు తాను నేసికొనును. పేదసాదలకు దానధర్మములు చేయుటకు సంసిద్ధముగా ఉండును. తళుకు బెళుకులు నమ్మరానివి. అందము నిలుచునదికాదు. ప్రభువుపట్ల భయభక్తులుగల మహిళ మెచ్చుకోదగినది. ఆ గృహిణి మంచి పనులకుగాను ఆమెను కీర్తించవలయును. ఆమె కృషి పదిమందిలోను ప్రశంసలు పొందునుగాక!”

మొదటి పఠనములో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదర్శవంతమైన గృహిణి గురించిన విశేషాలను తెలియ జేస్తున్నారు. “యోగ్యురాలైన గృహిణి ఎచట దొరుకును? ఆమె పగడములకంటెను విలువైనదని” దేవుని వాక్కు సెలవిస్తోంది. బంగారం, పగడాలు ఎక్కడైనా సులభంగా కొనవచ్చు; కానీ నమ్మకమైన, విశ్వాసపాత్రమైన, బాధ్యత కలిగిన భార్య లేదా తల్లి దొరకడం నిజంగా ఆ కుటుంబానికి దేవుడు ఇచ్చిన అమూల్యమైన వరం.

యోగ్యురాలైన గృహిణిని ఎక్కడా డబ్బుతో కొనలేము. ఆమె ఆ కుటుంబానికి దేవుడు ఇచ్చిన వరమని, ఆ ఇంటి యజమాని మరియు బిడ్డలు భావించాలి. ఆదర్శ గృహిణి ఎప్పుడూ కూడా ఎవరిని నాశనం చేయదు; బదులుగా తన బాధ్యతలను అత్యంత విశ్వాసపాత్రముగా ఉండి నెరవేరుస్తుంది.

ఆదర్శ గృహిణిలో మనం ముఖ్యంగా మూడు సుగుణాలను చూడవచ్చు:

ఒకటి, కష్టపడే తత్వం: ఆదర్శ గృహిణి ఎప్పుడూ సోమరితనంతో కూర్చోదు; ఎప్పుడూ ఆసక్తితో, శ్రద్ధతో కష్టపడి పనిచేస్తుంది. తన బాధ్యతలను నెరవేర్చడానికి ఏమాత్రం బద్దకించదు. నిరంతరం తన కర్తవ్యాన్ని, తన ఇల్లు, భర్త, బిడ్డలను ఎంతో శ్రద్ధతో, ప్రేమతో చూసుకుంటుంది.

రెండు, సహాయ గుణం: పేదసాదలకు దానధర్మాలు చేయడానికి ఆమె ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటుంది. ఆకలితో ఉన్నవారికి అన్నం, దప్పికతో ఉన్నవారికి మంచినీరు ఇచ్చి బడలిక తీరుస్తుంది. కష్టంలో ఉన్నవారికి తన సహాయ హస్తాన్ని చాపుతూ, క్రీస్తు ప్రేమను తన కుటుంబ సభ్యులకు, సాటివారికి తన చేతలద్వారా చూపుతుంది.

మూడు, దైవభయమే అసలైన అందం: ఈ లోకపు తళుకు బెళుకులకు ఆమె తన సమయాన్ని వృధా చేయదు. ఈ శరీరం సౌందర్యం, యౌవనం ఈ లోకంలో ఉన్నంతవరకే అని ఆమెకు బాగా తెలుసు. అందుకే ఎల్లప్పుడూ ప్రభువు పట్ల భయభక్తులు కలిగి, ప్రభువు మెచ్చుకోదగిన పవిత్ర జీవితాన్ని గడుపుతుంది.

ఆమె చేసే కృషి పదిమందిలో ప్రశంసలు పొందుకుంటుంది. అంటే, అంత బాధ్యతాయుతంగా ఆదర్శ గృహిణి జీవిస్తుందని మనం గ్రహించాలి. పూర్తిగా దేవుని భక్తిలో, విశ్వాసములో, శక్తివంచన లేకుండా శ్రమతో కూడిన జీవితాన్ని, దయతో కూడిన మనస్తత్వాన్ని కలిగి ఉంటూ, భార్యగా, తల్లిగా, సహనశీలిగా, దేవుని అపారమైన ఆశీర్వాదములను పొందుకుంటుంది.

ప్రియ విశ్వాసులారా! ఈ ఆదర్శ గృహిణికి ఉన్నటువంటి సుగుణాలు మన అందరిలోనూ ఉండాలి. దేవుడు మన యెడల కలిగి ఉన్న చిత్తానికి తగినట్లుగా, దేవుడు మనకు అప్పగించిన ప్రతీ బాధ్యతను అత్యంత నిబద్ధతతో నెరవేర్చాలి.

ఆదర్శ గృహిణి కుటుంబ బాధ్యతలను దేవుడిచ్చిన బాధ్యతలుగా భావించి, నెరవేర్చింది తప్ప ఎప్పుడూ సోమరితనంతో కూర్చోలేదు. కష్టపడి పనిచేసి, తన ఇంటిని, భర్తను, బిడ్డలను శ్రద్ధతో ప్రేమగా చూసుకుంది. చివరి వరకు తన కుటుంబం యెడల తాను నిర్వర్తించవలసిన కర్తవ్యాన్ని ఎంతో నమ్మకంగా నెరవేర్చింది.

దేవునికి ఇష్టమైన కార్యాలను ఈ సృష్టిలో జన్మించిన మనమందరము చేయాలి. కుటుంబం పట్ల బాధ్యతతో వ్యవహరించాలి. తల్లిగా, భార్యగా, తండ్రిగా, మన బాధ్యతలను శక్తివంచన లేకుండా నెరవేర్చాలి. పేదసాదలకు దానధర్మాలు చేయాలి. సమయాన్ని వృధా చేయకుండా, కుటుంబం యెడల బాధ్యత వహించాలి. ఆదర్శ గృహిణి ఏ విధంగా తన కుటుంబాన్ని ప్రేమతో కట్టుకుంటుందో, అదేవిధంగా దేవుడు మనకు ఇచ్చిన ప్రత్యేక బాధ్యతలను మనం స్వీకరించి నెరవేర్చాలి.

మనందరం కూడా పరలోక రాజ్యానికి చేరుకోవాలి. ప్రభువు మనకు ఒక అద్భుతమన ఉదాహరణగా ‘ఆదర్శ గృహిణిని’ చూపించారు. బాధ్యత కలిగిన స్త్రీగా ఏ విధంగా జీవించిందో, మనల్ని కూడా ఆ విధంగానే బాధ్యతతో నడుచుకోమని చెప్తున్నారు.

అందుకే నేటి మొదటి పఠనములో ‘ఆదర్శ గృహిణి’ ఉదాహరణను మనకు ఇవ్వబడింది. మనం కూడా మంచి లక్షణాలను కలిగి, ఆదర్శ గృహిణికి కలిగిన బాధ్యతలు మనమందరము కలిగి జీవిద్దాం. పరలోక ధన్యతను ప్రశంసలను పొందుకొని పరలోకమున ఆనందిద్దాం.

రెండవ పఠనము – ప్రభువు రాకడకు సంసిద్ధత: (పునీత పౌలు గారు తెస్సలోనికులకు రాసిన మొదటి లేఖ 5:1-6)

“సోదరులారా! ఈ విషయములు సంభవించు కాలములను గూర్చిగాని నిర్ణీత సమయములను గూర్చిగాని మీకు వ్రాయనక్కర లేదు. ఏలయన, ప్రభువు దినము రాత్రివేళ దొంగవలె వచ్చునని మీకు తెలియునుగదా!" "అంతయు ప్రశాంతముగ, సురక్షితముగ ఉన్నది" అని ప్రజలు అనుకొనునపుడే అకస్మాత్తుగా వారికి నాశనము సంభవించును. అది గర్భిణియగు స్త్రీ ప్రసవవేదనవలె వచ్చును. వారు దాని నుండి తప్పించుకొనలేరు. కాని సోదరులారా! మీరు చీకటియందులేరు. కనుక, దొంగవలె ఆ దినము మీకు ఆశ్చర్యము గొలుపగూడదు. మీరు అందరు వెలుగు కుమారులును, పగటి కుమారులునై వున్నారు. మనము రాత్రికిగాని, చీకటికిగాని సంబంధించినవారము కాము. కనుక ఇతరుల వలె, మనము నిద్రించుచుండరాదు. మేల్కొని జాగరూకులమై ఉండవలెను.”

ఇప్పుడు రెండవ పఠనమును ధ్యానించి, దేవుడు మనకు ఇస్తున్న సందేశాన్ని స్వీకరించి, జీవించడానికి ప్రయత్నం చేద్దాం!

ప్రియ విశ్వాసులారా! పునీత పౌలు గారు మనము పరలోక రాజ్యాన్ని ఏ విధంగా చేరుకోవాలో, దానికోసం ఏ విధంగా జీవించాలో చక్కటి హెచ్చరిక చేస్తున్నారు. దేవుని తుది తీర్పునకు ముందు దేవుని రెండవ రాకడ సంభవిస్తుంది. మానవాళికి తీర్పు తీర్చడానికి క్రీస్తు ప్రభువు పరలోకం నుండి భూమికి తిరిగి వేంచేస్తారు.

కాబట్టి, ఆ ప్రభువుని రాకడ కొరకు మనము ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. ప్రభువు రాకడ ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికి తెలియదు. “ఆ దినము, రాత్రివేళ దొంగవలె వచ్చును” అని దేవుని వాక్కు మనల్ని హెచ్చరిస్తోంది. అందుకే దైవరాజ్యానికి వారసులు కావడానికి మన ప్రవర్తనను ఎప్పుడూ సరిచేసుకోవాలి. మనం చేసిన తప్పులను, పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని సరిచేసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి.

‘అంతా ప్రశాంతంగా, సురక్షితముగా ఉన్నదని’ అం లోకం భావించే క్షణంలోనే, మన జీవితాలలో అకస్మాత్తుగా బాధలు కష్టాలు సంభవించినట్లే, ప్రభువుదినం కూడా రావొచ్చు! కాబట్టి, మన జీవితములో ఎలాంటి ఏమరపాటు అశ్రద్ధకూ చోటు ఇవ్వకూడదు. అందుకే ఎప్పుడూ జాగరుకులమై జీవించాలి. “ప్రభువుని రాకడ గర్భిణీయగు స్త్రీ ప్రసవవేదనవలె వచ్చును” అని దేవుని వాక్కు తెలుపుతుంది. ‘ఏముందిలే, ఇంకా చాలా సమయం ఉందిలే’ అని నిర్లక్ష్యంతో జీవిస్తే, అది మన ఆత్మలకు చాలా ప్రమాదకరమని గ్రహిద్దాం!

ఏమరపాటు, అశ్రద్ధ కలిగి జీవించే విధంగా మన జీవితాలు ఉంటే, అది సైతానుకు లొంగిన జీవితాలని మనం గ్రహించాలి. మనము చీకటిలో లేము. వెలుగు బిడ్డలం. పగటి బిడ్డలం. కనుక, ఇతరుల వలె నిద్రించరాదు. ఎల్లప్పుడూ మేల్కొని జాగరుకులమై ఉండాలి. అనుదిన జీవితంలో మనల్ని మనం ఇలా ప్రశ్నించుకుందాం: దేవుని చిత్తాన్ని నా జీవితంలో నేను నెరవేరుస్తున్నానా? దేవునికి తగినట్లుగా నేను జీవిస్తున్నానా? నా వలె నా పొరుగు వారిని నేను ప్రేమిస్తున్నానా? నా జీవితం ఎవరు చూడలేని చీకటి జీవితం వలే ఉందా? లేక పగటి వెలుగు వలే పవిత్రంగా ఉందా? నా జీవితాన్ని నేను త్రొంగి చూసుకున్నప్పుడు, నాకు సిగ్గుగా అనిపిస్తోందా? లేక దేవుని యందు భయభక్తులతో, విశ్వాసముతో, నా జీవితం పవిత్రంగా ఉందా? అని, నిత్యం ఆత్మపరిశీలన చేసుకొని జీవిద్దాం. ఈ లోక మాయాజాలంలో పడకుండా, ఎల్లప్పుడూ వాస్తవంలో దైవరాజ్యానికి చేరుకోవడానికి, దేవుని వాక్కును అనుసరిస్తూ, నెరవేరుస్తూ, తపనతో జీవిద్దాం.

సువిశేషము - సేవకుని కర్తవ్యము - నిర్వహణ విధానము (పునీత మత్తయి గారు వ్రాసిన సువార్త 25:14-30)

“ఒకడు దూరదేశమునకు ప్రయాణమైపోవుచు సేవకులను పిలిచి, తన ఆస్తిని వారికి అప్పగించెను. వారివారి సామర్థ్యమును బట్టి ఒకనికి ఐదులక్షల వరహాలను, మరియొకనికి రెండు లక్షల వరహాలను, ఇంకొకనికి ఒకలక్ష వరహాలను ఇచ్చి వెళ్ళెను. ఐదులక్షల వరహాలను పొందిన వాడు వెంటనే వెళ్ళి వ్యాపారముచేసి మరియైదులక్షలను సంపాదించెను. అట్లే రెండులక్షల వరహాలను పొందినవాడు మరి రెండు లక్షలను సంపాదించెను. కాని ఒక లక్ష వరహాలను పొందినవాడు వెళ్ళి నేలను త్రవ్వి తన యజమానుని ద్రవ్యమును దాచెను.” “చాలకాలము గడిచిన తరువాత ఆ సేవకుల యజమానుడు తిరిగివచ్చి, వారితో లెక్కలు సరిచూచుకొననారంభించెను. సేవకులతో ‘ఆ లక్ష వరహాలను వీనినుండి తీసివేసి పదిలక్షల వరహాలు కలవానికి ఈయుడు. ఉన్న ప్రతివానికి ఇంకను ఈయబడును. అపుడు అతనికి సమృద్ధికలుగును. లేనివాని నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును. ఈ నిష్ప్రయోజకుడగు సేవకుని వెలుపలి చీకటిలోనికి త్రోసివేయుడు. అచట జనులు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు’ అని పలికెను.”

‘సేవకుని కర్తవ్యము - నిర్వహణ విధానమును’ గూర్చి దేవుడు తెలిపే మర్మాలను తెలుసుకొని, దేవుడు మెచ్చే జీవితాలను జీవించడానికి ప్రయత్నిద్దాం.

యేసు ప్రభువు మనకు తెలుపుతున్న ఉపమానములోని గూడార్థాలను దైవజ్ఞానము ద్వారా గ్రహిద్దాం.

ఒక యజమాని దూర దేశమునకు ప్రయాణమైపోవుచూ, సేవకులను పిలిచి, తన ఆస్తిని వారికి అప్పగించెను. వారివారి సామర్థ్యములను బట్టి ఒకనికి ఐదులక్షల వరహాలను మరియొకనికి రెండులక్షల వరహాలను ఇంకొకరికి ఒకలక్ష వరహాలను ఇచ్చి వెళ్లాడు.

ఐతే, ఐదు లక్షల పొందినవాడు, రెండు లక్షల పొందిన వాడు వెంటనే వెళ్లి వ్యాపారం చేసి తమ సంపదను రెట్టింపు చేసుకున్నారు. యజమాని ఇచ్చిన సొమ్మును వారు ఎక్కడా దాచుకోలేదు, ‘ఏదైనా వ్యాపారం చేస్తే నష్టం వస్తుందేమో!’ అని వారు భయపడలేదు. బదులుగా, యజమాని తమపై ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగా, ఇచ్చిన సొమ్మును మరింతగా అభివృద్ధి చేసుకున్నారు.

కానీ ఒక లక్ష వరహాలను పొందిన వాడు భయపడ్డాడు. సోమరిగా ఉండిపోయాడు. శక్తివంచన లేకుండా, కష్టపడి జీవించడానికి సందేహించి, పూర్తిగా సోమరితనానికి లోనయ్యాడు. తన స్వశక్తి పట్ల, తనను నమ్మిన దేవుని పట్ల ఎలాంటి విశ్వాసము లేకుండా జీవించాడు. అందుకే, ఆ లక్ష వరహాలను నేలను త్రవ్వి ఎవరికీ కనపడకుండా దాచి పెట్టాడు.

అలా చాలా కాలం గడచిన తర్వాత, యజమాని తిరిగి వచ్చాడు. ఆ ముగ్గురిని పిలిచి లెక్కలు సరిచూడమన్నాడు. నమ్మకమైన ఆ ఇద్దరి సేవకులతో, “మంచిది నీవు ఉత్తముడవు, నమ్మినబంటువు” అని, విడివిడిగా ఐదులక్షల వరహాలను ఇచ్చిన వానినీ, రెండు లక్షల వరహాలను ఇచ్చిన వానినీ, ఇద్దరినీ మెచ్చుకున్నాడు. “నీవు ఉత్తముడవు. నమ్మినబంటువు. స్వల్ప విషయముల యందు శ్రద్ధ వహించితివి, కనుక అనేక విషయములను నీకు అప్పగింతను. నీ యజమానుని ఆనందములో నీవు పాలుపంచుకొనుము” అని వారిని ప్రశంసించి సత్కరించాడు.

సోమరిని చూసి, “ఓరీ దుష్ట సేవకా! సోమరీ! నేను నాటనిచోట పంట కోయువాడననియు, విత్తనములు చల్లనిచోట పంట కూర్చుకొనువాడననియు నీవు ఎరుగుదువు కదా! అట్లయిన నా ధనమును వడ్డీకి ఇచ్చి ఉండవలసినది. నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సహా సొమ్ము పుచ్చుకొని యుందునుగదా! అని పలికి, సేవకులతో ఆ లక్ష వరహాలను వీని నుండి తీసుకొని పది లక్షల వరహాలు కలిగిన వానికి ఈయుడు. ఉన్న ప్రతి వానికి ఇంకనూ ఈయబడును. అప్పుడు అతనికి సమృద్ధి కలుగును. లేనివాని నుండి వానికి ఉన్నది తీసివేయబడును. ఈ నిష్ప్రయోజకుడగు సేవకుని వెలుపలి చీకటిలోనికి త్రోసివేయుడు. అచట జనులు ఏడ్చుచు పండ్లు కొరుకు కొందరు” అని పలికెను.

ప్రియ విశ్వాసులారా! దేవుడు ప్రతి ఒక్కరికీ తగిన బాధ్యతలను అప్పగించారు. నమ్మకమైన సేవకులు యజమాని ఇచ్చిన వరాలను రెట్టింపు చేసుకున్నారు. ఐదు లక్షల వరహాలను పొందిన వాడు, మరీ అయిదు సంపాదించాడు. రెండు లక్షల వరహాలను పొందినవాడు మరి రెండు సంపాదించాడు. వారు సోమరితనానికి తావునివ్వలేదు; కష్టపడి వ్యాపారం చేసి, యజమాని ఇచ్చిన సంపదను మరింత వృద్ధి చేసుకున్నారు.

అదేవిధంగా, మొదటి పఠనంలోని ఆదర్శ గృహిణి కూడా నిరంతరం ఆసక్తితో, బాధ్యతతో, ఇంటి పని చేసుకుంటూ, సాటి వారికి సహాయం చేయాలనే ప్రేమను కలిగి ఉంది. తన కుటుంబానికి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటుంది.

కాని, సోమరి అయిన సేవకుడు ప్రతిదానికీ భయపడ్డాడు. ‘వ్యాపారం చేస్తే నష్టపోతానేమో’ అనే అభద్రతా భావంతో, యజమాని ఇచ్చిన డబ్బును భూమిలో పాతిపెట్టాడు. అతనిలో కష్టపడి పనిచేయాలనే సంకల్పం లేదు; ‘మనం కష్టపడితే ప్రతిఫలం దేవుడే ఇస్తాడు’ అని దేవునిపై భారం వేయలేదు. అలా, లక్ష వరహాలు తీసుకున్న ఆ సేవకుడు పూర్తిగా నిర్లక్ష్యంతో, సోమరితనంతో తన జీవితాన్ని గడిపాడు.

ప్రియ విశ్వాసులారా! మనం లక్ష వరహాలు పుచ్చుకొని, దానిని భూమిలో పాతిపెట్టిన ఆ సోమరి సేవకునివలె ఎప్పుడూ ప్రవర్తించకూడదు. మొదటి ఇద్దరు సేవకులు, ఏ విధంగా శ్రమపడి, యజమానిని గౌరవించి, ఆయన ఇచ్చిన సంపదను రెట్టింపు చేసుకున్నారో, అలాగే మనం కూడా దేవుడు మనకు ప్రసాదించిన ఈ జీవితం ద్వారా, ఆయన్ని మహిమపరుస్తూ, ఆయనలో కట్టబడి ఫలించాలి. దేవుడు మనకు అనుగ్రహించిన జ్ఞానంతో, పదవితో, గౌరవముతో, మరియు ప్రత్యేక నైపుణ్యాలతో, కష్టపడి జీవిస్తూ ఆధ్యాత్మికంగానూ, లౌకికంగానూ ఎదగాలి ఎదగాలి.

దేవుని రెండవ రాకడ దినమున జరిగే తీర్పు కొరకు మనమందరము సిద్ధపడాలి. ‘ఆయన వస్తాడులే, తీర్పు జరుగుతుందిలే’ అని నిర్లక్ష్యంతో ప్రవర్తిస్తే, మనకు ముప్పు తప్పదు. దేవునికి నమ్మకమైన సేవకులుగా ప్రవర్తించి, మన యజమానుడైన, పరలోక తండ్రియైన దేవునిచే గుర్తింపబడదాం.

“మంచిది నీవు ఉత్తముడవు / ఉత్తమురాలవు! నీవు నాకు నమ్మకమైన వాడవు. నా వాక్కు యందు ఎంతో శ్రద్ధ వహించి, దానిని పాటించి నెరవేర్చావు; కనుక, నీకు పరలోక రాజ్యమున మరింత గౌరవమును, సత్కారమును నీకు దయచేస్తాను. నేను నీకు అప్పగించిన బాధ్యతలను ఎంతో నమ్మకంగా నిర్వహించావు” అని దేవుడు రెండవ రాకడ తీర్పు దినమున మనల్ని అభినందించి సత్కరించాలి.

దేవుని చిత్తాన్ని, ఆయన అప్పగించిన బాధ్యతలను స్వీకరించి నెరవేర్చకుండా, సోమరి వలె దేవునికి విరుద్ధంగా జీవిస్తే, దేవుడు మనల్ని కూడా, “ఓరీ దుష్ట సేవకుడా!” అని పిలిచే పరిస్థితి వస్తుంది. “నీవు నిష్ప్రయోజనమైన జీవితాన్ని జీవించావు, కనుక నీకు ప్రకాశవంతమైన పరలోక రాజ్యమున చోటు లేదు. వెలుపలి చీకటిలోనికిం, నరకంలోనికి త్రోయబడతావు” అని తన దూతల ద్వారా మనలను హెచ్చరిస్తున్నారు.

కనుక ప్రతి ఒక్కరము జాగరుకులమై జీవిద్దాం. మనం చీకటికి సంబంధించిన వారము కాదు. వెలుగునకు సంబంధించిన వారము అని గ్రహిద్దాం. చీకటి పాపాలను, దేవునికి ఇష్టము లేని అనేక చీకటి కార్యాలను, ద్వేషాలను, ఈర్షలను పూర్తిగా విడిచిపెట్టాలి. సాటి మనుషులలో దేవుని రూపాన్ని చూడగలగాలి. సాటివారికి సహాయం చేయాలి. పేదలకు దానధర్మాలు చేయాలి.

దేవుని మెప్పించే సత్క్రియలు మనం చేసినప్పుడే, దేవుడు మనల్ని తన ప్రియ కుమారుని ద్వారా పరలోకమునకు ఆహ్వానించి చేర్చుకుంటారు. ఈ సత్యాన్ని గ్రహించి, ఇప్పటికైనా సంపూర్ణ పరివర్తన చెందుదాం. దేవుడు మనకిచ్చిన ప్రత్యేక బాధ్యతలను, కష్టపడి నెరవేర్చి, దేవుని సన్నిధిలో ఆరని జ్యోతులమై పరలోకమున నిత్యం వెలుగొందుదాం.

ముగింపు

ప్రియ విశ్వాసులారా! దేవుడు ఈరోజు మనకు ఇస్తున్న సందేశం నుండి, మనమేం నేర్చుకోవాలి? ఆదర్శ గృహిణి వలే బాధ్యతాయుతంగా, శ్రద్ధగా ప్రవర్తిద్దాం. నమ్మకమైన సేవకుల వలె దేవునికి ప్రీతిపాత్రముగా, దేవుని చిత్తానికి తగినట్లుగా, మనలో ప్రతి ఒక్కరికి దేవుడు అప్పగించిన బాధ్యతలను, భక్తిశ్రద్ధలతో నెరవేర్చాలి. ఆ విధంగా జీవించడానికి ఇప్పటికైనా మేలుకుందాం! పునీత పౌలు గారు హెచ్చరిస్తున్నట్లుగా, ఎల్లప్పుడూ దేవుని రాకకై సిద్ధంగా ఉందాం. మారుమనస్సు పొందుటకై ఏమాత్రం ఆలస్యం చేయవద్దు. చీకటిలో ఉన్న మన జీవితాలను వెలుగులోనికి మరల్చుకుందాం. నిత్యము దేవుని పట్ల భయభక్తులను, దృఢమైన విశ్వాసమును కలిగి జీవిద్దాం. దేవాది దేవునికి నిరంతరం ప్రార్థించుకొందాం. దేవుడు రాక రోజున ఎత్తబడే సమూహంలో, మనలో ప్రతి ఒక్కరము ఉండేలా, అనుదిన ఆత్మపరిశీలనతో జీవిద్దాం. ఏ రోజుకు ఆ రోజు, మనం చేసిన పొరపాట్లను, అపరాధములను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ, మనల్ని మనం సరిదిద్దుకుందాం.

పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమునకు, మహిమ కలుగునుగాక! ఆమెన్.

No comments:

Post a Comment