పునీత స్కాట్లాండు మర్గరీతమ్మ, 16 నవంబరు
క్రీ.శ.
1046వ సం.లో, ఇంగ్లాండు రాజ కుమారుడు అయిన ఎడ్వర్డు మరియు అగతమ్మలకు హంగేరీ దేశంలో
జన్మించారు. తండ్రి ఎడ్వర్డు, ఇంగ్లాండు సింహాసనాన్ని
కోల్పోయి హంగేరీలో ప్రవాస జీవితం గడుపుతున్నప్పుడు జన్మించారు. హంగేరీ రాజు 'పునీత స్టీఫెన్' ఆస్థానంలోని గొప్ప ఆధ్యాత్మిక
వాతావరణం ఆమె బాల్యంపై ఎంతో ప్రభావం చూపింది. ఆ తర్వాత ‘నార్మన్ దండయాత్రల’ కారణంగా
ఆమె కుటుంబం స్కాట్లాండుకు పారిపోయి రావాల్సి వచ్చింది. ఈ కష్టాలే ఆమెను
స్కాట్లాండు రాజు 3వ మాల్కంకు దగ్గర చేశాయి.
24 సం.ల
ప్రాయములో, స్కాట్లాండు రాజైన మాల్కంను వివాహమాడారు. భర్త కోపతాపాలకు గురికాకుండా,
మంచి ఆలోచనలు కలిగి ఉండి, మంచి పరిపాలన చేయడానికి తోడ్పడింది. సత్యవేదాన్ని, మంచి విద్యను
ప్రజలకు అందుబాటులోనికి తెచ్చారు. మంచి సంస్కృతి, దాతృత్వ కార్యాలను చేయగలిగేలా
చేసారు. మర్గరీతమ్మ సూచనల మేరకు అనేక దేవాలయాలు నిర్మించబడ్డాయి. డన్‌ఫెర్మ్‌లైన్
ఆశ్రమం ఆమె నిర్మించిన దేవాలయాలలో అత్యంత ముఖ్యమైనది ‘డన్‌ఫెర్మ్‌లైన్
బెనెడిక్టైన్ మఠం’. ఆమె మరణించిన తర్వాత
ఇక్కడే సమాధి చేయబడ్డారు.
మర్గరీతమ్మకు
ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారిని విశ్వాసంలోను, ప్రేమలోను, క్రమశిక్షణలోను
పెంచారు. వారిలో పట్టుదల, ప్రార్ధన, పేదలపట్ల ఆదరణ అను లక్షణాలను పెంపొందించింది.
పాపమునకు లోబడుటకంటే, మరణించుట మేలు అని బోధించింది. త్రిత్వైక దేవుని పూజించాలని,
మరియతల్లి పట్ల గౌరవ మర్యాదలు చూపాలని చెప్పారు. పేదలపట్ల ఆదరణ కలిగి,
దిక్కులేనివారికి సంరక్షణ కల్పించాలని బోధించారు. కతోలిక విశ్వాసాన్ని కాపాడాలని
బోధించారు. ఆరుగురు కుమారులు ఇద్దరు గురువులయ్యారు. ముగ్గురు రాజులై దేశాన్ని
తెలివిగా, సుభిక్షంగా పరిపాలించారు. తల్లి అడుగుజాడల్లో నడిచి స్కాట్లాండులో గొప్ప
సంస్కరణలు తెచ్చారు. ఒక కుమార్తె ఇంగ్లాండు 1వ హెన్రి రాజును వివాహమాడారు. ఆమెనే మెటిల్డా!
గొప్ప దైవభక్తి పరురాలు. ఇంగ్లాండు చరిత్రలో మంచి కీర్తిప్రతిష్టలతో గౌరవం
అందుకున్నారు.
ఈవిధంగా
మర్గరీతమ్మ క్రైస్తవ సద్గుణాలకు ఆదర్శకమయ్యారు. ఆమె వ్యక్తిగత పవిత్రత,
భక్తివిశ్వాసాలు, దీనత, దానగుణం మొదలగు సుగుణాలు స్కాట్లాండు ప్రజల్లో క్రైస్తవ
విలువలు, సంస్కృతి, అభివృద్దికి ఎంతగానో ప్రేరేపణ కలిగించాయి. దేవాలయ సలహా సంఘం
సమావేశాలలో కూడా చురుకుగా పాల్గొనేవారు. రోమను పూజా విధానాలకు ప్రాధాన్యత
ఇచ్చేవారు. అనేక దేవాలయాలు, మఠములు, సేవాసంస్థల ఏర్పాటుకు ధారాళముగా విరాళాలు
ఇచ్చారు. స్కాట్లాండులో అమానుష నిర్భంద బానిస విధానాలను రద్దు చేయించారు.
పునీత మర్గరీతమ్మగారు
ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేసేవారు. ప్రార్ధన చేసుకోవడమే కాదు,
ప్రార్ధన చేయడం కూడా ఇతరులకు నేర్పించేవారు. భోజనం ముందు, తర్వాత ప్రార్థనలు
తప్పనిసరిగా చెప్పేవారు. పేదలకు స్వయముగా సువార్తను బోధించారు. ప్రతీ రోజు 300ల
మంది పేదలకు అన్నదానం జరిపించారు.
క్రీ.శ.
1093వ సం.ములో, ఆమె భర్త రాజు మాల్కం మరియు పెద్ద కుమారుడు ఎడ్వర్డు యుద్ధంలో
మరణించారన్న వార్త విని, అప్పటికే అనారోగ్యంతో
ఉన్న మర్గరీతమ్మ ఆ బాధను తట్టుకోలేక, దేవునికి కృతజ్ఞతలు
చెప్పుకుంటూ, ప్రార్థన చేస్తూ, నవంబరు 16న మరణించి పరలోక రాజ్యం చేరుకున్నారు.
పరిశుద్ధ
గ్రంథాలంటే పునీత మర్గరీతమ్మకు ప్రాణం. ఆమె నిత్యం పఠించే, రత్నాలు పొదిగిన అత్యంత విలువైన సువార్త గ్రంథం
అనుకోకుండా ఒకసారి నదిలో పడిపోయింది. ఎంతో వెదికిన తర్వాత ఆ పుస్తకం
దొరికినప్పటికీ, నీటిలో పూర్తిగా తడిసినా అందులోని అక్షరాలు
చెరిగిపోకపోగా, ఏమాత్రం నష్టం వాటిల్లలేదు. దేవుని వాక్యం
పట్ల ఆమె చూపిన ప్రగాఢ భక్తికి ఇదొక దైవిక నిదర్శనమని, ఆమె
జీవితంలో జరిగిన అద్భుతాలలో ఇదొకటిగా భక్తులు గాఢంగా విశ్వసిస్తారు.
క్రీ.శ.
1250వ సం.లో నాల్గవ ఇన్నోసెంట్ పోపుగారిచే పునీత పట్టా పొందుకున్నారు. క్రీ.శ. 1673వ
సం.లో పదవ క్లెమెంటు పోపుగారు స్కాట్లాండు దేశ పాలక పునీతురాలుగా ప్రకటించారు.

No comments:
Post a Comment