లియో XIV
త్రికాల ప్రార్ధన
పు. పేతురు బసిలికా, రోము నగరము
ఆదివారము, 6 జూలై 2025
ప్రియ
సహోదరీ సహోదరులారా! శుభోదయం!
ఈనాటి సువార్త (లూకా 10:1-12, 17-20) మనం అందరం
చేయాల్సిన సేవ ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. మనం ఎవరమైనా, ఏ
వృత్తిలో ఉన్నా, ప్రభువు మనల్ని ఉంచిన ప్రతి ప్రత్యేక
పరిస్థితిలోనూ ఈ సేవను నిర్వర్తించాలి.
యేసు డెబ్బై రెండు మంది శిష్యులను పంపారు (10:1). ఈ సంఖ్య సువార్త ప్రపంచంలోని ప్రజలందరికీ
ఉద్దేశించబడింది అని సూచిస్తుంది. ఇది దేవుని హృదయం ఎంత విశాలమైనదో, ఆయన పంట ఎంత విస్తారమైనదో తెలియజేస్తుంది. నిజానికి, దేవుడు తన బిడ్డలందరూ ఆయన ప్రేమను తెలుసుకొని, రక్షించబడాలని లోకంలో
నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు.
అదే సమయంలో, యేసు ఇలా అన్నారు, “పంట
విస్తారము కాని పనివారు తక్కువ. కనుక, తన పంటపొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని
ప్రార్ధింపుడు” (10:2).
ఒకవైపు, దేవుడు విత్తనం వెదజల్లే
వ్యక్తిలా, చరిత్ర పొడవునా లోకంలోనికి ఉదారంగా వెళ్లి,
ప్రజల హృదయాలలో అనంతమైన దాని కోసం, పరిపూర్ణమైన
జీవితం కోసం, విముక్తిని ప్రసాదించే మోక్షం కోసం ఒక కోరికను
నాటాడు. అందుకే పంట విస్తారముగా ఉన్నది. దేవుని రాజ్యం
భూమిలో విత్తనంలా పెరుగుతుంది. నేటి స్త్రీ పురుషులు ఎన్నో విషయాలతో
సతమతమవుతున్నట్లు కనిపించినప్పటికీ, వారు ఇప్పటికీ గొప్ప
సత్యాన్ని ఆకాంక్షిస్తున్నారు. వారు తమ జీవితాలకు మరింత పరిపూర్ణమైన అర్థాన్ని వెతుకుతున్నారు,
న్యాయాన్ని కోరుకుంటున్నారు, మరియు శాశ్వత
జీవితం పట్ల ఒక వాంఛను కలిగి ఉన్నారు.
మరోవైపు, ప్రభువు విత్తిన పొలములోకి
వెళ్ళడానికి పనివారు తక్కువ. కోత కోయడానికి సిద్ధంగా ఉన్న
మంచి ధాన్యాన్ని గుర్తించగలిగిన వారు కూడా తక్కువే (యోహాను 4:35-38 చూడండి). మన జీవితాల్లోనూ, మానవజాతి చరిత్రలోనూ గొప్ప
కార్యాలు చేయాలని ప్రభువు కోరుకుంటున్నారు. అయినప్పటికీ,
ఈ సత్యాన్ని గ్రహించి, స్వీకరించి, ఇతరులకు ప్రకటించేవారు చాలా తక్కువ.
ప్రియ సహోదరీ సహోదరులారా! శ్రీసభకు, మరియు ఈ లోకానికి కేవలం మతపరమైన విధులను బాహ్య లాంఛనంలా నెరవేర్చే వారు
అవసరం లేదు. మనకు సేవ చేయాలనే ఆసక్తి ఉన్న పనివారు, ప్రతి చోటా
దేవుని రాజ్యాన్ని ప్రకటించగలిగే ప్రేమగల శిష్యులు అవసరం. అడపాదడపా ఏదో ఒక మతపరమైన
భావనతోనో, అప్పుడప్పుడు జరిగే కార్యక్రమాలలో పాల్గొనే “అప్పుడప్పుడు
వచ్చే క్రైస్తవులు” (ఇంటర్‌మిటెంట్ క్రైస్తవులు) ఎక్కువగానే ఉండొచ్చు! అయితే, ప్రతిరోజూ దేవుని పొలములో
శ్రమించడానికి, తమ హృదయాలలో సువార్త విత్తనాన్ని పండించి,
ఆపై తమ కుటుంబాలలో, పని ప్రదేశాలలో, విద్యా సంస్థలలో, సామాజిక వాతావరణాలలో, మరియు అవసరమైన వారితో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్న పనివారు మాత్రం చాలా
తక్కువ.
దీనిని సాధించడానికి, మతపరమైన ప్రణాళికల
గురించి ఎక్కువ సిద్ధాంతపరమైన ఆలోచనలు మనకు అవసరం లేదు. దానికి బదులుగా, మనం తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమాని అయిన ప్రభువును
ప్రార్థించాలి. ప్రభువుతో మన సంబంధానికి, ఆయనతో మన సంభాషణను పెంపొందించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు ఆయన
మనల్ని తన సేవకులుగా చేసి, తన రాజ్యాన్ని చాటిచెప్పడానికి ప్రపంచ
పొలములోకి పంపుతారు.
పరిశుద్ధ మరియ మాతను వేడుకుందాం. రక్షణ కార్యంలో పాలుపంచుకోవడానికి ఆమె
ఉదారంగా ‘అవును’ అని అంగీకరించింది. ఆమె మన కోసం మధ్యవర్తిత్వం వహించి, ప్రభువును అనుసరించే మార్గంలో మనకు తోడుగా ఉండాలని ప్రార్థిద్దాం.
తద్వారా మనం కూడా దేవుని రాజ్యంలో సంతోషకరమైన సేవకులుగా మారగలుగుతాం.
త్రికాల ప్రార్ధన తర్వాత
ప్రియ
సహోదరీ సహోదరులారా!
రోములోని విశ్వాసులకు, అలాగే ఇటలీ, ఇంకా వివిధ దేశాల నుండి విచ్చేసిన యాత్రికులందరికీ నా హృదయపూర్వక
శుభాకాంక్షలు. ఈ వేసవిలోని తీవ్రమైన ఎండను లెక్కచేయకుండా,
పవిత్ర ద్వారాల గుండా మీరు చేసిన ఈ యాత్ర ప్రశంసనీయం!
ముఖ్యంగా, ఫ్రాన్సిస్కాన్ మిషనరీ
సిస్టర్స్ ఆఫ్ ది సేక్రేడ్ హార్ట్ వారికి; స్ట్రైజోవ్ పాఠశాల
విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు; పోలాండ్
నుండి వచ్చిన లెగ్నికా విశ్వాసులకు; మరియు ఉక్రెయిన్ నుండి
విచ్చేసిన గ్రీకు కతోలిక బృందానికి నా ప్రత్యేక శుభాకాంక్షలు.
అలాగే, రొమానో ది లోంబార్డియా,
మేలియా (రెజ్జియో కలాబ్రియా), సాస్సరి నుండి
వచ్చిన యాత్రికులకు, మరియు ఫ్లోరెన్స్ అగ్రపీఠము నుండి
వచ్చిన లాటిన్ అమెరికన్ బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఆంగ్లభాష మాట్లాడే యాత్రికులకు నా కృతజ్ఞతలు. యునైటెడ్ స్టేట్స్‌లోని
టెక్సాస్‌లో గ్వాడలుపె నది వరదల వల్ల సంభవించిన విపత్తులో ప్రాణాలు కోల్పోయిన
కుటుంబాలకు, ముఖ్యంగా వేసవి శిబిరంలో తమ
కుమార్తెలను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి కోసం
మనం ప్రార్థిద్దాం.
ప్రియమైన మిత్రులారా, శాంతి అనేది ప్రతీ
ఒక్కరి కోరిక, యుద్ధం వల్ల విచ్ఛిన్నమైన వారి ఆక్రందన! పాలకుల
హృదయాలను తాకి, వారి మనస్సులను ప్రేరేపించాలని ప్రభువును
అడుగుదాం, తద్వారా ఆయుధాల హింసకు బదులుగా చర్చల ద్వారా
శాంతిని కోరుదురుగాక.
ఈ మధ్యాహ్నం, నేను కాస్టెల్ గాండోల్ఫో
వెళ్తాను. అక్కడ నేను కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను. ప్రతి
ఒక్కరూ తమ శరీరాన్ని, మనస్సును పునరుద్ధరించుకోవడానికి కొంత సమయాన్ని
ఆస్వాదించగలరని నేను ఆశిస్తున్నాను.
మీ అందరికీ ఆదివారం శుభాకాంక్షలు!
మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/angelus/2025/documents/20250706-angelus.html
గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.
No comments:
Post a Comment